‘నీవు చేసిన పాపం నీడలా నీ వెంటే వస్తుంది’ – భగవద్గీత శ్లోకం.
చాలా మంది రాజకీయ నేతలకు ఫలితాలు అలానే అర్థమవుతున్నాయి. కానీ బాలీవుడ్ సెలబ్రిటీ కంగనా రనౌత్‌కు మరో రూపేణా అర్థమయింది.
ఢిల్లీ వెళ్ళేందుకు గురువారం నాడు చండీగఢ్ విమానాశ్రమానికి వచ్చిన కంగనాకు ఈ చేదు అనుభవం ఎదురయింది. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్తుంటే ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెకు హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెళ్ళుమనిపించింది.
‘నా రైతులకు మద్దతుగా నేనీ పని చేశా…!’ అని ఘాటుగా జవాబిచ్చింది.
నాలుగేళ్ళ క్రితం భారత రైతాంగానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చింది. కొందరు వాటిని నిస్సిగ్గుగా సమర్ధించారు. ఆ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎండనకా వాననకా చలిగాలులను కూడా లెక్క చేయకుండా, చివరకు నీటిఫిరంగులు, బాష్పవాయువులు, లాఠీచార్జీ వంటి పోలీసు దమనకాండను సైతం ఎదుర్కొని వేల సంఖ్యలో రైతులు నెలల తరబడి రాజధాని రోడ్లపై బైఠాయించారు.
అప్పుడు ఆ రైతులను దూషిస్తూ వీళ్ళంతా కేవలం 100 రూపాయల కోసం వచ్చిన బాపతుగాళ్ళంటూ కంగనా కించపరిచారు. ”ఆనాడు ధర్నా చేసిన వారిలో మా అమ్మ కూడా ఉన్నది. మా అమ్మ రైతు. మా అన్న రైతు. మాది రైతు కుటుంబం. ఆమెకు నిజం తెలిస్తే… ఓ రైతులాగా ఆమె రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయగలదా…? అంటూ ఆ మహిళా కానిస్టేబుల్ ఆక్రోశంతో ప్రశ్నించారు.
ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతూ ‘భారత్ కి బేటీ’ అనే ప్రశంసల పాటతో మోగుతున్నది.
కంగనా రనౌత్ ఎంపీ కూడా. అయినా ఆ కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకున్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు పేట్రేగిపోతున్నాయని కంగనా అంటున్నారు.
సదరు కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌ను సస్పెండు చేసి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి కేసు దర్వాప్తు ప్రారంభించామని హర్యానా ముఖ్యమంత్రి నయూబ్ సింగ్ సైనీ చెప్పారు. ఘటన ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది గనుక, ఆ కానిస్టేబుల్ సి.ఐ.ఎస్.ఎఫ్ ఉద్యోగి గనుక, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కంగనా బిజెపి మౌత్ పీస్ అనే విషయం తెలిసిందే. గోడీ మీడియా ఆమెను అలానే హైలెట్ చేసింది కూడా. చివరకు ఆమె 2014 వరకు భారత్ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఏమిటో, తెలియవని, మోడీ ప్రధాని అయ్యాకే అవి ప్రజలకు లభించాయని సెలవిచ్చారు.
ఒక మనిషిని ఒకే పార్శ్వం నుండి చూసి అర్థం చేసుకోవడం సరికాదని, ప్రతి మనిషికి ఆత్మగౌరవమే (సెల్ఫ్ డిగ్నిటీ) అసలైన చిరునామా అని ఈ ఘటన ద్వారా మరోసారి విదితమవుతున్నది.
ఒక వస్తువును ఒక పార్శ్వం నుండి చూస్తే ఒకలా మరో పార్శ్వం నుండి చూస్తే మరోలా కనిపిస్తుంది. నాణేన్ని బొమ్మ వైపు చూసిన వారికి బొమ్మగాను, బొరుసువైపు నుండి చూసిన వారికి బొరుసుగాను, కన్పిస్తుంది. ఎవరిది వారికి కరెక్ట్‌గానే కన్పిస్తుంది. నాదే కరెక్టు. అవతలివారిదే తప్పు అంటే కుదరదు. అది మూర్ఖత్వం అవుతుంది. నీది నీకెంత కరెక్టో అవతలవారిది వారికి అంతే కరెక్ట్ అనే గ్రహింపు ఉండాలి. దీనినే వస్తుగత దృష్టి (ఆబ్జెక్టివ్ రియాలిటీ) అంటారు.
కాగా, ఇంగ్లీషులో ‘ఎంపథీ అనే పదం ఉన్నది. దీనినే తెలుగులో ‘సహానుభూతి’ అంటారు. ఉదాహరణకు బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్‌లో అంధ బిచ్చగాళ్ళు కన్పిస్తుంటారు. మనకు జాలివేసి ఐదో, పదో రూపాయలు దానం చేయవచ్చు. అయ్యో పాపం.. అనుకోవచ్చు. అది కేవలం సానుభూతి (సింపథీ) మాత్రమే. ఎంపథీ అంటే నేనే ఆ గుడ్డి బిచ్చగాని స్థానంలో ఉంటే… (ఫీల్ లైక్ ఎ క్లైంట్, ఫీల్ లైక్ ఎ పేషెంట్, ఫీల్ లైక్ ఎ రోల్) ఆ బాధ, ఆ నొప్పి, ఆ కష్టం ఏమిటో కొంతలో కొంతైనా అర్థమవుతుంది. అదీ నిజాయితీగా ఉంటేనే సుమా….
మెడిసిన్, సైకాలజీ, సోషల్ వర్క్ విద్యార్థులకు ఇది పాఠంగా కూడా ఉంటుంది. అలాగే రంగస్థలం (థియేటర్) విద్యార్థులకు కూడా. ఎందుకంటే వారు రకరకాల పాత్రలు అభినయించాల్సి ఉంటుంది కదా…
మరింత పెద్ద సెలబ్రిటీ కంగనా రనౌత్‌కు ఆ మాత్రం తెలియదా? రైతుల బాధలంటే ఏమిటో…? కష్టాలంటే ఏమిటో…? తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా తమ స్వప్రయోజనాన్ని ప్రేమించినంతగా ఇతరులను వారు ప్రేమించలేరు. అసలు ఇతరులను అర్థం చేసుకోలేరు. అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆత్మాభిమానం (ఆత్మగౌరవం) దెబ్బ తింటే ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా ప్రతీకారం తీర్చుకుంటారనే విషయం కూడా తెలుసుకోవాలి. చర్యకు ప్రతి చర్య లాంటిది. అది ఏ రూపంలోనైనా సరే… ఎన్నికల ఫలితాలు చాలా వరకు అదే విషయాన్ని చెప్తున్నాయి కదూ….!
– కె. శాంతారావు,
సెల్ : 9959745723