కార్మిక వర్గం- పుంజుకుంటున్న నయా ఫాసిజం

జర్మన్‌ తత్వవేత్త వాల్టర్‌ బెంజమిన్‌ స్వయంగా ఫాసిస్టు శక్తుల చేతుల్లో బాధితుడు. ఫాసిజం సమాజంలో పై చేయి సాధించడానికి, దానికి ముందు కాలంలో శ్రామికవర్గ విప్లవం విఫలం అవడానికి సంబంధం ఉందని ఆయన అన్నాడు. ఆయన దృష్టిలో జర్మనీ అనుభవాలు ప్రధానంగా ఉన్నాయి. 1917 బోల్షివిక్‌ విప్లవం విజయం సాధించిన అనంతరం, అదే మాదిరిగా జర్మనీలోనూ విప్లవాన్ని సాధించాలన్న ప్రయత్నాలు చాలానే జరిగాయి. కాని ఆ ప్రయత్నాలు ఏవీ విజయవంతం కాలేకపోయాయి. దాంతో అలసిపోయిన కార్మికవర్గం కమ్యూనిస్టులుగా, సోషల్‌ డెమాక్రాట్లుగా చీలిపోయింది. ఆ సోషల్‌ డెమాక్రాట్లు అధికారంలో ఉన్న కాలంలో కమ్యూనిస్టులైన రోజా లక్సెంబర్గ్‌, కార్ల్‌ లీబ్‌నెక్ట్‌ తదితరులు హత్యగావించబడ్డారు. దాంతో ఈ రెండింటి మధ్య రాజీకి గాని, సర్దుబాటుకు గాని అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో 1930 దశకంలో ఆర్థిక సంక్షోభం ఆవరించింది. అప్పుడు ఫాసిస్టు శక్తులు తేలికగా అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. వాటికి గుత్త పెట్టుబడిదారీ వర్గం, అందునా అందులో కొత్తగా తలెత్తిన శక్తులు దన్నుగా నిలిచాయి.
బెంజమిన్‌ చేసిన సూత్రీకరణ ఇక్కడ ప్రాధాన్యత కలిగివుంది. బలపడుతున్న కార్మికోద్యమానికి పాలకవర్గ ప్రతిస్పందనగా ఫాసిజం తలెత్తుతుంది అన్న నిర్ధారణకు ఈ సూత్రీకరణ భిన్నమైనది. కార్మికోద్యమ పురోగమనం ఆగిపోయిన సందర్భంలో, మళ్ళీ ఆ కార్మికోద్యమం బలం పుంజుకోకుండా చేయడానికి పాలకవర్గం ఫాసిజాన్ని బలపరుస్తుంది అని ఈ సూత్రీకరణ చెప్తుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా పేదరికం, నిరుద్యోగం హెచ్చు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో కార్మికోద్యమం మళ్ళీ బలం పుంజుకోకుండా చేయడానికి పాలకవర్గం ఫాసిజాన్ని బలపరుస్తుంది అని అంటుంది. ప్రస్తుతం అనేక ప్రపంచ దేశాల్లో నయా ఫాసిజం బలంగా ముందుకొస్తోంది. భారతదేశంతోబాటు, హంగరీ, అర్జెంటినా, బ్రెజిల్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో ఈ విధమైన పరిణామాలను మనం చూస్తున్నాం. ఐతే, ఈ నయా ఫాసిజం బలపడడానికి ముందు ఈ దేశాల్లో ఎక్కడా కార్మికవర్గ విప్లవాలు విఫలమైన సందర్భాలు లేవు. కాని, బెంజమిన్‌ ప్రస్తావించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ దేశాలలో కార్మికోద్యమాలు బలహీనపడ్డాయి. నయా ఉదారవాద వ్యవస్థ పని చేసిన తీరు ఈ పరిస్థితికి దారి తీసింది.
కనీసం మూడు వేరు వేరు మార్గాల్లో నయా ఉదారవాదం కార్మికోద్యమాన్ని బలహీనపరుస్తుంది.
