మా కాలేజీ మెస్ ఎప్పటిలా రాత్రి 8 గంటలకి కాకుండా 9 గంటలకి మొదలవుతుందని మే ఏడవ తేదీన వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. భారత్-పాక్ యుద్ధ సన్నాహాల్లో భాగంగా మాక్ డ్రిల్ కోసం ఇలా చేస్తున్నారన్నది ఆ మేసేజ్ సారాంశం. సరిగ్గా 8:15 నిమిషాలకు మా యూనివర్సిటీ (డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి-జలంధర్)లో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఇలా ఎప్పుడూ కాలేదు. ఈ నాలుగేళ్లలో ఇదే మొదటి సారి. మాక్ డ్రిల్ కోసమని సరిపెట్టుకున్నాం. హాస్టల్ మొత్తం ఒకటే అంధకారం. ఓ అర్థగంటలో మా కాలేజీ పైనుండి ఏదో నిప్పులు చెరుగుతూ వెళ్ళింది. అది దీపావళి టపాసా లేదా పాకిస్తాన్ వదిలిన మిస్సైలా! ఎవ్వరికీ క్లారిటీ లేదు. గంట తర్వాత మళ్ళీ కరెంట్ రాగానే రూమ్ లోపలికి వెళ్లిపోయాం.
జలంధర్ పక్కనే ఉన్న హోషియార్‌పూర్‌లో పాకిస్తాన్ డ్రోన్ శకలాలు దొరికాయని మే 8వ తేదీ ఉదయం న్యూస్‌లో వచ్చింది. మొత్తం స్టూడెంట్స్ గుండెల్లో దడ మొదలైంది. మా ఎన్‌ఐటి పక్కనే భారత మిలట్రీ శిబిరాలు ఉన్నాయి. కొంత మందిమి వెళ్ళి కాలేజీ ‘డీన్ స్టూడెంట్ వెల్ఫేర్’ని కలిసి…మాకు ఇక్కడ సేఫ్టీ కాదు, మమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చెయ్యండి…అని విన్నవించార. ‘స్టూడెంట్స్ సేఫ్టీనే మాకు మొదటి ప్రాధాన్యత, కానీ ఇప్పటి వరకు మన ఎన్.ఐ.టి. సేఫ్ గానే ఉంది, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా నిర్ణయాలు ఉంటే మెయిల్ పంపిస్తామ’ని చెప్పారు. అందరిలోనూ ఆందోళన కొంచెం తగ్గినా, అది ఎక్కువ సేపు నిలవలేదు. జలంధర్‌లో బ్లాకౌట్ అనౌన్స్ చేసినట్లు వాట్సాప్‌లో న్యూస్ వచ్చింది. ఆ రోజు రాత్రి బ్లాకౌట్‌లోనే డిన్నర్ చేసిన కాసేపటికి…మా ఎన్‌ఐటికి కొంచెం దూరంలో ఏవో నాలుగైదు మిసైళ్లు పైకి వెళ్ళాయి. అవి డ్రోన్లన్నారు మా ఫ్రెండ్స్. ఏదైతేనేం? మనకేం కాలేదు కదా అనుకునేలోపే ఆ చిమ్మచీకట్లో పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. మా బాల్కనీ నుండి పైకి చూస్తే రెండువైపుల నుంచి ఏవో వచ్చి గుద్దుకుని పేలాయి. భయపడుతూనే ఆకాశ దృశ్యాలను ఫోన్లతో వీడియో తీశార. స్టూడెంట్లు అందరూ రోడ్ల మీదనే వున్నారు. రాత్రి 9 గంటలకు మొదలై పదిన్నర పదకొండు గంటల వరకూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ విషయం చెప్పాలని అమ్మకు ఫోన్ చేశాను. ఫోన్‌లో ఆ భారీ శబ్దాలు విని మా అమ్మ, నాన్న భయపడ్డారు. నేను తీసిన వీడియోలను అమ్మకు షేర్ చేశాను. ఇంతలో డీన్ నుండి మెయిల్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్లకి ఇక్కడ సేఫ్ కాదు. కాబట్టి రేపు తెల్లవారి 6 గంటల నుండి కాలేజీ ఖాళీ చేసి మీ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని మెయిల్ సందేశం. ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. ఇంత సడన్‌గా సొంత ఊళ్లకు వెళ్లాలంటే ఎలా! ఆందోళన పడుతూనే, ట్రైన్ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతకడం మొదలుపెట్టాం. ఏ డ్రోన్, మిస్సైల్ వచ్చి పడుతోందోనని రాత్రంతా ఒకటే టెన్షన్. ఇంటికి ఎలా వెళ్లాలి? పంజాబ్ వాళ్లకు ట్రాన్స్‌పోర్టు పరవాలేదు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు సుమారు 20 రాష్ట్రాల వారు ఇక్కడ చదువుతున్నారు. పంజాబీ ఫ్రెండ్స్ తమ ఇళ్లకు రమ్మని నన్ను అడిగారు. కానీ అప్పటికే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, భటిండా, అమృత్‌సర్‌లో ఈ దాడులు తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండడం సేఫ్ కాదని, ఇంటికి వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రిజర్వేషన్ లేదు కాబట్టి ముందు ఇక్కడ నుండి బయట పడాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జాబ్ చేస్తున్న అక్క దగ్గరకు వస్తానని ఫోన్ చేసి చెప్పాను. అర్ధరాత్రి దాటింది. రాత్రంతా టెన్షన్, భయంతో నిద్ర పట్టలేదు. బ్యాగు సర్దుకుని తొమ్మిదవ తేదీ ఉదయం 5 గంటలకే జలంధర్ రైల్వేస్టేషన్ చేరుకున్నాను. స్టేషన్ మొత్తం స్టూడెంట్లతో కిక్కిరిసిపోయింది. జలంధర్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలన్నీ ఇదే విధంగా ప్రకటించాయి. ఏ స్టూడెంట్‌ను చూసినా భయంతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ కనిపించారు. లలిత్‌పూర్ ట్రైన్ రాగానే జనరల్ బోగీల్లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ అమ్మాయిలం, అబ్బాయిలం అంతా ఎక్కేశాం. కొంతమంది ఢిల్లీ వెళ్లి ఫ్లైట్, ఇతర రవాణా మార్గాల ద్వారా బయల్దేరారు.
యుద్ధం అంటే బుక్స్‌లో చదువుకోవడం, సినిమాల్లో, న్యూస్‌లో చూడడమే. కానీ ప్రత్యక్షంగా నేనున్న ప్రాంతంలోనే అలాంటి వాతావరణం చూసి ఒకవైపు ఆందోళన, మరోవైపు భయం! యుద్ధం ఎక్కడ జరిగినా ప్రాణ భయం, ప్రాణ నష్టం తప్ప ఏమీ సాధించలేమని అనుకున్నంతలోనే మన సైనికులు మృత్యువాత పడిన వార్తలను చూసి చాలా బాధపడ్డాను. భారత ప్రభుత్వం ఎందుకు యుద్ధం చేస్తోందో? ఉగ్రవాదులను పట్టుకోవాలంటే యుద్ధం ఒక్కటే మార్గమా? అనుకుంటూ ఆ రోజు రాత్రి 10 గంటలకు లలిత్‌పూర్‌లోని మా అక్క దగ్గరకు చేరుకున్నాను. మరో వారం రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసి బి.టెక్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాల్సిన టైంలో ఇలా జరిగిందేమిటా? అనుకున్నాను. మాలాంటి స్టూడెంట్ల కోసం ఎస్.ఎఫ్.ఐ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఢిల్లీలో షెల్టర్ ఇస్తుందని సోషల్ మీడియాలో చూసి మిత్రులకు షేర్ చేశాను.
– రిఖిల్,
బి.టెక్ విద్యార్థి, ఎన్.ఐ.టి, జలంధర్.