‘జాతుల సంపద’ గ్రంథాన్ని ఆడమ్ స్మిత్ 1776లో రచించాడు. అందులో మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి వాటి మధ్య తేడాలను వివరించాడు. మొదటిది: పురోగమించే రాజ్యం, రెండవది: ఎదుగూ బొదుగూ లేని రాజ్యం, మూడవది: దిగజారుతున్న రాజ్యం. పురోగమించే రాజ్యంలో జనాభా పెరిగే వేగం కన్నా ఎక్కువ వేగంతో పెట్టుబడి పోగుబడుతూ వుంటుంది. దాని వలన వేతనాలు పెరుగుతూ పోతాయి. దిగజారుతున్న రాజ్యంలో దానికి పూర్తి వ్యతిరేక దిశలో జనాభా పెరుగుదల వేగం ఎక్కువగా ఉండి పెట్టుబడి పోగుబడే వేగం తక్కువగా ఉంటుంది. అందువలన వేతనాలు అక్కడ దిగజారిపోతూ వుంటాయి. ఇక ఎదుగూ బొదుగూ లేని రాజ్యంలో పెట్టుబడి నిల్వలు గాని, జనాభా గాని వేతనాలు గాని మార్పు లేకుండా అలాగే ఉండిపోతాయి. ఐతే అక్కడ వేతనాలు పురోగమించే రాజ్యంలోని వేతనాలకన్నా తక్కువ స్థాయిలో ఉంటాయి. ”అందుచేత దేశ సంపద ఎంత ఎక్కువగా ఉంది అనే దానిని బట్టి గాక, ఆ సంపద నిరంతరాయంగా ఎంత వేగంగా పెరుగుతూ పోతుంది అన్న దానిని బట్టి అక్కడ వేతనాలు పెరుగుతాయి” అని ఆడమ్ స్మిత్ వాదించాడు. అంతేగాక, ”పురోగమించే రాజ్యం వివిధ తరగతుల ప్రజలందరికీ ఆనందదాయకంగా, సుఖదాయకంగా ఉండే రాజ్యం. ఇక ఎదుగూ బొదుగూ లేని రాజ్యంలో ప్రజలు స్తబ్దుగా ఉండిపోతారు. మరి దిగజారే రాజ్యంలో అన్ని తరగతుల ప్రజలూ విషాదమయమైన జీవితాలను గడుపుతారు” అని అన్నాడు. పురోగామి రాజ్యానికి ఉత్తర అమెరికా ఉదాహరణగా ఉంటుందని, బెంగాల్ దిగజారుతున్న రాజ్యానికి, చైనా ఎదుగూ బొదుగూ లేని రాజ్యానికి ఉదాహరణలుగా ఉంటాయని అతడు చెప్పాడు.
ఆడమ్‌స్మిత్ బెంగాల్‌కు, ఉత్తర అమెరికాకు మధ్య ఉన్న తేడాను వివరించడం ఆనాటికి చాలా సముచితమైనది. అతడి అవగాహన ఎంత లోతైనదో అది సూచిస్తుంది. వాస్తవానికి ఆడమ్ స్మిత్ తన గ్రంథం రాసే నాటికి బెంగాల్ పరిస్థితి అతడు ఊహించినదానికన్నా ఇంకా ఘోరంగా ఉండేది. మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్ రాజ్యంలో పన్నులు వసూలు చేసే హక్కును ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుక్కుంది. ఆ తర్వాత పన్ను రేట్లు ఎంతగా పెరిగాయంటే 1770-72 మధ్య కాలంలో బెంగాల్‌లో తీవ్రమైన కరువుకు అది దారి తీసింది. అందులో సుమారు 1 కోటి మంది మరణించారు. అప్పటి బెంగాల్ జనాభాలో అది మూడో వంతు! ఐతే ఉత్తర అమెరికాను వేగంగా పురోగమిస్తున్న రాజ్యానికి, బెంగాల్‌ను దిగజారుతున్న రాజ్యానికి ఉదాహరణలుగా ఆడమ్ స్మిత్ ఎంచుకోవడానికి వెనుక కారణం వేరు. అప్పటికి ఉత్తర అమెరికా బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో ఉంది (ఆడమ్ స్మిత్ తన గ్రంథం రాసేనాటికి అమెరికా స్వతంత్ర పోరాటం ఇంకా జరగలేదు). బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్య సంస్థ పాలనలో ఉంది. ఆడమ్ స్మిత్ స్వేచ్ఛా, సమన్యాయ సూత్రాల మీద ఆధారపడిన పెట్టుబడిదారీ విధానానికి సమర్ధకుడు. గుత్త వాణిజ్య సంస్థలకు వ్యతిరేకి. అందుచేత అతడు ఈస్ట్ ఇండియా కంపెనీని తీవ్రంగా ద్వేషించాడు. అందుచేత అతడు బెంగాల్‌కు, ఉత్తర అమెరికాకు తేడా ఎందుకు ఉందో తన అవగాహన ప్రకారం వివరణ ఇచ్చాడు. ఐతే అతడి వివరణ మాత్రం పూర్తిగా తప్పు.
