నూతన సంవత్సరమైన 2025 విద్యా రంగంపైన మరో దాడితో ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ద్వారా కొత్త నిబంధనల ముసాయిదా విడుదల చేసింది (‘యూనివర్సిటీలు, కాలేజీలలో టీచర్లు, అకడమిక్ సిబ్బంది నియామకం ప్రమోషన్ ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణకు కనీస అర్హతలు’ పేరిట). దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై అదుపు పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నమిది.
యుజిసి చెప్పే ప్రకారం దేశంలో 56 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 481 రాష్ట్రాల యూనివర్సిటీలు వున్నాయి. ఈ నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యూనివర్సిటీలకు కూడా నియామకాలు చేసేందుకు, వాటి నిర్వహణ ఎలా వుండాలో చెప్పేందుకు హక్కులను కబళించేస్తున్నది. రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన సమాఖ్య సూత్రంపై ఇది ప్రత్యక్షంగా దాడి చేయడమే.
కేంద్రం చెప్పిన వి.సి లు
దేశంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం ఎలా జరగాలో ఈ ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. వి.సి ల పరిశీలన, ఎంపిక కమిటీల ఏర్పాటు నిబంధనలను మార్చడం కోసం ఇవి ఉద్దేశించబడ్డాయి. ప్రస్తుతం ఈ కమిటీలలో ముగ్గురు సభ్యులు-యుజిసి ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనగా ఛాన్సలర్ ప్రతిపాదించిన సభ్యులు, యూనివర్సిటీ సిండికేట్-సెనేట్/ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతినిధి వుంటున్నారు.
కొత్త ముసాయిదా చెబుతున్న మార్పులు కేంద్ర ప్రభుత్వానికి మొగ్గు చూపేవిగానూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పాత్ర లేకుండా చేసేవిగానూ వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ హక్కును లాగేసుకుని ఛాన్సలర్‌కు అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధికి ఇస్తున్నాయి. ఇది నియామకాలను కేంద్రం చేతుల్లో పెట్టడమే గాక బిజెపి, ఆరెస్సెస్, విహెచ్‌పి లకు అనుకూలమైన వ్యక్తులను యూనివర్సిటీల విసి లుగా రుద్దేందుకు ఉద్దేశించాయి. కేరళలో గవర్నర్ పరిశీలన, ఎంపిక కమిటీ సిఫార్సులను తోసిరాజని ఆరెస్సెస్ అనుకూలమైన వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం ఇప్పటికే మనం చూశాం.
బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) భారతీయ విద్యావ్యవస్థ కేంద్రీకృతం, వ్యాపారాత్మకం చేయడానికి బాట వేసింది. విద్యా వ్యవస్థలో ప్రాథమిక భాగస్వాములైన అధ్యాపకులు, విద్యార్థులు సరైన రీతిలోనే దాన్ని వ్యతిరేకించారు. ఎన్‌ఇపి విధాన నిర్దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ కొత్త నిబంధనల ముసాయిదా ముందుకు వచ్చింది.
ఉన్నత విద్యపై ఉచ్చు
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అది యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలపై ఉమ్మడి ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాల చేతుల్లోని ముఖ్యమైన స్థానాలన్నిటినీ వశపర్చుకోవడంలో భాగంగా సరైన అర్హతలు లేకున్నా హిందూత్వ భావజాలంగల వ్యక్తులను నియమించడం ప్రారంభించింది. తాను అధికారంలో లేని రాష్ట్రాలలో ఇందుకోసం గవర్నర్లను ఉపయోగిస్తున్నది. తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ లతో పాటు కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కూడా ఈ విధంగా గవర్నర్లు తమ పరిధిలోని యూనివర్సిటీల నిర్వహణలో నియంత్రణలో జోక్యం చేసుకోవడాన్ని ప్రతిఘటించింది. రాజ్యాంగం విద్యను ఉమ్మడి జాబితాలో పెట్టగా ఈ ముసాయిదా నిబంధనలు రాష్ట్రాల హక్కులను కాలరాసేవిగా వున్నాయి. గవర్నర్లు సాగిస్తున్న ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు చట్టబద్దమైన విలువ కల్పించేందుకే ఈ ముసాయిదా నిబంధనలు వచ్చాయి.
