అన్యాయమైన జైలు శిక్ష

May 16,2024 05:30 #artical, #edite page, #Newsclick case

‘న్యూస్‌ క్లిక్‌’ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ఉపా’ (యుఎపిఎ) కేసులో ప్రబీర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆరు నెలలకు పైగా జైలులో ఉన్న ప్రబీర్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రబీర్‌ని ఇలా అక్రమంగా నిర్బంధించడం ఇదే మొదటిసారి కాదు. 48 ఏళ్ల క్రితం ఇదే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆయనకు పాతికేళ్లు. అప్పుడు కూడా ఆయన ఎలాంటి నేరం చేయలేదు. పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే విచారణ కూడా లేకుండానే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ప్రబీర్‌ ఢిల్లీ జెఎన్‌యు లో పిహెచ్‌డి విద్యార్థి. అయితే అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ ఉంది.
ఎలాంటి అభియోగాలు, ఆధారాలు లేకుండా 74 ఏళ్ల వయసులో గత అక్టోబర్‌లో ప్రబీర్‌ను మళ్లీ పోలీసు కస్టడీలోకి తీసుకున్నప్పుడు దేశంలో ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ప్రబీర్‌ అప్పుడు విద్యార్థి, కానీ నేడు ఆయన జర్నలిస్ట్‌, సైన్స్‌ ప్రచారకుడు, వామపక్ష వాది. ఈ రోజు వరకు ఏ మాత్రం తలొగ్గకుండా నికరంగా పోరాడుతున్న ‘న్యూస్‌ క్లిక్‌’ అనే మీడియా సంస్థకు వ్యవస్థాపక ఎడిటర్‌ కూడా.
నేటికి 48 సంవత్సరాల క్రితం, పాలక నాయకత్వం ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టింది. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రబీర్‌ను అక్రమంగా అరెస్టు చేయడంపై విచారణ జరిపిన జస్టిస్‌ జె.సి.షా కమిషన్‌ నాలుగు పేజీల నివేదికను విడుదల చేసింది. ప్రబీర్‌పై ఎలాంటి కేసు, వారెంట్‌ లేకుండా నిర్బంధించి, తప్పుడు పత్రాలతో అభియోగాలు మోపినట్లు షా కమిషన్‌ పేర్కొంది.
ప్రబీర్‌ పిహెచ్‌డి కోసం 1975లో ఢిల్లీ జెఎన్‌యు లోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌లో చేరారు. యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ సభ్యుడు అశోక్‌ లతా జైన్‌ బహిష్కరణకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సమయమది. సెప్టెంబర్‌ 24న విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ప్రబీర్‌ కూడా అందులో పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 25 కూడా సమ్మె కొనసాగింది. ఆ రోజు ఉదయం స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ దగ్గర స్నేహితులు సరస్వతీ మీనన్‌, శక్తి కాక్‌, ఇంద్రాణి మజుందార్‌తో కలిసి లాన్‌లో కూర్చున్నారు ప్రబీర్‌.
అకస్మాత్తుగా, క్యాంపస్‌ గేటులోకి నల్ల అంబాసిడర్‌ కారు ప్రవేశించింది. కారులో ఉన్న నలుగురిలో ఒకడు దిగి దగ్గరకు వచ్చాడు. ప్రబీర్‌ను చూసి ‘విద్యార్థుల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్‌ త్రిపాఠి యేనా?’ అని ప్రశ్నించాడు. కాదంటున్నా ప్రబీర్‌ని కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. ప్రబీర్‌ పక్కనే ఉన్న వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కారు డోర్‌ కూడా వేయకుండా వేగంగా వెళ్లిపోయారు. తెరిచిన తలుపు లోంచి ప్రబీర్‌ కాలు కూడా బయటికి వచ్చింది. పోలీసు అధికారి ఒకరు క్యాంపస్‌లోనే ఉండిపోయారు. విద్యార్థులు అతన్ని చుట్టుముట్టారు. అయితే బయట ఉన్న పోలీసులు వచ్చి అతన్ని రక్షించారు.
ప్రబీర్‌ని ఎవరో కిడ్నాప్‌ చేశారనే వార్త క్యాంపస్‌లో వ్యాపించింది. ఎమర్జెన్సీ వేళ ఈ విషయమై పెద్దగా దర్యాప్తు కూడా జరగలేదు.
డిఐజి పి.ఎస్‌. భిందర్‌, ఆయన బృందం కారులో ఉన్నారు. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీ నుండి నేరుగా ఆదేశాలు తీసుకున్న అధికారి భిందర్‌. ప్రబీర్‌ను ఆర్కే పురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడే అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు ‘నువ్వు త్రిపాఠి కాదా?’ అనే ప్రశ్నను పదేపదే అడిగారు. వారు ఎన్నిమార్లు అడిగినా సమాధానం ‘కాదు’ అనే వచ్చింది.
