గత ఐదు దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రజలతో పెనవేసుకున్న పెద్ద సేవా సంస్థ ‘రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు’ (ఆర్‌డిటి). అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రారంభించిన ఈ సంస్థ క్రమంగా రాయలసీమ జిల్లాలన్నిటితో పాటు, ఆంధ్ర, తెలంగాణలోని 21 జిల్లాలు 150 మండలాలకు తమ సేవా కార్యక్రమాలను విస్తరించి ప్రజల విశ్వసనీయతను పొందింది. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వాటర్‌షెడ్లు, పండ్ల మొక్కలు, చెట్ల మొక్కలు, క్రీడలు, మానసిక, వికలాంగుల పాఠశాలలు, మహిళా సాధికారిత గ్రూపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పొదుపు సంఘాలు ఇలా అనేక విభాగాల్లో ఆర్‌డిటి సేవలు అందిస్తుంది. దళిత, గిరిజన ప్రజల జీవితాల్లో చాలా మార్పులకు కారణమైంది. పారా ఒలింపిక్స్‌లో, జాతీయ మహిళా క్రికెట్‌లో, స్కేటింగ్, టెన్నిస్ లాంటి అనేక పోటీలలో ఈ ప్రాంత పేద పిల్లలు పతకాలు సాధించడంలో ఈ సంస్థ పాత్ర చాలా ముఖ్యమైనది. డ్రిప్, స్పింక్లర్ల విధానాన్ని మొదట ప్రారంభించింది ఆర్‌డిటి నే. ఇలాంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ మతతత్వ విధానాల ఫలితంగా సంక్షోభంలో పడింది. గత ఐదు సంవత్సరాలుగా అనేక రూపాల్లో వేధింపులకు గురిచేసి ప్రస్తుతం రెన్యూవల్స్‌ను నిలిపివేయడమే కాకుండా, బ్యాంకుల్లో వున్న డబ్బులను ఫ్రీజ్ చేసింది. దీనివల్ల ఆర్‌డిటి ఉనికికే ప్రమాదం వచ్చింది. పి4 విధానం ద్వారా దాతల సహాయంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పుకుంటున్న రాష్ట్ర పాలకులు అలాంటి సేవలు అందించడంలో రాష్ట్రంలో అగ్ర భాగాన వున్న ఆర్‌డిటి ని కాపాడేందుకు సిద్ధపడడంలేదు. కేంద్ర ప్రభుత్వంలో తమకున్న సంఖ్యా బలాన్ని ఉపయోగించి ఆర్‌డిటి కొనసాగేలా చూడాల్సిన ముఖ్యమంత్రి, కేంద్ర పాలకుల మతతత్వ మనసెరిగి నడుచుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఆర్‌డిటి మూతపడితే ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించినా అధినాయకుడి నుండి సరైన భరోసా రాలేదు.
ప్రజా ఉద్యమాలు-స్వచ్ఛంద సేవా సంస్థలు
భూమి కోసం తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం సాగిస్తున్నప్పుడు ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు ‘సర్వోదయ ఉద్యమం’ పేరుతో వినోభాబావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజలను పీడించుకొని దోచుకుంటున్న తెలంగాణ భూస్వాముల దగ్గరకు వినోభాబావే వచ్చి భూమి దానం ఇవ్వాలని అడగడం, విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి లాంటి వారు వెంటనే స్పందించి దానం చేయడం నాటకీయంగా ఆనాడు జరిగిపోయాయి. ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా అక్కడ ఇలాంటి దాన, సేవా సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రజల్లో అక్షరాస్యతను సాధించేందుకు, మూఢనమ్మకాలను తొలగించేందుకు బ్రిటీష్ కాలంలోనే అనేకమంది సంఘసంస్కర్తలు నిస్వార్థంగా కృషి చేశారు. స్వచ్ఛంద సేవ పేరుతో విదేశీ నిధులతో నిర్వహించే కొన్ని సంస్థలు మత మార్పిళ్లకు, ప్రజా ఉద్యమాల నుండి మళ్ళించేందుకు పనిచేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్వాతంత్య్రం పొందిన మూడో ప్రపంచ దేశాల్లోకి ఏదో రూపంలో జొరబడేందుకు సామ్రాజ్యవాదం వివిధ ప్రయత్నాలు చేసింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, డబ్య్లుటివో లాంటి ఆర్థిక సంస్థల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను, సైనిక ఒప్పందాల ద్వారా రక్షణ విధానాలను, సేవల ద్వారా పేదల జీవితాలను ప్రభావితం చేస్తూనే వుంది. దాతృత్వ సిద్ధాంతాన్ని పాలకులే ప్రచారం చేశారు. విదేశీ నిధులతో సేవలు అందించే స్వచ్ఛంద సేవా సంస్థలను పాలకులే ప్రోత్సహించి తగిన ఏర్పాట్లు చేశారు. 1965-70 మధ్య వేల సంఖ్యలో ఇలాంటి సంస్థలు దేశంలోకి వచ్చాయి. విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
