- అంతులేని వియత్నాం యుద్ధం
వియత్నాం యుద్ధం 1955 నుండి 1975 వరకు ఇరవయ్యేళ్ల పాటు కొనసాగింది. చరిత్రలో ఇంతటి విపత్కర అధ్యాయం పట్ల పశ్చాత్తాపం గాని, చేసిన దుర్మార్గం ఒప్పుకోలు ప్రకటనగానీ మనకు కానరాదు. ఈ యుద్ధం మానవ సమాజం మీదా, పర్యావరణం మీదా లోతైన గాయం మిగిల్చింది. ఇది మిగిలిన యుద్ధాల వంటి యుద్ధం కాదు. ఒక దేశం మీదో ఆ దేశ ప్రజానీకం మీదో, వాళ్లదైన చిన్న ప్రపంచం మీదో సామ్రాజ్యవాద శక్తులు నిరంతరాయంగా, నిర్దయగా చేసిన అమానవీయ, అమానుష యుద్ధం. ఈ యుద్ధం మాటున చేసిన విధ్వంసం, ప్రజానీకానికి మిగిల్చిన బాధ, వేదన కొన్ని దశాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధానికి ఉన్న చారిత్రక మూలాలు, ఈ యుద్ధం మూలంగా జరిగిన పర్యావరణ విధ్వంసం వియత్నాం ప్రజానీకాన్ని ప్రపంచ ప్రజానీకాన్ని పీడకలలా వెంటాడుతూనే ఉన్నాయి.
సామ్రాజ్యవాదం, ప్రచ్ఛన్న యుద్ధం దూకుడు
వలస పాలనను వ్యతిరేకిస్తూ వియత్నమిన్ శక్తుల పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్న ఫ్రాన్స్‌కు అమెరికా బలమైన తోడుగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ 1954లో వియత్నాంలో నెలకొన్న పరిస్థితులు, దక్షిణాసియాకు మధ్య ఉన్న బాదరాయణ సంబంధం గురించి వివరిస్తూ ఒక దేశంలో (వియత్నాం) కమ్యూనిజం విజయం సాధిస్తే చుట్టుపక్కల దేశాలన్నీ అదే మార్గం పడతాయన్న ఆందోళన వ్యక్తం చేశాడు. అమెరికా అండదండగా నిలబడిన ఫ్రాన్స్‌ను హోచిమిన్ నాయకత్వాన వియత్నమిన్ శక్తులు 1954లో డియన్ బియన్ ఫు దగ్గర పరాజయం పాల్జేశాయి. వియత్నాం నుండి ఫ్రాన్స్ సైన్యం వైదొలగింది. వియత్నాం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. అయితే ఈ స్వాతంత్య్రం అట్టే కాలం నిలవలేదు. దోపిడీ శక్తులు జెనీవా ఒప్పందం పేరిట వియత్నాం దేశాన్ని కమ్యూనిస్టు పార్టీ జయించుకున్న ఉత్తర వియత్నాం, కమ్యూనిస్టు వ్యతిరేక దక్షిణ వియత్నాంగా రెండుగా విభజించాయి.
అమెరికా సామ్రాజ్యవాద దాహంతో వియత్నాం అంతర్గత వ్యవహారాలలో తలదూర్చింది. ఉత్తర వియత్నాంలో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వం దక్షిణాసియా ఖండంలో పశ్చిమ దేశాల ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తుందని అమెరికా భావించింది. 1964లో టోన్‌కిన్ జల సంధిలో చోటు చేసుకున్నదని చెబుతున్న నావికాదళ స్వల్ప ఘర్షణను సాకుగా తీసుకుని అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏకపక్షంగా వియత్నాంపై సైనిక చర్యకు పిలుపునిచ్చాడు. అధునిక యుద్ధ చరిత్రలో అత్యంత పాశవికమైన యుద్ధానికి అలా అంకురార్పణ జరిగింది.
1965 నుండి 1973 వరకు అమెరికా 50 లక్షల మందికి పైగా సైన్యాన్ని వియత్నాం యుద్ధంలో మోహరించింది. అమెరికా వియత్నాంలో అంగుళం భూభాగాన్ని కూడా వదిలి పెట్టకుండా వైమానిక దాడుల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. రసాయన యుద్ధానికి పాల్పడింది. అయితే అమెరికాలో ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. అమెరికా దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం తీసుకు వచ్చిన ఒత్తిడి, దేశీయంగా ఉధృతమైన నిరసనోద్యమాల నేపథ్యంలో అమెరికా వియత్నాం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటూ 1973లో పారిస్‌లో ఒక శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసింది.
