సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ

అతడో పల్లెటూరి రైతు. అతనికి వున్నదల్లా ఓ పంపుసెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగమూ అతనికి తెలుసు. దాని ప్రతి కదలికా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడూ అది మొరాయిస్తుంది. అయితేనేం? దాన్ని బుజ్జగించి (మరమ్మతు చేసి) దారిలో పెట్టుకోవడం అతనికి చిటికెలో పని! ఆ రైతు కొడుక్కి పదేళ్లు. వాడికి ఈ పంపుసెట్టు పని అంటే మహా సరదా.
జుగాడ్‌ ఇలా పుట్టింది…
ఒకరోజు మన రైతు మెదడులో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. ‘ఈ డీజిల్‌ పంపు సెట్టుని బండి చక్రాలకు జత చేస్తే ఎలా ఉంటుంది?’ ఇదీ అతని ఆలోచన. వడ్రంగి దగ్గరికి వెళ్లి ఓ బండి చేయించాడు. చక్రాలకు టైర్లు తొడిగించాడు. పంజాబులో చెడిపోయిన సైనిక జీపులు కావలసినన్ని దొరుకుతాయి. వాటి నుంచి కొంత సామగ్రి సంపాదించాడు. ఇంకేం మన బండికి స్ప్రింగు, షాక్‌ అబ్జార్బర్లు, గేరు బాక్స్‌, క్లచ్‌, స్టీరింగ్‌ అన్నీ సమకూరాయి. ఇప్పుడు బండి చక్రాలకు పంపు సెట్టును ఓ బెల్టుతో మన రైతు అనుసంధానించాడు. అంతా కలిపి రూ.40 వేలు ఖర్చయింది. పదిమంది దీంట్లో ఎక్కవచ్చు. గంటకు 40 కిలోమీటర్లు పోతుంది. దీనికి ‘మారుత’ అనే పేరు పెట్టి మన రైతు గారు సకుటుంబంగా ఎక్కి ‘చల్‌ చల్‌ బండి’ అంటూ షికార్లు కొట్టసాగాడు.
ఇంకేముంది చూస్తుండగానే ఇది ‘రైతు మోటారు’గా మారిపోయింది. రైతులందరూ ఇదే దారి పట్టారు. కొందరైతే ఈ వాహన నిర్మాణ కళాకౌశలం కరతలామలకం చేసుకొని నిపుణులైపోయారు! వాడుకలో దీనిపేరు జుగాడ్‌’గా స్థిరపడింది. పంజాబ్‌ నుండి హర్యానాకు, అక్కడి నుండి రాజస్థాన్‌కు పాకి పోయింది.
క్రమంగా ఈ ‘పల్లెటూరు టాక్సీ’ ధర కూడా తగ్గిపోయింది. సొంతదారులే రిపేర్లు చెయ్యడం నేర్చుకోవడంతో పోషణా పాలనా మరింత సులువై కంపెనీ వాహనాలకు కష్టకాలం వచ్చేసింది!
తేనెటీగలతో మ్యాజిక్కు
పాటియాలాలో మరో రైతు. అక్కడో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం వుంది. దాని సాయంతో అక్కడి రైతులు సంవత్సరానికి నాలుగు పంటలు పండిస్తున్నారు. అయినా ‘సరిపోక’ మన రైతు ఒకరోజు ఆ కేంద్రానికి వెళ్లి ‘నేను మధ్యంతర పంటగా పొద్దు తిరుగుడు వేశాను’ అని అక్కడి శాస్త్రజ్ఞులకు సెలవిచ్చాడు. వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది.
‘ఆశపోతు అమాయక శిఖామణి’ అనుకొని ‘పొద్దుతిరుగుడు కూడా వేస్తే పక్షులు ఎక్కువై అసలు పంటకే మోసం వస్తుంది తెలుసుకో’ అని మందలించారు. అందుకా రైతు ‘ఇన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఆ మాత్రం తెలీదా నాకు. అందుకే పొలంలో తేనెటీగలను కూడా పెంచుతున్నా’ అని చెప్పి వాళ్ళని ‘ఓరి పిచ్చి దద్దమ్మల్లారా’ అన్నట్టు చూశాడు. ‘తేనెటీగలు పక్షులకు ప్రత్యామ్నాయ ఆహారం ఇచ్చి పంట జోలికి పోకుండా చూస్తాయి’. దీనికి జవాబు దొరక్క, ఏ పి.హెచ్‌.డి కి దీన్ని ఎవరూ సబ్జెక్టుగా తీసుకున్న దాఖలా కనిపించక శాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కొన్నారు. రైతు మాత్రం నాలుగు పంటలు, పొద్దు తిరుగుడుతో పాటు కావలసినంత తేనె కూడా ‘పండించుకున్నాడు’.
అంతా శ్రమైకజీవన ఫలం. ఇలాంటి కథలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆదిమ మానవుడు గుహాంతరాల నుంచి ప్రస్థానం ప్రారంభించి, సహస్రాబ్దాలనూ సముద్రాలనూ దాటి ఇంత దూరం ప్రయాణించడమంతా ఎలా జరిగింది? సామాన్య మానవుడి శ్రమైక జీవనం, అనుభవ పాండిత్యం, వ్యవహార విజ్ఞానం, ఆలోచనా శైలి, పని నైపుణ్యం, కళా కౌశలం కంటే శాస్త్రాన్నీ, చరిత్రనూ ఇంత దూరం నడిపించిన శక్తులేమున్నాయి? మన ఇతిహాస పురాణ కావ్యాల రచయితలుగా పండితులుగా కొందరిని మనం చెప్పుకోవచ్చు. కానీ వీటి మూలాలను మనం ఈ అనామక సామాన్య మానవ జీవన స్రవంతుల నుంచి గాక ఎక్కడ వెతకాలి? ఈ ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి.
నేడు ఆయుర్వేద ఔషధాలు ఏ మహానుభావుల పేర్లతోనైనా చలామణి కావచ్చు. కానీ వాటిని వెతికి పట్టుకున్నదీ, పరీక్షించిందీ మన ‘అనాగరిక ఆటవికులే’ కదా! చెకుముకి నుంచి నిప్పు రాజేసిన వాడు, కొయ్య దుంగల నుంచి చక్రాన్ని దొర్లించిన వాడు సగటు మనిషి గాక మరెవడని గదా మనం గుర్తించాల్సింది? సమిష్టి జీవన పోరాటం నుంచి గాక ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని గదా మనం తర్కించాల్సింది. శాస్త్రం రెక్కలు తొడిగాక, పరిశోధనా సంస్థలు వెలిశాక, విశ్వ రహస్యాలను ఛేదించే రోజు వచ్చాక శాస్త్రమూ సగటు మనిషీ ఎవరికి వారైపోతున్నారా? ఈ సహస్రాబ్దపు మహా మేధావులెవరు? తత్వవేత్తలెవరు? పరిశోధకులెవరు? కళాకారులెవరు అని మనం చేసే సర్వేలలో ఈ సామాన్యులకు స్థానం ఎక్కడైనా దొరుకుతోందా?

-‘జనవిజ్ఞానం’ సౌజన్యంతో ప్రొ|| యశ్‌పాల్‌

➡️