దేశంలో ఉన్నత విద్యలో ప్రవేశానికి ఏర్పరుచుకున్న పరీక్షా వ్యవస్థ లోపభూయిష్టంగా మారి విద్యార్థి లోకానికి శాపంగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం వల్ల పలు పరీక్షల వాయిదాలు, రద్దులతో విద్యా సంవత్సరానికి, విద్యార్థుల కష్టానికి, తల్లిదండ్రుల ఆర్థిక స్థితికి తగులుతున్న దెబ్బల తీవ్రత గణింపలేనిది. లక్షలాది విద్యార్థులు రాసిన యూజీసీ నెట్ పరీక్ష ఒకటి రద్దు కాగా, రాయబోయేది మరొకటి వాయిదా పడింది. ఇప్పుడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఆఖరు నిమిషంలో వాయిదా పడింది. మొదట నీట్ పరీక్షలో బయట పడ్డ తీవ్ర లోపాలు సుప్రీం కోర్టులో బాధితులు కేసు వేసేవరకూ ప్రభుత్వాన్ని కదిలించలేదు. తప్పులేమీ జరగలేదంటూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే అలా జరిగాయని అంటున్నది. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరపడానికి సూచనలు కోరుతూ నిపుణుల కమిటీ ఏర్పాటు చెయ్యడం ముదావహం అయినా అదొక్కటే సరిపోదు. తప్పు చేసిన వారికి, ఉదాసీనత చూపించిన వారికి శిక్షలు పడాలి. లక్షలాది విద్యార్థులు వారి విలువైన సమయాన్ని, ఆ విద్యార్థుల కుటుంబాలు కోట్లాది రూపాయలను కోచింగ్‌ల కోసం, సన్నద్ధత కోసం కోల్పోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. దేశమంతా ఒకే సారి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జరుపుకొనేలా విధానం మార్చాలి. అవకతవకలు ఏ స్థాయిలో జరిగినా అది విద్యార్థులందరికీ అన్యాయం జరిగినట్టే. ముందు ముందు అలా జరగకుండా చూడడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే అవకాశమే లేదు అన్న రీతిలో విధానాన్ని సంస్కరించాలి. ఆ నిబద్ధత చూపుతున్నట్లు ప్రభుత్వం కనిపించాలి. విద్యార్థి ఒక్క సెకను ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని బీరాలు పలుకుతున్నపుడు, ఆ పరీక్షను నిర్వహించడంలో చిన్న తప్పు కూడా జరగదు అన్న భరోసా కూడా ఇచ్చే స్థితిలో ఉండాలి. విద్యా రంగంలో ఆదర్శాలు, సంస్కరణలు, ఆశయాలు కేవలం పేపర్‌కే పరిమితం కారాదు. విద్యార్థి ఫెయిల్ అయితే ఆ నష్టం పరిమితం. విద్యా వ్యవస్థ ఫెయిల్ అయితే ఆ నష్టాన్ని గణించలేం. అందుకనే పరీక్షకుడి వైఫల్యం క్షమించరాని సామాజిక నేరం.
– డా|| డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ.
