ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుకోవాలి!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం త్వరలోనే ఈ భూగోళంపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుంది. అందువల్ల వ్యక్తిగత, సమిష్టి స్వేచ్ఛల పరిరక్షణకు, పెంపునకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించాల్సిన ప్రత్యేక బాధ్యతను ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తీసుకు వచ్చాయి. భారత త్రివర్ణ పతాకం సమున్నతంగా రెపరెపలాడుతుండగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా అభివాదం చేస్తుంటే, ఆ పతాకంలోని మువ్వన్నెలు సమ్మిళితమైన సంస్కృతిని మనకు గుర్తు చేయాలి. ఈ సంస్కృతే ప్రపంచంలోని విశిష్టమైన, అతి గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది. ఈ చారిత్రక సందర్భంగా, నిరంకుశపూరితమైన అహంకారం మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించేందుకు అనుమతించబోమని లేదా విద్వేషాలను రెచ్చగొట్టి భారతీయుల సమైక్యతను దెబ్బ తీసేందుకు అనుమతించ బోమని మనం తీర్మానించుకోవాలి. జాతీయ పతాకానికి మనం ఘనంగా సమర్పించగలిగిన వందనం ఇదే.

అమూల్యమైన ఐక్యత

ఉక్కిరిబిక్కిరి చేసిన వలస పాలన నుండి బయటపడి విస్తృతమైన బ్రిటీష్‌ పాలిత భూభాగాలు, సంస్ధానాల నుండి ఒక దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. ఈ ఐక్యత ఏదో రాత్రికి రాత్రే హఠాత్తుగా సాకారమై పోలేదు. మహాత్మా గాంధీ రగిల్చిన స్ఫూర్తితో, విదేశీ పాలనను అంతమొందించాలని భావించే భారతీయులందరినీ సమైక్య పరిచిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇది సాకారమైంది. బహుళ భాషలు, మతాలు, కులాలు, సామాజిక హోదాలతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా భారతీయులందరినీ ఈ ఉద్యమం ఏకం చేసింది. ఆ సమైక్యత భారత దేశానికి చాలా అమూల్యమైనది. భారతీయ గుర్తింపును చిన్నాభిన్నం చేసే మతోన్మాద విచ్ఛిన్నకర, భాషాపరమైన దురభిమానంతో కూడిన, నిర్లక్ష్య పూరితమైన కులతత్వ, లింగ వివక్షతతో కూడిన ప్రచారాల ద్వారా ఈ సమైక్యతను చెదిరిపోనివ్వరాదు. భారతీయులపైకి భారతీయులనే పురిగొల్పడం ద్వారా అటువంటి ఎత్తుగడలు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాలను కలిగించవచ్చు. కానీ, మహత్తర దేశంగా ప్రగతి వైపు సాగే భారతదేశపు పంథాను బీటలు వారుస్తాయి. లేదా అడ్డంకులను సృష్టిస్తాయి.

75 ఏళ్ళ భారత్‌-గతం-భవిష్యత్‌

వలస పాలన మన సంపదలను దోచేసింది. స్వాతంత్య్రం లభించిన తర్వాత పేద వర్ధమాన దేశంగా మనం జీవితాన్ని ఆరంభించాం. ఆ స్థాయి నుండి నేడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు కీలకమైన, ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించే స్థాయికి ఎదిగాం. 1991లో ప్రారంభించిన ఆర్థిక ఉదారవాద విధానాలు మన ఆర్థికాభివృద్ధిపై నిర్ణయాత్మకమైన ప్రభావాన్ని చూపాయి. అదే సమయంలో, దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక అసమాతల అంతరాన్ని తగ్గించడమనేది ప్రభుత్వ విధాన ప్రధాన సూత్రంగా మారింది. అందరినీ కలుపుకుని పోయేలా సమ్మిళిత ఆర్థిక వృద్ధి పంథాను మనం కొనసాగిస్తున్నందున, ఆదాయ అంతరాలను మరింత విస్తరిస్తూ, సంక్షేమ ప్రయోజనాలను కేవలం ఎంపిక చేసిన కొద్దిమంది వ్యాపారవేత్తలు మాత్రమే అనుభవించడానికి మనం అనుమతించరాదు.

