ప్రభుత్వ ఉత్తర్వు (జిఓ)ల సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్ (జిఓఐఆర్) వెబ్ పోర్టల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినది. ఈ నిర్ణయంతో కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. జిఓఐఆర్ పోర్టల్ కొత్తదేం కాదు. ఈ వెబ్ పోర్టల్ 2008లో మొట్టమొదట ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు వరకు వివిధ అంశాలపై జిఓలను సంపాదించడం ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. ప్రభుత్వ ఉత్తర్వులు అమలులోకి వచ్చిన నెలల తరువాత కూడా సామాన్యులకు అవి అందుబాటులోకి వచ్చేవి కావు. జిఓఐఆర్ వెబ్‌పోర్టల్ ఆవిష్కరణతో ఆ ఇబ్బందులు కొంత మేర తప్పాయి. రాజశేఖరరెడ్డి అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాధి నేతలు కూడా దీనిని కొనసాగించారు. అయితే, జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. 2021 ఆగస్టు 15 నుండి జిఓఐఆర్ వెబ్ పోర్టల్‌ను నిలిపి వేసింది. దీంతో ప్రజలతో సంబంధం ఉన్న అనేక ప్రభుత్వ నిర్ణయాలు గుట్టుచప్పుడు కాకుండా అమలులోకి రావడం ప్రారంభమైంది. దీనిపై ప్రజానీకంతో పాటు పలు తరగతుల ఉద్యోగుల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చినా ఫలితం దాదాపు శూన్యమే! తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జిఓఐఆర్ వెబ్‌పోర్టల్‌ను నేటి (గురువారం) నుండే ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించింది.
అయితే, జిఓఐఆర్ వెబ్‌పోర్టల్ పునరుద్ధరణతోనే పాలనలో నూరు శాతం పారదర్శకత వచ్చేసినట్టు, జవాబుదారీతనానికి పెద్దపీట వేసినట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. నిజానికి ఇది ఆ దిశలో ఒక అడుగు మాత్రమే! గతంలో జిఓఐఆర్ పోర్టల్ ఉన్నప్పటికీ ‘కాన్ఫిడెన్షియల్’ జిఓలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం కొంత కాలంపాటు ఈ పోర్టల్‌లోనే ఖాళీ పేజీలను ఉంచింది. అందువల్ల పోర్టల్ పునరుద్ధరణతోనే పారదర్శకత వచ్చేసినట్లు కాదు. దానిలో అన్ని రకాల జిఓలను ఏమాత్రం దాపరికం లేకుండా ప్రభుత్వం విడుదల చేయగలగాలి. అప్పడు కూడా పారదర్శకత వచ్చినట్టు కాదు. ‘పాలనలో పారదర్శకత’ అంటే మరింత విశాలమైన అర్ధంతో కూడుకున్నది! పారదర్శకత సుపరిపాలన యొక్క ప్రధాన సూత్రం. పారదర్శకత అంటే కేవలం సమాచారాన్ని పంచుకోవడం మాత్రమే కాదు. మరింత ‘ఓపెన్’గా వ్యవహరించడం! అంటే, తీసుకున్న నిర్ణయాలను తెలియచేయడం మాత్రమే కాదు! నిర్ణయాలు తీసుకోక ముందే చర్చించడం. నిర్ణయాలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ ప్రతిపాదన మీద ఎవరెవరు ఎలా స్పందించారు? భవిష్యత్ పరిణామాలేంటి అన్న అంశాలను కూడా అందుబాటులోకి ఉంచడం! కచ్చితమైన సమాచారాన్ని సకాలంలో, సంపూర్ణంగా, బాధ్యులైన వారి ద్వారా ప్రజలకు అందించడం కూడా సుపరిపాలనలో భాగమే! అప్పుడే ఆ సమాచారాన్ని పౌరసమాజం సమర్ధవంతంగా వినియోగించగలుగుతుంది. ఒక్క జిఓ లకే కాదు. అన్ని రకాల ప్రభుత్వ నిర్ణయాలకు, కార్యక్రమాలకూ ఇది వర్తిస్తుంది.
అంతర్రాష్ట సమస్యలు, కేంద్రం నుండి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన మొదలు రాజధాని నిర్మాణం వంటి అంశాలను అఖిలపక్షంలో చర్చించి అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల ఉమ్మడి అభిప్రాయాన్ని సాధించడం కూడా పారదర్శక పాలనలో భాగమే. ఈ విషయంలో కోవిడ్, వరదల వంటి వాటితో పాటు ఇటీవల వయనాడ్ విలరు వరకు అనేక సందర్భాల్లో కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఆదర్శం. విశాఖలో భూ కబ్జాలపై గతంలో టిడిపి తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని (సిట్) నియమించాయి కాని వాటి నివేదికలను బహిర్గతం చేయలేదు. ఇప్పటికైనా వాటిని వెల్లడించాలి. కార్మికుల ప్రాణాలు బలిగొంటున్న ప్రమాదాలు, వాటిని అరికట్టడానికి వివిధ కమిటీలు చేసిన సిఫార్సులు లోకానికి తెలియాలి. ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి అంశం (దేశ భద్రతకు ముప్పు ఉంటే తప్ప) ప్రజల ముందుకు రావాలి. విస్తృతంగా చర్చ జరగాలి. అలా జరిగేట్టు చూసే బాధ్యత ప్రభుత్వానిదే! పారదర్శకతకు పట్టం, జవాబుదారీతనానికి పెద్ద పీట అప్పుడే!
