అదాని సేవలో ఆ ముగ్గురు

ఒప్పందం ప్రకారం 3,000 మె.వా అదాని సౌర విద్యుత్‌ సరఫరాను సెకి గత సెప్టెంబరులో ప్రారంభించాలి. అయితే, అది వాయిదా పడింది. వచ్చే జనవరి నుంచి సరఫరా ప్రారంభమవుతుందని సెకి తెలిపింది. ఆ విద్యుత్‌ సరఫరా జరగాలంటే, అదాని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించాలి. ప్రసారం చేసేందుకు పిజిసిఐఎల్‌ (పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌)తో అవసరమైన ప్రసార సామర్ధ్యం కోసం కాంట్రాక్టు చేసుకోవాలి. రాష్ట్రంలో పంపిణీకి అవసరమైన సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ఏది జరగకపోయినా సరఫరా చేయటానికి వీలుండదు. అదాని ప్రాజెక్టు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించే తేదీ (సిఒడి) నుండి లభ్యమయ్యే విద్యుత్‌ను తీసుకునేలా డిస్కాములు చూడాలని పవర్‌ సప్లై అగ్రిమెంట్‌ (పిఎస్‌ఎ-ఆర్టికల్‌ 3.1.1)లో పేర్కొన్నారు. అదేవిధంగా, డిస్కాములు సిఒడి నుండి రాష్ట్ర సరిహద్దుల్లో పిజిసిఐఎల్‌, ఎపి ట్రాన్స్‌కో అనుసంధానం ఉన్న చోటు నుండి రాష్ట్రంలోకి ఆ విద్యుత్‌ సరఫరా జరిగేట్లు చూడాలి. ఈ ఏర్పాట్లు ముందుగానే ప్రారంభించి, సిఒడి నాటికి పనిచేసేలా ఉండాలి.
ఈ విద్యుత్‌ ప్రసారం, పంపిణీకి డిస్కాములు తాము చేయించాల్సిన ఏర్పాట్లు చేయించుకుంటే, అదాని ప్రాజెక్టు సకాలంలో సిఒడి సాధించలేకపోతే, ఆ ఏర్పాట్లు ఆ ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించే వరకు నిరుపయోగంగా ఉంటాయి. అయినా, ప్రసార, పంపిణీకి కాంట్రాక్టు చేసిన మేరకు చార్జీలను డిస్కాములు చెల్లించాలి. అదేవిధంగా, అదాని ప్రాజెక్టు అంగీకరించిన 28 శాతం కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌ (సియుఎఫ్‌-ఉత్పత్తి సామర్ధ్యం వినియోగం) కన్నా తక్కువగా ఉత్పత్తి చేసినా, ఉత్పత్తి తగ్గిన మేరకు ప్రసార, పంపిణీ సామర్ధ్యాలలో ఉపయోగించుకోలేని సామర్ధ్యానికి కూడా డిస్కాములు చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల, సిఒడి, ప్రసార, పంపిణీ సామర్ధ్యాల లభ్యత ఒకేసారి జరగాలి. అదాని ప్రాజెక్టు నిర్ణీత గడువులో సిఒడిని సాధించలేకపోతే, డిస్కాములకు జరిమానా చెల్లించాలని షరతు విధించలేదు. సెకికి, అదానికి మధ్య విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పిపిఎ) నిబంధనల ప్రకారం సిఒడి సాధించేందుకు సెకి డిస్కాములకు తెలియజేస్తూ గడువును పొడిగించవచ్చునని పిఎస్‌ఎలో (ఆర్టికల్‌ 2.1.4) పేర్కొన్నారు. అంటే, అదాని ప్రాజెక్టు సిఒడి సాధించే వరకు డిస్కాములు విద్యుత్‌ సరఫరా కోసం ఎదురు చూడాల్సిందే. నష్టపోవాల్సిందే. 7000 మె.వా. కొనుగోలుకు సెకితో చేసుకున్న ఒప్పందం రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా గాక, అదాని నెలకొల్పే ప్రాజెక్టుల సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు వీలు కల్పించే రీతిలోనే ఉంది.
కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (సిఇఆర్‌సి) జారీ చేసిన జిఎన్‌ఎ రెగ్యులేషన్లు అమలులోకి వచ్చాక 100 శాతం ఐఎస్‌టిఎస్‌ చార్జీల మినహాయింపు సాధ్యం కాకపోవచ్చునని డిస్కాములు ఆందోళన చెందుతున్నట్లు కమిషన్‌ దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని దక్షిణాది విద్యుత్‌ రెగ్యులేటర్ల వేదిక (ఎసిఆర్‌ఎఫ్‌) సమావేశంలో చర్చించి, దానిపై ఒక వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు గత ఆగస్టు 13న ఎపిఈఆర్‌సి రాష్ట్ర ప్రభుత్వానికి, మూడు డిస్కాంలకు రాసిన లేఖలో పేర్కొంది. జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ (జిఎన్‌ఎ) రెగ్యులేషన్ల ప్రకారం సాధ్యమయ్యే వాటిలో నూరు శాతం మినహాయింపు ఒకటని కమిటీ పేర్కొంది. అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలకు (ఐఎస్‌టిఎస్‌) నూరు శాతం మినహాయింపు పొందటానికి సెకి బాధ్యత తీసుకొనకపోతే, ఈ మినహాయింపు పొందేందుకు రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ కంపెనీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఎపిఈఆర్‌సి (ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌) ఆ లేఖలో తనంత తాను సలహా ఇచ్చింది. పిఎస్‌ఎకి ఎపిఈఆర్‌సి గత ఏప్రిల్‌ 20న ఆమోదం తెలిపింది. జిఎన్‌ఎ రెగ్యులేషన్లు అంతకన్నా చాలా కాలం క్రితమే అమలులోకి వచ్చాయి. ఈ అంశాన్ని పరిశీలించకుండానే, మినహాయింపు పొందాల్సిన బాధ్యత ఎవరిదనే దానిపై స్పష్టత లేకుండానే ఎపిఈఆర్‌సి పిఎస్‌ఎకి ఆమోదం తెలిపి, ఆ తరువాత నాలుగు నెలలకు ఇలా ఉచిత సలహా ఇచ్చింది. అన్ని అంశాలను, పిఎస్‌ఎను కూడా సమగ్రంగా పరిశీలించి పిపిఎలో, పిఎస్‌ఎలో సముచిత మార్పులు చేయించటంలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు, నియంత్రణ కమిషన్‌గా ఎపిఈఆర్‌సి వైఫల్యం కూడా దీనితో స్పష్టమవుతున్నది. కమిషన్‌ సలహా చేతులు కాలాక ఆకులు పట్టుకోండనే రీతిలో ఉంది.
సెకి టెండరులో ఎంపికైన ఉత్పత్తిదారుకు (అదాని గ్రూపు) టెండరు వేసిన ఉత్పత్తి సామర్ధ్యానికి సమానమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యాలను కేటాయించేందుకు కేంద్ర నూతన, పునరుత్పత్తి ఇంధన మంత్రిత్వ శాఖ గ్రీన్‌ షూ ఆప్షన్‌ పేరుతో వీలు కల్పిస్తూ చాలా కాలం క్రితమే ప్రకటన చేసింది. దీనికి సంబంధించి అదాని, సెకీ మధ్య పిపిఎలో ఎలాంటి నిబంధనలు పొందుపర్చారో, వాటి ప్రభావం డిస్కాంలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
అదాని ప్రాజెక్టు నుండి 7000 మె.వా సౌర విద్యుత్‌ను డిస్కాములకు అవసరమున్నా లేకపోయినా నిబంధనల ప్రకారం కొని తీరాల్సిందే. మిగులు ఉంటే దానిని మార్కెట్లో అమ్ముకోవచ్చనేది ఒక వాదన. మెరిట్‌ ఆర్డర్‌ డిస్పాచ్‌ సూత్రం ప్రకారం అత్యధిక అస్థిర చార్జీలు ఉన్న ధర్మల్‌ విద్యుత్‌ మిగులుగా తేలుతుంది. సౌర విద్యుత్‌ను మిగులు విద్యుత్‌గా చూపి మార్కెట్లో అమ్ముకొనేందుకు ఆ సూత్రం ప్రకారం వీలుండదు. గ్రామీణ వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ కంపెనీ ద్వారా 7000 మె.వా విద్యుత్‌ను పంపిణీ చేస్తే, రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు అది సరిపోవచ్చు. అలాంటి ఏర్పాటు వల్ల తలెత్తే ఇబ్బందులు, ప్రస్తుతమున్న మూడు డిస్కాములకు, వాటి వినియోగదారులకు వాటిల్లే నష్టాలను గతంలోనే వివరించాము. ఎపిఈఆర్‌సి పునరుత్పత్తి విద్యుత్‌ కొనుగోలు బాధ్యత (ఆర్‌పిపిఒ) ఉత్తర్వు కింద నిర్దేశించిన కనీస లక్ష్యానికి మించి సౌర విద్యుత్‌ వంటి ఆర్‌ఇని డిస్కాము కొనుగోలు చేస్తే, అదనంగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు పునరుత్పత్తి ఇంధన సర్టిఫికెట్లను (ఆర్‌ఇసి) పొంది, అమ్ముకోవచ్చు. ఆ సరిఫికెట్ల అమ్మకానికి ఉన్న పరిమితులకు తోడు, అలా అమ్ముకొనటం వల్ల వచ్చే ఆదాయం అదాని సౌర విద్యుత్‌ వల్ల వాటిల్లే భారీ నష్టాన్ని సర్దుబాటు చేసుకొనేందుకు ఏ మూలకూ చాలదు. పైగా, సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయటం రాష్ట్రంలో అవసరాలను తీర్చడానికి తప్ప ఆర్‌ఇసి సర్టిఫికెట్ల కోసం కాదు.
