తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష, వైసిపి కేంద్ర కార్యాలయంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతున్నాయి. తాము ఎంతో పవిత్రంగా భావించి, పూజించి, భుజించిన స్వామివారి లడ్డు అపవిత్రమైనదా! జంతువుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా! అంటూ దేశవ్యాపితంగా వున్న కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగివుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసులు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. అందుకు చట్టం తన పని తాను చేయాలి. ఈ పని సక్రమంగా చేయాల్సిన పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారు. ఇలాంటి చర్యలు మతోన్మాద శక్తులు బలపడడానికి తోడ్పడతాయనే స్పృహను పాలక పార్టీలు కోల్పోతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దేశమంతా ఇంత చర్చ జరుగుతున్న ఈ కల్తీ వ్యవహారంపై చట్టం, ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ తనిఖీ నిపుణులు ఎందుకు మౌనంగా వుంటున్నారు? జులై 23న వచ్చిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్.డి.డి.బి) రిపోర్టును సుమారు రెండు నెలలు ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటికైనా కేసు పెట్టారా? లేదా? ఇలాంటి అనేక సందేహాలను వెంటనే తీర్చాలి. లడ్డుతో పాటు టిటిడిలో జరుగుతున్న అనేక అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టిటిడిలో అనేక అక్రమాలు జరుగుతుంటే ఆ బోర్డులో సభ్యులుగా వున్న బిజెపి నాయకులు ఏం చేస్తున్నారు? భక్తులకు కావలసింది మతోన్మాద చర్యలు కాదు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కాదు. దీక్షలు, ప్రమాణాలు అసలే కాదు. నిజం కావాలి. లడ్డుల తయారీలో ఏం జరిగిందనే నిజం కావాలి. ఆ నిజం నిపుణులు చేసే పరీక్షల ద్వారా నిర్ధారణ కావాలి. ఆ నిజం తేలేవరకు రాజకీయ నాయకుల నోళ్ళు మూతపడాలి, మతోన్మాద ఉన్మాద ప్రకటనలు ఆగాలి. ఈ కుట్రలకు ప్రజలు, భక్తులు బలి కాకుండా ప్రజాతంత్రవాదులు కాపాడుకోవాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల బడ్జెట్, 18 వేల కోట్ల డిపాజిట్లు, వెయ్యి కిలోల బంగారం కలిగివుంది. ఇక్కడ ప్రతిరోజు కోట్ల రూపాయల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టే టిటిడి ఛైర్మన్, దాని సభ్యులుగా వుండడానికి రాజకీయ నిరుద్యోగులు, బడా వ్యాపారులు, అవినీతి మాజీ అధికారులు పెద్ద ఎత్తున పోటీలు పడుతున్నారు. అధికార పార్టీల నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చి టిటిడి పదవులు దిక్కించుకుంటున్నారనే విమర్శలు వున్నాయి. వ్యక్తిగత విశ్వాసంగా వుండాల్సిన భక్తిని వ్యాపారంగా, రాజకీయంగా మార్చి సొమ్ము చేసుకుంటున్న పార్టీలు ఇప్పుడు లడ్డు గురించి గగ్గోలు పెట్టడంలో భక్తి కంటే స్వార్థ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలే ప్రధానం. ఇక్కడికి వచ్చిన భక్తులు లడ్డు తీసుకోకుండా తిరిగి వెళ్లడమనేది ఉండదు. అందుకే తిరుమలలో ప్రతిరోజు సగటున 15 వేల కిలోల నెయ్యితో సుమారు మూడున్నర లక్షల లడ్లు తయారు చేస్తుంటారు. ఈ లడ్డులను తయారు చేయడానికి ఆవు నెయ్యితో పాటు శెనగపిండి, చక్కెర, యాలకులు, ఎండు ద్రాక్ష, కలకండ, ముంతమామిడి పప్పు వాడుతారు. ఈ సరుకులన్నీంటిని టిటిడి పాలకమండలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ-టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తుంది. ఇలా చేరుతున్న సరుకుల నాణ్యతను పరీక్షించడానికి టిటిడి చాలా సంవత్సరాల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఏడు ఎనిమిది దశల్లో తనిఖీలు చేస్తారు. 