దుంప తెగా.. ట్రంప్‌ స్పీడు ఇదేగా..

Jan 23,2025 04:38 #articales, #edite page, #Trump's speed

రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ స్పీడుని ఏ స్పీడోమీటర్లూ కొలవలేవు. పదవీ బాధ్యతలు తీసుకున్న క్షణమే టన్నుల కొద్దీ నిర్ణయాలు చకచకా తీసుకున్నారు. కొన్ని ఎన్నికల్లో చెప్పినవీ…మరి కొన్ని అప్పటికప్పుడే చెప్పినవి. ఆయన సంతకాలతో దేశం లోపలా, బయటా షాకులే. అమెరికాను మళ్లీ ఘనత పొందిన దేశంగా చేస్తానంటూ (మాగా) నుడివిన ఆయన వస్తూనే డజన్ల కొద్దీ ఆదేశాలపై సంతకాలు చేశారు. అందులో గత ప్రభుత్వం ఇచ్చిన 78 ఆదేశాల రద్దుతో మొదటి పద్దు మొదలెట్టారు. తర్వాత ముఖ్యమైన నిర్ణయం అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్‌గా వర్తించే పౌరసత్వపు హక్కు రద్దు. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగడం. పర్యావరణ రక్షణ బాధ్యత పూచీ పడాల్సిన పారిస్‌ ఒప్పందం నుండి తప్పుకోవడం. ఆ పైన తన చిరకాల హామీ అయిన మెక్సికో వైపు దేశ సరిహద్దుని గోడతో మూసేందుకు సుగమం చేసేలా ఎమర్జెన్సీ విధింపు. బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యంపై వంద శాతం సుంకం వేస్తానని హూంకరింపు. ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్క షాకు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను, అమెరికాతో సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాలు. అమెరికా తను పాడుచేసిన పర్యావరణం పట్ల చూపాల్సిన బాధ్యతను తప్పుకోవడం అంటే అది మొత్తం ప్రపంచ దేశాల పట్ల బాధ్యతను విస్మరించడమే. ఈ డజన్ల కొద్దీ ఆదేశాల్లో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో కానీ ఆయన ఉద్దేశ్యం, స్పీడు మాత్రం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అడుగు పెడుతూనే దుడుకు చూపించాడు. బండి స్టార్ట్‌ చేస్తూనే టాప్‌ గేర్‌ లోకి వెళ్లాడు. ఇక భయంతోనో, సంభ్రమంతోనో గట్టిగా కళ్ళు మూసుకోవడం, దెబ్బ తగలకుండా చూసుకోవడం ఒక్కటే ప్రపంచ దేశాల పని.

– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం.

➡️