నేడు కాంట్రాక్టు/ పర్మినెంటేతర కార్మికులు అన్ని చోట్లకూ విస్తరించడం అత్యంత తీవ్రమైన సమస్య. మన రాష్ట్రంలో సత్య సాయి జిల్లాలోని ‘కియా’ కార్ల కంపెనీలోగాని, ప్రపంచంలోనే 103 రాకెట్లను ఒకేసారి ప్రయోగించిన అంతరిక్ష కేంద్రమైన సూళ్ళూరుపేట లోని ‘ఇస్రో’ పరిశోధనా కేంద్రంతో సహా అన్ని పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులన్నింటిలోను, అన్ని రకాల కేంద్ర స్కీమ్ కార్మికులు, విశాఖ స్టీల్ లాంటి భారీ, చిన్న పరిశ్రమలలోని, శాశ్వత పనులన్నింటిలోను కాంట్రాక్ట్ కార్మికులు వేగంగా పెరుగుతున్నారు. సైన్యంలో కూడా 4 సంవత్సరాలకే సర్వీసు పరిమితం చేశారు. రాష్ట్ర సంస్థలలో పెద్దవైన విద్యుత్, ఆర్‌టిసి లలో సగం మంది కాంట్రాక్ట్/పర్మినెంటేతర కార్మికులు పెరుగుతూ పర్మినెంట్ కార్మికులు తగ్గుతున్నారు. రిటైర్ అయిన పర్మినెంట్ కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవడంలేదు. ఒకే పనిని పక్కనే ఉండి చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను చీప్ లేబర్‌గా వాడుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. దేశంలోనే 12 లక్షల మంది కార్మికులు పని చేసే అతి పెద్ద రంగం రైల్వే. కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా వర్క్ కాంట్రాక్ట్ పేరుతో ఎంతమంది పని చేయాలనే విషయంలో రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు అడ్డూ ఆపు లేని అధికారాలిచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు తొలగిస్తున్నారు. ఈ కార్మికులకు పని గంటలు ఎక్కువ. కాని వీరి జీతాలు గొర్రె తోక బెత్తెడు లాగా ఎన్ని సంవత్సరాలు పని చేసినా పెరగవు. జీతాలు పెంచమని అడిగితే పాతవారిని పనిని నుంచి ఆపి, కొత్తవారిని తక్కువ జీతాలకు తెచ్చుకుంటున్నారు. కాంట్రాక్టర్లు వీరికి ప్రభుత్వ చట్టాలు అమలు చేయడంలేదు. సర్వసంపదలు సృష్టించే కార్మిక వర్గాన్ని అణిచివేసేందుకు పాలకులు కార్పొరేట్లతో కుమ్మక్కవుతున్నారు.
ఉదారవాద విధానాలు మన దేశంలో 1991 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటి వరకూ శాశ్వత స్వభావం కల్గిన పనులన్నింటిలోను పర్మినెంట్ కార్మికులే పనిచేసేవారు. ఎల్.పి.జి విధానాల పేరుతో శాశ్వతమైన పనులు, మెయిన్‌టినెన్స్, ఆపరేషన్, సెక్యూరిటీ, క్యాంటిన్లు ట్రాన్స్‌పోర్టుతో సహా పర్మినెంట్ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులు వచ్చారు. కార్మికులు పోరాడి కాంట్రాక్ట్ లేబర్ (రెగ్యులేషన్ మరియు ఎబాలిషన్) చట్టం-1970ని సాధించుకున్నారు. యూనియన్లు పోరాటాల వల్లే ఈ చట్టం లోని ప్రతి అంశాన్ని అమలు చేయించుకోవడం సాధ్యమైంది. జ్యోతిబసు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించే పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ స్టీల్‌ప్లాంట్, ఇస్కో స్టీల్ ప్లాంట్లలో కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేశారు. ఆ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని చట్టంలో లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయించారు. ఆ స్ఫూర్తితోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 1991లో 1700 మంది క్యాజువల్ కార్మికుల కోసం పోరాడి సిఐటియు నాయకత్వంలో పర్మినెంట్ చేయించాం. కాంట్రాక్టు లేబరు చట్టంలోని గుర్తింపు కార్డు, పే స్లిప్, 20 రోజులకు ఒక ఎర్న్‌డ్ లీవ్, తొలగించినప్పుడు సెక్షన్ 25 ఎఫ్‌ఎఫ్ ప్రకారం రిట్రెంచ్‌మెంట్ నష్టపరిహారం ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం చొప్పున కాంట్రాక్టు కార్మికులు సాధించుకున్నారు. అంతేగాకుండా గ్రాట్యూటీ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు దాటిన వారందరికీ సంవత్సరానికి 