వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే …

చారిత్రాత్మక రైతు ఉద్యమం జరిగి మూడు సంవత్సరాలు దాటింది. 13 మాసాల పాటు ఢిల్లీ పరిసరాలు కేంద్రంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటం ముగింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎస్‌కెఎమ్‌ నాయకత్వానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు చట్టాలు రద్దు చేస్తామని, సి2+50 శాతం మద్దతు ధరలు చట్టం చేస్తామని, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రైతు సంఘాలతో చర్చించి నిర్ణయిస్తామని, ఉద్యమం సందర్భంగా అసువులు బాసిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎస్‌కెఎమ్‌ నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చింది. చట్టాలను వెనక్కి తీసుకుంది. మిగతా హామీలను అమలు పరచకుండా మూడు చట్టాల రూపకర్తలతోను, ఆ విధానాల మద్దతుదారులతోనూ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలన్నిటిలో అదానీ, అంబానీ కంపెనీల ఉద్యోగులను సలహాదారులుగా నియమించింది.
మూడవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం కొత్తగా మూడు పథకాలను ప్రకటించింది. ఈ మూడు పథకాల సారాంశం మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా ఉన్నాయి. వాస్తవానికి రద్దయిన చట్టాల కన్నా ఘోరంగా ఉన్నాయి. ఈ స్థితిలో ఎస్‌కెఎమ్‌ నాయకత్వం మరొక దీర్ఘకాల ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నది. ఈ క్రమంలో రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న చర్చలకు సిద్ధమయింది.

డిజిటల్‌ అగ్రికల్చరల్‌ మిషన్‌

డిజిటల్‌ రంగంలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రిటైల్‌ రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొంది. సాంప్రదాయ వ్యవసాయాన్ని సాంకేతిక వ్యవసాయంగా మార్చడం లక్ష్యంగా ప్రకటించింది. మన వ్యవసాయ రంగం ప్రపంచంలో పాడి, జ్యూట్‌ పప్పుధాన్యాలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో, గోధుమ, వరి, వేరుశనగ, కూరగాయలు, పళ్ళు, పత్తి, చెరకు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ…చిన్న కమతాల వల్ల సరిపడా ఆదాయం రావడంలేదని పేర్కొంది. వాతావరణ సస్యరక్షణ, సాగునీటి వ్యవస్థ, అధిక ఎరువుల వాడకం సమస్యలు ఎదుర్కొంటున్నదని డిజిటల్‌ టెక్నాలజీతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొంది. ప్రతి గ్రామంలో బకెటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని అందులో రైతులందరినీ గ్రూప్‌గా ఏర్పరచాలని చెప్పింది. మూడు సంవత్సరాలలో 11 కోట్ల కుటుంబాలను ఈ గ్రూపుల్లో చేర్చడమే లక్ష్యంగా పేర్కొంది. రైతులందరినీ ఒకే గొడుగు కిందకు చేరుస్తుంది. ఈ గొడుగులన్నీ కార్పొరేట్‌ కంపెనీల అజమాయిషీలోనే వుంటాయి. వ్యవసాయ కార్యకలాపాలన్నీ కంపెనీల అజమాయిషీలోనే నిర్వహించాల్సి వుంటుంది. పేద, మధ్య తరగతి రైతాంగం యావత్తూ కంపెనీలకు బంధీలైపోతారు.

రైతులకు అగ్రి స్టాక్‌ కార్డులు ఇవ్వాలని, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పశుపోషణ, భూమి సారాలు, వాతావరణ ఫోర్‌ కాస్ట్‌, భూమిలో తేమ శాతం, క్రిమి కీటకాల ప్రభావం, క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పరిమెంట్స్‌ అన్నీ దీని ద్వారా నిర్వహించాలని పేర్కొన్నది. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు తదితర అగ్రికల్చరల్‌ రోబోట్లను ప్రవేశపెట్టాలని పేర్కొంది. భూములన్నీ ఏకీకృతం చేయడం లక్ష్యంగా ఉంది. ఇవన్నీ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసమే తప్ప వేరుగాదు. రెండు దశాబ్దాలకు పూర్వం కుప్పంలో ఇజ్రాయిల్‌ కంపెనీతో చేసిన ప్రయోగం తప్ప వేరు కాదు.

