పెట్టుబడిదారీ వ్యవస్థలో వేతన రహిత శ్రమ

ఉత్పత్తి, సామాజిక పునరుత్పత్తిలో ఇమిడి ఉండే వేతన, వేతన రహిత శ్రమ పెట్టుబడి సంచయానికి దోహదం చేస్తుంది. సరుకులు, సేవల ఉత్పత్తికి అవసరమైన శ్రామికశక్తి ఒనగూడడానికి సామాజిక పునరుత్పత్తి సంవిధానం తోడ్పాటు ఇస్తుంది.
భారీ ఎత్తున జరిగే సరుకుల ఉత్పత్తిని పెట్టుబడిదారీ వ్యవస్థగా నిర్వచిస్తుంటారు. శ్రామికశక్తిని సరుకుగా మార్చడం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. ఈ క్రమంలో సమాజంలోని శ్రామికులు నిస్సహాయంగా తయారయ్యే పరిస్థితులను నిరంతరాయంగా సృష్టిస్తూ ఉంటుంది పెట్టుబడిదారీ వ్యవస్థ. కార్మికులు తమ శ్రమ శక్తిని అమ్ముకున్నందుకు బదులుగా జీతం స్వీకరిస్తారు. కాబట్టి ఇది చెల్లుకు చెల్లు అన్న రీతిలో ఎంత మాత్రం నిర్బంధపూరితం కాని సర్వసాధారణ అంశంగా పైకి కనబడుతుంది.

పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలు ఎవరి ఆధీనంలో ఉంటాయో ఆ యాజమానులకు అదనపు విలువ గడించి పెట్టేలా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తారు. యజమానులు లాభాలు, సంపదా పోగేసుకుంటూ ఉంటే కార్మికులు మాత్రం నానాటికీ పేదరికంలోకి జారిపోతూ ఉంటారు. ఉత్పత్తి సాధనాల మీద కార్మికులను హక్కులు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఆదిమ పెట్టుబడి సంచయం ద్వారా అంటే నిర్బంధపూరిత విధానాల ద్వారా శ్రామికులను నిస్సహాయంగా మార్చడం అనేది ఇంకో పద్ధతి. ఇందులో ప్రత్యక్ష ఉత్పత్తిదారుడిని బలవంతంగా ఉత్పత్తి సాధనాల నుండి వేరు చేసి, ఈ ఉత్పత్తి సాధనాలను పెట్టుబడిగా మలిచి కార్మికులకు తమ శ్రమశక్తిని అమ్ముకోవడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి సృష్టిస్తారు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికీకరణ ప్రధాన ధోరణిగా కొనసాగుతుంది. అంటే కార్మికులు తమ శ్రమ శక్తిని అమ్ముకుని బదులుగా జీతాలు అందుకుంటారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ ముదిరాక శ్రామికీరణ మూలంగానే కార్మికులు నిస్సహాయులుగా మారతారని అనుకోనక్కరలేదు. ఎందుకంటే పెట్టుబడి ప్రత్యక్షంగా కార్మికులను పనిలో పెట్టుకోదు. అయితే పెట్టుబడి సంచయం జరిగే క్రమంలో శ్రమశక్తిని కల్పించడానికి కూడా శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. ఈ శ్రమ వేతన రహిత శ్రమ కాబట్టి దీనికి పెద్దగా గుర్తింపు ఉండదు. వంట చెయ్యడం, పిల్లలను సాకడం, ఇంట్లో ముసలివాళ్ళకు సేవ చెయ్యడం, కుటుంబంలో సభ్యులందరి మంచి చెడ్డలు చూసుకోవడం ఇవన్నీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పైసా ప్రతిఫలం లేని చాకిరేయే. ఇది ఇంటి పని అని సరిపెడుతున్నారు. కానీ ఇది వేతన రహిత శ్రమ అని వర్థమాన దేశీల్లోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ గుర్తిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ‘కుటుంబ ఆదాయం’ అనేది విచ్ఛిన్నం కావడం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, మానవ శ్రమకు బదులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో అటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, ఇటు వర్థమాన దేశాల్లోనూ వివిధ తరగతుల్లో వేర్వేరు కారణాల రీత్యా వేతన రహిత శ్రమ పెరుగుతూ వస్తున్నది.