పాక్షిక ప్రయోజనాల సాధన కోసం గవర్నర్ల స్థానాన్ని పచ్చిగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది. ప్రతిపక్షాలు పాలన చేస్తున్న చోట్ల ఆ ప్రభుత్వాల పాలన సజావుగా సాగకుండా వీరు ప్రతిబంధకాలవుతున్నారు. ఎందుకంటే వారు చాలావరకూ కేంద్రంలోని పాలక పార్టీ ఏజంట్లే. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్లకు యూనివర్సిటీ ఛాన్సలర్ల వంటి రాజ్యాంగ పదవులు అప్పగించినపుడు వారు ఆ పాలక పార్టీ ఎజెండాను అమలు చేయడానికే ఉపయోగిస్తారు.
గత కమిషన్ల సిఫార్సులేంటి?
కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్ష కోసం నియమించబడిన రెండు కమిషన్లు ఛాన్సలర్లుగా గవర్నర్ల పాత్రపై వ్యాఖ్యానించడం గమనించదగింది. గవర్నర్ ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రులతో సంప్రదింపులు జరపాలని చెప్పడం స్పష్టంగానే ప్రయోజనకరమని 1988లో నివేదిక సమర్పించిన సర్కారియా కమిషన్ పేర్కొంది. ప్రత్యేకించి ఛాన్సలర్లుగా వారి పాత్రను ప్రస్తావిస్తూ ‘అలాంటి ముఖ్యమైన విషయాలలో గవర్నర్ ఆ మంత్రిని సంప్రదించాలని సూచించడం మంచిదని’ చెప్పింది. ఈ రెండు సిఫార్సులను కూడా అనుసరించింది లేదు.
ఇలాంటిదే మరొకటైన పూంఛీ కమిషన్ సర్కారియా కమిషన్ నివేదిక తర్వాత ఇరవై ఏళ్లకు తన నివేదికనిచ్చింది. అది తన సిఫార్సులలో సర్కారియా కన్నా మరో అడుగు ముందుకు వేసి ఇలా పేర్కొంది. ”గవర్నర్లను యూనివర్సిటీ ఛాన్సలర్లగా చేసి తద్వారా వారికి అధికారాలు కట్టబెట్టడం గతంలో కొంత ప్రాధాన్యత కలిగివుండింది గానీ మారిన కాలమాన పరిస్థితులను బట్టి అవి ఇప్పుడు వర్తించేవిగా లేవు. యూనివర్సిటీ విద్య నియంత్రణపై మంత్రి వర్గానికి సహజంగానే ఆసక్తి వుంటుంది. కనుక విధులు అధికారాలలో ఘర్షణకు దారితీసే ఈ విధానాన్ని కొనసాగించవలసిన అవసరమేమీ లేదు. ఏ చట్టం కిందనైనా గవర్నర్‌కు యథాలాపంగా విధులు అప్పగించకూడదని కమిషన్ భావిస్తున్నది. తన పాత్ర రాజ్యాంగ నిబంధనలకే పరిమితం కావాలి” అని పేర్కొంది.