మొదటిది: కార్మికోద్యమం జాతీయ ప్రాతిపదికన తన ఉద్యమాన్ని సంఘటితం చేసుకుంటూ ఉంటుంది. కాని రెండోపక్కన పెట్టుబడి మాత్రం ప్రపంచవ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంది. జాతీయ స్థాయిలో సంఘటితమైన కార్మికోద్యమం వద్ద ఉన్న సమ్మె అనే ఆయుధంతో అంతర్జాతీయ స్థాయిలో సంఘటితమైన పెట్టుబడిని ఎదుర్కొని నిలవరించడం కష్టం. ఒకవేళ కార్మికవర్గం సమరశీలంగా వ్యవహరించి పోరాటానికి పూనుకుంటే అంతర్జాతీయ పెట్టుబడి వేరే దేశానికి తన పెట్టుబడులను తరలిస్తానని బెదిరిస్తుంది. అందువలన కార్మికవర్గ సమరశీలతకి పరిమితులు ఏర్పడతాయి. అమెరికాలో సగటు పురుష కార్మికుడి నిజ వేతనం 1968లో ఏ స్థాయిలో ఉందో, అంతకన్నా తక్కువ స్థాయిలో 2011 నాటికి ఉన్నది అని ప్రముఖ ఆర్థికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ వివరించాడు. కార్మికవర్గ పోరాట శక్తి ఎంతగా కుదించుకుపోయిందో దీనిని బట్టి గ్రహించవచ్చు.
రెండవది: కార్మికవర్గపు రిజర్వు సైన్యం (నిరుద్యోగులు) పనిలో ఉన్న కార్మికవర్గంతో పోల్చినప్పుడు పెరుగుతోంది. ఇదేదో సంక్షోభం ఆవరించిన తర్వాత వచ్చిన పరిణామం అనుకోకూడదు. అంతకు ముందే, సంపన్న పశ్చిమ దేశాల నుండి పెట్టుబడిని వెనుకబడిన మూడవ ప్రపంచ దేశాలకు తరలించిన కారణంగా నిరుద్యోగం పెరగడం ఎక్కువైంది. దీని వలన సంపన్న దేశాలలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయాయి. మరోపక్క మూడవ ప్రపంచ దేశాలలో చిన్న స్థాయి ఉత్పత్తి వ్యవస్థ మీద, ముఖ్యంగా రైతాంగ వ్యవసాయం మీద కొత్తగా వస్తున్న అంతర్జాతీయ పెట్టుబడి దాడి చేసి విధ్వంసం చేసిన కారణంగా ఆ చిన్న ఉత్పత్తిదారులు, చేతివృత్తుల తరగతులు, పేద రైతాంగం సర్వమూ కోల్పోయి వీధిన పడుతున్నారు. వీరందరూ బతుకుతెరువు కోసం పట్టణాలకు వలసలు పోతున్నారు. ఇప్పటికే పట్టణాలలో ఉన్న ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. దానికి తోడు ఈ వలసలు పెరగడం వలన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమౌతోంది. దీని ఫలితంగా కార్మికవర్గం బలహీన పడుతోంది. ఆర్థిక సంక్షోభం తలెత్తకమునుపే ఈ పరిణామం మొదలైంది.
మూడవది: నయా ఉదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం జరుగుతోంది. సాధారణంగా ప్రైవేటు రంగంలో కన్నా ప్రభుత్వ రంగంలో కార్మికులు మెరుగ్గా సంఘటితం అవుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. ఉదాహరణకు: అమెరికాలో ప్రైవేటు రంగంలో 7 శాతం మంది కార్మికులు యూనియన్లలో సంఘటితం అయివున్నారు. అదే ప్రభుత్వ రంగంలో చూస్తే (విద్యారంగం కూడా కలుపుకుని) 33 శాతం యూనియన్లలో ఉన్నారు. ప్రైవేటీకరణ విధానం వలన కార్మికవర్గపు సంఘటిత శక్తి సన్నగిల్లిపోతుంది. ఐతే ఈ అంశాన్ని దాదాపు ఎవరూ చర్చించడం లేదు. ప్రైవేటీకరణ ఫలితంగా సృజనాత్మకత దెబ్బ తింటుందని, దేశ ఆర్థిక వ్యవస్థ తన స్వావలంబనను కోల్పోతుందని, పెట్టుబడి మరింతగా పరాన్నభుక్కుగా దిగజారుతుందని చర్చలు జరుగుతున్నాయి కాని, అది కార్మికవర్గ పోరాట శక్తిని దెబ్బ తీస్తుందన్న విషయాన్ని ఎక్కువగా చర్చించడం లేదు.
