నిబద్ద నేత, నిరాడంబర జీవి బుద్ధదేవ్‌

బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐఎం అగ్ర నాయకుడు బుద్ధదేవ్‌ భట్టాచార్యకు వంగదేశం అరుణాంజలితో అశ్రునివాళి అర్పించింది. ప్రగతిశీల రాజకీయాలు, ప్రజాస్వామిక విలువలు కోరుకునేవారందరికీ ఆయన మృతి విచారం కలిగించింది. రాజకీయ విభేదాలకు అతీతంగా ఆయనకు నేతలు నివాళులర్పించారు. అంతిమ యాత్రలో ప్రజలు పాల్గొన్న తీరు, ఎక్కడికక్కడ సామాన్యుల నుంచి కీలక నేతల దాకా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీరు తన పట్ల ఎంతటి గౌరవాభిమానాలున్నదీ విదితం చేసింది. రాజకీయాల్లో విలువలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో బుద్ధదేవ్‌ భట్టాచార్య తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కనబరిచిన నిబద్దత, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను ఉదాహరణలతో సహా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దేశంలో కీలకమైన బెంగాల్‌ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా వున్నా సాదాసీదా అపార్ట్‌మెంట్‌లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది.

యువ నేతగా ఆరంభం
కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో ఉద్యమంలో ప్రవేశించారు. ప్రమోద్‌ దాస్‌ గుప్తా తీర్చిదిద్దిన నాటి యువ బృందంలో బిమన్‌ బసు, సుభాష్‌ చక్రవర్తి, శ్యామల్‌ చక్రవర్తి, బుద్ధదేవ్‌ భట్టాచార్య, దినేష్‌ మజుందార్‌, అనిల్‌ బిశ్వాస్‌ వంటి వారు ముఖ్యులు. వారిలో ఇప్పుడు ఒక్క బిమన్‌ బసు మన మధ్య వున్నారు. 1970లలో బెంగాల్‌లో అర్థ ఫాసిస్టు బీభత్సకాండను, హత్యాకాండనూ తట్టుకుని నిలిచిన యువ నాయకత్వం అది. దేశానికి 1975లో ఎమర్జన్సీ వస్తే బెంగాల్‌లో అయిదేళ్ల ముందు నుంచే ఈ బీభత్సకాండ తాండవించింది. సిపిఎం కార్యకర్తలు 1200 మంది బలికాగా వేలాది మంది ఇశ్లు వదలి ఎక్కడో తలదాచుకోవలసిన పరిస్థితి. అరాచకం తాండవించిన కాలమది. ఆ సమయంలో మొత్తం ఉద్యమ శ్రేణులు చెదరని స్థయిర్యంతో నిలబడటం వల్లనే దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం కాపాడుకోవడం సాధ్యమైంది.
ఎమర్జన్సీ అనంతరం 1977 ఎన్నికలలో తొలిసారి ఘన విజయం సాధించిన వామపక్ష సంఘటన మంత్రివర్గంలో బుద్ధదేవ్‌ సమాచార సాంస్కృతిక మంత్రి అయ్యారు. 1982లో ఓడిపోయినా మళ్లీ 1987లో గెలిచి బాధ్యతలు చేపట్టారు.1996లో జ్యోతిబసు అనారోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 1985 నుంచి సిపిఎం కేంద్ర కమిటీ తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా రాజకీయ నిర్ణయాలలో, సైద్ధాంతిక విధానాలలో ముఖ్య పాత్ర పోషించారు. యువ మంత్రిగా, డివైఎఫ్‌ఐ నాయకుడుగా ఆయన 1979లో వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం తెలుగునాట నాటి యువ నేతలందరికీ జ్ఞాపకమే. పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సిపిఎం మహాసభలలో చేసిన కీలక ప్రసంగం, అప్పటికి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీపై మత రాజకీయాలపై నిశిత విమర్శలుచేస్తే ఈ వ్యాసరచయిత అనువదించారు కూడా. ”గుజరాత్‌లో జరిగిన మారణహోమానికి సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను” అని బుద్ధదేవ్‌ తీవ్ర స్వరంతో అన్నారు. వ్యక్తిగత మర్యాదలు ఎలా వున్నా రాజకీయ సిద్ధాంత విషయాల్లో రాజీ పడని తత్వం ఇక్కడే మనకు స్పష్టమవుతుంది.

