తీర్పు మారినా.. మారని తీరు!

Jun 26,2024 05:36 #editpage
politica parties election sefalogist

ఇటీవలి ఎన్నికల్లో జనం కర్రు కాల్చి వాత పెట్టినా… మోడీ పరివార్‌లో ఇసుమంతైనా మార్పు లేదు. తమకు ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఏమాత్రం సరిపడవని 18వ లోక్‌సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా మరోసారి రుజువు చేసుకున్నారు. 400 సీట్లు సాధించి.. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు కాలరాయాలని కలలుగన్న కమలం పార్టీ రాజకీయాల్ని జనం ఛీకొట్టినా… తాము సాధించింది ఘన విజయమని మోడీ చెప్పుకున్నారు. ఎన్నికల ప్రక్రియ అద్భుతంగా సాగిందని కితాబు ఇస్తూ.. ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కిన విషయాన్ని దాచిపెట్టారు. యుఎపిఎ కేసులు పెట్టి, గళమెత్తిన మేధావులను, విద్యార్థి, యువ నేతలను, ప్రబీర్‌ పుర్కాయస్థ లాంటి ప్రఖ్యాత జర్నలిస్టులను, ప్రతిపక్ష పార్టీల కీలక నాయకులు, సిఎంలను సైతం కేంద్ర ఏజెన్సీలతో తప్పుడు కేసులు పెడుతూ.. జైళ్లలో కుక్కుతూ…ఎమర్జెన్సీ గురించి సుద్దులు చెబుతున్నారు. దశాబ్దం కిందటి వ్యాఖ్యలను ముందుకు తెచ్చి అరుంధతీ రారుపై తాజాగా ఉపా కేసు పెట్టడం, కేజ్రీవాల్‌ బెయిల్‌ను అడ్డుకోవడానికి ఇ.డి ద్వారా శతవిధాలా ప్రయత్నించడం…ఇవన్నీ కమలం పార్టీ సర్కారు నిరంకుశ, నియంతృత్వ పోకడలు కావా? ప్రతిపక్షాలు ఈసారైనా తీరు మార్చుకుంటాయని, ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడతాయని ఆశాభావంతో ఉన్నానని ప్రధాని వ్యాఖ్యలు చేశారు. తీరు మార్చుకోవాల్సింది ఎవరు? గత ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వంద మంది లోక్‌సభ సభ్యుల్ని, 46 మంది రాజ్యసభ సభ్యుల్ని సస్పెండ్‌ చేసి.. ఎటువంటి చర్చా లేకుండా ప్రజా వ్యతిరేక చట్టాల్ని ఆమోదించుకున్నది ఎవరు? రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను, వివాదాస్పద 370 ఆర్టికల్‌ రద్దు, సిఎఎ.. ఇలా ఎన్నింటినో పార్లమెంట్‌ సభ్యుల గొంతునొక్కి… ప్రజాభిప్రాయాన్ని బుల్డోజ్‌ చేసి, నిరంకుశంగా ఆమోదించుకున్న చరిత్ర మోడీ సర్కారుది కాదా! ఏ సాంప్రదాయాలు పాటించబోమని, గత పదేళ్ల నిరంకుశ, నియంతృత్వ పోకడలను ఏమాత్రం వీడబోమని… తాజాగా ప్రొటెం స్పీకర్‌ విషయంలోనూ నిరూపించుకున్నారు కదా! అత్యంత సీనియర్‌ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే సాంప్రదాయాన్ని సైతం తుంగలో తొక్కడం, ఎనిమిదిసార్లు ఎన్నికైన కె సురేష్‌ను పక్కనపెట్టి, ఏడుసార్లు ఎన్నికైన బిజెపి ఎం.పి భర్తృహరి మెహతాబ్‌ను ఎంపిక చేయడం…ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడటమా? స్పీకర్‌గా అధికార పక్షం నుంచి, డిప్యూటీ స్పీకర్‌గా ప్రతిపక్షం నుంచి ఎంపికయ్యే సాంప్రదాయానికి సైతం మంగళం పాడుతూనే ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఐదేళ్లుగా ఖాళీగానే ఉంచారు. తమ స్పీకర్‌ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు సాధించేందుకు ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే ఎత్తుగడలు వేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోటీలో తమ అభ్యర్థిని నిలపాలని ప్రతిపక్షాలు నిర్ణయించడం సముచితం. మోడీ సర్కారు ఎత్తుగడల వెనుక ఓ స్పష్టమైన ఎజెండా ఉంది. ప్రతిపక్షాలతో ఏమాత్రం సయోధ్య లేదని, సంఖ్య తగ్గినా తమ టెంపరితనం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది.
ఈ పెడధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు ఇండియా వేదిక మరింత బలంగా సిద్ధమవ్వాలి. బిజెపి గెలిచిన 240 స్థానాలకు దీటుగా… 234 స్థానాలకు బలాన్ని పెంచుకున్న ఈ వేదిక పార్లమెంట్‌లో కీలక అంశాలు చర్చకు వచ్చేలా సమిష్టిగా సిద్ధమవడం సత్సంప్రదాయం. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, నీట్‌- ఎన్‌టిఎ, ఎగ్జిట్‌ పోల్‌-స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణాలు, అగ్నిపథ్‌ పథకం రద్దు, ఎన్నికల బాండ్ల స్కామ్‌పై సమగ్ర విచారణ, అదానీ వ్యవహారాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, దేశవ్యాప్త కులగణన, పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గింపు, ఓటింగ్‌ ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయడం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వేదిక సమాయత్తమవుతోంది. పార్లమెంట్‌లో బలమైన ప్రతిపక్షాన్ని ప్రజలిచ్చారు. ప్రజాతీర్పును గుర్తెరిగి, ప్రజాస్వామ్య హననాన్ని మాని… సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ… ప్రతిపక్షాలనూ కలుపుకు పోవాల్సిన బాధ్యత మోడీ సర్కారుదే! లేకుంటే తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలెప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

➡️