ఇల్లలకగానే పండగ కాదు. అలాగే వర్తమాన ప్రపంచీకరణ యుగంలో ఎవరైనా ఏకపక్షంగా వ్యవహరిస్తామంటే కుదరదు. దెబ్బకు దెబ్బ తీసే రోజులివి. తాను అధికారానికి వచ్చిన తొలి రోజే చైనా, మెక్సికో, కెనడాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పది, ఇరవై అయిదు శాతాల చొప్పున పన్ను విధిస్తానని రెండవసారి ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. తాము కూడా చేయాల్సింది చేస్తామని ఈ దేశాలు ఆ పెద్దమనిషికి స్పష్టం చేశాయి. వైట్‌హౌస్‌లో కొలువు తీరేందుకు ఇంకా యాభై రోజులకు పైగా గడువు ఉంది. ఈ లోగా ఈ మూడు, ఇతర దేశాలను కూడా లొంగదీసుకొని సాధ్యమైనంత మేరకు తమ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలన్నది ట్రంప్ ఎత్తుగడ. అందువలన అప్పటి వరకు ఈ వ్యవహారంలో దోబూచులాటలు నడుస్తాయి. గత అనుభవాన్ని బట్టి ఎవరూ తెగే దాగా లాగే అవకాశం లేదు. ఈ లోగా ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తారు. విదేశాల మీద నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఏ దేశమైనా సుంకం విధిస్తే ఆ మేరకు తమ వినియోగదారులపై భారాలు మోపాలి లేదా జనం నుంచి వ్యతిరేకత వస్తుందనుకుంటే ఆ మేరకు ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.
2023 వివరాలను పరిశీలించినపుడు చైనా, మెక్సికో, కెనడాల నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 1.2 లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. ఈ మొత్తంలో చైనా నుంచి 60 శాతం ఉంది. ట్రంప్ చెప్పినట్లుగా పన్ను విధిస్తే అమెరికాలోని ప్రతి కుటుంబం మీద 1,900 నుంచి 7,600 డాలర్ల వరకు భారం పడుతుంది. పర్యవసానంగా 1.4 నుంచి 5.1 శాతం వరకు ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. తాము దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరిగితే అంతిమంగా జనం నుంచే వసూలు చేస్తామని ఇప్పటికే వాల్‌మార్ట్ వంటి బడా సంస్థలన్నీ ప్రకటించాయి. మంచి తరుణం మించిపోతుంది, పాత స్టాకు ధర ఇది పన్ను పెరిగితే ఇంత అంటూ ఇప్పటికే అనేక సంస్థలు వినియోగదార్లను ఊరిస్తున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్ వస్తువు ధరలు పెద్ద మొత్తంలో పెరుగుతాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నపుడు ప్రారంభించిన వాణిజ్య యుద్ధం విధించిన పన్నులు వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం చూపలేదు గానీ, ఈ సారి అలా ఉండదని అంటున్నారు. చైనా నుంచి వినియోగ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండగా మెక్సికో, కెనడాల నుంచి ఇంథనం సింహ భాగం ఉంది. దాని ధరలు పెరగటం అనివార్యం. అమెరికా దిగుమతి చేసుకొనే మొత్తం ఇంథన దిగుమతుల్లో కెనడా, మెక్సికోల నుంచి నాలుగో వంతు, ఖాద్య తైలాల్లో కెనడా నుంచి సగం ఉంది. వ్యవసాయ, గొడ్డు మాంస ఉత్పత్తులను, పొటాష్ ఎరువును కూడా ఈ రెండు దేశాల నుంచి అమెరికా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నది. అమెరికాలో విక్రయించే వంద చెప్పుల జతల్లో 99 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే, ఒక్క చైనా నుంచే 56 శాతం ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై విధించే పన్నుతో కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపవచ్చని, స్వదేశంలో ఉత్పత్తి పెంచటం ద్వారా ఉద్యోగ రక్షణ, కొత్త ఉపాధి కల్పించవచ్చని గతంలో ట్రంప్ అండ్ కో చెప్పిన కబుర్లకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు.
దిగుమతి పన్ను విధించేందుకు ట్రంప్ చెప్పిన సాకులు తర్కానికి నిలిచేవి కాదు. మెక్సికో నుంచి అక్రమంగా వలసలు వస్తున్నారంటూ గతంలో ఆ దేశ సరిహద్దులో గోడ నిర్మించినప్పటికీ వలసలు ఆగలేదు, చైనా నుంచి మత్తుపదార్ధాలు దిగుమతి అవుతున్నట్లు ఆరోపించాడు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని నిఘా వ్యవస్థ ఉన్న అమెరికా అధినేత ఇలా మాట్లాడటం కుంటిసాకు, అమెరికన్లను వంచించటం తప్ప మరొకటి కాదు. పన్ను ప్రకటన తరువాత మెక్సికో, కెనడా అధినేతలతో ట్రంప్ ఫోన్ సంభాషణలు చేయటం బెదిరింపు-బుజ్జగింపు వ్యవహారం తప్ప మరొకటి కాదు. వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదు, తమ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే అనుభవిస్తారంటూ చైనా హెచ్చరించింది. గతంలో తమ వస్తువులపై విధించిన పన్నుకు ప్రతిగా అమెరికా ఎగుమతి చేసే సోయా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై చైనా కూడా ప్రతి చర్యలు తీసుకుంది. ట్రంప్ పోయి బైడెన్, తిరిగి ట్రంప్ రాకతో తన ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకుంటున్నది. అందువలన తన ఉడుత ఊపులకు బెదిరే దేశాలేవీ లేవన్నది ట్రంప్ ఎంతగా గ్రహిస్తే అన్ని దేశాలకూ అంత మంచిది.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్