విజయాలు, విచ్ఛిన్నాలు…
23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిన మహా నాయకుడు జ్యోతిబసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏదో అయిపోతుందని కొంతమంది రాజకీయ వ్యతిరేకులు కుత్సితంగా లేవనెత్తిన ప్రశ్నలకు సమర్థవంతమైన సమాధానంగా బుద్ధదేవ్‌ శక్తిని చాటారు. జ్యోతిబసు రాజకీయ పాలనా వారసత్వాన్ని జయప్రదంగా కొనసాగించారు. కమ్యూనిస్టులకు సంబంధించినంత వరకూ నాయకులపై ఎంత గౌరవం వున్నా విధానాలు, నిర్మాణం ముఖ్యమనే సత్యాన్ని నిరూపించారు. ఆయన హయాంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఫ్రంట్‌ విజయ పరంపర కొనసాగింది. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సారథ్యం చేపట్టిన బుద్ధదేవ్‌ నాయకత్వంలో 2006 ఎన్నికలలో 294కు 235 స్థానాలు రావడం సంచలనం సృష్టించింది. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి. పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో 42 సీట్లతో సిపిఎం వామపక్షం పాత్ర, ప్రతిష్ట విశిష్ట స్థాయికి చేరాయి. కేంద్రంలో బిజెపి మత రాజకీయాలకు అడ్డు కట్ట వేశాయి. యుపిఎ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ ఆ రాజకీయ వాస్తవాలు తెలిసీ అవకాశవాద అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా వుండేది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం పాలక వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్‌ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రామ్‌ ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి. కాంగ్రెస్‌, మమతా బెనర్జీ తృణమూల్‌ మహాజోత్‌ పేరిట వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్‌ ప్రభుత్వ సంకల్పం. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి. అనేక అధికారిక నివేదికలు, తీర్పులు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి.
బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్‌ భట్టాచార్య పెట్టుబడిదారీ సంస్కరణల కోసం ప్రయత్నించారనీ విఫలమైనారనీ శీర్షికలు వచ్చాయి. అప్పటికి పదేళ్ల సరళీకరణ విధానాల అమలు నేపథ్యంలో నూతన సహస్రాబ్ది తొలి పాదంలో అధికారం చేపట్టిన ఒక ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వం ముందు ఎలాంటి సవాళ్లు వుంటాయనే వాస్తవికత లేని ప్రతికూల వ్యాఖ్యలవి, ఒకవైపున మతతత్వ రాజకీయాలు పెరుగుతున్న దశ. కేంద్రం సహకార నిరాకరణ, కార్పొరేట్‌ శక్తుల ప్రతికూలత, అపారిశ్రామికీకరణ (డీ ఇండిస్టియలైజేషన్‌) నుంచి బెంగాల్‌ను ఎలా కాపాడుకోవాలనే సవాలు. ఆ క్రమంలో నూతన పారిశ్రామిక విధానం వచ్చింది. వాటిలో తప్పొప్పులు వుండొచ్చు గాని పారిశ్రామికీకరణ ఉద్యోగ కల్పన లక్ష్యంలో తప్పు లేేదు. తొలి దశలో పాలక వర్గాల బడా మీడియా బుద్ధదేవ్‌ దార్శనికుడనీ, పిడివాదాన్ని వదిలేశాడని పైపైన పొగుడుతూనే ఆయన ప్రభుత్వం భూమలు లాక్కొంటుందనే వ్యతిరేక ప్రచారాలు సాగించాయి. భూసంస్కరణలకు అమలులో అగ్రగామిగా నిలిచిన వామపక్ష కూటమి తదుపరి దశలో పారిశ్రామికీకరణ కోసం జరిపిన ప్రయత్నంలో కొన్ని పొరబాట్లున్న మాట నిజం, కానీ పాలక వర్గాలు, దారి తప్పిన కొన్ని శక్తులు పనిగట్టుకుని సాగించిన వ్యతిరేక ప్రచారాలే చాలా నష్టం చేశాయి. ఫలితమే 34 ఏళ్ల పాలన తర్వాత 2011లో వామపక్ష ఓటమి. వాటన్నిటినీ తట్టుకుని బుద్ధదేవ్‌ గట్టిగా నిలబడ్డారు. ”నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసుకోవాలి.” అని ఆయన ఆత్మకథలో చెప్పారు. ఫిర్‌ దేఖా, ఫిర్‌ దేఖా 2 (సింహావలోకనం లాంటిది) అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని, రాజకీయ, పాలనానుభవాలను నెమరువేసుకున్నారు.

