పేరుకే యూనివర్శిటీ హోదా

Feb 27,2025 05:30 #Articles, #edit page, #JNTUGV, #university

జె.ఎన్‌.టి.యు.జి.వి కి ప్రత్యేక యూనివర్సిటీ హోదా వున్నప్పటికీ ఎన్నో సమస్యలు వెన్నాడుతున్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ (జె.ఎన్‌.టి.యు.కె) 1946లో ‘ది కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విశాఖపట్నం’ పేరుతో ప్రారంభించబడింది. ఇది 1972లో జె.ఎన్‌.టి.యు హైదరాబాదులో ఒక భాగస్వామ్య యూనిట్‌గా మారింది. జె.ఎన్‌.టి.యు విభజనకు లోబడి 2008లో చట్టం ద్వారా ప్రత్యేక విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. దీనికి అనుబంధంగా జె.ఎన్‌.టి.యు.కె విజయనగరం ఉండేది.

విద్యలనగరంగా పిలవబడే విజయనగరంలో యూనివర్సిటీ లేకపోవడంతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నది స్థానిక విద్యార్థులు, ప్రజల సుదీర్ఘకాల డిమాండ్‌. అయితే ఉన్నపళంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే గత రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా 2022లో జె.ఎన్‌.టి.యు.కె విజయనగరంకు ప్రత్యేక యూనివర్సిటీ హోదా కల్పిస్తూ ‘జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ గురజాడ విజయనగరం’గా నామకరణం చేసింది. అయితే ఈ విభజనలో కొన్ని తప్పిదాలున్నాయి.

సిబ్బంది కొరత

ముఖ్యంగా ఈ క్యాంపస్‌లో 41 మంది రెగ్యులర్‌ సిబ్బంది వున్నారన్న ప్రాతిపదికన యూనివర్సిటీ హోదా కల్పించారు. జె.ఎన్‌.టి.యు.జి.వి కి రిక్రూట్‌ అయిన 15 మంది సేవలను జె.ఎన్‌.టి.యు.కె ద్వారా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది జె.ఎన్‌.టి.యు.కె నుండి ఆరు నెలలకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిలో పరిపాలన విధుల్లో పాల్గొంటున్నారు. డిప్యూటీ రిజిస్టర్‌, అసిస్టెంట్‌ రిజిస్టర్‌ వంటి సిబ్బంది లేకుండా ఒక యూనివర్సిటీ నడపడం చాలా కష్టం. సరిపడా నాన్‌ టీచింగ్‌ సిబ్బంది లేకపోవడం వలన అధ్యాపకులే ఆ పని చేయాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల్లో ఎక్కువమంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఉన్నారు. వీరు నిరంతరం పని ఒత్తిడికి గురవుతున్నారు. వీరి ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ లేదు. యూనివర్సిటీ అధ్యాపకులుగా ఉన్నప్పటికీ వీరికి ఇచ్చే జీతాలు చిన్న ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల జీతాలు కంటే దారుణంగా ఉన్నాయి. కేవలం రూ.12,000 జీతం తీసుకుని పనిచేసే వాళ్ళు అనేకమంది ఉన్నారు. యూనివర్సిటీకే సిబ్బంది సరిపోవటం లేదు. కానీ కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలకు సిబ్బందిని కేటాయించాలంటే ఎలా సాధ్యం?

నిధులు సమస్య

ఒక యూనివర్సిటీని నడపాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. యూనివర్సిటీని విభజించినప్పుడు దానికి అనుగుణంగా నిధులు కూడా అందించాల్సిన అవసరం ఉంది. కానీ అరకొర నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. జె.ఎన్‌.టి.యు.కె దగ్గర దాదాపు 800 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి. జె.ఎన్‌.టి.యు.జి.వి దగ్గర కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఉన్నాయి. ఉన్న నిధులు కొత్తగా నిర్మాణం అవుతున్న భవనాలకే సరిపోతున్నాయి. ఎప్పుడో హుదూద్‌ తుఫాన్‌లో కూలిపోయిన ఇండోర్‌ స్టేడియం ఇప్పటి వరకు బాగు చేయలేదు. వీటన్నింటితో పాటు యూనివర్సిటీ నిర్వహణకు పెద్దఎత్తున నిధులు అవసరం. నిధులు ఇవ్వమంటే మీకు అనుబంధంగా ఉన్న కళాశాల నుండి వసూలు చేసుకోమని జె.ఎన్‌.టి.యు.కె ఉచిత సలహా పడేస్తున్నది. జె.ఎన్‌.టి.యు.జి.వి కి అనుబంధంగా ఉన్న కాలేజీలు చాలా తక్కువ. అందులోనూ కొన్ని కళాశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. ఉన్న కాలేజీలు సకాలంలో చెల్లించడం లేదు. యూనివర్సిటీకి ఆదాయం వచ్చే రెండు మార్గాలు మూసుకుపోవడంతో ఎలా నడపాలో తెలియక వీసీ నుండి రిజిస్టర్‌ వరకు అందరూ తలలు పట్టుకుంటున్నారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు

యూనివర్సిటీలో నిధులు లేకపోవడం వలన ఆ భారం విద్యార్థుల మీద కూడా పడుతున్నది. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. రానున్న విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీలో కొత్త కోర్సులు రాబోతున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పుడున్న విద్యార్థులకు హాస్టళ్లు సరిపోవడం లేదు. గతంలో ఒక రూమ్‌లో ముగ్గురుంటే ఇప్పుడు ఐదుగురు ఉంటున్నారు. పెరుగుతున్న ధరల మూలంగా మెస్‌ చార్జీలు పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లు అందడం లేదు. ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్‌ సంస్కరణ వలన విద్యుత్‌ చార్జీల భారం హాస్టల్‌ విద్యార్థుల మీద కూడా పడుతున్నది. హాస్టళ్లలో వైఫై సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు నెట్‌వర్క్‌ కోసం డబ్బులు కట్టాల్సి వస్తున్నది. ప్రతి నెలా ఒక విద్యార్థి 200 రూపాయలు వరకు వైఫై బిల్లు చెల్లిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో లైట్ల సదుపాయం లేదు. గతంలో జంక్షన్‌ నుండి యూనివర్సిటీ వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. కానీ బస్సు వెయ్యలేదు. దీనితో ఆటో చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. అంబులెన్స్‌ సౌకర్యం సరిగ్గా లేదు. పైగా సిటీకి దూరంగా యూనివర్సిటీ ఉండడం వలన అర్ధరాత్రి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సకల అసౌకర్యాలకు మూలం నిధుల లేమి కావున జె.ఎన్‌.టి.యు.జి.వికి సరిపడా నిధులు అందించాలి. సిబ్బంది కొరత తీర్చాలి. దీనికోసం విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఐక్యంగా పోరాడాలి.

వ్యాసకర్త ఎస్‌.ఎఫ్‌.ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు, డి. రాము
సెల్‌: 9705545164 /

➡️