అప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న బెంగాల్, ఇతర భారత భూభాగాలు, 1857 తిరుగుబాటు తర్వాత 1858 నుంచీ బ్రిటిష్ ప్రభుత్వ పాలన కిందకు వచ్చాయి. ఆ తర్వాత కూడా బెంగాల్ దిగజారుడు ఆగలేదు. కరువు కాటకాలు ఆగలేదు. వలస పాలకుల దోపిడీ దాహం ఏ మాత్రమూ తగ్గలేదు. మరి బెంగాల్‌కు, ఉత్తర అమెరికాకు తేడా ఎక్కడుంది? బెంగాల్ బ్రిటన్ ఆధీనంలోకి పోయిన వలస రాజ్యం. ఉత్తర అమెరికా బ్రిటిష్ ప్రజలే ఆ ప్రాంతానికి వలసలు పోయి అక్కడ స్థిరపడడం ద్వారా ఏర్పడిన రాజ్యం. రెండూ బ్రిటన్‌కు వలసలుగానే ఉన్నా, ఆ రెండింటికీ మధ్య తేడా ఇక్కడే ఉంది.
ఉత్తర అమెరికా లోని సమ శీతోష్ణ మండల భూభాగాలకు యూరప్ నుండి జనాభా వలసలు పోయి అక్కడ జీవించే స్థానికులను తరిమివేసి వారి భూములను ఆక్రమించుకున్నారు. ఆ స్థానికులలో ఇంకా జీవించి వున్నవారిని కొద్దిపాటి భూభాగాలకు పరిమితం చేశారు. తక్కిన భూములను తమ మధ్య పంచుకున్నారు. ఆ విధంగా యూరప్ నుండి వలసలు వచ్చినవారు ధనవంతులైన రైతులుగానో, ఇతరత్రా ఉన్నతాదాయాలు పొందే వృత్తులు చేసేవారిగానో ఉత్తర అమెరికా ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆ విధంగా యూరప్ నుండి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలలోని సమ శీతోష్ణ ప్రదేశాలకు వలసలు పోయినవారు 5 కోట్ల మందికి పైనే ఉంటారని పండితులు అంచనా వేశారు. 1815 నుంచి 1914 మధ్య కాలంలో ఈ వలసలు ప్రధానంగా జరిగాయి (అంతకు ముందు నుంచీ కూడా వలసలు ఉన్నా అవి కొద్ది మోతాదులోనే ఉండేవి). అదే కాలంలో ఇవే ప్రాంతాలకు భారత దేశం నుంచి, చైనా నుంచి కూడా ఒప్పంద కార్మికులుగా, కూలీలుగా అనేకులు వలసలు వెళ్ళారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసినది ఏమంటే, భారత్, చైనా తదితర ఉష్ణ దేశాల నుండి వలసలు యూరోపియన్ వలస ప్రజల అనుమతి మేరకే జరిగాయి తప్ప నిర్నిబంధంగా, ఎటువంటి పరిమితులూ విధించకుండా వీరిని వలస రావడానికి అనుమతించలేదు (యూరప్ నుండి వెళ్ళినవారి విషయంలో అటువంటి నిబంధనలు, ఆంక్షలు లేవు). ఇప్పటికీ, ఆ సమశీతోష్ణ ప్రదేశాలకు భారతదేశం, చైనా తదితర ఉష్ణ మండల దేశాల నుండి వలసలు పోడానికి ఆంక్షలు కొనసాగుతూనే వున్నాయి.
