తమ పనులు కచ్చితంగా, త్వరగా, నాణ్యంగా జరగటానికి అవసరమైన పనిముట్లను రూపొందించుకునే ప్రస్థానంలో మానవులు సాధించిన ప్రగతి అద్వితీయం. తొలినాళ్ల వేట ఉపాయాలు మొదలుకొని నేడు అత్యున్నత శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానంగా చెప్పుకుంటున్న కృత్రిమ మేధ (ఎఐ) దాకా ఆవిష్కరణల పథం సాగుతూనే ఉంది. పనిముట్ల మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందో – సమాజం మీద వాళ్ల పెత్తనమే చెల్లుబాటు అవుతుంది. అత్యంత వేగవంతమైన, ప్రభావశీలమైన కృత్రిమ మేధ మీద ఆజమాయిషీ, అదుపు, అందుకు అవసరమైన విలువల ప్రతిష్టాపన, సర్వజనీన శ్రేయస్సును కోరే విచక్షణ ఎలా ఉండాలి? ఏయే ప్రామాణికాలతో ఆ ప్రక్రియ సాగాలి? దేశాల మధ్య పరస్పర సహకారం, పారదర్శకత ఎలా ఉండాలి? ఇత్యాది కీలకమైన అంశాలపై చర్చించి, సమాధానాలు, పరిష్కారాలు చూపాల్సిన ఎఐ పారిస్ శిఖరాగ్ర సదస్సు పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వకుండానే ముగియటం నిరాశాజనకం. సదస్సు తీర్మానంపై భారత్, చైనా సహా 60 దేశాలు సంతకాలు చేసినప్పటికీ- అమెరికా, బ్రిటన్ దానికి దూరంగా ఉండడం వాటి పెత్తందారీ వైఖరికి నిదర్శనం. ఎఐ వంటి విస్తృత సాంకేతిక పరిజ్ఞానంపై తమ పట్టు సడలిపోకూడదన్న స్వార్ధ బుద్ధికి సంకేతం.
విద్య, వైద్యం, పరిశోధన వంటి అనేక రంగాలను, శాస్త్ర సాంకేతిక అంగాలను విశేషంగా ప్రభావితం చేయగలిగిన కృత్రిమ మేధ అన్ని వైపులా పదునున్న కత్తి. వినియోగించేవారి ఉద్దేశాలను బట్టి ఫలితాలు, పర్యవసానాలూ ఉంటాయి. ప్రోది చేయబడిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా లూటీ చేయగలిగిన మతలబు ఇప్పుడున్న మెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఆధార్ వంటి డేటా అనుసంధాన ప్రక్రియల్లో పుష్కలంగా ఉంది. గూగుల్ వంటి సెర్చి ఇంజన్లలో మన అన్వేషణ, గూగుల్ మ్యాపుల్లో మన సందర్శనల సమాచారం ఆధారంగా మన ఇష్టాయిష్టాలను, అలవాట్లను కార్పొరేట్ వాణిజ్య సంస్థలు సులభంగా గుప్పిట పట్టగలుగుతున్నాయి. తమ వ్యాపార ఉత్పత్తుల ప్రచారాన్ని మన మీద కుమ్మరించి, క్రమేణా వినియోగదారుల జాబితాలోకి బదలాయిస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక వ్యవస్థ కన్నా అనేక వందల రెట్ల సామర్థ్యాన్ని, వేగాన్ని కలిగిన ఎఐ వేదికలు దుర్వినియోగం కావన్న గ్యారంటీ ఏముంది? వ్యక్తిగత గోప్యత, దేశ భద్రత, భిన్నాభిప్రాయాలకు అవకాశం కచ్చితంగా దొరుకుతుందన్న భరోసా ఏమిటి? ఎఐ పరిజ్ఞానం మీద కొన్ని దేశాలకో, సంస్థలకో గుత్తాధిపత్యం ఏర్పడితే తలెత్తే పరిణామాలకు ఎవరిది బాధ్యత? ఇలాంటి భయాందోళనలు, సందేహాలూ ముప్పిరిగొంటున్న సమయాన విస్తారమైన చర్చలూ, ప్రజాస్వామ్యబద్ధమైన నియమ నిబంధనలు చాలా అవసరం. వాటి మీద ప్రపంచ దేశాల ఏకీభావం చాలా ముఖ్యం. కానీ, సంతకానికి నిరాకరించటం ద్వారా అమెరికా, బ్రిటన్ దేశాలు ఐక్య కార్యాచరణకు అడ్డంకిగా మారాయి. ప్రపంచ ఉమ్మడి లక్ష్యాల నుంచి, తన బాధ్యత నుంచి వైదొలగిపోతూ అమెరికా ఈ వేదిక మీదా తన ఏకపక్ష వైఖరిని ప్రదర్శించటం ఆందోళనకరం.
కృత్రిమ మేధ ఆవిష్కరణకు, అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడి, ఏళ్ల తరబడిన కృషీ అవసరమని అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాలూ, కార్పొరేట్ కంపెనీలూ ప్రపంచానికి బోధిస్తే- కొద్ది పెట్టుబడితోనే ఆ పనిని సాకారం చేయొచ్చని చైనా ఇటీవల చాటి చెప్పింది. డీప్‌సీక్ ఆవిష్కరణ ద్వారా సంచలనం కలిగించింది. మెయిల్ మొదలుకొని అన్ని రకాల డిజిటల్ వేదికలను సొంతంగా నిర్మించుకున్న చైనా తన సొంత ముద్రను కాపాడుకుంటోంది. సమాచార సేకరణ, అమ్మకం పెద్ద వ్యాపారంగా మారిన ప్రస్తుత కాలంలో- సొంత సమాచార వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ, నియంత్రణలో మనమూ ముందడుగు వేయాలి. గతాన్ని, చరిత్రను వక్రీకరించే సాధనంగా టెక్నాలజీని వాడడమే గొప్పనుకునేలా మన పాలకులు యువతరాన్ని సంకుచిత కూపంలోకి నెడుతున్నారు. శాస్త్రీయ విద్యను, ఆధునిక దృక్పథాన్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని పెంపొందించటం ద్వారా మాత్రమే శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజయాలు సాధించగలం. విచక్షణ, వివేచన, మానవీయతతో కూడిన సమున్నత, సమానత్వ భావనలతోనే కృత్రిమ మేధకు అర్థమూ పరమార్థమూ చేకూరతాయి. ఆ దిశగా పాలకులు ఆలోచించాలి.