సహజంగానే ఇలాంటి సిఫార్సులు బిజెపి ప్రభుత్వానికి మింగుడుపడేవి కావు. బిజెపి సైద్ధాంతికంగా కూడా సమాఖ్య భావనకు వ్యతిరేకంగా కేంద్రీకరణ కోరుకుంటుంది. అందువల్లనే అది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కమిషన్లు చేసిన సిఫార్సుల అమలు కోసం గవర్నర్ల అధికారాలు తగ్గించడం పట్ల ఆసక్తి చూపించదు. ఈ ముసాయిదాలో అత్యంత కర్కోటకమైన భాగం ఏమంటే ఈ నిబంధనలు అమలు చేయని రాష్ట్రాలు లేదా మరే ఇతర వ్యవస్థలపై శిక్షా చర్యలు నిర్దేశించడం. అలాంటి సంస్థలను యుజిసి పథకాల్లో పాలు పంచుకోకుండా బహిష్కరించాని ఈ ముసాయిదా చెబుతున్నది. యుజిసి చట్టం కింద నిర్వహించే ఉన్నత విద్యా సంస్థల జాబితా నుంచి అలాంటి వాటిని తొలగించాలంటున్నది. క్లుప్తంగా చెప్పాలంటే తన ఆదేశాలకు లోబడి వుండాలని యూనివర్సిటీలను యుజిసి నిర్దేశిస్తున్న నిర్బంధ చర్యే ఇది. ప్రధానంగా వివిధ యూనివర్సిటీలకు నిధులు పంపిణీ చేసేందుకు మాత్రమే యుజిసి ఉద్దేశించింది తప్ప వాటిపై పెత్తనం చేసేందుకు కాదు.
ప్రైవేటు ఇష్టారాజ్యం
ఆ ముసాయిదాలో ఇంకా ముఖ్యమైన సిఫార్సులున్నాయి. అవి కూడా ఉన్నత విద్య ఆరోగ్యానికి హాని కలిగించేవే. ఈ నిబంధనల ద్వారా యుజిసి నాన్ అకడమిక్ వ్యక్తులను కూడా వైస్ ఛాన్సలర్లుగా నియమించడాన్ని చట్టబద్దం చేసుకోవాలనుకుంటున్నది. గతంలో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వి.సి లుగా నియమితులైన సందర్భాలు మనకు తెలుసు. ఇప్పుడీ నిబంధనలు పరిశ్రమలకు సంబంధించిన వారిని కూడా వి.సి లుగా నియమించేందుకు అనుమతినిస్తున్నాయి. ఇది యూనివర్సిటీల అకడమిక్ స్వభావాన్ని దెబ్బతీసి వాటిని పరిశ్రమలకు, ప్రత్యేకించి ప్రైవేటు రంగానికి తోకలుగా మార్చేందుకు జరు పుతున్న దాడి ఇది. అంతేగాక దేశంలో స్థాపించబడిన ప్రైవేటు యూనివర్సిటీలకు అకడమిక్ వ్యక్తులనే వి.సి లుగా నియమించాలనే చింత లేకుండా స్వేచ్ఛ కల్పించే చర్య. ఇది ప్రైవేటు యూనివర్సిటీల విద్యా ప్రమాణాలను నాణ్యతపై మరింత రాజీకి దారితీస్తుంది.
వివిధ యూనివర్సిటీలలో అధ్యాపక సిబ్బంది కూడా ఇప్పటికే ఈ నిబంధనలపై వ్యతిరేకత ప్రకటించారు. ఎందుకంటే వాటి వల్ల నియామకాల్లో నాణ్యత దెబ్బతినిపోతుంది. విద్యా సంబంధమైన ప్రమాణాలు సడలిపోవడం, యూనివర్సిటీల నాణ్యత దెబ్బ తినడమేగాక పని భారం పెంపు, తాత్కాలిక నియామకాల ప్రభావం పట్ల కూడా వారు విమర్శ చేశారు.
ప్రజల సూచనల కోసం యుజిసి విడుదల చేసిన ఈ నిబంధనల ముసాయిదా 30 రోజుల పాటు అందుబాటులో వుంటుంది. మన విద్యా వ్యవస్థ పట్ల, దేశ భవిష్యత్తు పట్ల ఆసక్తిగల వారందరూ ఈ నిబంధనలకు తమ వ్యతిరేకతను నమోదు చేయాలి. ఈ నిబంధనల ఉపసంహారం కోసం విద్యార్థులు, అధ్యాపక వర్గాలు అన్ని ప్రజాస్వామిక శక్తులతో కలసి సమైక్యంగా పనిచేయాలి.
(జనవరి 8 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)