విశాఖ సాక్షిగా ప్రధాని మరోసారి ద్రోహం

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ వచ్చి వెళ్లారు. భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలపై స్పందించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత నాలుగేళ్లుగా పోరాడుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ మాట మాత్రం కనీసంగా కూడా ఎత్తలేదు. పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కనీసంగా కూడా అడగలేదు. సరికదా, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే ఇద్దరూ పోటీ పడ్డారు. ముచ్చటగా ముగ్గురూ కలిపి ఈ సభా వేదికగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేశారు. సభంతా ఒకర్నొకరు పొగుడుకోవడంతోనే సరిపోయింది. ఆయన సభలో పదేపదే ప్రస్తావించిన గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం, ఆయన విధానపరంగానే ద్వేషించే, ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అయిన ఎన్‌టిపిసి ద్వారా జరగడం ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తెలుస్తోంది. సరిగ్గా రెండేళ్ల రెండు నెలల క్రితం అంటే 2022 నవంబర్‌ 12వ తేదీన ఇదే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆయన సభ జరిపారు. అప్పటికే స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోంది. అప్పుడు కూడా ఆయన దానిపై స్పందించలేదు. ఆయన పక్కనే ఉన్న నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా ఆయనను అడగలేదు. దీనిపై నాడు ప్రతిపక్షంలో ఉన్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌-ఇద్దరూ జగన్మోహన్‌ రెడ్డి తనపై ఉన్న కేసుల గురించి భయపడి మోడీని అడగలేదని విమర్శించారు. ఆ విమర్శ కూడా సహేతుకమైనదే కావచ్చు. అయితే విచిత్రంగా నేడు అదే వేదికపై అదే మోడీ పక్కన కూర్చున్న చంద్రబాబు నాయుడు గానీ, పవన్‌ కల్యాణ్‌ గానీ మోడీని కనీసం మాట వరసకైనా అడగకపోవడం ఆశ్చర్యం కలిగించడమే కాక సమర్ధనీయం కూడా కాదు. ఎందుకంటే, వీరు 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకు పోతామని హామీ ఇచ్చారు. కానీ అందుకు భిన్నంగా కేంద్రం స్టీల్‌ప్లాంటు కష్టాలను మరింత పెంచింది. కార్మికులను తొలగిస్తోంది. ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించకుండా తిప్పలు పెడుతోంది. బొగ్గు, ముడి సరుకు, రైలు ర్యాకులు కూడా ఇవ్వకుండా స్టీల్‌ ప్లాంట్‌ను అష్ట దిగ్బంధనం చేస్తోంది.
ఈ దుస్థితి నుండి ఈ సభలోనైనా ఉపశమనం కలుగుతుందేమోనని కొంతమందైనా ఆశించారు. కానీ ఆ ఆశలను అడియాసలు చేస్తూ, ప్రధాన మంత్రి తమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు. సరికదా, పక్కలో బల్లెంలా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రైవేట్‌ రంగంలో మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే గాక దానికి అనుసంధానంగా పోర్టు నిర్మిస్తామని కూడా తెలిపారు. వీటికి మించి, ఇటీవల చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని అడగలేదు. కానీ ప్రైవేటు రంగంలోని ఇంకా స్థాపించబడని మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటుకు మాత్రం గనులు ఇవ్వాలని కోరారు. దీన్నిబట్టే తెలుస్తోంది ఈ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పయనమెటో! అందులోని భాగస్వామ్య పక్షాలకు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో! రక్షణ కాదు, భక్షణ వీరి విధానమని.

దీనికి తోడు, రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికలలో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని అప్పటి మిత్రులైన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా నేటికీ అతీ గతీ లేదు. నాయకుల ప్రకటనలే తప్ప ఆచరణలో రైల్వే జోన్‌ ఏర్పాటు కాలేదు. నేడు తీరుబడిగా పదేళ్ల తరువాత శంకుస్థాపన చేశారు. ఇక ప్రారంభానికి ఎంత సమయం వేచి ఉండాలో! కానీ ఆ పేరున, వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి, దేశంలోనే రైల్వేకు అతి పెద్ద ఆదాయం సమకూరుస్తున్న డివిజన్లలో ఒకటిగా ఉన్న విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పచ్చి దగా తప్ప మరొకటి కాదు. పదేళ్ళ నుండి ఊరిస్తూ, ఊరిస్తూ ఎట్టకేలకు రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయడంలో గర్వపడవలసినదేముంది? పదేళ్ళ క్రితం రావలసినది ఇంత ఆలస్యం చేసినందుకా?