ఆఖరు దాకా ఆదర్శంగా…
వయో భారం, నిర్బంధాలు తట్టుకుంటూనే ఆరోగ్యం సహకరించినంత వరకూ సభలూ సమావేశాలలో పాల్గొంటూ తన పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గం జాదవ్‌పూర్‌లో 2017లో పెద్ద మెజార్టీతో గెలిపించుకోగలిగారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్‌ కూడా తోడుగా నిలిచారు. ఎంతటి కీలక బాధ్యతల్లో వున్నా బుద్ధదేవ్‌ ఎప్పుడూ సామాన్య జీవితమే గడిపారు. కార్యకర్తలతో కలసిపోయేవారు. గౌరవ మర్యాదలు పాటించినా మార్క్సిస్టు విలువలు, విధానాల విషయంలో రాజీ పడేవారూ కాదు. ఆయన నిరాడంబరత్వం, నిశిత దృష్టి గురించి సహచరులు ప్రత్యేకంగా చెప్పుకునేవారు. పటాటోపాలను ఏనాడూ దరి చేరనివ్వని ఆయన ఎవరు ఎంత చెప్పినా పామ్‌ అవెన్యూలోని తన నిరాడంబర నివాసం మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఎప్పుడో ప్రభుత్వంలో వున్నప్పుడు వచ్చిన పాత అంబాసిడర్‌ కారునే ఆఖరు వరకూ ఆయన వాడేవారు. అందరితో స్నేహంగా గౌరవంగా వుండేవారు. అనారోగ్యంలో పరామర్శించే పేరుతో ముఖ్యమంత్రి మమత గానీ అప్పటి గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ గానీ వంకర ప్రచారాలతో సిపిఎంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే బుద్ధదేవ్‌ భట్టాచార్య, ఆయన భార్య చాలా గట్టిగా ఖండించేవారు. చివరి రోజుల్లో మోడీ ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆఖరుకు ఆయన మరణానంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించి తుపాకులతో వందనం సమర్పిస్తామంటే కూడా వారు నిరాకరించారు. బుద్ధదేవ్‌ వ్యక్తిత్వ వరవడి అలాంటిది.
కళా సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్‌ భట్టాచార్య కృషి ప్రత్యేకమైంది. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా. ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగూర్‌ పద్యాలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట. ఇరవయ్యవ శతాబ్దపు పెట్టుబడిదారీ విధానం గురించి ”అది అత్యద్భుతమైన కాలం. అదే అత్యంత అధ్వాన్నమైన కాలం” అన్న డికెన్స్‌ మాటలను తన సంభాషణల్లోనూ ప్రసంగాల్లోనూ తరచూ ప్రస్తావించేవారు. సంక్లిష్ట సృజన శిల్పానికి పేరొందిన కాఫ్కా, మార్క్వేజ్‌ వంటి వారి రచనలను బెంగాలీలోకి అనువదించారు. సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కోల్‌కతాలో నందన్‌ కానన్‌ కళాభవన్‌ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. నామ్‌చామ్‌స్కీ వంటి మేధావులను, ప్రపంచ విప్లవకారులను కోల్‌కతాకు పిలిపించి గౌరవించడం, వారి భావాలు తెలుసుకోవడం జరిగేది. ప్రముఖ బెంగాలీ దర్శకులు, రచయితలతో లోతుగా చర్చలు చేసేవారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. శ్రామికవర్గ ఉద్యమాలతో మమేకమై సిద్ధాంతాలను సృజనశీలతనూ మేళవించి అదే సమయంలో ఉద్మమ నిర్మాణంలోనూ పాలనా వ్యవహారాలలోనూ రాటుదేలిన బుద్ధదేవ్‌ జీవితం భావి తరాలకు ఓ పాఠం, ఆయనకిదే మరోసారి లాల్‌ సలామ్‌.

– తెలకపల్లి రవి

➡️