కార్మికవర్గ పోరాట శక్తి బలహీనపడింది అంటే దానర్ధం స్వల్పకాలిక, భారీ జాతీయ సమ్మెలు కూడా చేపట్టలేరని అనుకోకూడదు. అటువంటి సమ్మెలు మనం గడిచిన కొన్ని సంవత్సరాలలో మన దేశంలో ఎక్కువగానే జరిగాయి. కాని ఆ యా రంగాలకు సంబంధించిన నిర్దిష్ట డిమాండ్లతో, అవి నెరవేరేవరకూ దీర్ఘకాలం పాటు సమ్మెలు కొనసాగించడం అనేది మనకు ఇప్పుడు కనపడదు. అటువంటి సమ్మెలు 1970 దశకంలో మన దేశంలో చాలా జరిగాయి. రైల్వే కార్మికుల సమ్మె, అంతకు ముందు జరిగిన లోకో రన్నింగ్‌ కార్మికుల సమ్మె వంటివి నిర్వహించగల పరిస్థితి ఇప్పుడు దాదాపు లేదు. జర్మనీలో కార్మికవర్గ విప్లవం విఫలమైన తర్వాత ఫాసిజం బలంగా ముందుకొచ్చిందని బెంజమిన్‌ చేసిన సూత్రీకరణ ప్రాతిపదికన ఇప్పుడు మనం పరిశీలిస్తే, నయా ఉదారవాద విధానాల అమలు ఫలితంగా కార్మిక వర్గ పోరాట శక్తి బలహీన పడిన నేపథ్యంలో నయా ఫాసిజం ముందుకు రావడం కనిపిస్తుంది. దానికి ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడం తోడైంది. నయా ఫాసిస్టు శక్తులు బలం పుంజుకోవడం వెనుక ఈ నేపథ్యాన్ని చూడాలి.
దీనినిబట్టి కేవలం కార్మికవర్గ పోరాటశక్తి బలహీనపడడమే నయా ఫాసిజం బలపడడానికి కారణం అన్న నిర్ధారణకు రాకూడదు. నయా ఉదారవాద విధానాల అమలు ఫలితంగా అనివార్యంగా తలెత్తే ఆర్థిక సంక్షోభం కార్మికోద్యమం బలహీన పడిన నేపథ్యంలో సంభవించింది. ఈ పరిస్థితి నయా ఫాసిస్టు శక్తుల బలం పెరగడానికి దోహదం చేసింది.
బూర్జువా ఉదారవాదులు ఈ అంత:సంబంధాన్ని పరిగణించరు. సమాజాన్ని వర్గ ప్రాతిపదికన పరిశీలించడానికి వారు అంగీకరించరు. వ్యక్తులుగానో, వర్గేతర ప్రాతిపదికన వ్యక్తుల సమూహాలుగానో మాత్రమే వారు పరిశీలిస్తారు. దానికి తోడు వారు నయా ఉదారవాదాన్ని సమర్ధిస్తారు. అందువల్లనే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒకే కాలంలో నయా ఫాసిజం ఎందుకు పుంజుకుంటోందో వారు వివరించలేకపోతున్నారు. ట్రంప్‌, మోడీ, బోల్సనారో, మైలీ, మెలొనీ వంటి నాయకులు ఇప్పుడే ఎందుకు బలంగా ముందుకొస్తున్నారో వారు గ్రహించలేకపోతున్నారు. ఇంతమంది ఫాసిస్టు స్వభావం కలిగిన నియంతలు ఏక కాలంలో బలపడడం వెనుక ఉమ్మడి అంతర్జాతీయ సందర్భం ఏమిటన్నది వారు తెలుసుకోవాలి. కొంతకాలంగా నయా ఉదారవాద విధానాల అమలు జరిగి దాని ఫలితంగా కార్మికోద్యమ పోరాట శక్తిని దెబ్బ తీసిన తర్వాత అవే విధానాల కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొని దానినుండి బైటపడే దారి తోచని స్థితి ఏర్పడడమే ఆ ఉమ్మడి కారణం. తమ తమ దేశాల్లో మెజారిటీ ప్రజల ముందు ”పరాయివాళ్ళు” అని కొన్ని సమూహాలపై ముద్ర వేసి విద్వేష భావనలు రెచ్చగొడుతున్న వాతావరణం ఈ అన్ని దేశాల్లోనూ నెలకొంది. ఎటొచ్చీ ఆ ”పరాయివారు” ఎవరన్నది ఆ యా దేశాన్ని బట్టి మారిపోతూ వుంటుంది. కాని ఎవరినో కొందరిని ”పరాయివారి” గా చిత్రించడం మాత్రం ఉమ్మడి ధోరణిగా ఉంది. దాని వెనుక ఉన్న ఉమ్మడి సందర్భం ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం.