విభజన రాజకీయాలపై ధ్వజం

ఉపాధి కల్పించలేని అభివృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ సురక్షితమైనది కాదు. నిరుద్యోగం మన మానవ వనరులను గరిష్టంగా ఉపయోగించడానికి అనుమతించకపోవడమే కాకుండా సామాజిక అసమ్మతి, విభజన రాజకీయాలు పాదుకొనడానికి కూడా వెసులుబాటు కల్పిస్తుంది. రాబోయే పాతికేళ్ళ స్వతంత్ర భారతం వైపుగా మనం పయనిస్తున్నందున, విద్య, నైపుణ్యాలు, అనువైన ఉపాధి, యువ పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు తోడ్పాటునందించడం ద్వారా యువతరాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడం మన లక్ష్యంగా వుండాలి. ఇందుకు విద్య, ఉపాధి కోసం దేశవ్యాప్తంగా సులభంగా రాకపోకలు అవసరం. మతోన్మాద, భాషాపరమైన అడ్డంకులు అటువంటి రాకపోకలను ఆటంకంగా తయారవుతాయి. అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ ప్రమాదాన్ని భారతీయ పారిశ్రామికవేత్తలు కచ్చితంగా గుర్తించాలి. జాతీయ ఐక్యత కోసం తమ గళమెత్తాలి. విచ్ఛిన్నకర, విభజన రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగిస్తున్నపుడు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోరాదు.

శాస్త్రీయ సంప్రదాయ పరిరక్షణ

స్వాతంత్య్రం తొలినాళ్ళ నుండి సైన్స్‌లో నైపుణ్యాలను పురోగతికి బాటగా భారత్‌ అనుసరించింది. జాతీయ శాస్త్రీయ విధానం ముందుచూపుతో సాగుతోంది. శాస్త్రీయ విజ్ఞాన నైపుణ్యాల అభ్యాసానికి, పరిశోధనకు గొప్ప సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. భారతదేశంలోని వివిధ సాంకేతిక సంస్థలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అవార్డులు గెలుచుకున్నాయి. ఈ సంస్థల్లో చదివిన అనేకమంది విద్యార్థులు అంతర్జాతీయ పేరు ప్రతిష్టలు సాధించారు. మన రోదసి, సముద్రాల అధ్యయన శాస్త్రం, అణు కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనల్ని ఎంపిక చేసిన దేశాల జాబితాలో నిలిపాయి. ఈ దేశాల శాస్త్రీయ పరాక్రమాలు, సాంకేతిక నైపుణ్యాలను యావత్‌ ప్రపంచం గుర్తించి, గౌరవించింది. విద్యాపరమైన సమగ్రతను పణంగా పెట్టి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసే నాయకత్వం వల్ల మన శాస్త్రీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అణగదొక్కబడితే అది చాలా దురదృష్టకరం. ప్రాచీన కాలం నుండి భారత్‌ గర్వించదగిన శాస్త్రీయ విజ్ఞానాన్ని, సాంప్రదాయాలను కలిగి వుంది. కానీ, మన శాస్త్రీయ సమాజానికి అప్రతిష్టను తీసుకువచ్చే కుహనా సైన్స్‌కు ఒక ముసుగుగా లేదా సాకుగా మారరాదు.

ప్రపంచ దేశాల సమూహంలో, సూత్రబద్ధమైన వైఖరులు అనుసరించినందుకు, వలస పాలనను వ్యతిరేకించినందుకు, రెండు అధికార గ్రూపులు ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటున్న వేళ మానవ హక్కులను సమర్ధిస్తూ, శాంతి ప్రయోజనాలను పెంపొందిస్తూ అలీనోద్యమానికి నాయకత్వం వహించినందుకు భారతదేశం అపరిమితమైన గౌరవాన్ని పొందింది. మన పొరుగు దేశాలతో మన సంబంధాలు చాలా వరకు సామరస్యంగా వుంటాయి. కొన్ని దేశాలతో ఘర్షణలు వున్నప్పటికీ, శాంతియుత సహజీవనానికి వెసులుబాటు కల్పించేలా అవగాహనా వారధులను నిర్మించడానికి మనం ప్రయత్నించాం. ప్రపంచ దేశాల్లో సరికొత్తగా తలెత్తే ఘర్షణలు, కొత్తగా రూపొందే పొత్తులు వున్నప్పటికీ ఈ వైఖరులనే మనం కొనసాగించాల్సిన అవసరం వుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో విశ్వసనీయ, గౌరవనీయ, మిత్ర దేశంగా మనం పరిగణించడం చాలా కీలకం. వ్యక్తిగత వైఖరులపై ఆధారపడి మన విదేశాంగ విధానం నడవడానికి మనం అవకాశమివ్వరాదు. సమర్ధులైన దౌత్యవేత్తల మద్దతుతో, తెలివైన నాయకత్వం ద్వారా స్పష్టమైన చొరవలను అనుసరించాల్సి వుంది.

