ట్రైలర్‌

Apr 17,2024 05:40 #Articles, #edit page, #modi

బార్బర్‌ షాపులోకి అడుగు పెడుతు న్నప్పుడు ఆ షాపు పక్కనే ఉన్న కొబ్బరి బొండాల బండీ అబ్బాయి ఎందుకలా జాలిగా, అదోలా నావైపు చూశాడో ముందు నాకు అర్ధం కాలేదు. షేవింగ్‌ అయిపోయేసరికి మాత్రం బాగా అర్ధం అయింది. పనసకాయ చెక్కినట్టు నా ముఖం అంతా చేక్కేశాడు మా హైటెక్‌ బార్బర్‌ షాపు ఓనర్‌ కం వర్కర్‌. అక్కడితో ఆగేడా ! ఆ గాట్ల మీద దట్టంగా ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ పులిమేడు. మంటెక్కిపోయి ”అబ్బ !” అన్నాను. హైటెక్‌ రేంజిలో డబ్బులు పుచ్చుకున్నాడు. అక్కడితో ఊరుకుంటే బాగుండును. ” సార్‌ ! ఎలాగుంది సార్‌ మా షాప్‌లో సర్వీస్‌ ?” అనడిగేడు. నేనేదో చెప్పబోయేలోపే మళ్ళీ అందుకుని ”సార్‌ ! ఇది ట్రైలర్‌ మాత్రమే సార్‌ ! ఈ మారు వచ్చినప్పుడు ఫుల్‌గా సినిమా చూపిస్తా సార్‌ ! తప్పకుండా రండి!” అన్నాడు. ”మళ్ళీ నీ షాపుకి బుద్ధున్న వాడెవడన్నా వస్తాడా ?” అని మనస్సులో అనుకుని పైకి మాత్రం ఏడుపు లాంటి నవ్వు ముఖం మీదకి తెచ్చుకుని ”తప్పకుండా ” అని చెప్పి బైటపడ్డాను.
ఎండ పొద్దెక్కిందో ఏవోఁ. కాస్తంత చెమట పట్టి ముఖం అంతా మంటెక్కిపోయింది. ఇంటికి రాగానే గబగబా స్నానం చేసేశాను. అయినా ఇంకా మంటగానే ఉంది. అప్పుడు సతీమణి వేడివేడిగా టిఫిన్‌ ప్లేట్‌ తెచ్చి నా ముందు పెట్టి గబుక్కున తిరిగి వంట గదిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్లేట్‌లో ఘన, ద్రవ పదార్ధాలకు మధ్యస్తంగా మూడో భౌతిక స్థితిలో ఉంది ఏదో పదార్ధం. ధైర్యం చేసి నోట్లో పెట్టుకున్నా. గొంతు దిగనని మొరాయించింది. అప్పుడు వంటింల్లోంచి తిరిగి వచ్చి, గరిటె ఉన్న చేతిని నడుంమీద వయ్యారంగా ఆన్చి, ”ఎలా ఉంది ?” అనడిగినట్టు కళ్ళెగరేసింది. నేనేం చెప్పాలి ? అది స్వీటో, హాటో తెలియడం లేదు. ఒకవేళ అది స్వీటే గనుక అయితే, అందులో ఉప్పు ఎక్కువైన ఫీలింగ్‌ నాకు ఎందుకు కలుగుతోంది? తెలియడం లేదు? ఏదో ఒకటి తొందరపడి చెప్పానే అనుకోండి, నా కుటుంబ జీవితం మీద పడనున్న తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు ఏ విధంగా ఉండవచ్చు? ఇలా నాలో నేను మధన పడుతూ, ఆ పదార్ధాన్ని తినలేక, మానలేక గింజుకుంటున్నప్పుడు ఆవిడే అంది: ” చాలా రోజులుగా నా పాత వంటలు తిని తిని బోరెత్తిపోయి వుంటారని, యూ ట్యూబ్‌ చూసి మరీ ఈ కొత్తరకం గుజరాతీ వంటకం చేసేను. దీనిపేరు ధోక్‌లా. ఇప్పుడు మీరేం చెప్పనక్కర్లేదు. ఇది ట్రైలర్‌ మాత్రమే. అసలు వంట మును ముందు ఉంటుంది లెండి” అని హామీ ఇచ్చేసింది. నెత్తిమీద పడిన పిడుగును తట్టుకునే ప్రయత్నం చేస్తూనే నెమ్మదిగా అడిగేను ” దీని పేరేమిటి?” మళ్ళీ చెప్పింది. ” ఇది గుజరాతీ వంటకం. దీని పేరు ధోకలా” అంది ఆవిడ. నాకెందుకో అది ధోకా అన్నట్టు అనిపించింది. ఇంత చెప్పింది కాని అది స్వీటో హాటో మాత్రం చెప్పలేదు, నాకు తెలియనూ లేదు.