బాంబు దాడుల తీవ్రత – సరికొత్త సాక్ష్యం
అమెరికా వియత్నాం మీద బాంబు దాడులు చేసి విచక్షణా రహిత విధ్వంసానికి పాల్పడింది. కొత్తగా వెలుగు చూసిన రహస్య నివేదికలు ఈ బాంబు దాడుల వెనుక ఉన్న భయంకరమైన చేదు నిజాలను వెల్లడిస్తున్నాయి. వియత్నాం, లావోస్, కంబోడియాల మీద అమెరికా 130 లక్షల టన్నుల బాంబులు కురిపించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కురిపించిన మొత్తం బాంబుల పరిమాణం వియత్నాం మీద అమెరికా కురిపించిన బాంబులతో పోలిస్తే ఏ మూలకీ లెక్కలోకి రావు.
క్యూయాంగ్ ట్రై ప్రావిన్స్‌లోను, వియత్నాం, లావోస్, కంబోడియాల ఉమ్మడి సరిహద్దు ట్రై ప్రాంతంలోనూ దాదాపు 50,000 భారీ గోతులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి కేవలం గోతులే కాదు. వీటి నిండా ఇంకా పేలని మందుగుండు పదార్థాలు నిండి ఉన్నాయని తేల్చి చెప్పారు. వియత్నాం యుద్ధం ముగిసి ఇప్పటికి యాబై ఏళ్లు కావస్తున్నది. ఈ రోజుకీ వియత్నాం గడ్డ మీద 6,00,000 టన్నుల పేలని మందు గుండు నిల్వలున్నాయి. యుద్ధం ముగిసినా ఈ పేలుడు పదార్థాల మూలంగా ఇప్పటి వరకూ లక్ష మంది సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారని వియత్నాం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వీటి మూలంగా ఈ రోజుకీ స్థానికులు భయం భయంగా దినదినగండంగా బతుకులు వెళ్లదీస్తున్నారు.
రసాయన యుద్ధ విధ్వంసం
మానవ జీవితాలంటే అమెరికా సామ్రాజ్యవాదానికి ఏ మాత్రం లెక్కలేదని వియత్నాంపై అది కురిపించిన బాంబులు తెలియచేస్తుంటే ‘ఏజెంట్ ఆరెంజ్’ పేరిట అది చేపట్టిన రసాయన యుద్ధం దాని రాక్షసత్వాన్ని వెల్లడిస్తుంది. 1962-1971 మధ్య కాలంలో అమెరికన్ సైన్యం వియత్నాం, తూర్పు లావోస్, కంబోడియాలోని కొన్ని ప్రాంతాలపై 750 లక్షల లీటర్ల విష రసాయనాలు విరజిమ్మింది. 1967-69 మధ్య కాలంలో ఈ విష రసాయనాలను అత్యధిక స్థాయిలో వినియోగిరచింది. సామూహిక విధ్వంసక ఆయుధాలలో రసాయన యుద్ధం అనేది మానవులు సష్టించిన అత్యంత కిరాతక యుద్ధ క్రీడగా నిలుస్తుంది. ఈ రసాయన యుద్ధం ద్వారా వియత్నాంలో పంటలను, అడవులను దుంప నాళనం చేసింది అమెరికా. పర్యావరణ దృష్ట్యా చూస్తే ఇది మానవ ప్రేరేపిత ఉత్పాతం. 30 లక్షల హెక్టార్ల పచ్చని అడవులు బీళ్లుగా మారాయి. జీవ వైవిధ్యం ఘోరంగా దెబ్బతిని పోయింది. పర్యావరణానికి తీరని విపత్తు దాపురించింది.
‘ఏజెంట్ ఆరెంజ్’ రసాయనాల విష ప్రభావాలతో దాదాపు 30 లక్షల మంది వియత్నమీయులు అనారోగ్యం పాలైతే మరో పది లక్షల మంది అంగ వైకల్యానికి లోనయ్యారని అధికారికంగా లెక్కించారు. యుద్ధానంతరం జన్మించిన తరం పిల్లలకు తాము ఎందుకు జన్యుపరమైన లోపాలతో వికారంగా ఉన్నామో తెలియదు. యుద్ధం పేరిట వియాత్నాంలో అమెరికా సష్టించిన విధ్వంసంతో పోలిస్తే అది చెల్లించిన పరిహారం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
యుద్ధం మూలంగా వియత్నాం ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిని పోయింది. సాగుకి లాయకీ అయిన భూములు…బాంబుల మూలంగా ధ్వంసం కావడం, లేదంటే ఏజెంట్ ఆరెంజ్ రసాయనాల మూలంగా దెబ్బతిని పోవడమో జరిగింది. దీనితో సాగు దెబ్బ తినిపోయి గ్రామీణ ప్రాంత ప్రజానీకం పేదరికంలోకి కూరుకుపోయారు. క్షుద్భాద పట్టి పీడించింది. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే లక్షలాది మంది ప్రజానీకం కూడా జీవనోపాధి కోల్పోయి అదే దైన్యానికి లోనయ్యారు. నదులు, నీళ్ల చెలమలు, బావులు విష రసాయనాల ప్రభావంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి పనికి రాకుండా పోయాయి. గత్యంతరం లేక అదే నీటిని వాడుకున్న జనం రోగాల పాలయ్యారు.