ఈ వైఖరిని ఎండగట్టి, రాష్ట్ర హక్కులను సాధించుకోవడంలో ముఖ్యమంత్రి క్రియాశూన్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నిస్తానని బయల్దేరిన పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రశ్న అనే పదాన్నే మరిచిపోయారు. దీనితో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో మెజార్టీ లేకపోయినా, మరింత రెచ్చిపోయి రాష్ట్రానికి ద్రోహం చేస్తోంది. ప్రత్యేక హోదా మాటే మరిచింది. వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ఊసే కేంద్ర ప్రభుత్వం మరిచింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రావలసిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చేసింది. వీటిపై కూడా కూటమి నేతలు నోరు మెదపడం లేదు.

నేడు పాలకులకు ప్రజలు కోరుకున్నవి కాకుండా ప్రజల ఆలోచనలలో లేనివి ప్రకటించి అదే అభివృద్ధి అని నమ్మబ లుకుతున్నారు. ఈ సభలో మోడీ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. విశేషం ఏమిటంటే అక్కడ స్థానికులు ఈ ప్లాంట్‌ మాకొద్దు బాబోరు, దీనివల్ల ఇప్పటికే కాలుష్యంతో సతమత మవుతున్న మా ప్రాంతం, సముద్ర తీరం మరింత కలుషితం అవుతుంది, మత్స్యకారులకు ఉపాధి పోతుంది అని మొత్తుకుంటున్నారు. అయినా ఇదే అభివృద్ధి అంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులు బలవంతంగా రుద్దుతున్నారు. అచ్యుతాపురం దగ్గర వున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కూడా వర్చువల్‌గా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా 1200 ఎకరాల భూమిని కోల్పోయిన స్థానిక రైతులు, నిర్వాసితులు ఉపాధి, నష్ట పరిహారం గురించి ఇంకా వేచి చూస్తున్నారు.

సి.ఎం చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్న నీటి ప్రాజెక్టుల నిర్మాణం, కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రం, భావనపాడు ఫిషింగ్‌ హార్బర్‌ వంటివి కాకుండా ఎయిర్‌ పోర్టు, కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేస్తామని తెలిపి, పెద్ద ఎత్తున బలవంతపు భూ సేకరణకు పూనుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజల నెత్తిపై కుంపటిలా కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌ అన్నది ఎలాగూ ఉంది. ఆ ప్రమాదం గుర్తించే ఆలోచనే కనీసంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమే.

రాష్ట్రంలోని గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వున్న 10.39 శాతం వాటాను జగన్‌ ప్రభుత్వం అదాని సంస్థకు అమ్మేసింది. దీనితో 2852 ఎకరాల భూమితో సహా సర్వ హక్కులు ప్రభుత్వం అదానీ పరం చేసింది. విశాఖ ఏజెన్సీ ఏరియాలో వివిధ ప్రాజెక్టుల పేరుతో గిరిజన ఉపాధికి గండికొడుతూ, గిరిజన చట్టాలను అతిక్రమించి, అదానీ సంస్థకు అనుమతులు ఇచ్చింది. విశాఖ నగరంలో అత్యంత విలువైన 130 ఎకరాల భూమిని అదానీ డేటా సెంటరుకు అప్పజెప్పింది. నేడు అదాని కంపెనీలు అత్యంత అవినీతికి పాల్పడి విద్యుత్‌ ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ అవినీతి వ్యవహారాన్ని ఖండించి, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేయవలసింది పోయి వాటిని కొనసాగిస్తూ, తిరిగి సమర్ధించుకుంటోంది.

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే రాష్ట్రానికి ఏదో న్యాయం జరుగుతుందని కొంతమందికైనా వున్న భ్రమలు ఇప్పుడు క్రమేణా కరిగిపోతున్నాయి. విద్యుత్‌ చార్జీలు, ఇతర బాదుళ్లతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడు కోవాలన్నా, విభజన చట్టం అమలు కావాలన్నా, ఎడాపెడా వేస్తున్న భారాలను తిప్పికొట్టాలన్నా, చట్టపర హక్కులను నిలబెట్టుకోవాలన్నా ప్రజా ప్రతిఘటనే మార్గం.

➡️