కరువు పీడిత ప్రాంతాల ‘ప్రాణదాయని’, ఆ ప్రాంత ప్రాణ కోటికి దాహార్తి తీర్చే సకల జనులకు ‘సుఖదాయని’ అయిన ‘వెలుగొండ ప్రాజెక్టు’ను వేగిరం పూర్తి చేయాల్సిన అవసరముంది.
1989 మార్చి 8న వెలుగొండ పథకానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను తెలుగుగంగ ప్రాజెక్టు ఓఎస్‌డిగా పనిచేస్తున్న డాక్టర్ కె.రామకృష్ణయ్య ప్రభుత్వానికి అందించారు. అప్పటి మార్కాపురం శాసనసభ్యులు పూలసుబ్బయ్య విజ్ఞప్తి మేరకు నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ‘ఖోస్లా ‘కమిషన్’ను నియమించారు. ప్రకాశం జిల్లా పశ్చిమ సమస్యకు పరిష్కారం ‘వెలుగొండ’ అని పుచ్చలపల్లి సుందరయ్య 1954లో మొదటగా ‘ఖోస్లా కమిషన్’కి సూచించారు. కమిషన్ గ్రీన్ సిగల్ ఇవ్వడంతో 1996లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
వెలుగొండ పథకం గురించి…..
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4,47,300 ఎకరాలు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టుగా రూపకల్పన చేశారు. కొల్లం వాగు ఎగువన హెడ్ రెగ్యులేటర్ నిర్మించి అడ్డుగా ఉన్న కొండను తొలిచి 7 మీటర్లు, 9.2 మీటర్ల వ్యాసార్ధంగల రెండు సొరంగ మార్గాలను 19.8 కి.మీ మేర ఏర్పాటు ద్వారా 20 కిలోమీటర్ల వరద కాలువ నుంచి ‘నల్లమల రిజర్వాయర్’కు నీరు చేరుతుంది.
సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల దగ్గరున్న కొండల మధ్య ఖాళీలను పూడ్చడం ద్వారా ‘సహజ రిజర్వాయర్’గా రూపుదిద్దుకుంటుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 53 టిఎంసిలుగా నిర్ణయించారు. వర్షాకాలంలో కృష్ణా నది ద్వారా రోజుకు ఒక టిఎంసి చొప్పున 45 రోజులు పాటు 45 టిఎంసిల నీరు రిజర్వాయర్‌కు చేరుతుంది. ఏడాది పొడవునా వచ్చే వరదనీటి ద్వారా మరో 7 నుంచి 8 టిఎంసిలు వెరసి 53 టిఎంసి లు నిల్వ చేసే అవకాశం వుంది. అక్కడి నుండి తీగలేరు, గొట్టిపడియ ప్రధాన కాలువల ద్వారా రిజర్వాయర్‌కి చేరుతుంది. ఈ నీటి ఆధారంగా రాళ్లపాడు రిజర్వాయర్, గుండ్ల మహేశ్వరం రిజర్వాయర్లకు కూడా నీరందుతుంది. వెలుగొండ పథకంలో భాగంగా ఐదు ఎత్తిపోతల పథకాలు రూపొంది వాటి ద్వారా సాగునీరు, తాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. ఇదంతా రెండు దశల్లో సాగుతుందని మొదటి దశలో 1.19 లక్షల ఎకరాలకు, రెండో దశలో 3,25,300 ఎకరాలకు సాగు నిర్ధారించారు. ఇందుకోసం రూ.980 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. దీనికోసం 11 గ్రామాలను ఖాళీ చేయించాలని, 33,545 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప్రకారం గ్రామాలు ఖాళీ చేయించడం, భూసేకరణ ప్రక్రియ పూర్తయింది.
ముప్పయ్యేళ్ల తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి
ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 6,197 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రాజక్టు పనులు ప్రారంభమై సుమారుగా మూడు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ మొదటి దశ పూర్తికాలేదు. అరకొర నిధులతో ప్రాజెక్టు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మొదటి సొరంగం దాదాపు పూర్తయింది. 30 శాతం బేలెన్స్ పనులు పూర్తి చేయాలి. రెండో సొరంగం (9.2 మీటర్ల వ్యాసార్ధం) 11 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. ఏడు కిలోమీటర్ల దూరం మట్టి తొలగించలేదు. మరో రెండు కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. రెండు సొరంగాలలో వచ్చిన మట్టిని బయటకు తరలించకుండా, హెడ్ వర్క్ ప్రాంతంలో డంప్ చేశారు. మరికొంత మట్టిని మొదటి సొరంగానికి ఐదు చోట్ల రంధ్రాలు పెట్టి వాటిలో నింపారు. ఇలా అస్తవ్యస్తంగా ఎందుకు చేశారు? దీనికి ఎవరు బాధ్యులు?
