వికలాంగులకు బాసటగా నిలవాల్సిన సమయం

సివిల్‌ సర్వీసులలో వికలాంగుల రిజర్వేషన్‌పై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. అఖిల భారత సర్వీసులలో వికలాంగుల కోటాపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు హద్దు మీరాయంటూ ఒక పార్లమెంటు సభ్యురాలు వ్యాఖ్యానించారు. శిక్షణలో ఉన్న ఒక ఐఏఎస్‌ అధికారిణి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి వికలాంగుల కోటాలో ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారనే అభియోగాలపై యుపిఎస్‌సి చర్యలకు ఉపక్రమించింది. ఎంతో పారదర్శకంగా ఏ విధమైన పొరపాట్లకు ఆస్కారమే ఉండదని భావించే అఖిల భారత సర్వీసుల ఎంపికలోని డొల్లతనం ఈ సందర్భంగా బయటపడటం సగటు భారతీయుడిని ఉలిక్కిపడేటట్లు చేసింది. అంతేకాక ఎంపిక సందర్భంలో అనేక వడపోతల ద్వారా ఒక సమర్థవంతమైన, వ్యక్తిత్వ వికాసంతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసి దేశ పాలనా వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడం లక్ష్యంగా యుపిఎస్‌సి ఏర్పాటయింది. కానీ పూజా కేత్కర్‌ వంటి అధికార దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తిని, నేరారోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ నేపథ్యం ఉన్న ఒక అభ్యర్థి ఎంపిక కావడం అనూహ్యం. శిక్షణా కాలంలోనే ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో ఆమె వ్యక్తిత్వంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. కారు, అధికారిక వసతులు వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యమిచ్చే స్వార్ధపరులకు ఈ వ్యవస్థ ఎలా అవకాశం కల్పించిందనేది ప్రశ్న. ఆమె తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సమర్పించడమే కాక తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం ఈ-మెయిల్‌ ఐ.డి, మొబైల్‌ నెంబర్‌, చిరునామా పత్రాలను సైతం మోసపూరితంగా సమర్పించినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంలో ఎవరిది తప్పుగా కనిపిస్తున్నదో స్మితా సబర్వాల్‌ చెప్పాల్సి ఉంటుంది.
రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా తప్పు చేసిన పూజ కేత్కర్‌ని, లోపభూయిష్టమైన ఎంపిక విధానం ద్వారా ఆమెను ఆ స్థాయి వరకు తీసుకు వచ్చిన నియామక సంస్థను నిందించడం మానేసి భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా వికలాంగులు పొందుతున్న రిజర్వేషన్లపై ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నమే కాగలదు. పైగా బాధ్యతాయుతమైన కేంద్ర సర్వీసులకు చెందిన అధికారిణిగా భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించవలసిన అవసరం ఆమెకు ఉంటుంది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 16(4) ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లనే ఆమె ప్రశ్నించదలిచారా? ఈ రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులను సైతం ఆమె పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ట్విట్టర్‌ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం సందేశాన్ని ఇవ్వదలిచారు?
వికలాంగుల కోటా ద్వారా ఎంపికైన సమర్థులైన అధి కారులు ఎందరో ఉన్నారు. ఆ మాట కొస్తే చక్కటి శరీర దారుఢ్యం ఉన్న అధికారులు అందరూ సమర్థంగా పని చేస్తున్నారా? అనుక్షణం మానసిక వేదనకు, సామాజికంగా అసమానతలను, ఇబ్బందులను ఎదుర్కొనడం, విధిని ఎదిరి ంచి నిరంతర శ్రమతో, కృషితో, పట్టుదలతో సివిల్‌ సర్వీసుల స్థాయికి ఎదిగిన వికలాంగులైన అధికారులలో మరింత కష్టపడి పని చేయాలనే తపన ఉంటుంది. అలాంటి అనేక ఉదాహరణలు కూడా మనం చూశాం.
మన తెలుగు తేజం బాలలత వైకల్యాన్ని అధిగమించి సివిల్‌ సర్వీసులకు ఎంపిక కావడమే కాక ఇప్పుడు ఎందరో ఔత్సాహికులకు శిక్షణనిచ్చి సివిల్‌ సర్వీసులకు ఎంపిక అయ్యేందుకు తన మేధను ఉపయోగిస్తున్నారు.
స్మిత సబర్వాల్‌ ఒక మంచి అధికారిణి. గతంలో ఆమె పని చేసిన చాలా చోట్ల సమర్థవంతంగా విధులు నిర్వహించారనే పేరు ఉన్నది. అతి చిన్న వయసులో సివిల్‌ సర్వీసులకు ఎంపిక కావడం ద్వారా సివిల్‌ ఆశావహులకు ఆదర్శప్రాయురాలిగా నిలుస్తారు. ప్రజల ఆశలకు, అవసరాలకు తగినట్లుగా పని చేసి మంచి గుర్తింపు పొందారు. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమెను అభిమానించేవారు సైతం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్లను వ్యతిరేకించే కొందరు ఆమెను సమర్ధించడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఆమె కేంద్ర సర్వీసుల అధికారిగా ప్రభుత్వంలో భాగస్వామి. అంతేకాదు, రాజ్యాంగ పరిరక్షకురాలు కూడా. ఆమె వ్యాఖ్యలను వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేం. వైకల్యాన్ని ఎదుర్కొంటూ, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అధిగమించి, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ…ఈ వ్యాఖ్యల పట్ల ఆవేదన చెందుతున్న వికలాంగులకు దేశం యావత్తు బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నది.

– ఎన్‌ స్టాలిన్‌ బాబు,
సెల్‌ : 8374669988

➡️