2024 మార్చి 12న నిర్వహించిన టెండర్లలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన తమిళనాడుకు చెందిన ఎ.ఆర్ డెయిరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జులై 6న, జులై 12న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు పంపింది. ఈ నెయ్యే ఇప్పటి వివాదానికి కేంద్రంగా వుంది. తిరుమలలో జరిగే లడ్డు తయారీతో పాటు, ఆలయంలో ఉపయోగించే అన్ని రకాల సరుకులను టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తారు. తక్కువ ధరకు టెండర్ వేసిన వారితో సరుకులు సప్లయి చేయించుకుంటారు. ప్రస్తుతం లడ్డుల కోసం ఉపయోగించే నెయ్యిని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డెయిరీ, వైష్ణవిశ్రీ పరాగ్ మిల్క్, ఎ.ఆర్ డెయిరీ అనే ఐదు సంస్థలు సప్లయి చేస్తున్నాయి. నెయ్యి సరఫరా చేసే ఏ సంస్థ అయినా ట్యాంకర్ తిరుపతికి బయలుదేరే ముందే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి.ఎఫ్. టి.ఆర్.ఐ) మైసూర్‌లో నమూనా పరీక్షలు చేయించుకుని, వారి సర్టిఫికెట్ వెంటపెట్టుకుని తిరుపతికి వస్తారు. అక్కడకు వచ్చిన ట్యాంకర్లను కొండ కింద ఒకసారి, కొండపైన మరోసారి టిటిడి తనిఖీ నిపుణులు నాణ్యతను పరీక్షిస్తారు. ఇలా పరీక్షలు చేయడానికి ప్రస్తుతం 12 మంది ల్యాబ్ నిపుణులు, సి.ఎఫ్.టి.ఆర్.ఐలో పదవీ విరమణ చేసిన సీనియర్ శాస్త్రవేత్త ఒకరు కలిసి 13 మంది సిబ్బంది వున్నారు. సరుకుల నాణ్యతలో వీరికి ఏ మాత్రం అనుమానం వచ్చినా నమూనాలు తీసి వివిధ ల్యాబ్‌లకు పంపి నిర్ధారించుకుంటారు.
ఈ సంవత్సరం జూన్ 14న టిటిడి ఈవో గా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అదేరోజు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ లడ్డు నాణ్యతపై భక్తులు, లడ్డు తయారీ కార్మికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, లడ్డు నాణ్యతను కాపాడడంలో రాజీ పడే ప్రస్తక్తే లేదని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే ఎ.ఆర్ డెయిరీ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి నుండి నాలుగు నమూనాలు గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు చెందిన సి.ఎ.ఎల్.ఎఫ్ కు పంపారు. అనేక ల్యాబ్‌లు అందుబాటులో వుండగా, ఎప్పుడూ పంపని ఈ గుజరాత్ ల్యాబ్‌కు శ్యాంపిళ్లు ఎందుకు పంపారనే అనుమానాలు వున్నాయి. గుజరాత్ ల్యాబ్ పరీక్షించి ఈ నెయ్యి వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు, చేప నూనె, ఇతర పదార్థాల వల్ల కల్తీ అయినట్లు ఎన్.డి.డి.బి రిపోర్టు ఇచ్చారని తెలుగుదేశం నాయకులు, ఆ తర్వాత టిటిడి ఈవో సెప్టెంబర్ 20న, ఆ వెంటనే ముఖ్యమంత్రి చెప్పడంతో దేశమంతటా సంచలనమైంది.
ఒక్క లడ్డులోనే కాదు, ఏదైనా ఎందుకు కల్తీ జరుగుతుందీ అంటే లాభం కోసమే కదా. నాణ్యమైన దానికంటే కల్తీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. తిరుపతికి సరఫరా అవుతున్న సరుకుల్లో నాణ్యత ప్రమాణాలు వుండడం లేదంటే అక్కడి భక్తుల మనోభావాల కంటే తమ లాభాలే ముఖ్యమని కొంతమంది వ్యాపారులు భావించడమే. లాభం వస్తుందంటే దేన్నైనా, ఏం కలిపైనా కల్తీ చేస్తారు. కేంద్ర హోంమంత్రి సిఫారసుతో ఏడు సంవత్సరాలుగా టిటిడి బోర్డు మెంబర్‌గా వున్న ప్రముఖునికి తెలియకుండా ఏదీ కొనుగోలు కాదన్నది జగమెరిగిన సత్యం. బిజెపి అగ్ర నాయకులకు తెలిసిన నిజం. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి ‘టిటిడిలో ఏం జరుగుతుందో బిజెపి వారికి తెలియదా, మీ బిజెపి వారు ఎంతమంది అందులో సభ్యులుగా వున్నారో మీకు తెలియదా’ అని వేస్తున్న ప్రశ్నల అంతరార్ధం సాధారణ భక్తులకు అర్థం కాకపోవచ్చు కానీ, భక్తుల వేషం వేసుకున్న మోసకారులకు బాగా అర్థమవుతుంది.
