ట్రంప్‌ సుంకాల దూకుడు

మనం తీసుకునే మేథోపరమైన వైఖరి సరైనది అయితే సరిపోదు. అటువంటి వైఖరి తీసుకోవడానికి సరైన కారణాలు కూడా చూపాలి. ఇప్పుడు ట్రంప్‌ చాలా దూకుడుగా ఎడా పెడా సుంకాలు విధించడాన్ని దాదాపు ప్రపంచం అంతా ఖండిస్తోంది. ఈ ఖండన సరైనదే అయినా చాలా మంది పొరపాటు కారణాలతో ట్రంప్‌ విధానాన్ని ఖండిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంపై ఎటువంటి ఆంక్షలూ ఉండకూడదన్న దృక్పధం నుండి ట్రంప్‌ను ఖండిస్తున్నవారు అత్యధికంగా ఉన్నారు. అటువంటి స్వేచ్ఛావాణిజ్య సూత్రానికి విరుద్ధంగా ట్రంప్‌ చాలా మూర్ఖంగా, అసహ్యంగా వ్యవహరిస్తున్నాడని వారంతా అతడిని తిట్టిపోస్తున్నారు. ఒక విధంగా ట్రంప్‌ విమర్శకుల్లో చాలా ఎక్కువమంది డేవిడ్‌ రికార్డో కాలం నుండీ మనకు వారసత్వంగా అందించిన స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని వంటపట్టించుకుని ఆ ప్రాతిపదికన ట్రంప్‌ను విమర్శిస్తున్నారు. ఈ వాదన మాత్రం పూర్తిగా తప్పు.
స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం ‘సే’ ప్రతిపాదించిన సూత్రం మీద ఆధారపడి రూపొందింది. ఆ సూత్రం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ డిమాండ్‌కి కొరత ఉండదు. అంటే ఎంత విలువగల సరుకు మార్కెట్లోకి వస్తుందో అంత కొనుగోలు శక్తి, సరుకుల అవసరం వినియోగదారుల వద్ద ఉంటాయి అని ఆ సూత్రం చెప్తుంది. ఇది బొత్తిగా అర్ధం లేని సూత్రం అని చెప్పడానికి పెద్ద వివరణ ఏమీ అవసరం లేదు. పెట్టుబడిదారీ మార్కెట్‌లో మొత్తంగా చూసుకున్నప్పుడు సరుకుల సరఫరా కన్నా వాటి వినిమయం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అందుకే పెట్టుబడిదారుల నడుమ తీవ్రమైన పోటీ నెలకొని వుంటుంది. స్వేచ్ఛా వ్యాపారం గాని, సుంకాల విధింపు ద్వారా దానిని నియంత్రించడం కాని మార్కెట్‌లో ఎక్కువ భాగం కొన్ని దేశాలు మాత్రం చేజిక్కించుకోడానికే అమలౌతాయి. కొన్ని దేశాలకు ఎక్కువ మార్కెట్‌ వాటా దక్కడం అంటే మరికొన్ని దేశాలకు దక్కవలసిన వాటా దక్కకుండా పోవడం అన్నమాట. స్వేచ్ఛా వ్యాపారం అనేది అన్ని దేశాలకూ ఒకే మోతాదులో లాభదాయకంగా ఉండదు. తన దేశానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు స్వేచ్ఛా వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటూ ట్రంప్‌ను విమర్శించడం అంటే తప్పుడు కారణాల ప్రాతిపదికన విమర్శించడమే అవుతుంది.