నల్లమల రిజర్వాయర్ 2018లోనే పూర్తయింది. తొమ్మిదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంది. సొరంగం నుండి రిజర్వాయర్ వద్దకు వెళ్లే అప్రోచ్ ఛానల్ 2019 లోనే పూర్తయింది. అప్పట్లో తీసిన కాలువలు చెట్లుతో, మట్టితో పూడి పోయాయి. వీటిని వినియోగంలోకి తేవాలంటే మరలా మరమ్మతులు చేపట్టాలి. దీనికి అదనంగా ఖర్చవుతుంది. మొదటి సొరంగాన్ని అప్రోచ్ ఛానల్‌కు కలిపే భాగాన్ని వదిలి వేశారు. అన్నింటికన్నా ముందుగా పూర్తి చేసిన హెడ్‌వర్క్ పనులు పూర్తికాలేదు. హెడ్‌వర్క్ నుండి సొరంగాలకు కలుపుతూ చేయాల్సిన పనులు కూడా పూర్తికాలేదు. అప్రోచ్ చానళ్ళకు లైనింగ్ అవసరం. అవసరమైన కల్వర్టులు లైనింగ్‌లు పూర్తి చేయాలి. సొరంగం తవ్విన యంత్రం (టన్నెల్ బోరింగ్ మిషన్) బయటకు రావడం సాధ్యం కాదని, సొరంగం అవతల మార్గం లోపల ధ్వంసం చేయాలని, దీనికోసం కాంట్రాక్టర్‌కి బిల్లులు చెల్లిస్తే గాని ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండదని నిపుణుల అభిప్రాయం.
నిర్వాసితులకు పునరావాసం
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలి. దీనికి రూ.1402 కోట్లు అవసరమవుతాయి. ఇవిగాక మొదటి దశ పెండింగ్ పనులకు రూ.1600 కోట్లు అవుతాయి. ఇప్పటి వరకు జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్ట్ వ్యయ అంచనా రూ. 12 వేల కోట్లకు పెరిగింది.
ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తయ్యేనా?
ప్రాజెక్టు పూర్తయినట్లు జంట సొరంగాలను జాతికి అంకితం చేస్తున్నట్లు గత ఏడాది మార్చి ఆరున అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టారు. తాజాగా కూటమి మంత్రులు రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించడం గమనార్హం. ప్రకటించిన రీతిలో రెండేళ్లలో పూర్తి చేయాలంటే సుమారు రూ.4000 కోట్లు అవసరం కాగా 2024-25 బడ్జెట్లో కేవలం రూ.507 కోట్లు కేటాయించి కేవలం రూ 210 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
తక్షణం రూ. 3000 కోట్లు కేటాయించాలి
ప్రభుత్వం తక్షణ ప్యాకేజీగా రూ.1402 కోట్లు, మట్టి తొలగించేందుకు, లైనింగ్ ప్రక్రియ వంటి ఇతర పనులు పూర్తి చేసేందుకు మరో రూ.1600 కోట్లు వెరసి రూ.3000 కోట్లు కేటాయించాలి. అనేక ఆందోళనలతో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య, సాగునీరు, తాగునీటి సమస్యతో జిల్లా వాసులు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలసలు వెళ్లడం పరిపాటయింది. 1000 అడుగులు తవ్వినా చుక్క నీరు పడని పరిస్థితి ఉంది. జిల్లాలో అత్యధిక మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లా వర్షఛాయ ప్రాంతంగా పేరు ఉంది. జిల్లాలో 80 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే 80 శాతం పైగా వర్షాధారంగానే సాగయ్యే పరిస్థితి. మూసి, పాలేరు, గుండ్లకమ్మ వంటి సహజ వనరులు ఉన్నప్పటికి…సాగునీటి వినియోగం కోసం ప్రాజెక్టులు రూపొందించలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మినహా, మిగిలిన ప్రాంతమంతా తాగునీరు, సాగునీరుకు వర్షంపై ఆధారపడాల్సిందే.
ఎన్‌ఎస్‌పి రెండవ దశ ద్వారా ‘మీ దశ తిరుగుతుందన్నారు’. అయితే తొలి దశకే నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. కృష్ణా నదిలో వృధాగా పోతున్న నీటిని ప్రకాశం జిల్లాకు మరలించి నీటి సమస్యను పరిష్కరించడంలో అలసత్వం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ ప్రక్రియకు అవసరమైన నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నదో తెలీదు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ విషయమై ఎందుకు నోరు మెదపడం లేదు? వామపక్షాల ఉద్యమాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొని సుమారుగా ముప్పయ్యేళ్లు అవుతున్నది. దీన్ని పూర్తి చేయడానికి మాటలు తప్ప చర్యలు లేవు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం నల్లమల సాగర్ జలాశయం నిండేందుకు చర్యలు చేపట్టాలి. దీనికి రూ. 4 వేల కోట్లు అవసరం కాగా, తక్షణ సాయంగా ఈ ఏడాది బడ్జెట్లో కనీసం రూ.3 వేల కోట్లు కేటాయించాలి. ప్రజా ప్రతినిధులు నిధులు మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వెలుగొండ పూర్తయ్యేందుకు, ఆ మేరకు నిధులు రాబట్టేందుకు జిల్లా వాసులు ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఉంది.
వ్యాసకర్త రైతు సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు, పెంట్యాల హనుమంతరావు
సెల్ : 9490300345 /