ఆఫ్రికా ఖండాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ కేసులు మనదేశంలోనూ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు యువకుల్లో అనుమానిత లక్షణాలు కనపడడంతో- వారిని ఢిల్లీ జయప్రకాశ్ నారాయణన్ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి, పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ మంకీపాక్స్ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. 2022 జులై నుంచి ఇప్పటివరకూ మనదేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, వాటి వలె తాజా కేసులూ ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే సందర్భంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌లో ఉంచి, వైద్య పరీక్షలు జరపాలని సూచించింది.
ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. పదిహేను నెలల క్రితమే కేసులు నమోదు కాగా, ఇది అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పేర్కొంది. ఆ తరువాత కూడా కేసులు పెరగడంతోనూ, అనేక దేశాల్లోకి వైరస్ వ్యాప్తి చెందడంతోనూ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. విమానాశ్రయాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేయాలని, ఏ కొద్దిపాటి లక్షణాలు కనిపించినా రోగులను ఐసోలేషన్‌లో ఉంచి, చికిత్స అందించాలని అన్ని దేశాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం 116కు పైగా దేశాల్లో 16 వేల మంది మంకీపాక్స్ బాధితులు ఉన్నట్టు డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాపించే వ్యాధి కానప్పటికీ – అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తోంది.
1956లో తొలిసారి కోతుల్లో ఈ వ్యాధిని కనుగొన్నందున దీనికి మంకీపాక్స్ అని పేరు. 1970లో కాంగోలోనే ఓ వ్యక్తికి సోకింది. వైరస్ సోకిన 5 నుంచి 21 రోజుల్లో జ్వరం, చర్మం మీద దద్దుర్లు, కండరాల నొప్పి, గాయాలవ్వడం, చలి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాంగోలో ఇప్పుడు ఉనికిలో ఉన్న వైరస్ క్లాడ్ 1 టైపు అని, ఇది తన జన్యు ఉత్పరివర్తన లక్షణాలను మార్చుకొని తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తోందని గుర్తించారు. లైంగిక సంపర్కం ద్వారానే ఈ వైరస్ సోకుతుందని ఇప్పటివరకూ ఉన్న అవగాహన కాగా, కొత్త వేరియంట్ వైరస్ రోగికి దగ్గరగా ఉన్నా, ముట్టుకున్నా వ్యాప్తి చెందుతున్నట్టు తాజాగా గమనించారు. ఈ పరిస్థితుల్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
ఇలాంటి సాంక్రమిత వ్యాధులు చుట్టుముడుతున్నప్పుడు అవి ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తలెత్తినప్పటికీ అంతర్జాతీయ సమాజం మొత్తం బాధ్యతాయుతంగా స్పందించాలి. దేశాలకు సరిహద్దులు ఉంటాయి కానీ, వైరస్‌ల వ్యాప్తికి ఏ అడ్డంకులూ ఉండవు. కోవిడ్ కాలంలో ఈ వైపరీత్య వ్యాప్తి ఎంత వేగంగా జరుగుతుందో ప్రపంచం ప్రత్యక్షంగా అనుభవించింది. ఎయిడ్స్, ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఎక్కడో పుట్టి, ఇప్పుడు ప్రపంచమంతటా తిష్ట వేశాయి. ఎవరి భద్రత వారే చూసుకుంటాం అంటే అది కుదిరే పని కాదు. అందుకనే కొత్త కొత్త వ్యాధులు కోరలు చాస్తున్నప్పుడే వాటి నియంత్రణకు, నిర్మూలనకూ చిత్తశుద్ధితో పూనుకోవాలి. ఇప్పుడు కాంగోలో కోటికి పైగా టీకా డోసులు అవసరం కాగా, 3 లక్షల డోసులు కూడా అందుబాట్లో లేవు. ఆకలిదప్పులతో అల్లాడిపోయే ఆ దేశం సొంతంగా టీకాలను సమకూర్చుకోవడం జరగని పని. టీకాలు అందిస్తామని అమెరికా, ఐరోపా దేశాలు మాట వరసకు చెప్పినా, ఆచరణలో ఇంతవరకూ చేసింది శూన్యం. లాభాలే పరమార్థంగా భావించే బహుళ జాతి మందుల కంపెనీలు రాబందుల్లా వేచి చూస్తున్నాయి తప్ప- ఆదిలోనే పరిస్థితిని అదుపు చేయటానికి ముందుకు రావటం లేదు. స్వలాభాలే పరమార్థంగా ఉన్న సంపన్న దేశాలూ, కార్పొరేటు కంపెనీలూ ఆధునిక ఆవిష్కరణలపై ఆధిపత్యం పొందుతాయి చేస్తాయి తప్ప వాటిని మానవాళి మేలు కోసం ఉపయోగించవు. పైగా వాటి మితిమీరిన ధనాకాంక్ష వైపరీత్యాల వ్యాప్తికీ, వ్యాధుల ఉధృతికి కారణమవుతుంది. ఆధునిక సామాజిక చైతన్యానికి, నాగరిక వికాసానికి రోగాలూ, వైపరీత్యాలూ లేని ప్రపంచం ఒక ఆదర్శవంతమైన ఆనవాలు. ఎక్కడ వ్యాధులు విస్తరిస్తున్నా అక్కడికి ఎల్లలెరగని ఆధునిక వైద్య పరిజ్ఞానం, మానవతా సహాయం వెల్లువెత్తాలి. ఆదిలోనే ప్రాణాంతక వైరస్‌ల పీచమణచాలి. అప్పుడే ప్రపంచ ఆరోగ్యానికి పరిపూర్ణమైన రక్ష!
