ఆర్.జి.కర్ కేసులో బాధితురాలి కొత్త పేరు తిలోత్తమ. ఆమె ఎదుర్కొన్న ఆటవిక అకృత్యంపై వెల్లువెత్తిన నిరసనల గర్భంలోంచి ఈ కొత్త పేరు పుట్టుకొచ్చింది. ఆ పేరుకు తగ్గట్టుగానే అక్కడి వారందరి లోకెల్లా అత్యుత్తమరాలు. ఈ కేసులో హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ చేసిన సంఘీభావ పోరాటాలు ఒక్క బెంగాల్‌ను మాత్రమే కాక దేశాన్నే కదిలించివేశాయి. అనేక ప్రాంతాలలో పౌర సమాజం వీధుల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల సంఘం, వైద్యుల ఉమ్మడి వేదిక ఈ పోరాటానికి అగ్రభాగాన నిలిచాయి. వామపక్ష ప్రజా సంఘాలు న్యాయం కోసం నిరంతరం శాంతియుతంగా తిరుగులేని నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. వామపక్షానికి ఉన్న బలమైన మద్దతు వల్ల నిరసన స్వరాలు పట్టణాలు మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా మారు మూల పల్లెల దాకా ప్రతిధ్వనించాయి. సంఘీభావంగా జనం వేలాదిగా తరలి వచ్చారు. వాస్తవానికి నిరసనల స్వరాలు రోజురోజుకు మరింత శక్తివంతంగా వినిపిస్తున్నాయి. నిరసనలను చాలా ప్రమాదకరమైనవిగా చిత్రించిన టిఎంసి ప్రభుత్వం వెనక్కి తగ్గి, కొన్ని డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది. పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతోంది.
వాస్తవానికి, భారతదేశంలో లైంగిక దాడులు, లింగ, కుల ఆధారిత అనాగరిక చర్యల మూలాలు పుట్టుక నుండి మరణం వరకు స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అసమానతల్లోనే ఉన్నాయి.
అత్యాచారాల్ని సమర్ధించే సంస్కృతులు
లైంగిక హింసను సమర్ధించడం లేక అల్పమైన విషయంగా భావించడం లేదా బుకాయించడాన్ని అత్యాచారాన్ని సమర్ధించే సంస్కృతులు అంటాం. అత్యాచార బాధితురాలికి న్యాయం నిరాకరించే వాతావరణాన్ని సృష్టించడమే ఈ అత్యాచారాల సంస్కృతి అసలు ఉద్దేశం. మీడియాను వినియోగించడంతో పాటు అనేక సాధనాల ద్వారా ఈ సంస్కృతులు న్యాయ ప్రక్రియలకు విఘాతం కలిగిస్తాయి. లైంగిక హింసకు పాల్పడిన నేరస్తుడ్ని నిందించడానికి బదులుగా లైంగిక హింసను ఎదుర్కొంటున్న మహిళను బాధ్యురాలిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తాయి. భారతదేశంలో నేరస్తుని లేదా బాధితురాలి కుల, మతాల గుర్తింపుకు అనుసంధానం చేయబడిన అదనపు అత్యాచార సంస్కృతుల కోణాలున్నాయి. ఇప్పటికే భారతీయ సమాజంలో ఉనికిలో ఉన్న నిచ్చెనమెట్ల లాంటి అమానుషమైన కుల వ్యవస్థ, మహిళలకు వ్యతిరేకంగా ఉన్న మనువాద భావజాలాలు, సంస్కృతులు ఇలాంటి అత్యాచార సంస్కృతులకు మరింత ఊతమిస్తున్నాయి. ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకున్న మతోన్మాద అధిక సంఖ్యాక ఆధిపత్యవాదం (కమ్యూనల్ మెజారిటేరియ నిజం), అన్ని వర్గాల మహిళలు ముఖ్యంగా దళిత మహిళలపై ప్రభావం చూపే మనువాద ఆధిపత్య భావజాలాలు మహిళలపై హింసను సమర్ధిస్తాయి. బిజెపి పాలనలో ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల అండతో బిజెపి-ఆరెస్సెస్ ఇటువంటి ఆవరణ వ్యవస్థను (ఎకో సిస్టం) ప్రోత్సహిస్తుంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో, హింసకు పాల్పడిన నేరస్తుల్ని, వారి కుల, మతాల గుర్తింపు ఆధారంగా రక్షించేందుకు ప్రభుత్వ అధికారాన్ని వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది న్యాయ నిబంధన కాదు, న్యాయ చట్రం కూడా కాదు. కానీ, ఎవరు శిక్షను అనుభవించాలి, ఎవరు స్వేచ్ఛగా తిరగాలి అనేది నిర్ణయించేది నేరస్తుని లేక బాధితురాలి కుల, మతాల గుర్తింపు మాత్రమే. ఇలాంటి కేసుల్లో కులం, జాతికి నేరాలను అనుసంధానం చేసే అవకాశాన్ని అత్యాచార సమర్థన సంస్కృతులు కల్పిస్తాయి.