అభ్యుదయకర స్వభావంగల కొందరు మేథావులు ట్రంప్‌ విధానాన్ని వేరే కారణాలను చూపి విమర్శిస్తున్నారు. ఒకపక్క మూడవ ప్రపంచ దేశాలన్నీ స్వేచ్ఛా వాణిజ్యాన్ని అసుసరించేలా ఒత్తిడి చేస్తూ మరోపక్క బలమైన పెట్టుబడిదారీ దేశంగా ఉన్న అమెరికా తన వరకూ మాత్రం అధిక సుంకాలను విధించడం అనేది ఒక సామ్రాజ్యవాద ఆధిపత్య లక్షణం అని వారు విమర్శిస్తున్నారు. ఇలా అమెరికా విధించే అధిక సుంకాల వలన మూడవ ప్రపంచ దేశాల నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గిపోతాయని, అప్పుడు ఆ దేశాలలో నిరుద్యోగం పెరుగుతుందని, అమెరికాలో నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం మూడవ ప్రపంచ దేశాలకు ఆ నిరుద్యోగాన్ని ట్రంప్‌ ఎగుమతి చేస్తున్నాడని వారు విమర్శిస్తున్నారు. తక్షణ పరిస్థితుల్లో ఈ వాదన వర్తించేదే అయినా ఇది సామ్రాజ్యవాదపు ప్రధాన ధోరణిని సూచించడం లేదు. వలస విధానం చివరి దశలో వలస దేశాల మీద స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని సామ్రాజ్యవాదులు రుద్దారు. అయితే అప్పుడు ప్రధాన సామ్రాజ్యవాద దేశంగా ఉన్న బ్రిటన్‌ కూడా స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అమలు చేసింది. ఇండియా, చైనా వంటి దేశాలలోకి తన పారిశ్రామిక ఉత్పత్తులను విరజిమ్మింది. దానివలన ఇండియాలో, చైనాలో ఉన్న చేతివృత్తులు, చిన్న ఉత్పత్తిదారులు చితికిపోయారు.
మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధానికి మధ్య కాలంలో మహా మాంద్యం తలెత్తిన నేపథ్యంలో లాటిన్‌ అమెరికా దేశాల్లో ఒక కొత్త రాజకీయ వెల్లువ పెల్లుబికింది. అక్కడి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవన్నీ తమ దేశాలను విదేశీ సరుకుల తాకిడి నుండి రక్షించుకోడానికి విదేశీ సరుకుల మీద అధిక సుంకాలను విధించి తమ తమ దేశాలలో పరిశ్రమలు బలపడడానికి తోడ్పడ్డాయి. అయిష్టంగానైనా, భారతదేశంలో కూడా అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం విదేశీ సరుకుల దిగుమతులపై అదనపు సుంకాలను విధించింది. దేశంలో అప్పుడప్పుడే తలెత్తుతున్న పరిశ్రమలకు రక్షణ కావాలన్న వాదనను చూపించి ఆ అదనపు సుంకాలను విధించింది. ఆ క్రమంలో దేశీయంగా పెట్టుబడిదారీ వర్గం కొంత నిలదొక్కుకోడానికి అవకాశం వచ్చింది. అందుచేత సామ్రాజ్యవాదం అన్ని సందర్భాలలోనూ తయ దేశీయ మార్కెట్‌ను రక్షించుకోవడమే ప్రధానంగా ఎంచుకుందని చెప్పలేం. అలాగే వలస దేశాలపై, లేదా మూడవ ప్రపంచ దేశాలపై స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అన్ని కాలాల్లోనూ బలవంతంగా రుద్దిందని కూడా చెప్పలేం. సామ్రాజ్యవాదం అనుసరించిన వాణిజ్య విధానం ఆ యా కాలాల్లోని నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఉండేది. ఇటీవల కాలంలో మూడవ ప్రపంచ దేశాల్లో తమ ఫ్యాక్టరీలను పెట్టడానికి బహుళజాతి కంపెనీలు సుముఖత చూపించాయి. దానికి కారణం ఇక్కడ ఉన్న చౌక కార్మిక శక్తిని కొల్లగొట్టి తమ లాభాలను బాగా పెంచుకోవాలన్న వాళ్ళ లక్ష్యమే. దాని వలన మూడవ ప్రపంచ దేశాల్లో అదనంగా ఉపాధి కల్పన జరిగిందే తప్ప సంపన్న దేశాల నుండి నిరుద్యోగం ఇక్కడికేమీ ఎగుమతి కాలేదు కదా? ఈ కాలంలో స్వేచ్ఛా వాణిజ్యం అమలులో ఉంది. స్వేచ్ఛా వాణిజ్యం అమలైతే మన దేశానికి పెట్టుబడులు వస్తాయని, దాని వలన అదనంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రచారం చేయడం ద్వారా ఇండియా వంటి దేశాలలో నయా ఉదారవాద విధానాలను ఆమోదింపజేశారు. ఇప్పుడు ట్రంప్‌ స్వేచ్ఛా వాణిజ్యానికి అడ్డుకట్ట వేయడానికి పూనుకున్నాడు.
ట్రంప్‌ ఇప్పుడు చేపడుతున్న రక్షణాత్మక చర్యలు మూడవ ప్రపంచ దేశాల నుండి, ముఖ్యంగా చైనా నుండి ఉపాధి అవకాశాలను తన దేశానికి లాక్కుందామన్న లక్ష్యంతో మాత్రమే చేపడుతున్నవి కావు. ఇప్పుడు చైనాతో అమెరికా వాణిజ్య లోటు చాలా హెచ్చు స్థాయిలో ఉంది. దాని వలన అమెరికా ప్రపంచంలోకెల్లా అత్యధిక రుణగ్రస్త దేశంగా నిలిచింది. ఇప్పుడు చైనా నుండి దిగుమతులను అధిక సుంకాల ద్వారా నిరోధిస్తే దాని ఫలితంగా వాణిజ్య లోటు తగ్గుతుందని ట్రంప్‌ ఆశ పడుతున్నాడు.

