ప్రజారోగ్యానికి ముప్పు

రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతున్న వైద్య కళాశాలలకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) నమూనాను వర్తింపజేసే టిడిపి కూటమి ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే మిణుకు మిణుకుమంటున్న ప్రజారోగ్యాన్ని మరింత చీకటిమయం చేస్తుంది. వైద్య విద్యను మరింతగా ప్రైవేటీకరిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదిత ‘పిపిపి’ మోడల్‌ ప్రైవేటు, కార్పొరేట్ల లాభాలకు బాగా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు సంవత్సరాల్లో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని గత వైసిపి ప్రభుత్వం తలచింది. కొత్తగా నెలకొల్పబోయే కాలేజీల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకొస్తే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రజలు నిజమే కాదా అని నమ్మారు. అధికారంలోకొచ్చాక పి-3 అనడం ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే. సెల్ఫ్‌ఫైనాన్స్‌ అని వైసిపి సర్కారు వైద్య విద్యార్థుల భవిష్యత్తును పెనం మీదికి నెట్టగా కూటమి ప్రభుత్వం ఏకంగా పొయ్యిలోకి తోసినట్లయింది.

రాష్ట్ర విభజన తర్వాత వైద్య విద్యలోకానీ, వైద్య మౌలిక సదుపాయాల్లోకానీ ఎ.పి. పరిస్థితి తెలంగాణతో పోల్చితే వెనకబాటులో ఉంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వ రంగంలో వైద్య విద్య, సౌకర్యాలు పెరగాలి. నవ్యాంధ్రలో పాలన చేసిన వైసిపి, టిడిపి ఆలోచన ఆ దిశలో లేదు. రాష్ట్రంలో ఆరు వేల వరకు ఎంబిబిఎస్‌ సీట్లుండగా సగం ప్రైవేటులోనివే. మొత్తం 36 మెడికల్‌ కాలేజీలు ఉండగా సగం ప్రైవేటువే. స్థానికంగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో చదవాలంటే లక్షలు కుమ్మరించాలి. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ శూన్యం. రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన మోతుబరుల చేతుల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్న నేపథ్యంలో ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఆశించడం శుద్ధ దండగ. అన్నేసి లక్షలతో ప్రైవేటు కాలేజీల్లో సీట్లు కొనలేక వైద్య విద్యపై ఆసక్తి ఉన్న ఔత్సాహిక యువత తమ ఆలోచనను విరమించుకుంటున్నారు. మరికొంత మంది తక్కువ ఖర్చులో మెడిసన్‌ చేసేందుకు చైనా, ఫిలిప్పైన్స్‌, ఉక్రెయిన్‌ తదితర దేశాలకు వలస పోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నెలకొల్పుతారని విద్యార్థులు ఎంతో ఆశ పడ్డారు. పి-3 మోడల్‌ అని ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేసింది.
కూటమి సర్కార్‌ ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర విజన్‌ 2047’ నినాదం ఐశ్వర్య, ఆరోగ్య, ఆనంద రాష్ట్రాన్ని నిర్మించడం. ప్రజలందరూ ఆరోగ్యవంతులు కావాలంటే ఆ రంగానికి బడ్జెట్‌లో అందుకు తగిన విధంగా నిధులు కేటాయించాలి. జిడిపిలో కనీసం 2.5 శాతం ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు ఖర్చు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆరోగ్యాంధ్ర చేస్తామంటున్న కూటమి సర్కారు తన బడ్జెట్‌లో ఆరు శాతం ఇవ్వడం కనాకష్టమైపోయింది. చివరికి ఎంత ఖర్చు చేస్తారో తెలీదు. ఆస్పత్రుల్లో మందుల్లేవని అధికార సభ్యులే అసెంబ్లీలో గోల చేశారు. 108, 104 సేవలు, ఎన్‌టిఆర్‌ ఆరోగ్యసేవ అరకొరే. డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు వేలాదిగా ఉన్నాయని స్వయాన మంత్రి శాసనసభకు సెలవిచ్చారు. డాక్టర్‌ పోస్టులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా రాకపోవడానికి కారణం లక్షలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చదివిన వారికి సంపాదన, కెరీర్‌ పరమావధిగా దేశీయ కార్పొరేట్‌ ఆస్పత్రులు, విదేశాల బాట పట్టడమే. ప్రతి వెయ్యి మందికీ ఒక క్వాలిఫైడ్‌ డాక్టర్‌ ఉండాలని డబ్ల్యుహెచ్‌ఒ నిర్దేశించింది. తామొచ్చాక ఆ టార్గెట్‌ను దాటేశామంటోంది మోడీ ప్రభుత్వం. నగరాలు, పట్టణాల్లో ఆ నిష్పత్తిలో వైద్యులుండవచ్చునేమో కానీ గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు చాలా చాలా అధమ స్థాయిలో ఉన్నాయనడానికి ఏజెన్సీలో తరచు కనిపించే డోలీ మోతలే నిదర్శనం. ఆరోగ్యం ప్రజల హక్కు. అది సాకారం కావాలంటే ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలు పరిపుష్టం కావాలి. ప్రభుత్వ రంగంలోనే వైద్య కాలేజీలు, ఆస్పత్రులు కొనసాగాలి. పి-3, పి-4 నమూనాలు మితిమీరిన చార్జీలు మోది ప్రజల మూలగ పీలుస్తాయి.

➡️