బిజెపి కూటమిలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న పోకడలు ఆంధ్ర రాష్ట్రంలో మతతత్వాన్ని పెంచి పోషించేందుకు తోడ్పడుతున్నాయి. హిందూత్వకు తానే నిజమైన ప్రతినిధిని అనిపించుకోవడానికి ఆయన యజ్ఞాలు, యాగాల పేరుతో చేస్తున్న హంగామా అంతిమంగా మతోన్మాద శక్తులకే తోడ్పడుతుంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో బిజెపి బలపడకపోవడానికి, మత సామరస్యం కొనసాగడానికి ప్రధాన కారణం మన జీవన విధానంలో భాగంగా వున్న భిన్నత్వంలో ఏకత్వ భావన. పీర్ల పండుగ అయినా, వినాయకచవితి అయినా హిందువులు, ముస్లింలు కలిసి మెలసి చేసుకుంటున్నారంటే అది మన తెలుగువారి సత్ సాంప్రదాయం. పవిత్రమైన అలాంటి ప్రజా ఐక్యతా భావాలకు నష్టం కలిగించే విధంగా ఆయన ప్రవర్తన వుండడం ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రమాదానికి సంకేతం. ఆయన చర్యలు తాత్కలికంగా బిజెపి మన్ననలు పొందు తాయేమోగానీ, అంతిమంగా తన పార్టీని మింగేస్తాయని గుర్తించలేకపోతున్నారు. గతంలో బిజెపి కంటే తీవ్రమైన మత పార్టీగా వ్యవహరించిన శివసేన పరిస్థితి ఇప్పుడు ఏమిటో జనసేన నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకోవాలి. తమ నాయకుడు అనుసరిస్తున్న మతతత్వ విధానాల నుండి బయటకు వచ్చేలా ఆయనపై ఒత్తిడి తేవాలి. ఒకనాడు లౌకిక, ప్రజాస్వామిక భావాలకు కట్టుబడి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలలో భాగస్వామిగా వున్నందునే దేశంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందనే విషయాన్ని తెలుగుదేశం మరచిపోరాదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం నేడు మత రాజకీయాలకు వత్తాసుగా మారుతుండడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. బిజెపి లాంటి మత రాజకీయాలు ప్రజలకు ఎంత నష్టం కలిగిస్తాయో తెలిసి కూడా ఆ కొరివితో తల గోక్కోవాలనుకుంటున్నది. గత ఐదేళ్ళుగా కేంద్రంలో బిజెపి ని బలపరచినా చివరకు తనకు దక్కింది ఏమిటో వైసిపి గుర్తించాలి. బిజెపి మత రాజకీయాల పట్ల ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కి ఏం సాధిస్తారో వైసిపి నేతను ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించాలి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతతత్వాన్ని పెంచి పోషించే చర్యలను ప్రశ్నిస్తున్నది, ప్రతిఘటిస్తున్నది వామపక్షాలు మాత్రమే. రాష్ట్రంలో మతోన్మాద ప్రయత్నాలను నివారించాలి. ప్రజల ఐక్యతను కాపాడటం ప్రజాతంత్ర, లౌకికవాదుల తక్షణ కర్తవ్యం. మత సామరస్యాన్ని కాపాడాలని, వివిధ మతాల విశ్వాసాలకు అనుగుణంగా వ్యక్తిగత మత స్వేచ్ఛను పరిరక్షించాలని, మతాన్ని రాజకీయాల నుండి వేరు చేయాలని వామపక్షాలు కోరుతున్నాయి.
-వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్