కొలువుల కల్పనలో కాలయాపన

రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలల ముగిసింది. కానీ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇంతవరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం. మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత అంటున్నారు. ఇదంత త్వరగా తేలే వ్యవహారం కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు. కావాలనే కొలువుల విషయంలో కాలయాపన చేస్తున్నది. ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకు విడుదల చేయలేదు? జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 18 శాఖల్లో 2,686 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. వీటిలో 1820 పోస్టులకు గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్‌ వెలువడింది. ఇకపోతే మిగిలినవి 866 పోస్టులు. అందులోనూ అత్యధికంగా 814 పోస్టులు ఒక్క అటవీ శాఖ నుండే భర్తీ చేస్తామన్నారు. ఆ ఒక్క శాఖలోనే అన్ని పోస్టులు భర్తీ ఎందుకు చేయదలుచుకున్నారు. మిగిలిన శాఖలో పోస్టుల ఖాళీలు లేవా? దానికి సిద్ధమౌతున్న యువత లేరా? పోనీ దాన్నైనా విడుదల చేశారా అంటే అదీ లేదు. ఈ అరకొర పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తే యువతలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలు అదనంగా చేర్చి నూతన క్యాలెండర్‌ విడుదల చేస్తామని నమ్మబలకుతున్నది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబుగారు పెట్టిన ఐదు సంతకాల్లో మొదటిది మెగా డీఎస్సీ. 25 వేల పోస్ట్లులు ఇస్తామని చివరికి 16,340 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో 6,100 పోస్టులు గత ప్రభుత్వం ప్రకటించినవే. ఏది ఏమైనప్పటికీ డీఎస్సీ అభ్యర్థులు అందుకు మళ్ళీ పరీక్షలకు సిద్ధపడ్డారు. కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. రాత్రీ పగలు అనకుండా నిద్రాహారాలు మాని చదువుతున్న అభ్యర్థులు ఇప్పుడు విద్యారంగంలో వస్తున్న సంస్కరణలు చూసి లబోదిబోమంటున్నారు. కొత్త ఉద్యోగం కోసం పోటీ పడుతుంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్‌ 117 రద్దు చేస్తామని చెబుతున్నప్పటికీ అంతకంటే దారుణమైన సంస్కరణలు చేపడుతున్నది. ంగన్వాడీలను ప్రీ ప్రైమరీకి అనుసంధానం చేస్తూ ఒకటి రెండు తరగతులను అంగన్వాడీలో కలపనుంది. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రైమరీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నది. పంచాయతీల్లో మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది. 75 కంటే తక్కువ విద్యార్థులున్న 297కు పైగా ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ, పిఇటి పోస్టులను రద్దు చేస్తున్నది. ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్యను గతం కంటే పెంచనుంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త మార్గదర్శకాల మూలంగా 15 వేలకు పైగా పోస్టులు రద్దు కానన్నాయి. మరోవైపు జనాభా ఆధారంగా క్రమబద్దీకరణ పేరుతో గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందిని కుదించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రతి సచివాలయంలో ఇప్పటి వరకు 10 నుండి 11 మంది సిబ్బంది ఉన్నారు. ఈ క్రమబద్ధీకరణ మూలంగా ఇప్పటి నుండి 2500 కంటే తక్కువ జనాభా ఉన్న దగ్గర ఆరుగురు, 3,500 వరకు జనాభా ఉన్న దగ్గర ఏడుగురు, 3,500కు పైన జనాభా ఉన్న దగ్గర ఎనిమిది మందికి కుదించనుంది. అలా జరిగితే ఈ శాఖలో దాదాపు 34 వేల పోస్టులు రద్దయ్యే అవకాశం ఉంది. 2.66 లక్షల మంది కాస్తో కూస్తో ఉపాధి పొందుతున్న వాలంటరీ వ్యవస్థకు ఇప్పటికే మంగళం పాడేసింది. ఇలా ఒకవైపు కొత్త ఉద్యోగాలు రాక మరోవైపు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం వలన, ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం వలన ఉద్యోగం వస్తుందన్న యువత ఆశలన్నీ అడియాసల వుతున్నాయి. ఇకనైనా పెరుగుతున్న నిరుద్యోగాన్ని అదుపు చేయడానికి, యువతకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి.

– డి.రాము, ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు, సెల్‌ : 9705545464

➡️