ఆర్.జి.కర్ కేసులో వ్యవస్థాగత సమస్యలు
బెంగాల్‌లో ఈ దారుణ అకృత్యం తృణమూల్ కాంగ్రెస్ పాలనలో జరిగింది. ప్రభుత్వం, పౌర వాలంటీర్లుగా పిలువబడే వారి నియామక విధానం, ప్రిన్సిపాల్‌ను రక్షించడంలో ప్రభుత్వ, ఆరోగ్య శాఖామంత్రి పాత్ర, ఈ కేసు లేకుండా చేసే ప్రయత్నంలో ప్రిన్సిపాల్, పోలీసుల పాత్ర, పాలనా వ్యవహారంలో యధేచ్ఛగా అవినీతి, భయంకర నేర చరితులకు-అవినీతిలో భాగస్వాములైన వారికి మధ్య సంబంధాలు, ఆసుపత్రి సెమినార్ గదితో పాటు అన్ని గదుల్లోకి పౌర వాలంటీర్ ప్రవేశానికి అవకాశం కల్పించిన బంధానికి సంబంధించిన ప్రశ్నలు, ఆసుపత్రిలో వైద్యాధికారులు, శ్రామిక మహిళల రక్షణలో లోపం లాంటివి ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మించిన సమస్యలివి. ప్రభుత్వం, పోలీస్, ప్రభుత్వ విధానాలతో ఈ కేసు ముడివడి ఉంది కాబట్టి ఇది వ్యవస్థాగత సమస్యే.
అత్యాచార సంస్కృతుల విస్తరణ
ఒక మహిళా ఎంపీ తప్పుడు వార్తల్ని ఖండించే పేరుతో బాధితురాలి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వున్న వివరాలు చెప్పడం సిగ్గుచేటు. ప్రైవేట్ అవయవాల బరువు, కనుగొనబడిన లేక కనుగొనబడని వీర్యం వివరాలను చర్చించడానికి, అది గ్యాంగ్ రేప్ అనే అభియోగాలను కొట్టిపారేసే బాధ్యత ఆమె తీసుకున్నారు. బాధితురాలి ఎముక విరిగిందా లేదా అనే చర్చను మొదలుపెట్టి, పోస్ట్‌మార్టంలో అది అబద్దంగా తేలిందని ప్రకటించారు. భయంకర అత్యాచార నేర స్వభావం నుండి దృష్టిని మరల్చడం కోసం బాధితురాలిపై, ఆమె శరీరంపై ఇటువంటి చర్చను ప్రారంభించడానికి ఇలాంటి వివరాలు మాట్లాడుతున్నారు. అంటే దీనర్థం ఏమిటంటే… అత్యాచారంతో పాటు ఎముకలు విరిగినట్టు రుజువు కాకుంటే, అత్యాచారం ‘సాధారణంగానే’ జరిగినట్టని అత్యాచారాన్ని సాధారణీకరణ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలకు సమాధానంగా గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివి ఎన్నో చేశాయని చెప్తారు.
మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారి తల్లులు, అక్కాచెల్లెళ్ళ చిత్రాల్ని మరోలా మార్చి వారి తలుపులకు అంటిస్తామని టి.ఎం.సి కౌన్సిలర్ ఒకరు అన్నారు. ఇది కూడా మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింసను సమర్ధించే అత్యాచార సంస్కృతులకు ఉదాహరణ. ఒక మహిళపై అత్యాచారం జరిగితే, నీ నాయకుడ్ని సమర్ధించాల్సి వచ్చినప్పుడు, ఆ నేరం అల్పమైనదిగా మారిపోతుంది. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడంలో బెంగాల్ ప్రభుత్వం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ కౌన్సిలర్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అత్యాచార సంస్కృతిలోని మరొక కోణాన్ని తెలియజేస్తున్నాయి.
అత్యాచార కేసుల ‘రాజకీయీకరణ’
మహిళలపై జరుగుతున్న నేరాల్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని, ఒకరినొకరు ఆరోపణలు చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ‘అత్యాచారాన్ని’ ఒక అంశంగా ఉపయోగించుకుంటున్నాయి. అత్యాచారాలను రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాలి. లేదా అత్యాచార కేసుల్లో నిందితుల్ని రక్షించడం వంటి చర్యలకు బాధ్యత వహించాలి. పితృస్వామ్య, కుల ఆధారిత వ్యవస్థ ఉన్న సమాజంలో పెత్తనం చెలాయించడం పురుషుల హక్కు అనే సంస్కృతి రాజకీయ అంశంగా మారింది. వరకట్న హత్యలు, గృహ హింస, చిన్నారులపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఇవన్నీ ‘రాజకీయ రహిత, మృదువైన సమస్యలు’ అంటూ మహిళల విభాగంలో పడేశారు. మహిళల పోరాటాలు, బాధితలు కనబరచిన ధైర్యం ఆ విభాగం తలుపులు బద్దలు కొట్టాయి.