యూరప్ నుండి ఆ సమ శీతోష్ణ ప్రదేశాలకు వలసలు పోవడం జరుగుతున్నప్పుడే సమాంతరంగా యూరప్ నుండి పెట్టుబడికూడా తరలి వెళ్ళింది. ఆ విధంగా యూరప్ నుండి పారిశ్రామిక కార్యకలాపాలు ఉత్తర అమెరికాకు, తక్కిన యూరోపియన్ సెటిల్మెంట్లకు విస్తరించాయి. దీనికి పూర్తి భిన్నంగా యూరోపియన్ దేశాల వలసలుగా ఉన్న ఉష్ణ దేశాలకు (భారత్ తదితర ఆసియా, ఆఫ్రికా దేశాలు) యూరప్ నుండి ఎటువంటి పారిశ్రామిక కార్యకలాపాలూ విస్తరించలేదు. ఈ వలస దేశాల్లో యూరోపియన్ ఆధిపత్య రాజ్యాలు ఏవైనా పెట్టుబడులు పెట్టాయంటే అవి కేవలం ఇక్కడ దొరికే ముడి సరుకులను మరింతగా తయారు చేసుకోడానికి మాత్రమే. ఉదాహరణకు బ్రిటన్‌కి ఉన్న వలసల్లో అతి పెద్దది, అత్యంత కీలకం అయినది భారత ఉపఖండం. అటువంటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి (1914) బ్రిటన్ తన మొత్తం విదేశీ పెట్టుబడిలో కేవలం 10 శాతం మాత్రమే భారత ఉప ఖండంలో పెట్టింది. అది కూడా తేయాకు, జనపనార తదితర ఉత్పత్తుల కోసం, వాటి రవాణా కోసం మాత్రమే.
నిజానికి ఇక్కడ జరిగినది బ్రిటన్ నుంచి భారత దేశానికి పెట్టుబడులు రావడం కాదు. దానికి విరుద్ధ దిశలో ఇక్కడి నుంచి మిగులును తమ దేశానికి తరలించుకుపోయారు. పన్ను రూపంలో వసూలు చేయడం, ఇక్కడ పండిన పంటలను కొనుగోలు చేయడానికి ఆ పన్నుల ద్వారా సమకూరిన ధనాన్నే ఖర్చు చేయడం బ్రిటిష్ వారి విధానం అయింది. అంటే ఇక్కడి నుంచి ముడిసరుకు అంతా ఒక విధంగా ”ఉచితంగా” యూరోపియన్ దేశాలు పొందాయన్నమాట. బహుశా అటువంటిది జరిగి వుండకపోతే యూరప్‌లో ఆ పారిశ్రామిక విప్లవం సాధ్యపడేది కాదేమో! బ్రిటిష్ వారి దోపిడీ అక్కడితో ఆగలేదు. తమ దేశం నుండి పారిశ్రామిక ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి కుమ్మరించారు. ఆ తాకిడికి తట్టుకోలేక ఇక్కడి సాంప్రదాయ వృత్తులు అన్నీ చితికిపోయాయి. చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారులు భారీ సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. ప్రత్యామ్నాయ జీవనాధారంగా వారంతా వ్యవసాయం వైపు మళ్ళారు. దాంతో భూమి మీద ఒత్తిడి పెరిగింది. భూముల కౌళ్ళు పెరిగిపోయాయి. కూలి రేట్లు తగ్గిపోయాయి. ప్రజా బాహుళ్యం పేదరికంలో కూరుకుపోయింది. బెంగాల్‌లో తగినంత పెట్టుబడి పోగుబడకపోవడం వల్లనే బెంగాల్ దిగజారిందని ఆడమ్ స్మిత్ భావించినది తప్పు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వల్లనే బెంగాల్ దిగజారిందని అతడు భావించినదీ తప్పు. బ్రిటన్‌లో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందాలంటే బెంగాల్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టి ఇక్కడికి బ్రిటన్ నుంచి పారిశ్రామిక సరుకులను గుమ్మరించడానికి మార్గం ఏర్పాటు చేయడం అవసరం అయింది. బెంగాల్ పరిస్థితి దిగజారుతున్న కొద్దీ బ్రిటన్‌లో పెట్టుబడి పోగుబడడం పెరుగుతూ వచ్చింది.
ఇంతవరకూ చెప్పిన విషయాలు చాలామట్టుకు అందరికీ తెలిసినవే. ఐతే జనాభా ఒక ప్రాంతం నుండి వలసలు పోయి మరొక ప్రాంతంలో సెటిల్ అయినందువలన ఏర్పడిన రాజ్యాలకి, ఒక దేశం మరొక దేశాన్ని లోబరుచుకోవడం వలన వలసలుగా మారిన దేశాలకి మధ్య తేడాను నేటికి కూడా సరిగా గుర్తించడం లేదు. అందుకే ఈ విషయాలను మళ్ళా చెప్పవలసి వచ్చింది. మొదటి తరహా వలస దేశాలను, రెండో తరహా వలస దేశాలను కలిపి ఒకే గాటన కట్టి అంతా ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’లో భాగమే అన్నట్టు వ్యవహరిస్తూంటారు. దీనివలన వాస్తవంగా జరిగిన దోపిడీ కనిపించకుండా పోతుంది.
