విజ్ఞానశాస్త్ర విజయం

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్‌తో పాటు, ఆమె సహచర వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ క్షేమంగా భూమికి తిరిగిరావడం విజ్ఞానశాస్త్రం సాధించిన మరో విజయం! కేవలం ఎనిమిది రోజుల పరిశోధనల కోసం గత ఏడాది జూన్‌ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన సునీత, విల్మోర్‌లు అనూహ్యంగా 286 రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. సొంత ఊరికి, అయిన వారికి ఆ మాట కొస్తే భూగోళానికే దూరంగా ఇంత సుదర్ఘీకాలం ఉండటమంటే మామూలు విషయం కాదు! నాలుగైదు రోజులు ఇంటికి దూరంగా గడపడమంటేనే మనలో చాలా మంది విలవిలలాడిపోతారు. అటువంటిది, ఎప్పుడు తిరిగివస్తారో, అసలు తిరిగి వస్తారో రారో తెలియని స్థితి! ఈ సందిగ్థత, గందరగోళం మనకే కాదు, భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత, విల్మోర్‌లకు కూడా తెలుసు! కానీ, వారు ఏ నాడూ తమ మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంతరిక్షంలో ఉండిపోయిన ఈ తొమ్మిది నెలల ఈ కాలంలో దిగులుతో కూర్చుండి పోలేదు. భావి తరాలకు ఉపయోగపడే ఎన్నో ప్రయోగాలను నిర్వహించారు. సునీత 900 గంటల పాటు అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో 62 గంటలకు పైగా స్పేస్‌ వాక్‌ చేసి ఆ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. తమను తిరిగి తీసుకురావడానికి భూమిమీద ఉన్న సహచరులు చేస్తున్న ప్రయత్నాల పట్ల, విజ్ఞానశాస్త్రం పట్ల వారికున్న తిరుగులేని నమ్మకమే దీనికి కారణం.

నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం 2024 జూన్‌ ఏడాది 13,14 తేదీల్లో వారు భూమికి తిరుగు ప్రయాణం కట్టాల్సి ఉంది. అయితే, వీరిని అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన వ్యోమనౌక ‘స్టార్‌ లైనర్‌’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిని అదే వాహనంలో వెనక్కి తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావించింది. అప్పటి నుండి ఎన్నో అవాంతరాలు! అంతా సిద్ధమైంది, ఈ సారి రావడం ఖాయమని అనుకునేలోగా మరో కొత్త సమస్య! దీంతో ఎప్పటికప్పుడు వారి తిరుగు ప్రయాణం వాయిదా పడేది! ఈ అవాంతరాలన్నీ దాటుకుని ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని సముద్ర జలాల్లో వారు క్షేమంగా దిగడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైన డ్రాగన్‌ వ్యోమనౌకలో వారు కూర్చున్న నిమిషం నుండి భూమి మీదకు క్షేమంగా చేరుకున్న చివరి క్షణం వరకు ప్రతి అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగలగడం అపూర్వం! భూ వాతావరణంలోకి వ్యౌమనౌక ప్రవేశించిన సమయంలో ఉత్పన్నమైన 1,650 డిగ్రీల ఉష్ణోగ్రత, ఫ్లాస్మా పేరుకుపోవడం, కొద్దిసేపు కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్థంభించిపోవడం, కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతుందో అర్ధంకాని ఉత్కంఠ, వీటన్నింటిని ఛేదిస్తూ రేడియోలో వినిపించిన కమాండర్‌ నిక్‌హేగ్‌ గొంతు, దీంతో కమాండ్‌ సెంటర్‌లో నెలకొన్న ఆనందం, చివరకు వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వీక్షించేలా చేయగలిగింది మాయలు, మంత్రాలు కాదు! కేవలం విజ్ఞానశాస్త్రం మాత్రమే! దానిని మరింత ముందుకు తీసుకెళ్లి భావితరాలకు అందించే క్రమంలో ఎదురైన ఆటంకాన్ని సునీత, విల్మోర్‌లు ఇతర శాస్త్రవేత్తల సహకారంతో సమర్ధంగా ఎదుర్కున్న తీరుకు జేజేలు!

భూమి గుండ్రంగా ఉందన్న వాస్తవాన్ని చెప్పినందుకు గెలీలియో అనుభవించిన శిక్ష, వ్యాధుల నివారణ పరిశోధనల్లో భాగంగా తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చిన లూయిపాశ్చర్‌ తెగువ నుండి, నిన్న మొన్నటి కరోనా సంక్షోభ నివారణ పోరు వరకు మానవాళి పురోగమనంలో సమిధలుగా మారిన విజ్ఞానశాస్త్ర యోధులును ఎందరిని చెప్పగలం! సుదర్ఘ ప్రయాణంలో మానవాళి అధిగమించిన మైలు రాళ్లను ఎన్నని లెక్కపెట్టగలం! అనంతమైన విశ్వాంతరాళపు నిగూఢ రహస్యాలను తెలుసుకొవాలన్న ఆకాంక్ష అనాదిగా ఉన్నదే. శాస్త్ర విజ్ఞానం మాత్రమే అందుకు దారి చూపగలుగుతుంది. విజ్ఞాన తృష్ణ మెండుగా ఉన్న వారు మాత్రమే ముందుకొచ్చి ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్క చేయకుండా తమ అన్వేషణ కొనసాగిస్తారు. అందుకే. వారు ఆధునిక సమాజపు వైతాళికులు.

సమాజాన్ని ముందుకు నడిపించింది అని చెప్పగల మూఢ విశ్వాసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కానీ మన కళ్ల ముందు విజ్ఞానశాస్త్రం సాధించిన విజయాలను కూడా మూఢ విశ్వాసాలతో ముడిపెట్టడం ఆందోళనకరం! మానవాళిని మూఢత్వం వైపు, అంధకారం వైపు మళ్లించే ఆ తరహా కుట్రలు, కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.

➡️