న్యాయం కోసం జరుగుతున్న మన పోరాటాలు అవసరమైన ‘రాజకీయీకరణకు’, ‘సంకుచిత పార్టీ రాజకీయాలకు’ మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. ఈ తేడాను గుర్తించడం ఎందుకు అవసరమో చెప్పడానికి బెంగాల్ మంచి ఉదాహరణ. డాక్టర్లు స్వయంగా నాయకత్వం వహించిన భారీ నిరసన ఉద్యమాలను బలహీనపర్చి, తక్కువ చేయడానికి బెంగాల్‌లో టి.ఎం.సి, బి.జె.పి లు ప్రయత్నించాయి. ఛాత్ర సమాజ్ వేదికను ఉపయోగించడం ద్వారా బి.జె.పి ఈ సమస్యను నియంత్రించే ప్రయత్నం చేసింది. ఈ ఛాత్ర సమాజ్ వేదిక, టి.ఎం.సి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హింసాత్మక ప్రదర్శనను నిర్వహించింది. పోలీసుల్ని రెచ్చగొట్టడం, ఎత్తులు పైయెత్తులతో బిజెపి, టీఎంసీల మధ్య సంకుచిత రాజకీయ పోరాటంగా మారింది. బిజెపి తన దృష్టిని అత్యాచార బాధితురాలిపై పెట్టడానికి బదులుగా దృష్టిని తన వైపు మళ్లించుకునేలా బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి భిన్నంగా లెఫ్ట్ ఫ్రంట్ భారీగా సమీకరణలు నిర్వహించి, నిరసనలకు అవసరమైన బలాన్ని చేకూర్చింది. లెఫ్ట్‌ఫ్రంట్ ఇలా చేయడం ద్వారా ‘మహిళల ఏకైక రాజకీయేతర’ విభాగాన్ని బద్దలు కొట్టడానికి సహాయపడింది. ఈ సందర్భంలో ఉద్యమ నాయకుల అంటే డాక్టర్ల నిర్ణయాలను గౌరవిస్తూ, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ ఉద్యమ డిమాండ్లను ఎలా సమర్ధించిందో చూపించింది.
బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్ స్వతంత్ర సమీకరణల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమీకరణల్ని అప్రతిష్టపాలు చెయ్యాడానికి టి.ఎం.సి అన్ని రకాల ట్రిక్కులను ప్రయోగించింది. అది బాధితకు సంఘీభావం తెలియ చేయడాన్ని కూడా నేరగ్రస్తం చేసేందుకు ప్రయత్నించింది. అంతేగాక సంఘీభావానికి ‘రాజకీయ’ ఉద్దేశ్యాలను ఆపాదించడం కూడా న్యాయాన్ని కోరుకునే స్వరాలు వినపడకుండా చేయాలని చూసింది. ఇది బాధితురాలికి, ఆమె కుటుంబానికి సామాజిక మద్దతు లేకుండా ఒంటరిని చేస్తుంది. నేరస్తుడు మాత్రం లబ్ధి పొందుతాడు. ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చెయ్యాడానికి టి.ఎం.సి అవలంబిస్తున్న ఈ ధోరణిని మనం తిరస్కరించాలి.
కొత్త చట్టం నాటకం
లైంగిక నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పోలీసులు, సమాజంపై ఉంది. ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత ఏర్పాటైన వర్మ కమిషన్ చట్టంలో మార్పులతో పాటు కొన్ని సిఫార్సులు చేసింది. వాటిలో కొన్ని అమలులోకి వచ్చాయి. దీనిపై మనకు స్పష్టత ఉండాలి. కేవలం చట్టంలో లోపం, బలహీనత వల్లే ఆర్.జి.కర్ నేరం జరిగిందనుకోలేం. అయినా బెంగాల్ ముఖ్యమంత్రి ఆదారాబాదరాగా ఒక చట్టాన్ని తెస్తూ సరికొత్త నాటకం ఆడారు. ఇది దృష్టిని మళ్లించేందుకు అనుసరించిన ఎత్తుగడ. ప్రతిపాదిత చట్టం లోపభూయిష్టమైనది. వాస్తవానికి ఇది, వర్మ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా వుంది. ఇలాంటి చర్యలు అత్యాచారానికి, హత్యకు గురైన బాధితురాలికి న్యాయం జరగడానికి ఏ రకంగానూ సహాయపడవు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం తమ జవాబుదారీతనాన్ని అంగీకరించేలా ఒత్తిడి తేవాలి.
వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూర్ సభ్యురాలు బృందాకరత్