ఇంతలో హోప్‌ ఎగ్సామ్స్‌ రాసిన మా పుత్రరత్నం వచ్చేడు. వస్తూనే చేతిలో ఉన్న రిపోర్టు కాగితాన్ని నాకిచ్చేడు. ”ఎలాగుంది నా పెర్ఫార్మెన్స్‌ ?” అన్నట్టు కళ్ళెగరేసి లోపలికి వెళ్ళేడు. ఎంత వెతికినా అందులో ఒక సబ్జెక్టులోనూ పాసుమార్కులు కూడా కనపడడం లేదు. నాకు అరికాలి నుండీ కాలిపోయింది. గబగబా లోపలికి వెళ్ళేను. అక్కడ విలాసంగా మంచం మీద పడుక్కుని సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు వాడు. ఆ సెల్‌ఫోన్‌ని వాడి నుంచి లాక్కున్నాను. ”సీరియస్‌గా చాటింగ్‌ చేస్తూంటే మధ్యలో ఏమిటి నాన్నా నీ గొడవ ?” అన్నట్టు చూసేడు వాడు. ”ఏమిట్రా? ఇంత దరిద్రంగా ఉన్నాయేమిట్రా నీ మార్కులు?” అని అడిగాను. ”అబ్బ! అది ఒట్టి ట్రైలర్‌ మాత్రమే నాన్నా, రేపు ఫైనల్‌ ఎగ్సామ్‌లో చూపిస్తా అసలు సంగతి” అన్నాడు వాడు ఏ మాత్రమూ జంకు లేకుండా. ”ఏవిఁట్రా నువ్వు చూపించేది ? ఏడాదిపాటూ చదువు అయిపోయిన తర్వాత రాసిన పరీక్షలు రా ఇవి. కొద్ది వారాల తర్వాత రాసే ఫైనల్‌లో నీ పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉండబోతోందో చెప్పే హోప్‌ పరీక్షలు రా. దీనిలోనే నీ మార్కులు ఇలా తగలడ్డాయంటే ఇక ఫైనల్‌ గురించి హోప్‌ ఏముంటుందిరా ?” అని గట్టిగా మందలిచేను.
ఇదిగో ! ఆ టైమ్‌కి వచ్చేడు మా కొలీగ్‌ హనుమాన్లు. వస్తూనే, ” ఏంటోరు రామారావ్‌! మాంఛి హుషారుమీద ఉన్నట్టున్నావే!” అన్నాడు. నా మంట వీడికి హుషారుగా కనిపించిందా ? అని లోపల్లోపలే గొణుక్కుని, ” రా హనుమాన్లూ” అని ముక్తసరిగా ఆహ్వానించేను. కూర్చోగానే మొదలెట్టేడు ”నిన్న రాత్రి మోడీ ఇంటర్వ్యూ విన్నావా ? చాలా గొప్పగా చెప్పేడు సుమా, ఏవైఁనా గాని, గొప్ప మాటల మాంత్రికుడు ” అన్నాడు. నేనేదో అడగబోయే లోపే మళ్ళీ అందుకున్నాడు ”పదేళ్ళలో ఏం చేసేడో చెప్పడానికి ప్రయత్నించలేదు చూడూ, అదీ నాకు మహ బాగా నచ్చింది. గొప్పలు చెప్పుకోవడం బొత్తిగా మోడీకి ఇష్టం లేదు సుమా. ఎంత నమ్రత! ” అన్నాడు. ” ఏం చేసేడని చెప్పుకోడానికి? ” అని నేననబోయేను. మళ్ళీ అందుకున్నాడు. ” ఒక్క ముక్కలో చెప్పేసేడయ్యా ! ఇది ట్రైలర్‌ మాత్రమే అని! అసలు సినిమా అంతా ముందు ముందు చూపిస్తానన్నాడు” అన్నాడు హనుమాన్లు ఒక తన్మయత్వంలో.
నాకు ఇంక కోపం ఆగలేదు. ”చాల్చాల్లేవయ్యా! మనం ఓట్లేసేది ఐదేళ్ళ పదవీ కాలానికి. ఐదేళ్ళూ పూర్తవగానే ఆ పాలన సవ్యంగా ఉందీ లేదా అన్నది తీర్పు చెప్పేస్తాం. పదవిలోకి కొత్తగా వచ్చినవాడికి మూడు నెలలో, ఆర్నెలలో వ్యవధి ఇస్తాం. అదే ట్రయల్‌ అంతే కాని ఏకంగా పదేళ్ళపాటు అధికారం వెలగబెట్టి దేశాన్ని, మరీ ముఖ్యంగా మన రాష్ట్రాన్ని ఇంతగా సంకనాకించిన తర్వాత ఇదంతా ట్రైలర్‌ మాత్రమే అని అడ్డగోలుగా మాట్లాడ్డానికి అతగాడికి నోరెలా వచ్చింది? అతగాడు సరే, హోప్‌లెస్‌ అని తేలిపోయింది. నీ బుద్ధి ఏమైంది? నీ ఉద్యోగానికి ప్రొబేషన్‌ పీరియడ్‌ ఆర్నెల్లు. ఆ పీరియడ్‌లో నీ పని బాగులేకపోతే పీకి పడేస్తారు. అంతే కాని పదేళ్ళ పాటు ప్రొబేషన్‌ ఎవరన్నా ఇస్తారా? మళ్ళీ ట్రైలర్‌ అన్న మాట వినపడిందో ! జాగ్రత్త !” అన్నాను. దెబ్బకి హనుమాన్లు లంఘించేడు.
మా వాడు సెల్‌ఫోన్‌ పక్కన పెట్టి పుస్తకాలు ముందేసుకుని కూచున్నాడని, నా సతీమణి గుజరాతీ వంటకాల ఊసెత్తడం మానేసి గోంగూర పచ్చడి తయారీలో పడిందని వేరే చెప్పాలా?

సుబ్రమణ్యం

➡️