ఇంకో విషయం కూడా ఉంది. అమెరికా, కెనడా, తదితర సమ శీతోష్ణ దేశాలకు పారిశ్రామిక విస్తరణ ముందు జరిగిందని, ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థలో గతంలో వలసలుగా ఉండిన ఉష్ణ దేశాలకు (భారత్ తదితర ఆసియా, ఆఫ్రికా దేశాలకు) పారిశ్రామిక విస్తరణ జరుగుతోందని, అందుచేత గతంలో అమెరికా, కెనడా వంటి దేశాలు అభివృద్ధి చెందినట్టే ఇప్పుడు ఇండియా, ఇండోనేషియా తదితర దేశాలు అభివృద్ధి చెందుతాయని నమ్మబలుకుతున్నారు.
ఇక్కడ మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మొదటిది: ఇండియా గాని, ఇండోనేషియా గాని సామ్రాజ్యవాద దేశాలకు వలసలుగా చాలా కాలం ఉన్న కారణంగానే అవి బాధిత దేశాలుగా ఉన్నాయి. వీటికి స్వాతంత్య్రం వచ్చినా, గత వారసత్వంగా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పెద్ద మోతాదులో పొందాయి. ఇది ఆ వలస పాలన పుణ్యమే. అందుచేత అమెరికాలో, కెనడాలో జరిగిన విధంగా ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి అదే తరహాలో చేసేయవచ్చునని, అక్కడ వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చేస్తాయని అనుకుంటే పొరపాటు. రెండవది: భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చిన్న, మధ్య తరహా ఉత్పత్తి వ్యవస్థలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలలోకి విదేశాల నుండి పెట్టుబడుల ప్రవాహం వచ్చిపడితే జరిగేది అభివృద్ధి కాదు, పెద్ద సంఖ్యలో ఈ చిన్న మధ్య తరహా ఉత్పత్తుల వినాశనం మాత్రమే. సంపన్న దేశాల నుండి వచ్చే పెట్టుబడులు ఇక్కడ ఉన్న రిజర్వు సైన్యాన్ని (నిరుద్యోగులను) వినియోగించుకునే బదులు, ఇక్కడ మరింత ఎక్కువ సంఖ్యలో రిజర్వు సైన్యాన్ని తయారు చేస్తాయి. మూడవది: 19వ శతాబ్దంలో సమ శీతోష్ణ దేశాలకు యూరప్ నుండి పెట్టుబడులు తరలుతున్నప్పుడు ఆ సమ శీతోష్ణ దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకోగలిగాయి. కాని ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థలో ఏ దేశమూ ఆ విధంగా రక్షణాత్మక చర్యలు తీసుకోజాలదు.
మరొక విషయం కూడా చూడాలి. మూడవ ప్రపంచ దేశాలలో పారిశ్రామిక విస్తరణ ఫలితంగా ఉత్పత్తి అయిన సరుకులు తమ దేశీయ ఉత్పత్తులను మించిపోయే పరిస్థితే గనుక ఏర్పడితే ఈ సంపన్న దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? దాని వలన తమ తమ దేశాల్లో నిరుద్యోగం పెరిగితే సహిస్తాయా? సంపన్న దేశాల నుండే ఆ పెట్టుబడి మూడవ ప్రపంచ దేశాలకు తరలి వెళ్ళి వుండొచ్చు. కాని తమ దేశీయ మార్కెట్ లోకి ఆ మూడవ ప్రపంచ దేశాల సరుకులు వచ్చిపడితే సంపన్న దేశాలు ఊరుకోవు. ఇప్పుడు చైనా నుంచి తమ దేశానికి వచ్చిపడే సరుకుల తాకిడిని నియంత్రిస్తూ అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటోందో మనం చూస్తూనే వున్నాం.
అందుచేత యూరప్ నుండి జనాభా వలసలు పోయి స్థిరపడిన సమ శీతోష్ణ దేశాల అభివృద్ధి క్రమం వేరు. యూరప్ దేశాలు తమ తంత్రం ద్వారా వలసలుగా మార్చి పెత్తనం చెలాయించిన ఉష్ణ మండల దేశాల అభివృద్ధి క్రమం వేరు. ఈ తేడా ఆడమ్ స్మిత్‌కు తెలియదు. అతడి కాలానికి ఈ తేడా స్పష్టంగా కనిపించే పరిస్థితులు లేవు. కాబట్టి ఆడమ్ స్మిత్‌ను మనం అర్ధం చేసుకోవచ్చు. కాని ఇప్పుడు అన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా, ఇప్పుడు కూడా మన దేశం సైతం అమెరికా మాదిరిగానో లేదా కెనడా మాదిరిగానో అభివృద్ధి చెందిపోతుందని, కేవలం పెట్టుబడులు వచ్చిపడితే చాలునని నమ్మేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి? వారి నమ్మకం పూర్తిగా తప్పు అని మాత్రమే చెప్పగలం.
– ప్రభాత్ పట్నాయక్
( స్వేచ్ఛానుసరణ )