ట్రోలర్లపై చర్యలేవి?

విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రితో పాటు ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆన్‌లైన్‌ దాడులు మన దేశ డిజిటల్‌ వాతావరణంలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణికి నిదర్శనం. స్వాతి చతుర్వేది తన పుస్తకం ‘ఐ యామ్‌ ఏ ట్రోల్‌’ (నేనొక అంతర్జాల పోకిరిని)లో ”భారతదేశంలో సోషల్‌ మీడియా మితవాద ట్రోలర్స్‌తో నిండిపోయింది. వారు ఆన్‌లైన్‌లో మత విద్వేషాన్ని రెచ్చగొడతారు, జర్నలిస్టులను, ప్రతిపక్ష రాజకీయ నాయకులను దుర్భాషలాడతారు, లైంగికంగా వేధిస్తారు.’ అని పేర్కొన్నారు. ఈ విషపూరిత సంస్కృతి గతంలో ప్రముఖులను మాత్రమే లక్ష్యంగా చేసుకునేది. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను, అలాగే జాతీయ విషాద ఘటనల్లో బాధితుల కుటుంబాలను కూడా వదిలిపెట్టకపోవడం గమనార్హం. విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విక్రమ్‌ మిస్రి పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల పర్వం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన మీడియా సమావేశాల్లో మరో ఇద్దరు సైనికాధికారులతో కలిసి భారత ప్రభుత్వ వాణిని వినిపించేవారు. ఈ క్రమంలో భాగంగానే కాల్పుల విరమణ గురించి ప్రకటనను భారత ప్రభుత్వం తరపున ఆయన చేశారు. దీంతో ట్రోలర్స్‌ ఆయన్ను, ఆయన కుమార్తెను లక్ష్యంగా చేసుకున్నారు. రాయలేని భాషల్లో సోషల్‌ మీడియాలో దూషించారు. మిస్రి కుమార్తె వ్యక్తిగత వివరాలు బయటపెట్టడంతోపాటు, ఆమె దేశభక్తిని ప్రశ్నించారు. ఈ దాడితో వారు తమ సోషల్‌ మీడియా ఖాతాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ వేధింపులు అధికారుల కుటుంబాలకూ పరిమితం కాదు. ఉగ్రవాద దాడుల బాధిత కుటుంబాలు, ఇతర బాధితుల కుటుంబాలు కూడా ట్రోలింగ్‌, వేధింపులు, బెదిరింపులకు గురయ్యాయి. పహల్గాం ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన లెఫ్టినెంట్‌ వినరు నర్వాల్‌ భార్య హిమాంషి నర్వాల్‌ కూడా ట్రోల్స్‌ బారిన పడ్డారు. ఈ సంఘటనలో కాశ్మీరీలను, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవద్దని, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరడమే ఆమె చేసిన నేరం! ఉగ్రవాదుల కాల్పుల్లో తండ్రిని కోల్పోయిన ఒక యువతి కాశ్మీర్‌లో తనకు ఇద్దరు సోదరులు లభించారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు గురయ్యాయి. సమాజం నుండి మద్దతు, సానుభూతి లభించాల్సిన సమయంలో వీరంతా నిందలకు, వేధింపులకు గురికావడం బాధాకరం. గాయకుడు సోనూ నిగమ్‌, బాలీవుడ్‌ నటుటు భూమి పెడ్నేకర్‌, ఆలియా భట్‌ తదితరులు కూడా తదితరులు కూడా ఇటీవల ట్రోలింగ్‌ బారిన పడ్డారు.

అధికార పార్టీకి చెందిన మంత్రులపైనో, నాయకులపైనో సోషల్‌ మీడియాలో విమర్శలు పెట్టీ పెట్టగానే రకకరాల కేసులతో చెలరేగిపోయే ప్రభుత్వ యంత్రాంగం ఈ అన్ని సందర్భాల్లోనూ మౌనం వహించడం, నామమాత్రంగా కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విదేశాంగశాఖ కార్యదర్శి మిస్రీ కుమార్తె గతంలో రోహింగ్యా శరణార్థుల కోసం పనిచేయడమే మితవాద ట్రోలర్స్‌ ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. ఈ కారణంగానే అత్యున్నత స్థాయి అధికారైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టీపట్టన్నట్లు వ్యవహరిస్తోందన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులకే ఈ పరిస్థితి తప్పనప్పడు సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్నకు జవాబు లభించడం కష్టం. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024లో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 66,854 సైబర్‌ వేధింపుల కేసులు నమోదయ్యాయి. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఈ తరహా కేసులు భారీగా పెరిగే అవకాశముందని అంచనా!

‘ట్రోలర్స్‌ యాదృచ్ఛిక వ్యక్తులు కారు. వీరిలో చాలామంది వ్యవస్థీకత డిజిటల్‌ ఆర్మీలో భాగంగా ఉంటారు. వారి ఆన్‌లైన్‌ దాడులకు ప్రోత్సాహం, కొందరికి బహుమతులు కూడా లభిస్తాయి,” అని చతుర్వేది రాశారు. ”ట్రోలింగ్‌ అనేది ఉద్దేశపూర్వకమైన, వ్యవస్థీకత చర్య. మౌనంగా ఉండేలా చేయడం, బెదిరించడం, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం’ వీరి లక్ష్యమని సుదీర్ఘ పరిశోధన తరువాత ఆమె నిర్ధారించారు. ఈ తరహా వైఖరి పౌర హక్కులకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని కలుగ చేస్తుంది. వాటిని రక్షించుకోవడం ప్రజలందరి బాధ్యత. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కఠినచర్యలు తీసుకోవాలి. బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలి.

➡️