1950-67 మధ్య రాయలసీమ జిల్లాల్లో గ్రామీణ పేదలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భూమి కోసం, సామాజిక న్యాయం కోసం పెద్ద పోరాటాలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ దుర్మార్గాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేల ఎకరాల భూములను సాధించుకున్నారు. ఈ పోరాటాలకు అనంతపురం జిల్లా ఒక ముఖ్య కేంద్రంగా వుండేది. ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలిక నేపథ్యంలో ఆర్‌డిటి సేవా సంస్థ 1967-69 మధ్య జిల్లాలోకి వచ్చింది. స్పెయిన్‌కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, ఆయన భార్య అన్నె ఫెర్రర్ ఆ నాడు జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల్లో రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్టు పేరుతో గంజి కేంద్రాలను మొదట ప్రారంభించారు. అప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న గంజి కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేశారు. ఇలాంటి వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించారు. ఈ స్థితిలో ఆర్‌డిటి సంస్థ ఉచితంగా, నాణ్యమైన గంజిని ప్రజలకు అందించి ఆదరణ పొందింది. క్రమంగా జిల్లాలోని గ్రామీణ పేదలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లోని వృత్తిదారులను లక్ష్యంగా పెట్టుకుని విభిన్న రూపాల్లో ఆర్‌డిటి సేవా కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసినా ఆర్‌డిటి పొందినంత విశ్వసనీయత, పేదల ఆదరణ ఇతర ఏ సంస్థలూ పొందలేక పోయాయి. దానికి కారణం విన్సెంట్ ఫెర్రర్ వ్యక్తిత్వం, పట్టుదల, దూరదృష్టి, పేదల పట్ల ఆయన అంకిత స్వభావం.
విస్తరించిన ఆర్‌డిటి సేవలు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3896 గ్రామల్లో 4,51,200 కుటుంబాలకు వివిధ రకాల సేవలను ఆర్‌డిటి అందిస్తుంది. ఈ సంస్థ చేపట్టే పనుల నాణ్యత ప్రజల ఆదరణ పొందడంలో కీలకంగా నిలిచింది. ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో 25 పైసలు మాత్రమే ప్రజలకు చేరితే, ఆర్‌డిటి చేసే ప్రతి రూపాయిలో 90 పైసలకు పైగా సద్వినియోగం అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అనంతపురం జిల్లాలో ఆర్‌డిటి సంవత్సరానికి రూ.345 నుండి రూ.500 కోట్ల బడ్జెట్‌తో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 87,032 ఇళ్ళను పేదలకు నిర్మించారు. 1,25,000 మంది విద్యార్థులకు చదువు నేర్పించారు. 8,19,835 మందికి వీరి ఆసుపత్రుల్లో సేవలు అందించారు. బత్తలపల్లి, కల్యాణదుర్గం, కణేకల్లులో వీరు అందిస్తున్న వైద్య సేవలు పేదలకు పెద్ద ఉపశమనంగా వున్నాయి. ఈ ఆసుపత్రుల్లో చేరిన 87 శాతం గర్భణీలకు సాధారణ కాన్పులు అవుతున్నాయి. ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు మెరుగైన సేవలు అందించి, వారి పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. కరోనా సమయంలో విశిష్టమైన వైద్య సేవలు అందించారు. బాలికలకు 40 వేల సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతపురంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. వందలాది దళిత కాలనీలలో కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు నిర్మించారు. 1,64,06,477 మొక్కలను, మరో కోటికి పైడా పండ్ల మొక్కలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. 25,355 మంది వికలాంగులకు సహాయం అందించారు. భూగర్భ జలాలను పెంచడం కోసం వాటర్‌షెడ్లను నిర్మించారు. 14 వేల మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. మూగ, చెవిటి పిల్లలకు ఒక ప్రత్యేక పాఠశాలను నడుపుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కర్నూలుతో పాటు, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
పాలకుల దృష్టి-సేవా సంస్థలు
మన దేశంలో విదేశీ విరాళాలతో నిర్వహిస్తున్న ఆర్‌డిటి లాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు చాలా సుదీర్ఘ కాలం నుండి పనిచేస్తున్నాయి. ప్రజా ఉద్యమాల ఉధృతిని తగ్గించుకోవడానికి పాలకులు వీటిని ప్రోత్సహించారు. క్రమంగా సేవా సంస్థలే కాకుండా హక్కుల సంస్థలూ ఏర్పడ్డాయి. సమస్యలపై వీరు ప్రశ్నించడం పెరిగేకొద్దీ వీటిని నియంత్రించే చర్యలను పాలకులు అనుసరిస్తూ వచ్చారు. 1857 వరకు సంఘ సంస్కరణోద్యమాలను బలపరచిన బ్రిటీష్ పాలకులు దేశీయ రాజకుటుంబాలు, భూస్వామ్య వర్గాల నుండి వ్యతిరేకత రావడంతో వీటిని అడ్డుకున్నారు. 1860 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, 1882 ఇండియన్ ట్రస్టు చట్టాలకు 1976 ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అనేక సవరణలు చేసి ఈ సంస్థలను నియంత్రించింది. చిందబరం హోంమంత్రిగా వున్న యుపిఎ-2 సమయంలో విదేశీ నిధులు పొందుతున్న సంస్థలపై అనేక నిబంధనలు విధించారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత ప్రాతిపదిక మీద ఈ సంస్థలపై ఆంక్షలు పెరిగాయి. మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే దేశంలోని 10,171 సంస్థలకు విదేశీ నిధులను అడ్డుకున్నారు. అనేక సంస్థలను నిషేధించారు. ఈ సంస్థలకు నిధులు ఇచ్చే విదేశీ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడుతున్నారు. ఇదంతా దేశ భద్రత కోసం, మత మార్పిడుల నివారణ కోసం అని పైకి చెబుతున్నారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి లాంటి హిందూత్వ మత సంస్థలు మాత్రం ఈ పదకొండు సంవత్సరాల్లో భారీగా విదేశీ నిధులను పోగేసుకుని మతతత్వ భావాల వ్యాప్తికి, ఎన్నికల లబ్ధికి విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛంద సేవ పేరుతో ఏ సంస్థ అయినా ఆర్థిక అక్రమాలకు, అవినీతికి పాల్పడినా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవలసిందే. అయితే సంస్థ నిర్వాహకుల మతాన్ని బట్టి సంస్థలను అడ్డుకోవడం పాలకుల మతతత్వంలో భాగమే అని గుర్తించాలి.
‘పి4’ విధానం ద్వారా పేదరికాన్ని నివారిస్తామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం, సుదీర్ఘ కాలం సేవలు అందిస్తూ ప్రజావిశ్వాసాన్ని పొందిన ఆర్‌డిటి ని కాపాడుకోకుండా కొత్త దాతలను, సేవా సంస్థలను ఎలా ఆకర్షించగలదు? విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధించేందకు గత ఏడు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ఈ నాటికీ అమలుకు నోచుకోలేదు. తాము చేయక, మరొకరిని చేయనివ్వకపోతే ప్రజలు సహించరని పాలకులు గుర్తించాలి.
లెనిన్ అన్విత్