వాణిజ్య పోరుకు తెర తీసిన ట్రంప్‌

Feb 5,2025 05:42 #curtain, #Lifted, #trade war, #Trump

డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందు నుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెర తీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంత కాలం వాయిదా వేస్తామనంటతో పాటు ‘ఐరోపా మీద త్వరలో విధిస్తా, వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా’ అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం. అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పది శాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తర్వులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది. పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే (హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.

ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడింది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు. కృత్రిమ సింథటిక్‌, నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ‘ట్రంపెరికా’ అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటంలేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్ష భవనం చెప్పిన సాకును ఆమె ఖండించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడించలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతి పెద్ద దాడులలో ఇదొకటని, అమెరికా-కెనడా-మెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్ధమని పాలక పార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీ పడుతోంది. మూడో వంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20 శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు, వైన్‌, పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్ధతిలో దెబ్బ తీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.

ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంప్‌ పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు. తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోరు శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పిజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్ధంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్ధం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదరు కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీ మే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారించటంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25 శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890 దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున లోటు బడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు. తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశ కార్మిక వర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.

అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి? సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8 శాతం దిగజారుతుంది. 1.3 ఎగుమతులు, 2.8 శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి. లక్షా 84 వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25 శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7 బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క. చైనా వస్తువులపై 60 శాతం, మిగతా వాటిపై 20 శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌, మొత్తం మీద పది శాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, 7,600 డాలర్లు ఉంటుందని నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి. వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్ధరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు. భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌ మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

ఎం. కోటేశ్వరరావు

➡️