సామాజిక జన జీవితం అస్తవ్యస్థం అయిపోయింది. మరణాలు, విస్థాపనలు, యుద్ధం మూలాన ఏర్పడిన మానసిక సమస్యలతో కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమై పోయాయి. ఈ యుద్ధం ములంగా ఇరవై లక్షల మంది వియత్నమీయులు మరణించారు. అనేక లక్షల మంది విస్థాపనకు గురయ్యారు. తత్ఫలితంగా అతి పెద్ద మానవ సంక్షోభం నెలకొన్నది. యుద్ధానంతరం దేశ పునర్నిర్మాణ ప్రక్రియ చాలా నెమ్మదిగా నడిచింది. యుద్ధం మూలంగా నెలకొన్న విధ్వంసం అంతటి తీవ్ర స్థాయిది కావడం ఒక కారణమైతే, పునర్నిర్మాణ ప్రక్రియకు అంతర్జాతీయ సహకారం ఆశించినంతగా అందకపోవడం మరో కారణం.
యుద్ధం-జవాబుదారీతనం
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన యుద్ధాల్లో అత్యధికం అమెరికా స్వీయ ప్రయోజనాల కోసం, అమెరికా తోడ్పాటుతో జరిగినవే. వియత్నాం యుద్ధం నేర్పిన గుణపాఠాలను అమెరికా ఈ రోజుకీ పెద్ద ఎత్తున విస్మరిస్తున్నది.
ఈ అమానవీయ యుద్ధానికి నైతికంగా బాధ్యత వహించకపోవడం అమెరికా ప్రధాన వైఫల్యం. విషతుల్యమైన పదార్థాల ప్రక్షాళన, ఆ రసాయనాల ఫలితంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలను చక్కదిద్దడానికి అమెరికా పూర్తి బాధ్యత వహించకపోవడం క్షంతవ్యం కాని నేరం. అమెరికా పెద్ద ఎత్తున ఈ సమస్యల పరిష్కారానికి పూచీ పడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా యుద్ధాలను ప్రేరేపించడం గానీ, యుద్ధాలకు మద్దతుగా నిలబడడం కానీ చేయరాదు.
వియత్నాం యుద్ధం మిగిల్చిన గాయాలను చూసి అమెరికా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అమెరికా చేసిన తప్పులకు పరిహారంగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన కార్యాచరణ పథకాన్ని చేపట్టాలి. విచ్చలవిడిగా బాంబులు ప్రయోగించడం, రసాయన జీవ ఆయుధాలను వినియోగించడం మీద పూర్తి నిషేధం విధించేలా ప్రపంచ దేశాల మీద అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలి. ఇజ్రాయిల్ వంటి ధూర్త దేశాల మీద కఠిన చర్యలు చేపట్టాలి. యుద్ధ పరిహారం చెల్లింపు దానధర్మంగా ఇచ్చేది కాదు. సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి పరిహారం చెల్లించాలి.
పారదర్శకతకు, జవాబుదారీతనానికి అమెరికా పెట్టింది పేరు అంటుంటారు. అదే నిజమైతే వియత్నాం యుద్ధ బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు తక్షణమే సమగ్ర సహాయ ప్రణాళికను ప్రకటించి అమలు చెయ్యాలి. లేని పక్షంలో యుద్ధం మూలంగా ఒనగూడిన అన్యాయాలను వియత్నాం ప్రజానీకం మరింత సుదీర్ఘకాలం భరించాల్సి వుంటుంది. వియత్నాం యుద్ధం నుండి మనం నేర్వాల్సిన గుణపాఠం ఏమిటంటే ప్రజల ప్రాణాలను హరించి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే సాయుధ ఘర్షణలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. యుద్ధ వ్యయం కన్నా యుద్ధాల మూలంగా చెల్లించే మూల్యం ఎన్నో రెట్లు ఎక్కువ. యుద్ధాలు దేశాలకు దేశాలనే అస్థిరం పాల్జేస్తాయి. సామ్రాజ్యవాద శక్తులు యుద్ధ దాహార్తిని కట్టబెట్టి శాంతికి కట్టుబడి ఉండాలి. మానవాళి శ్రేయస్సు కోసం యుద్ధాలను వ్యతిరేకించాలి. శాంతి స్థాపన కోసం పాటుపడాలి. వియత్నాం యుద్ధం మనకు ఇచ్చే సందేశం ఇదే.
ఎస్. కృష్ణస్వామి