సంజరు గాంధీని ప్రసన్నం చేసుకునేందుకే ప్రబీర్‌ అరెస్ట్‌ అని షా కమిషన్‌లో వెల్లడైంది. సంజరు భార్య మేనకా గాంధీ అప్పట్లో జెఎన్‌యు విద్యార్థిని. విద్యార్థులు తరగతిలోకి ప్రవేశించేందుకు వచ్చారు. యూనియన్‌ చైర్మన్‌ త్రిపాఠి తదితరులు అడ్డుకున్నారు. వారు వెనక్కి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న సంజరు గాంధీకి కోపం వచ్చింది. త్రిపాఠి, అతని స్నేహితులను అరెస్టు చేయాల్సిందిగా ఎమర్జెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న సంజరు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. త్రిపాఠిపై అప్పటి జాతీయ భద్రతా చట్టం (అంతర్గత భద్రతా చట్టం నిర్వహణ-మీసా) కింద వారెంట్‌ కూడా పంపారు. త్రిపాఠి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే పోలీసులు త్రిపాఠిని (త్రిపాఠీ అనుకొని ప్రబీర్‌ని) పట్టుకోగలిగారు.
ప్రబీర్‌ సమ్మెలో పాల్గొన్నారు కానీ మేనకను క్లాసులకు వెళ్లకుండా ఆపలేదు. ప్రబీర్‌ అరెస్టుకు ఎలాంటి వారెంట్‌ లేదు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ అధికారులు షా కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అయితే తాము వ్యక్తిగతంగా ఒకరిని అరెస్టు చేసినట్లు సంజరు గాంధీకి తెలియజేయడానికి అధికారులు భయపడ్డారు. వారు షార్ట్‌కట్‌ కోసం వెతికారు. ప్రబీర్‌ను నిందితుడిగా చూపించాలని భిందర్‌ నిర్ణయించారు. రాత్రికి రాత్రే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రబీర్‌పై మీసా వారెంట్‌ జారీ చేశారు. పాత తేదీకి సంబంధించిన పత్రాలను తారుమారు చేసి కేసు కూడా పెట్టారు. ‘దేశ భద్రతకు ప్రమాదం’ కారణంగా ప్రబీర్‌ను తీహార్‌ జైలులో ఉంచారు. ఎమర్జెన్సీ సమయంలో మీడియా సెన్సార్‌షిప్‌తో ఈ వార్త కూడా బయటకు రాలేదు.
ప్రబీర్‌ మాస్టర్స్‌ కోర్సు వైవాకి హాజరు కావాల్సి వచ్చింది. పెరోల్‌ తిరస్కరించారు. ఢిల్లీ హైకోర్టు గట్టిగా జోక్యం చేసుకున్న అనంతరం వైవా సమర్పించారు. అది కూడా సంకెళ్లు తొలగించకుండానే. ఇంతలో తీహార్‌ జైలు నుంచి ఒకరు తప్పించుకున్నారు. దీంతో 1976 మార్చిలో ప్రబీర్‌ను ఆగ్రా జైలుకు తరలించారు. అక్కడ 25 రోజుల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారు. ప్రబీర్‌ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. సిపిఐ-ఎం రాజ్యసభ సభ్యుడు సమర్‌ ముఖర్జీ కేంద్ర హోంమంత్రి ఓం మెహతాకు లేఖ రాశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జైలు శిక్షను పున:పరిశీలించేందుకు నిరాకరించారు. సిపిఐ-ఎం నేతలు, పలువురు ఎంపీలు తీవ్ర ఒత్తిడిని కొనసాగించారు. చివరగా, 1976 సెప్టెంబర్‌ 25న, ఒక సంవత్సరం తరువాత, ప్రభుత్వం ప్రబీర్‌ను విడుదల చేయవలసి వచ్చింది.
ప్రబీర్‌ అరెస్టుకు సంబంధించిన అన్ని అంశాలను, పోలీసు అధికారులతో సహా సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత, జస్టిస్‌ షా కమిషన్‌ 1978 ఏప్రిల్‌ 26న జనతా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. ‘ప్రధాని నివాసం నుంచి ఆదేశాలు అందుకున్న అధికారి క్యాంపస్‌కు చేరుకుని తాను చూసిన మొదటి విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. అతను నిందితుడు కాదని తెలిసినా తప్పుడు కథనం సృష్టించి ‘మీసా’ కింద జైలుకు పంపారు. ఇది అధికార దుర్వినియోగం. పుర్కాయస్థ అరెస్ట్‌, మేజిస్ట్రేట్‌ వారెంట్‌ జారీ చేసిన తీరు…న్యాయ నిర్వహణ పూర్తి విచ్ఛిన్నతను చూపుతుంది’ అని నివేదిక పేర్కొంది.
అపరిమితమైన అధికార దురహంకారం, బాధ్యత కలిగిన అధికారుల వెన్నెముక లేనితనం కలిపితే ఏం జరుగుతుందో ఈ ఘటన తెలియచేస్తుంది. ఈ చర్యలు పాలనాపరమైన ప్రతిష్టపై శాశ్వత మచ్చగా మిగిలిపోతాయి.
ప్రధాని నివాసంలో ఎవరినో సంతృప్తి పరచడానికే ఈ అరెస్టు జరిగింది. అధికారం చేతిలో వుంది కదా అని, తాము ఏం చేసినా ఎవరికీ వివరణ ఇచ్చుకోనవసరం లేదని భావించడం వల్ల జరిగిన దురదృష్టకర పరిణామం ఇది.
ఇప్పుడు ప్రబీర్‌ను మళ్లీ జైలుకు పంపారు. ఏమీ మారలేదు. అసంతృప్తులను అణిచివేసేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడిన నాయకత్వం…చట్ట విరుద్ధమైనప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేసేందుకు లొంగిపోయే అధికారులు…సంబంధిత ఘటనలు పునరావృతం అవుతూనే వున్నాయి. అయితే…ఎమర్జెన్సీ సమయంలో చేసిన దానికి అంతిమంగా ప్రజాశక్తి తుపానుగా మారి ఆ ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసిందని గుర్తుంచుకోవాలి.

– శ్రీకుమార్‌ శేఖర్‌
‘దేశాభిమాని’ సౌజన్యంతో

➡️