ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి, విద్యుత్ భారాలు వేయవద్దని కోరుతూ 2000 సంవత్సరంలో సిపిఎం, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్, బషీర్‌బాగ్‌లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యమకారులపై పాశవికంగా కాల్పులు జరిపి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలను బలికొన్నది.
ఆ ఉద్యమ ఫలితంగా కొద్ది సంవత్సరాల పాటు ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల జోలికి వెళ్లలేదు. ప్రపంచ బ్యాంకు సంస్కరణల వేగం తాత్కాలికంగా తగ్గింది. ఈ 24 ఏళ్ల కాలంలో కేంద్రం, రాష్ట్రంలోని వివిధ పార్టీల ప్రభుత్వాలు చాప కింద నీరు లాగా విద్యుత్ రంగంలో ప్రమాదకర విధానాలను అమలు చేశాయి.
ఈ సంస్కరణలతో ప్రజలకు చౌకైన, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తు అందుతుందని పాలకులు నమ్మబలికారు. కానీ ఈ కాలంలో విద్యుత్ భారాలు మరింత పెరిగాయి. ప్రమాదాలు ఆగలేదు. కోతలు పూర్తిగా తొలగలేదు. వ్యవసాయ విద్యుత్ ఒడిదుడుకులతోనే సాగుతోంది. మొత్తంగా పాలకుల మాటలు అబద్ధాలు అని రుజువయ్యాయి. సంస్కరణలు విఫల మయ్యాయి. ప్రజలకు కష్టాలు తప్పలేదు. విద్యుత్ కార్పొరేట్ల చేతిలో బందీగా మారింది.
ఈ పది సంవత్సరాల్లో కేంద్రంలో బిజెపి విద్యుత్ రంగంలో దోపిడీని తీవ్రతరం చేసింది. కేంద్ర విద్యుత్ రంగం చట్టానికి సవరణలు చేయడానికి శత విధాల ప్రయత్నించింది. చట్ట రూపం దాల్చకపోయినా దొడ్డి దారిన ఆ దుష్ట విధానాలను అమలు చేసింది. విద్యుత్ రంగం మొత్తాన్ని అదానీ, టాటా వంటి బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది.
విద్యుత్ బాదుడు లేకుండా చేస్తామని, ప్రైవేట్ కంపెనీల దోపిడీ అరికడతామని వైసిపి 2019లో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి వైసిపి ఐదేళ్లలో దొడ్డిదారిన ప్రజల కళ్ళుగప్పి ముక్కలు ముక్కలుగా 32 వేల కోట్ల రూపాయల భారం మోపింది. చార్జీల పెంపు, స్లాబుల మార్పిడి, విద్యుత్ సుంకం, స్థిర చార్జీలు, కస్టమర్ చార్జీలు, అదనపు లోడు డిపాజిట్లు ఇలా పలు రూపాలలో దండుకున్నది. టిడిపి ప్రభుత్వం తెచ్చిన ట్రూ అప్, సర్దుబాటు చార్జీల విధానాన్ని వైసిపి పూర్తి స్థాయిలో అమలు చేసింది. ఏనాడో వాడిన కరెంటుకు, లోటు సాకుతో వైసిపి పాలనలో మూడు రకాల సర్దుబాటు చార్జీలను రూ. 9863 కోట్ల అదనంగా వసూలు చేయడం దుర్మార్గం. ఆ పాలనా కాలానికి సంబంధించి మరో 17,137 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీలు మోపటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. అసలు చార్జీల కంటే కొసరు చార్జీలే ఎక్కువయ్యాయి. ప్రతి నెల ఈ వసూళ్లు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అగ్నికి ఆజ్యం పోశాయి. సంస్కరణలలో భాగంగా వచ్చిన ఈ సర్దుబాటు చార్జీల విధానమే ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులతో సోలార్, విండ్, జల ఇతర రకాల విద్యుత్ చౌకగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గాలి. కానీ భారాలు పెరగటం పాలకుల దోపిడీకి తార్కాణం.
కార్పొరేట్ల దోపిడీ, ప్రైవేటీకరణ, అవినీతి, పాలకుల అసమర్థ, అపసవ్య విధానాలే ఈ భారాలకు కారణం. విద్యుత్ ఉత్పత్తి మొత్తం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నది. ఈ సంస్థలతో ప్రభుత్వాలు అధిక రేట్లకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకొని ప్రజలపై రుద్దుతున్నాయి. బొగ్గు గనులు, విదేశీ బొగ్గు సరఫరా, పోర్టులు, రవాణా, ఇంధనం అన్నీ అదానీ, బడా కంపెనీల పరమై విద్యుత్ వ్యయం పెంచుతున్నాయి. అత్యవసర విద్యుత్ కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నది. ట్రాన్స్‌ఫార్మర్లు, మెటీరియల్, అన్ని రకాల కాంట్రాక్టులలో పాలకులు బడా సంస్థలతో కలిసి వేలాది కోట్లు దోచుకుంటున్నారు. బడా సంస్థల నుండి విద్యుత్తును కొనుగోలు చేయడానికి, ప్రభుత్వ విద్యుత్ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి వాటిని దెబ్బ తీస్తున్నారు. పాలకులు ఇంకా ఎన్నో పాపాలకు పాల్పడ్డారు. విద్యుత్ భారాలతో మన జేబులు ఖాళీ చేస్తున్నారు. కార్పొరేట్ల ఖజానా నింపుతున్నారు. తక్షణ ప్రమాదమే కాదు. భవిష్యత్తును కార్పొరేట్ల చక్రబంధంలో ఇరికిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ పేరుతో 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ 25 సంవత్సరాలు పాటు సరఫరా చేసే ఒప్పందాన్ని అదానీ కంపెనీతో చేసుకున్నది. యూనిట్ రూ.2.49 పైసలకు రాజస్థాన్ నుండి విద్యుత్ సరఫరా చేస్తారు. 25 సంవత్సరాలలో ట్రాన్స్‌మిషన్ చార్జీల పేరుతో లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాలు కుమ్మక్కై ఈ ఒప్పందం చేశాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు సబ్సిడీ బకాయిలను (రూ.12,681 కోట్లు) ప్రభుత్వం చెల్లించ లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు విద్యుత్ వాడుకొని రూ.15,157 కోట్ల బిల్లులు బకాయిలు చెల్లించలేదు. విద్యుత్ సంస్థలను అడ్డంపెట్టి వైసిపి ప్రభుత్వం అప్పులు తెచ్చి ఇతర అవసరాలకు వినియోగించుకున్నది. విద్యుత్ సంస్థలను రూ.1,12,422 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆ వడ్డీ భారం ప్రజలపైనే వేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటీకరించారు. భవిష్యత్తులో పంపిణీ, సరఫరాను కూడా ప్రైవేట్ సంస్థలకు కట్ట పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోతున్నాయి.
దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అప్పుల కోసం కేంద్రం షరతులకు వైసిపి లొంగిపోయింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి అంగీకరించి, పలు ప్రాంతాల్లో మీటర్లు బిగించారు. ఇదే కాకుండా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ పెట్టడానికి అదానీ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు క్రమంగా ఎసరు పెట్టటానికే ఈ మీటర్లు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరతో ప్రతి ఇంటిలో ముందే బిల్లు చెల్లించి విద్యుత్ బ్యాలెన్స్ వేయించుకోవాలి. బ్యాలెన్స్ అయిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గంట గంటకు రీడింగ్ చూపిస్తుంది. అధిక విద్యుత్ వినియోగించే రాత్రి సమయాలలో యూనిట్‌కు అధిక చార్జీలు వసూలు చేస్తారు. విద్యుత్ మీటర్‌కు అయ్యే ఖర్చు (10 నుండి 15 వేల రూపాయలు) వినియోగదారులే భరించాలి. దీనిని 93 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు. మీటర్ల కొనుగోలు ఒప్పందాలతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసి అదానీ కంపెనీ వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నది. హరిత విద్యుత్ పేరుతో బడా కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెడుతున్నారు. ఇది మరో రకమైన దోపిడి.
అనేక కారణాలతో పాటు విద్యుత్ బాదుడు, పన్నుల భారాలతో విసిగి ప్రజలు ఆగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. విద్యుత్ బాదుడు ఆపుతామని కూటమి హామీ ఇచ్చినా నేటికీ ఆగలేదు. కనీసం సర్దుబాటు చార్జీలు కూడా రద్దు చేయలేదు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు కాలేదు. పై పెచ్చు అదానీ కంపెనీ మీటర్లు తాజాగా విద్యుత్ కార్యాలయాలకు చేరుకున్నాయి. ఇంటింటికి మీటర్లు బిగించడానికి అదానీ సిబ్బంది సిద్ధమవుతున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉండగా మీటర్లను వ్యతిరేకించింది. హైకోర్టులో ఆ పార్టీ నేత కేసు కూడా వేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే బద్దలు కొట్టాలని ఆ నేతలు పిలుపునిచ్చారు. నేడు మాట మార్చారు. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానెళ్లు బిగిస్తామని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సర్దుబాటు చార్జీల విషయం అడిగితే, నేను రద్దు చేస్తానని చెప్పానా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అదానీ కంపెనీతో చేసుకున్న సోలార్ ఒప్పందం రద్దు పైన నోరు మెదపడం లేదు. కేంద్రంలో కార్పొరేట్లకు దాసోహం అంటున్న బిజెపి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయ్యింది. నేను మారిన చంద్రబాబుని అని చెప్పుకుంటూ, మరోవైపు గతంలో తాను ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు దేశానికి ఆదర్శమని ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవడం ఏమిటి? మారింది ఎక్కడా? అవే విధానాలను టిడిపి, బిజెపితో కలిసి అమలు చేయటం వాగ్దాన భంగమే కాదు, ప్రజా ద్రోహం అవుతుంది. టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ శ్వేతపత్రంలో వైసిపి ప్రభుత్వ దోపిడీ, భారాలు వివరంగా చెప్పారు. కాని కూటమి ప్రభుతం వీటన్నింటిని కొనసాగించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వైసిపి పాలనలో విద్యుత్ రంగంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని…జగన్, వైసిపి బినామీ సంస్థ అని… టిడిపి నేతలు పదే పదే చెప్పారు. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాలను, భూముల కేటాయింపులను టిడిపి సర్కారు కొనసాగించడం శోచనీయం. ఎన్నికలలో ఈ షిరిడీ సాయి కంపెనీ నుంచి టిడిపి పార్టీ రూ.40 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో (2024 జనవరి) పొందడం సిగ్గుచేటు. టిడిపి కూటమి ప్రభుత్వం 25 ఏళ్ల సంస్కరణల వైఫల్యాల అనుభవాన్ని గమనించి తమ విధానాలు మార్చుకోవాలి. విద్యుత్ భారాలు తగ్గించాలి. కార్పొరేట్ల దోపిడీ అరికట్టాలి. సర్దుబాటు చార్జీలను తక్షణమే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు తొలగించాలి. అదానీ తదితర కంపెనీలతో తీసుకున్న అడ్డగోలు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. విద్యుత్ భారాలు, మీటర్లు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల స్ఫూర్తితో మరో పోరుకు ప్రజలు సిద్ధం కావాలి.
వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుసిహెచ్. బాబూరావు