అదిరింపులు, బెదిరింపులతో దారికి తెచ్చు కోవాలని చూశాడు. వాటితో ఒరిగేదేమీ లేదు. మాకెంత నష్టమో మీకూ అంతే నష్టం తప్పదంటే పోరుకు సిద్ధమే అంటూ ఒక్క దేశమూ లొంగలేదు. చివరికి తొడగొట్టి బస్తీమే సవాల్ అంటూ 50 దేశాల మీద డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగాడు. పన్ను అస్త్రాన్ని ప్రయోగించాడు. అమెరికాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి చట్టానికి దుమ్ము దులిపి వినియోగంలోకి తెచ్చాడు. యాభై దేశాల మీద వివరాలు ప్రకటించినప్పటికీ కనీసం 100 దేశాలు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. దాంతో దేశాలూ, నేతలూ…కాస్త వెనుకా ముందూ చూసుకొని తమ శస్త్రాలను సంధిస్తారు. విముక్తి దినంగా ప్రకటించిన ఏప్రిల్ రెండవ తేదీ సుంకాలతో 30 లక్షల కోట్ల డాలర్లు లేదా నలుగురున్న కుటుంబం మీద మూడు లక్షల డాలర్ల మేర భారం పడుతుందని అమెరికా మాజీ విత్త మంత్రి, ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన లారెన్స్ హెచ్ సమర్స్ హెచ్చరించాడు. ఇది రాసిన సమయానికి ఒక్క నరేంద్ర మోడీ తప్ప అనేక దేశాల నేతలు ఇప్పటికే స్పందించారు. ఔషధాలు, మరికొన్నింటి మీద పన్నులను మినహాయించినట్లు, అందువలన మన మీద పెద్దగా ప్రభావం ఉండదనే విశ్లేషణలు వెలువడినప్పటికీ స్టాక్‌మార్కెట్ వడిదుడుకులకు లోనైంది. కొన్ని పన్నులు గురువారం నుంచి అమల్లోకి రాగా మిగిలినవి క్రమంగా వస్తాయి.
వస్తుసేవల ఎగుమతుల్లో తలసరి 2,638 (2023 జనాభా) డాలర్లు ఉన్న చైనా మీద 34 శాతం, 538 డాలర్లున్న మన మీద ట్రంప్ 26 శాతం పన్ను విధించాడు. మొత్తం మీద కనీసంగా పది శాతం, దేశాల వారీ అమెరికా దిగుమతులు మీద ఎంత పన్ను విధిస్తే దానిలో సగం అమెరికా విధించింది. చైనా 67, భారత్ 52 శాతాలుగా ఉన్నందున వాటి మీద సగం విధించాడు. గరిష్టంగా కంపూచియా మీద 49 శాతం, వియత్నాంపై 46 శాతం మోపాడు. యాభై దేశాలకూ ఇదే ప్రమాణాన్ని పాటించాడు తప్ప నరేంద్ర మోడీతో ఉన్న స్నేహం కారణంగా మనకు ప్రత్యేక రాయితీ ఇచ్చిందేమీ లేదు. గ్రామాల్లో రెండు సామాజిక తరగతులు రైతుల ఇళ్లలో భోజనం చేయరుగానీ వారి నుంచి పాలు, పెరుగు, మజ్జిగల స్వీకరణకు మినహాయింపులు ఇస్తున్నట్లుగానే అమెరికాకు అవసరమైన వాటికి సుంకాల నుంచి మినహాయించారు లేదా నామమాత్రంగా విధించారు. అలా మన దేశం నుంచి ఔషధాలు, ఐటి, సెమీ కండక్టర్లు, రాగి, కలప, కొన్ని ఖనిజాలు వీటిలో ఉన్నాయి. దీని అర్ధం మనకు శాశ్వత మేలు కాదు. తక్షణ ఉపశమనం మాత్రమే. తమ వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకొని వాణిజ్య అసమతూకాన్ని సరి చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దానికోసం వాణిజ్య ఒప్పందం పేరుతో చర్చలు జరుపుతూ ఒత్తిడి తెస్తోంది. దాన్లో మోడీ సర్కార్ లొంగిపోయి దిగుమతులకు తలుపులు బార్లా తెరిస్తే సరే లేకుంటే ఇప్పుడు మినహాయించిన వాటినీ ట్రంప్ వదలడని గ్రహించాలి. తన తొత్తు ఇజ్రాయిల్ మీదా 17 శాతం విధించిన అంశాన్ని మరచిపోరాదు.
ప్రధాని మోడీ మంచివాడు, తనకు గొప్ప స్నేహితుడని అయితే భారత్ చెడ్డది, తమ పట్ల సరిగా వ్యవహరించటం లేదని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఇది బిస్కెట్ వేయటం తప్ప మరొకటి కాదు, అందుకే మోడీ మౌనంగా ఉన్నారా! ఏమో ఎవరికి తెలుసు? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఇంతవరకు పన్ను ప్రతిపాదనలు మనకు మేలు చేసేవా హానికరమా అన్నది ఏదో ఒకటి చెప్పకుండా 140 కోట్ల జనాభాకు తాను జవాబుదారీ, తనవి సురక్షిత హస్తాలని ఎలా చెప్పుకోగలరు? కెనడా, ఇటలీ, బ్రెజిల్, జపాన్, దక్షిణ కొరియా, థారులాండ్, ఐరోపా సమాఖ్య, తదితర దేశాలు వెంటనే స్పందించాయి. ప్రస్తుతం ప్రపంచ దిగుమతుల్లో అమెరికా వాటా 16 శాతం కాగా వాటిన్నింటి మీద పన్నులు పెరుగుతాయి, ఎంత అయితే అంత దాదాపుగా అమెరికా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో అమెరికా వైపు నుంచి ఇలాంటి బెదిరింపులు వెలువడుతున్న కారణంగా అనేక దేశాలు తమ ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంటున్నాయి. చైనా వద్ద భారీ మొత్తంలో వాణిజ్య మిగులు పేరుకు పోతున్న కారణంగా దాని వద్ద డాలరు నిల్వలు కూడా ఏ దేశం వద్దా లేనన్ని ఉన్నాయి. అందువలన అది ట్రంప్ దాడిని తట్టుకోగలదు, మన వంటి దేశాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కెనడాపై పన్నులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో నలుగురు అధికారపక్ష సెనెటర్లతో సహా మెజారిటీ 51 మంది ఒక తీర్మానాన్ని ఆమోదించారు. మిత్రులు, శత్రువులు అని లేకుండా అందరి మీద యుద్ధం ప్రకటించిన అమెరికా ఈ విషయంలో ఒంటరైంది. అన్ని దేశాలూ కలసి దాని మెడలు వంచుతాయా లేదా రాజకీయాలకు తెర లేపుతాయా అన్నదే ప్రపంచం ముందున్న సమస్య.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్