రైతును ఏడిపించే రాజ్యం బాగుపడదని మనం నీతికథల రోజుల నుంచీ వింటూనే ఉన్నాం. దేశానికి రైతే రాజని, వెన్నెముక అని నినాదప్రాయమైన ఉవాచలు పాలకుల ప్రసంగాల నిండా ప్రవహించటం కూడా చూస్తూనే ఉన్నాం. ఇన్నిన్ని ప్రస్తావనలూ, ప్రాచుర్యాలూ అన్నదాతల గురించి ప్రతినిత్యం పల్లవిస్తూనే ఉన్నా- రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ దుస్థితి మరింతగా విస్తరించింది. అనేక సాగు కష్టాలతో సతమతం అవుతున్న రైతాంగం మోడీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కాక నిత్యం ఆందోళనల దిశగానే సాగాల్సి వచ్చింది. పొలాల్లో, పంటల ఉత్పత్తిలో తలమునకలు కావాల్సిన రైతు- తుండుగుడ్డను తలకు బిగించి, ఢిల్లీ నడివీధిలో పోరాటానికి దిగాల్సి వచ్చింది. ఒకపక్క పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు తమ న్యాయబద్ధ డిమాండ్ల మీద వివిధ రూపాల్లో ఆందోళనలు సాగిస్తుండగా, తాజాగా తమిళ రైతులు ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అన్నదాతలను అనేక విధాలుగా అగచాట్ల పాల్జేస్తున్న మోడీ ప్రభుత్వ మోసకారితనంపై ఇది రైతులు మోగించిన రణభేరి.
ఏడేళ్ల క్రితం ఢిల్లీలో చిత్ర విచిత్ర రూపాల్లో నిరసనలు తెలిపిన నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈనెల 24 నుంచి ఈ ఆందోళన మొదలు పెట్టారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించిన విధంగా పంటలకు మద్దతు ధర (సి2 + 50)ను ఇవ్వాలని, సింగిల్ యూనిట్ ప్రాతిపదికన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని వారి డిమాండ్లు. ఇవన్నీ, పదేళ్ల క్రితం అధికారంలోకి రాక ముందు బిజెపి బలంగా వినిపించిన ఎన్నికల వాగ్దానాలే! కానీ, గద్దెనెక్కాక ఆ హామీలను ఆవలకు విసిరేసి, రైతులకు పంగనామాలు పెట్టే పనికి సమాయత్తమైంది! ఉన్న రాయితీలను తీసేసి, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దుస్సాహసానికి ఒడిగట్టింది. వాటిని వెనక్కి కొట్టటానికి లక్షలాదిమంది రైతులు నెలల తరబడి, ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక పోరాటం చేశారు. తెరిపివ్వని వర్షాలకు, వణికించే చలికి, వడగాడ్పుల ఎండలకు … వీటికి మించి మోడీ ప్రభుత్వపు నిర్బంధ, నిరంకుశ చర్యలకూ ఎక్కడా వెనకడుగు వేయకుండా, చెక్కుచెదరకుండా ధీరోదాత్త సమరం సాగించారు. తప్పని పరిస్థితుల్లో మోడీ క్షమాపణలు చెప్పి, ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ తరువాత కూడా వ్యవసాయ రంగాన్ని, రైతులను ఉద్ధరించే చర్య ఒక్కటంటే ఒక్కటీ చేపట్టలేదు. ఏడాదికి మూడు విడతలుగా విదిల్చే రూ.6 వేల సహాయాన్నే గొప్ప ఉపకారంగా మోడీ పరివారం డప్పాలు కొడుతోంది.
ఇలాంటి అరకొర విదిలింపులతో దేశ వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమీ ఉండదు. మూడు, నాలుగు దశాబ్దాలుగా పాలకులు సాగించిన ఉదారవాద ఆర్థిక విధానాలు మన దేశ సేద్యాన్ని కోలుకోలేనంతగా దెబ్బ తీశాయి. ‘వ్యవసాయం దండగ’ అనే ఒక దౌర్భాగ్యకర స్థితిని, ప్రచారాన్ని పెంచి, పోషించాయి. తదుపరి కార్యక్రమంగా వ్యవసాయ భూములు రైతుల చేతుల నుంచి కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి వెళ్లే కార్యాచరణను రూపొందించాయి. ఈ వికృత వలయంలోంచి భూమి రక్షించబడాలన్నా, రైతు చేనుగట్టు మీద నిశ్చింతగా నిలబడాలన్నా ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను సంపూర్ణంగా అమలు చేయాలి. రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు తగిన అండాదండా ఇచ్చే ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టాలి. సాగుకు కీడు కలిగించే బిజెపి నయవంచన విధానాల మీద దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. గత మార్చిలో మళ్లీ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టిన రైతుసంఘాలు ఇప్పుడు కాషాయ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో తమిళ రైతులకు నాయకత్వం వహిస్తున్న అయ్యకన్ను 2014 వరకూ బిజెపిలో ఉన్నవాడే! రైతులకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదనే అతడు ఆ పార్టీతో అనుబంధం తెంచుకొని, 2017 నుంచి పోరాటం చేస్తున్నాడు. రైతును క్షోభపెట్టే ఏ ప్రభుత్వమూ అధికారంలో కొనసాగటానికి వీల్లేదు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరం మోడీ షాలకు అలాంటి పాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