అయితే ఇక్కడ ఒక వైరుధ్యాన్ని సాధారణంగా పట్టించుకోవడం లేదు. సామ్రాజ్యవాద దేశాల కూటమికి నాయకత్వ స్థానంలో ఉండే దేశం సాధారణంగా తక్కిన దేశాలతో వాణిజ్య లోటును కొనసాగించడం పరిపాటి. ఆ యా దేశాల ఆకాంక్షలను సర్దుబాటు చేయడానికి వాటి నుండి అధికంగా దిగుమతులను అనుమతించడం, దాని వలన తన వాణిజ్య లోటు పెరగడం జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వ కాలంలో సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వ స్థానంలో బ్రిటన్‌ ఉండేది. అప్పుడు తక్కిన యూరోపియన్‌ దేశాలతోను, అమెరికాతోను బ్రిటన్‌కు వాణిజ్య లోటు నిరంతరం కొనసాగేది. ఆ దేశాల కోర్కెలను నెరవేర్చడం ద్వారా బ్రిటన్‌ తన నాయకత్వ స్థానాన్ని పదిలం చేసుకునేది.
అయితే ఈ వాణిజ్య లోటు కారణంగా బ్రిటన్‌ ఏనాడూ రుణగ్రస్త దేశంగా అయిపోలేదు. పైగా ఇతర దేశాలకు రుణాలను ఇచ్చే దేశంగా, పెట్టుబడులను ఇతర దేశాలలో పెట్టే దేశంగా ఉండేది. ముఖ్యంగా ఏ యే దేశాల నుండి తనకు ఎక్కువగా సరుకులు వచ్చేవో, ఆ దేశాలలోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతూ వుండేది. దీనికి కారణం బ్రిటన్‌ తన వలస దేశాలన్నింటి నుండి వాటి వాటి ఎగుమతుల ఆదాయాలను తాను చేజిక్కించుకునేది. తన సరుకులను ఆ దేశాలకు పంపి వాటి కారణంగా అక్కడి స్థానిక చేతివృత్తులు చితికిపోయేలా చేసేది. అప్పుడు బ్రిటన్‌ వలస విధానం ఉనికిలో ఉన్నప్పుడు నాయకత్వం చెలాయించడానికి. ఇప్పుడు అటువంటి వలస విధానం లేని కాలంలో అమెరికా నాయకత్వం చెలాయించడానికి ఒక మౌలికమైన తేడా ఉంది. మూడవ ప్రపంచ దేశాల ఎగుమతుల ఆదాయాలను కొల్లగొట్టడానికి కాని, ఆ దేశాలలోని పరిశ్రమలను చితికిపోయే విధంగా ఆ దేశాలకు ఎగుమతులు చేయడం కాని ఇప్పుడు అమెరికాకు సాధ్యం కాదు.

ప్రస్తుతం వలసలు లేని సామ్రాజ్యవాదం నడుస్తోంది. పెట్టుబడిదారీ-పూర్వపు ఉత్పత్తి విధానం అంతరిస్తున్నకొద్దీ స్థానిక వృత్తులను నాశనం చేసి తన సరుకుల ద్వారా అక్కడి మార్కెట్‌ను ఆక్రమించుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ కొన్ని వలస దేశాలు ఉన్నా, వాటి ఆర్థిక వ్యవస్థలు ఎదుగూ బొదుగూ లేకుండా పడివుండడంతో అక్కడినుండి ఎగుమతుల ఆదాయాన్ని మరింత ఎక్కువగా కొల్లగొట్టే అవకాశాలూ అంతరించిపోతాయి. అందుచేత గతంలో బ్రిటన్‌ సామ్రాజ్యవాదం నాయకత్వం చెలాయించినప్పుడు ఉన్న సానుకూల అంశాలు ఇప్పుడు లేవు.