నేషనల్‌ కోపరేటివ్‌ పాలసీ

రాష్ట్రాల జాబితాలో ఉన్న సహకార రంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకున్నది. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచింది. జాతీయ సహకార పాలసీని ప్రకటించింది. గ్రామాలలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బహుళ ప్రయోజన ప్రాథమిక సహకార సంఘాలుగా మారుస్తుంది.

ఇప్పటివరకు స్వతంత్ర సహకార సంఘాలుగా పని చేస్తున్న పాల సహకార సంఘాలను, మత్స్య సహకార సంఘాలను వీటితో సంధానం చేస్తుంది. వీటిని ప్రతి పంచాయతీ పరిధిలోనూ ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘాలు సామాజిక వ్యవసాయం, పాలు, చేపలు, పరపతి, గోడౌన్లు ఏర్పాటు, ధాన్య సేకరణ, ఎరువులు, విత్తనాలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు, మందుల షాపులు ఏర్పాటు చేస్తాయి. కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మైక్రో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పు తాయి. రోబోట్‌ యంత్రాలు, యంత్రాల హైరింగ్‌ సెంటర్లు, సోలార్‌ పరికరాలు ఏర్పాటు చేస్తాయి. ఈ సహకార సంఘాలలో వ్యవసాయం చేసే రైతులు, పాలు పోసే రైతులు, చేపలు పెంచే రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘంలో ఎంత షేరు ధనం ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. నూతన చట్టం ప్రకారం ఈ సంఘాలలో ఈ మూడు రంగాలతో వ్యాపారం చేసేవారు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నడిపేవారు, పెట్టుబడులు పెట్టేవారు ”ఎ” తరగతి సభ్యులుగా చేరవచ్చు. వీరు 20 శాతం షేరు ధనం కట్టవచ్చు. ఓటింగ్‌ హక్కు కూడా 20 శాతం ఓట్లు ఉంటాయి. వ్యవసాయం చేసే రైతుకు, పాలు పోసే రైతుకు, చేపలు పెంచే రైతుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు మాత్రమే ఉంటుంది. ఈ సొసైటీలన్నీ వ్యాపారుల, ప్రోసెసింగ్‌ యూనిట్‌ యజమానుల, పెట్టుబడిదారులు అయిన అదానీ, అంబానీ, బేయర్‌, డూపాండ్‌, మాన్‌సాంటో, ర్యాలీస్‌ వంటి వాటి వశం అవుతాయి. ఈ సొసైటీలన్నిటికీ వారి ప్రయోజనాలే ప్రధానం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆర్థిక సంస్థలన్నీ ఈ పథకానికి మద్దతుగా ఉంటాయి. ఇప్పటికే కంపెనీ యాక్ట్‌లోకి వెళ్ళిన విశాఖ డెయిరీ ఎలా నడుస్తున్నదో చూస్తూనే ఉన్నాం.

బహుళ ప్రయోజన సహకార సంఘాలు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం సంస్థలకు అప్పగించింది. నాబార్డ్‌ ఐదేళ్లలో 70 వేల సంఘాలను ఏర్పాటు చేసి అగ్రి క్లినిక్స్‌, అగ్రి బిజినెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయాలి. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఇప్పుడున్న డెయిరీలను 46 వేల సొసైటీలతో పాటు మరొక 56 వేల సొసైటీలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో డెయిరీ ప్రాజెక్టును నెలకొల్పాలి. జాతీయ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారు 11,500 సొసైటీలు ఏర్పాటు చేయాలి.

