మోసపూరిత బడ్జెట్‌

నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి దేశప్రజల ముందు వంచనా శిల్ప విన్యాసాన్ని ప్రదర్శించింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26వ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో ప్రజలను మభ్య పరిచే మాటలే ఎక్కువ! వరుసగా ఎనిమిది సంవత్సరాలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌ అన్ని బడ్జెట్‌లలోనూ సామాన్యులను విస్మరించారు. తాజా బడ్జెట్‌లోనూ అదే ఒరవడి కొనసాగించి, మహా సంపన్నుల పట్ల మహా విధేయతను ప్రదర్శించారు. దేశంలోని మౌలిక సమస్యలను పూర్తిగా మరచిపోయిన తాజా బడ్జెట్‌ కార్పొరేట్ల చుట్టూ ప్రదక్షిణ చేసింది. ప్రైవేటీకరణ, ఆశ్రిత పెట్టుబడిదారి విధానాలకు మరింతగా ఊతమిచ్చే ప్రతిపాదనలతో బడ్జెట్‌ పత్రాలు నిండిపోయాయి. ఆదాయపన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడాన్ని కేంద్ర పాలకులు ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే, దీనివల్ల లబ్ధి పొందే ప్రజానీకం దేశ వ్యాప్తంగా ఒక్క శాతం కూడా లేరన్న విషయాన్ని వారు దాచిపెడుతున్నారు. పైగా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలతో పోల్చుకుంటే ఇది సముద్రంలో నీటిబొట్టంత కూడా లేకపోవడం గమనార్హం. దశాబ్ధకాలంగా దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు ,అసమానతలు, పేదరికం భారీగా పెరిగాయి. పొదుపు రేట్లు నేల చూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులతో పాటు, ప్రైవేటు పెట్టుబడులు కూడా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదారవాద విధానాల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను తెగనమ్ముతున్నా ఆర్థిక వ్యవస్థ నానాటికీ తీసికట్టుగానే మారుతోంది. ఈ కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపడంలో కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో జాతీయ దృక్పథం ఏమాత్రం లేకుండా సంకుచిత రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్‌ సాగింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాల ప్రస్తావనే బడ్జెట్‌లో కనపడకపోవడం, త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు పథకాల వరద పారించడం దీనికి నిదర్శనం.
వందశాతం విదేశీపెట్టుబడులను అనుమతించడం బీమా రంగంలో విదేశీ గుత్తపెట్టుబడిదారి సంస్థల ఆధిపత్యానికి దారి తీయనుంది. మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేల వంటి కీలక సదుపాయాలను కార్పొరేట్లకు అప్పగించనున్నారు. రానున్న ఐదేళ్లకాలంలో ఈ పిపిపి ప్రాజెక్టుల విలువ 10 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అదే సమయంలో కీలకమైన వ్యవసాయ రంగానికి ఎటువంటి ఎటువంటి ఉపశమనమూ దక్కలేదు. రైతాంగం ఏళ్లతరబడి ఆందోళనలు చేస్తున్నా కనీస మద్దతు ధర అంశాన్ని పట్టించుకోలేదు. రుణ ఉపశమనంతో సహా ఇతర రాయితీలు లేవు.వంద జిల్లాలకు ప్రకటించిన ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజనను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాల్సిఉంది. 2017 బడ్టెట్‌లో పేర్కొన్న విధంగానే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మాటను మళ్లీ చెప్పారు. ఎరువులు, ఆహార,సబ్సిడీలు, పంటలబీమాకు కోతపడింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు నిధులు పెంచలేదు. కార్మికులు, యువత, మహిళలు, పిల్లలు, ఇతర అణగారిన వర్గాలను బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు. వీరందరి జీవనస్థితిగతులు మెరుగుపరచకుండా, కొనుగోలుశక్తి పెంచకుండా వృద్ధి లక్ష్యాలను సాధించడం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం సాధ్యం కాదన్న ఆర్థికవేత్తల సూచనలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసింది. విభజనతో కుదేలైన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించే విషయాన్ని ఎప్పుడో పక్కనపెట్టేశారు. ఇతరత్రా విభజన హామీల అమలు అంశాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కీలకమైన రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలు బడ్జెట్‌లో కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. ఉడప ఉక్కు పరిశ్రమది ఇదే దుస్థితి. ఈ తరహా నిర్లక్ష్యాన్ని బిజెపికి కొమ్ము కాస్తున్న టిడిపి, జనసేనలు సమర్ధించుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి నోరు విప్పకపోవచ్చు. కానీ, రాష్ట్ర ప్రజలు ఆగ్రహించకమానరు. ధరలు, నిరుద్యోగం, ఆకలిని పెంచి, ప్రైవేటీకరణ అజెండాను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్న కేంద్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తం కావడం సహజం.

➡️