15 రోజుల జీతం, బోనస్ చట్టం ప్రకారం బోనస్ తప్పక చెల్లించేవారు. చట్టాలను అమలు చెయ్యకపోతే కార్మికశాఖ ద్వారా అమలు చేయించుకునేవారు. కార్మిక శాఖ నేడు పూర్తిగా చచ్చుబడి పోయింది. నేటికీ అవే చట్టాలున్నా కార్మిక శాఖ నిర్వీర్యం అయింది. ఏ ఒక్క చట్టాన్ని అమలు చేయడంలేదు. యూనియన్ పెట్టుకోవడానికి కార్మిక శాఖకు దరఖాస్తు చేయగానే 7 పేర్లు ఆ కంపెనీ యాజమాన్యానికి వెళ్తున్నాయి. కాంట్రాక్టరు వెంటనే వారిని పని నుంచి తొలగిస్తున్నారు. మిగిలిన కార్మికులు భయపడి యూనియన్లో లేకుండా బానిసల్లాగా పని చేస్తున్నారు. తొలగించిన కార్మికుల వివాదాల్లో కార్మికశాఖ జోక్యం లేదు. కాంట్రాక్టు/పర్మినెంటేతర కార్మికులకు ఉద్యోగ భద్రత కీలకం. ఉన్న ఉద్యోగం పోతుందని కాంట్రాక్టు కార్మికులు భయభ్రాంతులతో పనిచేస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకొని కాంట్రాక్ట్ వర్కర్లకు వర్తించే పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ, బోనస్‌లతో సహా ఏ చట్టాలూ అమలు చేయకుండా కార్మికులకు పంగనామాలు పెడుతున్నారు. ప్రభుత్వాలు పరిశ్రమల్లో తనిఖీలు లేకుండా చేసేశాయి. పరిశ్రమల్లో ప్రాణా లకు కూడా భద్రత లేకుండా పోయింది.
నేటి కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలే. పాలకులు కార్పొరేట్ అనుకూల విధానాలు పాటిస్తున్నారు. కార్మికులను పర్మినెంట్ చేస్తే పని చేయరని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం యాజమాన్యాలకు సులభతర వ్యాపారాన్ని కల్పించడంలో పోటీ పడుతున్నాయి. కార్మికులకు అతి తక్కువ జీతాలు చెల్లించడం, పర్మినెంట్ చెయ్యకపోవడం ఇందులో ముఖ్యమైన విధానం. కార్మికులు పోరాటాలు చేస్తే అణచివేయటం కూడా ఈ విధానంలో భాగమే. ప్రభత్వ విధానాల వల్ల పర్మినెంట్ కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో పెరిగిన మాత్రం జీతాలు కూడా పెరగడంలేదు. అనేక అలవెన్స్‌లు రద్దు చేస్తున్నారు. ఉన్న హక్కులు తీసివేస్తున్నారు. పాలకులు పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు ఇద్దరిపైన దాడి చేస్తున్నారు. పర్మినెంట్ కార్మికులు గతంతో పోలిస్తే సంఖ్య రీత్యా బాగా తగ్గిపోతున్నారు. పర్మినెంట్ యూనియన్లు చొరవ తీసుకొని కాంట్రాక్ట్/ పర్మినెంటేతర కార్మికులను ఐక్యపరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. విశాఖ స్టీల్‌లో గత 30 సంవత్సరాల నుంచి పర్మినెంట్ యూనియన్ సహాయంతో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ విజయవంతంగా నడుస్తున్నది. దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్ల కంటే హెచ్చు జీతాలు సాధించారు. కాంట్రాక్టర్ మారినా కార్మికులను తొలగించకుండా పని భద్రత అమలులో వుంది. కానీ నేడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా భారీ పోరాటాలు సాగుతున్నాయి. మోడీ ”నో పర్మినెంట్” విధానాలను ఓడించడానికి యావత్తు కార్మికులను ఐక్యం చేయడం ఒక్కటే మార్గం. ఈ కింది డిమాండ్లను సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమం నడిచినప్పుడే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యం.
1.శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేసే ట్రాన్స్‌పోర్టు, క్యాంటిన్, సెక్యూరిటీ, మెయిన్‌టెనెన్స్, ఆపరేషన్లలో పని చేసే కార్మికులందరూ పర్మినెంటే. వీరందరినీ చట్టప్రకారం పర్మినెంట్ చేయాలి. 2. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. 3. కాంట్రాక్టర్ మారినా కార్మికులను కొనసాగించాలి.4. చట్ట ప్రకారం ఇఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, బోనస్ లాంటి చట్టాలన్నింటిని అమలు చేయాలి.
వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు