ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం-2024 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. శాసనసభలో ఉన్న ఒక్క ప్రతిపక్ష పార్టీ వైసిపి సభకు వెళ్లనందున అక్కడ ఎలాంటి అభ్యంతరాలకు, సలహాలకు ఆస్కారం లేదు. శాసన మండలిలో పిడిఎఫ్ సభ్యులు చేసిన సూచనలను టిడిపి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ చట్టం పేదలపై పాలకులు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం వలే ఉందంటూ పేదలు, ప్రజాసంఘాలు వెలిబుచ్చుతున్న భయాందోళనలను కూటమి సర్కారు నివృత్తి చేయలేదు. పేదలకు అన్యాయం తలపెడతాయని సందేహిస్తున్న క్లాజులను తొలగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించింది. సెలెక్టు కమిటీకి కూడా సిఫారసు చేయలేదు. కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లు ఆమోదమయ్యాక, గవర్నర్ నుంచి రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం వెళుతుంది. పైన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక, అది టిడిపిపై ఆధారపడి ఉంది కనుక, ఇటువంటి చట్టం గుజరాత్, ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెచ్చినందున, సులువుగానే రాష్ట్రపతి వద్ద క్లియర్ అవుతుంది. అయితే, అసెంబ్లీలో టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో దాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో పేర్కొన్న ‘ఉద్దేశాలు-కారణాల’ను పరిశీలించినట్లయితే, రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న పట్టణీకరణ, వ్యాపారీకరణలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల దురాక్రమణలకు ఉత్ప్రేరకాలుగా ఉన్నాయని, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలు, సంబంధిత పరిణామాల వలన అన్ని వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయని, వాటిని అరికట్టడానికి చట్టం తెస్తున్నామని తెలిపారు. ఎ.పి. భూ దురాక్రమణ (నిషేధం) చట్టం-1982 కంటే గట్టి చట్టం తెస్తున్నందున, ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామన్నారు. పాత చట్టానికి, కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ‘1982’ యాక్ట్ అప్పటి ఉమ్మడి ఎ.పి.లోని అర్బన్ ప్రాంతాలకు పరిమితంకాగా, ‘2024’ బిల్లులో రూరల్, అర్బన్ సహా రాష్ట్రం మొత్తానికీ వర్తిస్తుంది. అప్పుడూ ఇప్పుడూ ల్యాండ్ గ్రాబర్ అనే దానికి నిర్వచనం మక్కికి మక్కికి దించారు. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, చారిటబుల్, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరాలుగా పరిగణించి శిక్షిస్తామన్నారు. పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభియోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. జైలు శిక్షను ఐదేళ్ల వరకు వేయొచ్చు. ఐదు వేల రూపాయల జరిమానా కూడా అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విస్తరించవచ్చు అన్నారు. కబ్జాకు గురైన ఆస్తి మార్కెట్ విలువను జరిమానాగా వేస్తారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. ఆ కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. సర్కారు ఎప్పుడైనా ఆ పని చేయొచ్చు. 1982 జూన్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తదుపరి ఆగస్టులో అసెంబ్లీలో బిల్లు పెట్టింది. 1982 ఆగస్టు 10న ఆ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సిపిఎం అగ్ర నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ ఎప్పుడు పడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే, ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలు వస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను, జడ్జిల నియామకాలను బతకనిస్తారా, ఆ గ్యారంటీ బిల్లులో లేదని నిలదీశారు. రద్దు చేసిన చట్టంలో ఏముందో, కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది. ఇక్కడే ప్రభుత్వ నైజం అర్థమవుతుంది. నాలుగున్నర దశాబ్దాలలో పరిస్థితుల్లో మార్పొచ్చింది. అదానీ వంటి వారు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ కోర్టులను, జడ్జిలను రద్దు చేయిస్తారు. చట్టంలో పొందుపర్చిన ఈ లొసుగు ముందు ల్యాండ్ గ్రాబ్ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి, డిఎస్‌పి స్థాయికి తక్కువ కాకుండా అధికారితో దర్యాప్తు చేయించాలి, ఆర్నెల్లలో విచారణ పూర్తి కావాలి అనేవి చాలా చాలా చిన్నవి.