ఉత్పత్తి, చలామణి వ్యయాల తగ్గింపు

పెట్టుబడి సంచయానికి ఉత్పత్తి, వినియోగం ఈ రెండూ కీలక అవసరాలే. పెట్టుబడిదారులు ముడిసరుకులు, యంత్రాలు, కార్మికుల శ్రమను కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెడతారు. ఉత్పత్తి అయ్యే క్రమంలో అదనపు విలువ ద్వారా పెట్టుబడిదారులకు లాభాలు ఒనగూరుతాయి. అయితే ఈ లాభం పెట్టుబడిదారుడి సొంతం కావాలంటే ఉత్పత్తి అయిన సరుకు మార్కెట్‌లో అమ్ముడుపోవాలి. ఇది జరగాలంటే వాణిజ్య పెట్టుబడి అంటే వాణిజ్యపు ప్రకటనలు, సరుకులు, అమ్మే వ్యాపారులు అవసరం. ఉత్పత్తి అయిన సరుకులు మార్కెట్‌లో అమ్ముడయ్యేందుకు వీలుగా పెట్టుబడిదారుడు వాణిజ్య అవసరాల కోసం అదనపు విలువలో కొంత భాగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో శ్రమశక్తి ఇమిడిపోయింది. పెట్టుబడిదారుడు అదనపు విలువను లాభంగా మార్చుకోవడంలో నష్టాన్ని నివారించుకోవడానికి గాను వేతన శ్రమకు బదులు వేతన రహిత శ్రమను వినియోగించుంటారు.

కుటుంబ వేతనం విచ్ఛిన్నం కావడంతో ఒక్క జీతంతో కుటుంబ పోషణ గడిచే పరిస్థితి ఉండదు. పూట గడవడం కోసం ఇంట్లో ఆడవాళ్లు కూడా పని వెతుక్కోవాల్సి వస్తుంది. లేదా ఇంట్లో మగ మనిషి పని కోసం పరాయి ఊళ్లోకి వలస వెళితే, మహిళలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వేతనరహిత శ్రమ చేయాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా వినియోగక్రమంలో కొనుగోలుదారులు వేతనరహిత శ్రమను అందించడం గణనీయంగా పెరిగింది. తద్వారా పెట్టుబడిదారు వాణిజ్య పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటాడు.

బట్టల షాపుల్లో, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లలో ఇతరేతర షోరూముల్లో సేల్స్‌ సిబ్బందిని గణనీయంగా తగ్గించివేశారు. వెండింగ్‌ మిషన్లు, టెల్లర్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఖాతాదారులకు సెల్ఫ్‌ సర్వీస్‌ అలవర్చడం ద్వారా రిటైల్‌ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంటే వేతన రహిత శ్రమను ప్రజాక్షేత్రంలో కూడా విస్తృతపరిచి అమ్మకాల వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు.
వాస్తవం ఏమిటంటే వివిధ రూపాల్లో వేతనరహిత శ్రమను పెంపొందిస్తున్నా తద్వారా ప్రత్యక్షంగా లాభాలను ఉత్పత్తి చేయలేరు. వేతన కార్మికుల నుండి ఎంత ఎక్కువగా శ్రమ దోపిడి చేస్తే అంత ఎక్కువ అదనపు విలువను పిండుకుంటుంది పెట్టుబడి. అయితే వివిధ రూపాల్లోని వేతన రహిత శ్రమ…శ్రమ శక్తిని మరింత చౌకగా మారుస్తుంది. అలాగే పంపిణీ వ్యయాన్ని తగ్గించి మరింత అదనపు విలువ పిండుకోవడానికి వీలవుతుంది.

వేతన కార్మికుల సంఖ్యను తగ్గించే, వేతనరహిత శ్రమను అందించే మిషన్లు ప్రవేశపెట్టడం ద్వారా తగ్గించుకుంటూ పోవడంద్వారా నిరుద్యోగం ప్రబలడానికి, కార్మికుల ఉమ్మడి బేరసారాల శక్తి తగ్గిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి వేర్వేరు పరిస్ధితులలో వేతనశ్రమ, వేతన రహిత శ్రమ మధ్య ఉన్న చలన సూత్రాలను పెట్టుబడి సంచయ స్వభావం నిర్ణయిస్తుంది. లాభాల హెచ్చింపుకు దోహదం చేస్తుంది. వర్ధమాన దేశాల్లోని స్వయం ఉపాధి కార్మికులు చౌక మార్కెట్లలో అమ్ముడుపోయే సరుకులు, సేవలు ఉత్పత్తి చెయ్యడం ద్వారా శ్రామికశక్తి పునరుత్పాదకతకు అవసరమయ్యే వ్యయాన్ని కట్టడి చేసేందుకు చూస్తారు. అలాగే సంఘటిత రంగంలో కాంట్రాక్టీకరణ ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా ఉత్పత్తి, సామాజిక పునరుత్పత్తి రంగాల రెండింటికీ వేతనేతర శ్రమ తోడ్పాటు ఇస్తుంది.