ఆర్‌పిపిఒ కింద డిస్కాములు, ఇతరులు వాటి విద్యుత్‌ వినియోగంలో కొనాల్సిన కనీస ఆర్‌ఇని నిర్దేశిస్తూ, ఎనర్జీ కన్సర్వేషన్‌ చట్టం కింద గతేడాది అక్టోబరు 20న కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం వివిధ రకాల ఆర్‌ఇ ని 2024-25లో 29.92 శాతం మేరకు, తరువాత ప్రతి ఏటా ఆ శాతాన్ని పెంచుతూ 2029-30లో 43.33 శాతం మేరకు కొనాలని నిర్దేశించింది. ఎపిఈఆర్‌సి నిర్దేశించిన అధిక శాతాల కన్నా ఇవి ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మార్గదర్శకాలు మాత్రమే. అయితే, కమిషన్‌ నిర్ణయించిన, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పేర్కొన్న వాటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ శాతం మేరకు ఆర్‌ఇ ని డిస్కాంలు కొనాలని ఎపిఈఆర్‌సి ఏకపక్షంగా ఆదేశించింది. ఈ అంశం ప్రస్తావన కూడా లేని రెండు పిటిషన్‌లలో ఇచ్చిన ఉత్తర్వులలో ఎపిఈఆర్‌సి అలా ఆదేశించింది. ఆర్‌పిపిఒ కింద కనీస లక్ష్యాలను నిర్ణయించే ముందు, కమిషన్‌ తన ప్రతిపాదనలకు ప్రకటించి, ఆసక్తి గలవారి నుండి అభ్యంతరాలను, సూచనలను ఆహ్వానించి, బహిరంగ విచారణలు జరిపి, ఉత్తర్వులు జారీ చేయటం గత నుండి జరుగుతున్నది. దానికి విరుద్ధంగా, అప్రజాస్వామికంగా, అనవసరంగా అధిక ఆర్‌ఇ కొనుగోలు వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని, వాటిల్లే భారీ నష్టాలను పట్టించుకోకుండా ఎపిఈఆర్‌సి ఈ ఆదేశాలు జారీ చేసింది. అదాని నుండి సెకి ద్వారా 7000 మె.వా సౌర విద్యుత్‌ కొనుగోలుకు తానిచ్చిన అనుచిత ఆమోదాన్ని సమర్ధించుకునేందుకు ఎపిఇఆర్‌సి ఇలా మళ్ళీ అనుచిత ఆదేశాలనిచ్చింది.
ఇన్ని అవకతవకలతో, ముడుపుల చెల్లింపుల అభియోగాలతో కూడుకున్న ఈ అక్రమ వ్యవహారంపై విచారణలు జరిపించి, తగు చర్యలు తీసుకోవాలని పార్లమెంటు లోపల, బయట రాజకీయ పార్టీలు, పలువురు మేధావులు పదేపదే డిమాండు చేస్తున్నారు. విచారణ జరిపించేందుకు అనేక అవకాశాలున్నాయి. కాని ఇందులో విచారించాల్సిందేమీ లేదన్నట్లుగా మోదాని ప్రభుత్వం యథావిధిగా మొండిబండగా వ్యవహరిస్తున్నది. ఈ వ్యవహారంలో అదానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదని బుకాయించటంతో పాటు, ఈ ఒప్పందం చేసుకున్నందుకు తనకు శాలువా కప్పాలని జగన్‌ అంటున్నారు. ఈ వ్యవహారంపై అధ్యయనం చేయాలంటూ, విచారణ జరిపించాలన్న సహేతుక డిమాండుపై చంద్రబాబు నాయుడు దాటవేత వైఖరి అవలంభిస్తున్నారు. రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా, బడా కార్పొరేట్‌ శక్తులతో పాలక వర్గాల సంబంధాలు పరస్పర స్వార్ధ ప్రయోజనాల కోసం ఎంత బలంగా ముడిపడి ఉన్నాయనేది ఈ వ్యవహారం మరోసారి నిర్ధారిస్తున్నది.

 వ్యాసకర్త విద్యుత్‌ రంగ నిపుణులు ఎం. వేణుగోపాలరావు

➡️