ట్రంప్‌ ఇప్పుడు మొదలుబెట్టిన సుంకాల యుద్ధాన్ని చూసి అతడికి పిచ్చి పట్టిందనో, లేదా అతడికి తక్కిన ప్రపంచం అంటే విపరీతమైన ద్వేషం అనో వ్యాఖ్యానించేవారున్నారు. కాని అతడి చర్యలకు మూలం పెట్టుబడిదారీ విధానంలో పాతుకుని వున్న వైరుధ్యాలలో ఉంది. పెట్టుబడిదారీ విదానం ముదురుతున్న కొద్దీ ఈ వైరుధ్యాలు ముందుకొస్తాయి. వాటిని విస్మరించి, కేవలం ట్రంప్‌ పిచ్చితనానికి ప్రాధాన్యతనివ్వడం అంటే అది పైపై పరిశీలన మాత్రమే అవుతుంది. ఇప్పుడు ట్రంప్‌ విధించిన అధిక సుంకాల మంత్రం పని చేసి ఒకవైపు అమెరికాలో ఉద్యోగావకాశాలు పెరగడం, మరోవైపు అమెరికా వాణిజ్యలోటు తగ్గడం-రెండూ జరగాలంటే తక్కిన దేశాలు తమ వంతు సుంకాలను పెంచి ప్రతీకార చర్యలకు దిగకూడదు. తక్కిన దేశాలు కూడా ప్రతీకార చర్యగా అమెరికన్‌ సరుకుల దిగుమతులపై అధిక సుంకాలను విధిస్తే అప్పుడు ట్రంప్‌ మంత్రం పని చేయకపోగా పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ చిక్కుల్లో పడుతుంది.

అన్ని దేశాల్లోనూ దిగుమతి సుంకాలు పెరిగితే అప్పుడు ఆ సరుకుల ధరలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా జీతాలు పెరగవు. అప్పుడు కొనుగోలు శక్తి పడిపోయి వినిమయం మరింత తగ్గిపోతుంది. దాని వలన సరుకుల డిమాండ్‌ ఇంకా తగ్గుతుంది. అది మరింత నిరుద్యోగానికి దారి తీస్తుంది. పోనీ, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కాపాడదామా అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిబంధనలు అందుకు అంగీకరించవు. పోనీ సంపన్నుల మీద అదనపు పన్నులు వేద్దామా అంటే అందుకూ అంగీకరించవు. పెట్టుబడిదారీ వ్యవస్థ లోని మౌలిక వైరుధ్యం ఈ పరిస్థితికి కారణం తప్ప ట్రంప్‌ పిచ్చితనం కాదు.

మరి ఇప్పుడు ట్రంప్‌ చేపడుతున్న చర్యలకు ఏ విధంగా ప్రతిస్పందించాలి? ఇప్పుడు ట్రంప్‌ చేపడుతున్న అధిక సుంకాలు అమెరికా నుండి మూడవ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ రాబోయే కాలంలో జరగదని స్పష్టం చేస్తున్నాయి. సంపన్న దేశాల నుండి పెట్టుబడులు వస్తాయనే కదా మూడవ ప్రపంచ దేశాలు నయా ఉదారవాద విధానపు షరతులకన్నింటికీ తలవొగ్గింది? ఇక ఇప్పుడు అటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశాలు లేవు అన్నది స్పష్టం అయిపోయాక ఇక మన దేశం చేయవలసింది ఒక్కటే. అది నయా ఉదారవాద పంథాను విడిచిపెట్టడమే. అందులో మొదటి చర్యగా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశీయ మార్కెట్‌ను విస్తరింపజేయడం జరగాలి. కేవలం రక్షణాత్మక చర్యలు మాత్రమే సరిపోవు. వాటితోబాటు ప్రభుత్వ వ్యయాన్ని పెంచి వ్యవసాయ రంగాన్ని, చిన్న ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించాలి. అందుకవసరమైన పెట్టుబడిని సమీకరించడానికి సంపన్నుల మీద అదనపు పన్నులు విధించాలి. అప్పుడు దేశీయంగా ప్రజల ఆదాయాలు పెరిగి మార్కెట్‌ విస్తరిస్తుంది. ప్రజలకు సంక్షేమమూ అందుతుంది.

ఇటువంటి చర్యలు చేపట్టినప్పుడు మన దేశం నుండి ఫైనాన్సు పెట్టుబడి బైటకు తరలిపోయే అవకాశం ఉంటుంది. దానిని అదుపు చేయడానికి పెట్టుబడుల కదలికలపై నియంత్రణలను విధించాలి. ట్రంప్‌ చేపట్టిన చర్యలతో మన కళ్ళు తెరుచుకోవాలి. అసమానతలను తగ్గించడం, సంక్షేమానికి పెద్ద పీట వేయడం, దేశీయ మార్కెట్‌ను విస్తరింపజేయడం, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడం ఇండియా వంటి మూడవ ప్రపంచ దేశాలకు ముందున్న ప్రత్యామ్నాయం. అప్పుడే ట్రంప్‌ దూకుడు నుండి తట్టుకోవడం సాధ్యం.

( స్వేచ్ఛానుసరణ )

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️