మతలబు ఇదే
బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరిమానా అన్నారు. కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్ విలువను గ్రాబర్ నుంచి వసూలు చేస్తామంటున్నారు. ఇక్కడ మార్కెట్ విలువంటే రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే బుక్ వాల్యూనా లేదంటే బహిరంగ మార్కెట్‌లో క్రయవిక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్ వాల్యూనే అయితే గ్రాబర్‌కే లాభం. గ్రాబింగ్ చట్టబద్ధమైపోతుంది. అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవుతుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి. బిల్లులో ఆ అంశం లేదు. అందువల్లనే కొత్త చట్టం ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులైన పెద్ద వాళ్లకు, కార్పొరేట్లకు చుట్టం అవుతుందని సందేహించాల్సి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్ గ్రాబర్ల కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబర్ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులవుతారు. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్ భూములను ఎకరమో, రెండెకరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణ దారులై శిక్షలకు గురవుతారు. కొంత మంది పెద్దలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు. ఎవరు ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నారో వారు గ్రాబర్ అయిపోతారు తప్ప అక్రమంగా భూములను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుంటారు. ఒక వేళ భూ దురాక్రమణ ఆరోపణలొచ్చినా వ్యవస్థలను మేనేజ్ చేసే పలుకుబడి అటువంటి పెద్దలకు ఎలాగూ ఉంటుంది. అపరాధులయ్యేది పేదలు, చిన్నవాళ్లే. అందుకే పేదలకు, చిన్న చిన్న వారికి కొంత వరకు మినహాయింపులుండాలి. ప్రభుత్వ అభ్యంతరాల్లేని నివాసాలకు ప్రభుత్వం కొంత విస్తీర్ణ పరిమితి పెట్టి పట్టాలిస్తోంది. అనధికారిక బిల్డింగ్‌లను రెగ్యులరైజ్ చేస్తోంది. అలాగే చట్టంలో పొందుపర్చాలి. పెద్దలను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. అటువంటి సదుద్దేశం బిల్లులో కనిపించదు. పాత చట్టం ఉన్నా ఆచరణలో పేదలకు, సామాన్యులకు నష్టం జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో యథేచ్ఛగా పెద్దల ఆక్రమణలు సాగిపోయిన అనుభవం ఉండనే ఉంది. రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాలు, వీరంగాలు రోజూ చూస్తున్నవే. ఆ కారణంగానే 2024- ల్యాండ్ గ్రాబింగ్ చట్టంపై పేదల్లో, ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అసైన్డ్‌లో జరుగుతున్నదేంటి?
1977- అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణల సమయంలోనూ ఎస్‌సి, ఎస్‌టి, పేదలు నష్టపోతారన్న భయాలు వ్యక్తమయ్యాయి. ఆచరణలో నిజం అయ్యాయి కూడా. 1977-చట్ట ప్రకారం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నిషిద్ధం. 2019లో టిడిపి ప్రభుత్వం దిగిపోయే ముందు అసైన్డ్ ఇళ్ల స్థలాలు పొంది 20 సంవత్సరాలు దాటితే ఒరిజనల్ ఎస్సయినీలకు సర్వ హక్కులూ కల్పిస్తూ చట్టం తెచ్చింది. అమరావతి ప్రాంతంలో ఐదేళ్ల గడువుపై చట్టానికి ప్రయత్నించగా నాటి గవర్నర్ అంగీకరించలేదు. అదే దారిలో ఐదేళ్ల కాలపరిమితి పెట్టి సర్వ హక్కులూ అంది వైసిపి సర్కారు. కోర్టులు అంగీకరించకపోయే సరికి అసైన్డ్ వ్యవసాయ భూములకు 20 ఏళ్లు, ఇళ్ల స్థలాలకు పదేళ్ల కాల పరిమితి పెట్టి జగన్ సర్కారు సవరణ చట్టం తెచ్చింది. ఈ చట్టం పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా కార్యక్షేత్రంలో చూస్తే అసైన్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన, ఆక్రమించిన, బెదిరించి లాక్కున్న పెద్దలకే ఎక్కువగా ఉపయోగ పడుతోంది. ఈ పూర్వరంగంలో ప్రస్తుత ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టం కూడా అంతే. ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టంపై ప్రజల్లో సందేహాలు, భయాందోళనలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏపక్షంగా చట్టం చేయబూనుకోవడం ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు. రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే ప్రభుత్వానిది సదుద్దేశం అనిపించుకుంటుంది. చట్టాన్ని అమలు చేసే ముందైనా అన్ని పక్షాలతో చర్చలు జరపాలన్న డిమాండ్ సహేతుకమైనది. ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా చేసే చట్టం ఆచరణలో నిలబడదు. అప్పటికి తాత్కాలిక రాజకీయ కక్షలకు ఉపయోగపడితే పడవచ్చు. ప్రధానంగా పేద ప్రజలకు నష్టం జరగకూడదు. పేదల పక్షాన, వారి హక్కుల కోసం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించే సంస్థలపై, వ్యక్తులపై అణచివేత, నిర్బంధాలకు ప్రభుత్వానికి చట్టం ఆయుధం కాకూడదు. అప్పుడే ‘మంచి ప్రభుత్వం’ అవుతుంది.
కె.ఎస్.వి.ప్రసాద్
వ్యాసకర్త సెల్ : 9490099019