నేషనల్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌

ఏఎంసి చట్టానికి కేంద్రం 12 సవరణలు చేసింది. సవరణలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు, ఎగుమతిదారులకు, ప్రాసెసింగ్‌ కంపెనీల యజమానుల ప్రయోజనాల కోసం చేసినవే. గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు, ప్రైవేట్‌ మార్కెట్లకు గుర్తింపు ఇచ్చింది. అన్ని మార్కెట్లకు ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాÛరాలు ఉండాలి. మార్కెట్‌ ఫీజులు, మార్కెట్‌ రుసుము, కమిషన్‌ చార్జీలు హేతుబద్ధం చేసింది. ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలకు రైతులు నేరుగా వెళితే ఫీజు మినహాయింపు. ఇతర రాష్ట్రాల నుండి ప్రాసెసింగ్‌కు తెచ్చిన సరుకులు ఫీజు మినహాయింపు. యార్డుల వెలుపల పండ్ల వ్యాపారాలు నిషేధించింది. దేశంలో ఉన్న 7057 రెగ్యులేటర్‌ మార్కెట్లను, 22 వేల గ్రామీణ అగ్రికల్చర్‌ మార్కెట్లను ఈనామ్‌ మార్కెట్లుగా మారుస్తుంది. ఏఎంసీల ద్వారానూ, ప్రైవేట్‌ మార్కెట్ల ద్వారానూ, ఎఫ్‌.పి.ఓలు, సొసైటీల ద్వారాను ముందస్తు అగ్రిమెంట్ల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్ళు చేయవచ్చు.

మద్దతు ధరలు గానీ, మద్దతు ధరలకు కొనుగోలు చేయడం గాని, ధరలు పడిపోతే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు ఉండవు. పైగా మద్దతు ధరల కోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్‌ చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. ఇప్పటికే ధరల స్థిరీకరణ విధానం ఎత్తివేసింది. అన్ని రాష్ట్రాలు ఈ విధానాలు అమలు పరచాలని చెప్పింది. 2003లో ఈనామ్‌ మార్కెట్ల చట్టం చేసింది. ఈనామ్‌ మార్కెట్‌ వల్ల ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతూ ప్రయోజనం పొందిన సందర్భం లేదు. ఇప్పటికే 2 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు అదానికి 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న సిడబ్ల్యుసి గోడౌన్‌ ప్రస్తుతం

చందనా బ్రదర్స్‌ గోడౌన్‌గా ఉంది.

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎప్పుడూ ఇచ్చిన హామీ అమలుపరిచిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికలలో సి2+50 శాతం అమలు పరుస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడివిట్‌ దాఖలు చేసింది. 2021లో ఎస్‌కెఎమ్‌ నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు పరచకుండా ఎగవేసింది. విద్యుత్‌ చట్టాన్ని యథాతథంగా అమలు చేసేందుకు పూనుకున్నది. కార్పొరేట్‌ సంస్థలకు 16 లక్షల కోట్లు బకాయిలు రద్దు చేసిన ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని కబుర్లు చెబుతున్నది. రద్దు చేసిన చట్టాల కన్నా ఘోరమైన పథకాలను నేడు ముందుకు తెచ్చింది. పైగా ఏప్రిల్‌ ఒకటి నుండి 4 కార్మిక కోడ్‌లను అమలు పరుస్తానని ప్రకటించింది.
ఫిబ్రవరి 14న చర్చలు సజావుగా జరగాలన్నా, సి2+50 మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం చేయాలన్నా, రుణ మాఫీ చట్టం సాధించాలన్నా, రైతులకు వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ చట్టం రావాలన్నా పోరాటాన్ని తీవ్రం చేయాల్సి ఉంది. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులతోపాటు అన్ని ట్రేడ్‌ యూనియన్లను కలుపుకొని జనవరి 26న ర్యాలీలను జయప్రదం చేయాల్సి ఉంది.

వ్యాసకర్త రైతు సంఘం సీనియర్‌ నాయకుడు వై. కేశవరావు

➡️