దీనినుండి అనేక నిర్ధారణలకు రావచ్చు. మొదటిది: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే బలమైన కార్మిక సంఘాలను నిర్మించడం తప్పనిసరిగా జరగాలి. బూర్జువా ఉదారవాదం ఇందుకు పూర్తి వ్యతిరేకం. కార్మిక సంఘాల పట్ల వారు శత్రుపూరిత వైఖరితో వ్యవహరిస్తారు. సమ్మెలు చేయడం అంటే సమాజాన్ని (పబ్లిక్‌ని) ఇబ్బందులపాలు చేసి తమ డిమాండ్లను నెగ్గించుకోవమే అని వారు విమర్శిస్తారు. వారికి శ్రమజీవుల పేదరికం, దుర్భర పరిస్థితులు ఏమాత్రమూ పట్టవు. అంతేగాక వారికి ఈ సమాజం ఏ ప్రాతిపదికన నడుస్తోందో కూడా పట్టదు. నిజానికి వారు చెప్పే స్వేచ్ఛ అనేది వ్యక్తులందరికీ ఉండాలంటే, ఆ స్వేచ్ఛను కాపాడే మొనగాడిగా కార్మికవర్గం బలంగా ఉండడం అత్యంత కీలకం. కాని ఉదారవాదులు వ్యక్తుల స్వేచ్ఛను గుర్తిస్తూనే, ఆ వ్యక్తులందరి సమూహంగా ఉండే కార్మిక సంఘం యొక్క స్వేచ్ఛను మాత్రం అంగీకరించరు. కలిసికట్టుగా ఉంటూన్నప్పుడే స్వేచ్ఛను పొందలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక వ్యక్తులుగా విడిగా స్వేచ్ఛను అనుభవించడం ఎలా సాధ్యమో వారు వివరించలేరు.
ఇక రెండవది: ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రభుత్వ రంగం ఉండడం తప్పనిసరి. ఉదారవాదులు దీనిని కూడా వ్యతిరేకిస్తారు. ప్రైవేటు సంస్థలు, ఉదార ప్రజాస్వామ్యం ఒకదానికొకటి బలపరుచుకుంటాయని వారు భావిస్తారు. ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం అంతా ప్రైవేటు రంగమే విస్తరించి వుంటే, ప్రభుత్వ రంగం ఉనికి నామమాత్రం అయితే, అప్పుడు ప్రజానీకానికి అత్యవసర సేవలను వారి ఆర్థిక స్తోమతకు తగ్గ ధరలకు అందించడం ఏ విధంగా సాధ్యం? సాంకేతికంగా కొంతైనా స్వావలంబనను సాధించడం ఎలా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎలా? ఈ ప్రశ్నలకు ఉదారవాదుల దగ్గర సమాధానాలు ఉండవు. ప్రభుత్వ రంగం ఉంటే కార్మిక సంఘాలు బలంగా ఉంటాయి. కార్మిక సంఘాలు బలంగా ఉంటే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం సాధ్యం. దీనర్ధం దేశమంతటా ప్రైవేటు రంగం విస్తరించివుంటే నయా ఫాసిజం బలపడిపోతుందని మాత్రం కాదు. ప్రైవేటు రంగం మాత్రమే బలంగా ఉంటే నయా ఫాసిస్టు దాడికి సులువుగా బలి చేయబడతాం అని మాత్రమే.
”ద్రవ్య పెట్టుబడి యొక్క అత్యంత ప్రతీఘాత, తిరోగమన తరగతుల బహిరంగ, ఉగ్రవాద నియంతృత్వమే ఫాసిజం” అని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఏడవ మహాసభలో జార్జి డిమిట్రోవ్‌ వివరించారు. అది కార్మిక సంఘాలను అణచివేస్తుందని, కార్మిక నాయకులను నిర్బంధించి వేధింపులకు గురి చేస్తుందని బిషప్‌ నీమోల్లర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఫాసిజం బలం పుంజుకోడానికి ప్రధానంగా తీవ్రమౌతున్న ఆర్థిక సంక్షోభం, కార్మికసంఘాలు బలహీనపడడం దోహదం చేస్తున్నాయి.
అందుచేత నయా ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగాలంటే కేవలం రాజకీయంగా కూటములు ఏర్పరచడం ఒక్కటే సరిపోదు. ఆ వ్యూహంలో కార్మికోద్యమాన్ని బలోపేతం చేసి కార్మికవర్గం పుంజుకునేలా చేయడం, కార్మిక-కర్షక ఉద్యమాల నడుమ సమన్వయాన్ని (ప్రస్తుతం భారతదేశంలో ఈ సమన్వయం పెరుగుతోంది) పెంపొందించడం చాలా ముఖ్యం.

ప్రభాత్‌ పట్నాయక్‌

(స్వేచ్ఛానుసరణ)

➡️