వివిధ వర్గాలపై వేర్వేరు ప్రభావాలు

వేతన శ్రమ, వేతనేతర శ్రమలు ప్రధాన వేతన ఆదాయానికి ఎలా తోడ్పడతాయనేది ఆ యా వర్గాల వారీగా, వేర్వేరుగా ఉంటుంది. శ్రామిక కుటుంబాలలో కుటుంబ వేతనం మీద అంటే ఒక వేతనం మీద ఆధారపడి కుటుంబ పోషణ గడిచే పరిస్థితి లేదు. నిజ వేతనాలు స్థంభించిపోవడమో, దిగజారి పోవడం మూలంగానో కుటుంబ పోషణ కోసం మహిళలు కూడా శ్రామిక శక్తిలో భాగస్వామ్యం కావడం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా కుటుంబంలో ఇద్దరూ పని చేయాల్సి రావడంతో వేతన రహిత శ్రమ అంటే ఇంటి పనులు, బిడ్డల సంరక్షణ వంటి బాధ్యతలు పలుచబడతాయి.

ఉన్నత మధ్య తరగతి వర్గాల్లో ఈ పనులు చేసేందుకు పని మనుషులను పెట్టుకుంటారు. అంటే వేతన రహిత శ్రమ స్థానాన్ని వేతన శ్రమ భర్తీ చేస్తుంది. అదే ధనిక దేశాల్లో అయితే ఇంటి సనులు చక్కబెట్టడానికి రకరాల గృహోపకరణ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి కొనే స్థోమత, వీటిని వినియోగించగలిగే సమయం ఉన్న వారికే ఉపయోగకరం. అంటే ధనిక కుటుంబాల వేతన రహిత శ్రమ సామాజిక పునరుత్పత్తి కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అదే శ్రామిక కుటుంబాల్లో అయితే వాళ్ళ ఆదాయాలు కుటుంబ పోషణకీ బొటాబొటిగా సరిపోతాయి కాబట్టి ఇంటి పనుల కోసం వేరే మనుషులను పెట్టుకునే పరిస్థితి ఉండదు. పర్యవసానంగా వేతన రహిత శ్రమ కుంచించుకుపోయి సామాజిక పునరుత్పత్తి క్రమం అంతే పిల్లల ఆరోగ్యం, చదువులు మున్నగునవి దెబ్బతినిపోతాయి. అంటే వేతన శ్రమ, వేతనేతర శ్రమలు వివిధ తరగతులకు చెందిన ప్రజానీకం మీద వేర్వేరు ప్రభావాలు చూపుతాయని స్పష్టం అవుతున్నది.
అంతిమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకించి రోబోట్లు, కృతిమ మేధ వంటి వాటి వినియోగం భవిష్యత్‌లో వేతన శ్రమ, వేతన రహిత శ్రమ మీద ప్రభావం చూపించనున్నది. వేతన శ్రమను వేతన రహిత శ్రమలో భర్తీ చేయడం మూలంగా కార్మికుల నిజ వేతనాలు పడిపోయే అవకాశం ఉంటుంది.

సామాజిక పునరుత్పత్తి క్రమం మీద ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా శ్రమశక్తి ఉత్పత్తి వ్యయం తగ్గుముఖం పడుతుంది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ సరుకులకు ఉన్న మారకపు విలువను మాత్రమే గుర్తిస్తుంది. వేతన రహిత శ్రమ ద్వారా ఉత్పత్తి అయిన ఉపయోగపు విలువ శ్రమశక్తి మారకం విలువ మీద గానీ వేతనాల మీద గానీ ప్రభావం చూపించగలిగితే అప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లు చక్కబెట్టడం, మరమ్మతులు చెయ్యడం తదితర స్వయం సేవలకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానం పంపిణీ వ్యయాన్ని తగ్గించగలిగితే పెట్టుబడి దాన్ని లాభదాయకంగా పరిగణిస్తుంది.

కాబట్టి వేతన రహిత శ్రమ ద్వారా సృష్టించబడిన ఉపయోగపు విలువ మారకపు విలువకు లోబడి ఉంటుంది. అయితే వేతన శ్రమ కుంచించుకుపోతూ.. వేతన రహిత శ్రమ పెరిగిపోతూ…ఈ వేతన రహిత శ్రమ వేతన శ్రమ నుండి వేరుపడిన కొలదీ…దీనిని హీరోచితం చెయ్యడం పెట్టుబడిదారీ వ్యవస్థకు నానాటికీ క్లిష్టతరంగా మారుతుంది.

సంజయ్ రాయ్

➡️