యువత సంక్షేమం

యువత ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలను పెంపొం దించడంపై భారత్‌ తప్పనిసరిగా దృష్టి కేంద్రీకరించాలి. పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత వంటి సమస్యలు పునరుత్పాదక వయస్సులో వున్న మన పిల్లలు, మహిళల్లో ఎక్కువ శాతాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇటీవల చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌-5) మనకు గుర్తుచేస్తోంది. ఇతర రంగాల్లో ముఖ్యంగా నీరు, పారిశుధ్య రంగాల్లో పోషకాహారానికి ప్రాధాన్యమిచ్చే విధానాలను మనం ముందుకు తీసుకెళ్ళినప్పటికీ నిర్దిష్టంగా పోషకాహార కార్యక్రమాలు చేపట్టేందుకు మనం హామీ కల్పించాల్సిన అవసరం వుంది.

మన ఆరోగ్య వ్యవస్థలో వున్న అనేక రకాల బలహీనతలను కోవిడ్‌ వెల్లడించింది. వ్యాధి పట్ల అప్రమత్తత, నిఘా దగ్గర నుండి ఆరోగ్య సంరక్షణ నిబంధనల వరకు ఆరోగ్య సేవల సామర్ధ్యాలను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వుంది. వివిధ రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థల పని తీరు, సామర్ధ్యాల్లో అనేక తేడాలు వున్నాయి. ఆరోగ్య రంగంలో రాష్ట్రాలు మరింతగా పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఆరోగ్య ప్రామాణికాల్లో వెనుకబడిన రాష్ట్రాలకు మరింత తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. అందరికీ అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తూ, తగిన ఆర్థిక రక్షణ కల్పించడం సార్వజనీన ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా వుండాలి. దేశవ్యాప్తంగా దీన్ని ఏకరీతిన మనం సాధించాల్సి వుంది.

పౌరుడు ఆలోచించేందుకై…

కొత్తగా స్వాతంత్య్రం పొందిన ఆనందాన్ని, అలాగే దేశ విభజన వల్ల ఎదురైన బాధాకరమైన విషాదాలను రెండింటినీ పద్నాలుగేళ్ళ బాలుడిగా నేను అనుభవించాను. ఇలాంటి అసమ్మతి, విద్వేషం మరోసారి అనుభవంలోకి రాకుండా ఒక దేశంగా భారత్‌ బలంగా ఎదగాలని నేను ఆశించాను. ఈనాడు, భారత్‌ ఏదైతే సాధించిందో అందుకు గర్వంగా వుంది. ఈ మహత్తర దేశ భవితవ్యం గురించి కూడా చాలా ఆశాభావంతో వున్నాను. అయితే, సామాజిక సామరస్యతను కలుషితం చేసేలా, ప్రజలను విభజించేలా వేర్పాటువాద నినాదాలు, మతోన్మాద స్పర్ధలు తలెత్తడం గురించి కూడా నేను ఆందోళన చెందుతున్నాను. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను పరిరక్షించాల్సిన సంస్థలను బలహీనపరచడం, సుపరిపాలన నిబంధనలను బలపరిచే సంస్థలను తుంగలో తొక్కడం, ధనబలం, కో ఆప్టెడ్‌ ప్రభుత్వ సంస్థల దాడి నుండి ఎన్నికల రాజకీయాలను సంరక్షించాల్సిన సంస్థలనూ బలహీనపరుస్తున్నారు. ఎంతగానో కష్టపడి సాధించుకున్న మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుకోవడం, భారత పౌరుల కర్తవ్యం. మనం తలెత్తి మన పతాకానికి అభివాదం చేస్తున్న వేళ మనందరిలో ఈ కర్తవ్య సంరక్షణ ప్రతిబింబించాలి.

(డా|| మన్మోహన్‌ సింగ్‌ 2004 నుండి 2014 వరకుభారత ప్రధానిగా వున్నారు. 2022 ఆగస్టు 15 ‘హిందూ’ సౌజన్యంతో /

 

డా|| మన్మోహన్‌ సింగ్‌

➡️