సంపద సృష్టికి, సమాజాభివృద్ధికి తరతరాల నుండి శ్రమను ధారపోస్తున్న దళితులు నేటికీ అమానుషమైన అంటరానితనం, కుల వివక్ష, అత్యాచారాలు, అణిచి వేతలకు, సాంఘిక బహిష్కరణలకు గురవుతున్నారు. భూమి, నీరు, సంపద, బడ్జెట్, అభివృద్ధిలో వాటా దక్కక, కేటాయింపులు లేక, చేసినవీ అందక పేదలుగానే వున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అందడం లేదు. దళితుల సామాజిక, ఆర్థిక సమానత్వ సాధనకై ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం’ (కె.వి.పి.ఎస్) 1998 అక్టోబర్ 2న ఏర్పడింది. కుల వివక్ష రూపాలు, సమస్యలను గుర్తించి వాటి నిర్మూలనకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో దళితులకు అండగా పోరాడుతున్నది. సమాజంలో చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దళితులు, అభ్యుదయ వాదులందరినీ సమీకరించి ప్రతిఘట నోద్యమాలను నిర్వహిస్తున్నది.
హాటళ్లు, సినిమా హాళ్ళల్లో అందరం కలిసే వుంటున్నాం. అంటరానితనం, కుల వివక్ష ఇంకా ఎక్కడుంది? ఇప్పటికే అనేక దళిత సంఘాలుండగా కె.వి.పి.ఎస్ అవసరం ఏమిటనే అనేక విమర్శలు, వాదనలు ఆనాడు వచ్చాయి. సంఘం ఏర్పడిన అనతి కాలంలోనే రాష్ట్రంలో అంటరానితనం, కుల వివక్ష రూపాలు, దళితుల సమస్యలపై 11 వేల గ్రామాల్లో సర్వేలు నిర్వహించగా వెల్లడైన ఘటనలు హృదయ విదారకంగా వున్నాయన్నారు.
కె.వి.పి.ఎస్ పోరాట ఫలితంగా ఏకసభ్య కమిషన్, ఎస్.సి-ఎస్.టి కమిషన్, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు, శ్మశాన పరిరక్షణకు జీవో-1235 లాంటి అనేక విజయాలు సాధించింది. పసిబిడ్డ గొంతెండి దాహమంటున్నా ఊరుమ్మడి బావిలో నీళ్ళు తోడుకోలేని దుస్థితి. హోటళ్ళలో టీ తాగుదామన్నా వేరే గ్లాసు. గడ్డం గీయరు. రచ్చబండపై కూర్చోనివ్వరు. ఇటువంటి అంటరానితనం నేటికీ చాలా జిల్లాల్లో వుంది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ఎదురొస్తే దళితులు వంగి దండం పెట్టాలి. కష్టాలన్నీ దేవుడికైనా చెప్పుకుందామంటే గుడి మెట్ల దగ్గరికే రానివ్వరు. చివరకు కాటికి వెళ్ళినా వివక్షే. అన్ని కులాలవారి దహన సంస్కారాలు చేసే దళితుడికి శ్మశానం లేదు. ఇతర కులాల శ్మశాన వాటికల్లో దళితుల శవాలను సమాధి చేయనివ్వరు.
దళితులకు కేటాయించిన నిధులు తక్కువ. విడుదల తక్కువ. ఖర్చు ఇంకా తక్కువ. మాకు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు మాకే ఖర్చు చెయ్యాలని ఆందోళన చేస్తున్నప్పటికి గత ప్రభుత్వాలు దారి మళ్లించాయి. కె.వి.పి.ఎస్ వీటికి వ్యతిరేకంగా పోరాడింది. నేటి చంద్రబాబు ప్రభుత్వమైనా సబ్‌ప్లాన్ నిధులు కేటాయించి ఖర్చు చెయ్యాలి.
మహనీయుల స్ఫూర్తితో దళితుల సమస్యలపై సామాజిక చైతన్య యాత్రలు జరిగాయి. అంటరానితనం, కుల వివక్షను వ్యతిరేకించే వారందరనీ సమైక్యపరిచి మానవహారాలు, పాదయాత్రలు…ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి సామాజికోద్యమ నాయకుల జయంతి వర్ధంతుల సందర్భంగా కె.వి.పి.ఎస్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నేడు దళితులపై జరుగుతున్న దుర్మార్గమైన దాడులకు వ్యతిరేకంగానూ పోరాడుతున్నది.
ప్రజాప్రతినిధులు సైతం దళితులను అవమాన కరంగా మాట్లాడుతుంటారు. వీటిపై కేసులు లేవు. రాజీ ప్రయత్నాలు సరేసరి. రాష్ట్రంలో పెరుగుతున్న దాడులు, కుల వివక్ష నిర్మూలనకు కృషి లేదు. దళితులకు ఉన్న రక్షణ చట్టాలు అమలు కావడం లేదు. ఆ చట్టాలతో పాటు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయడమేగాక దళితులకు రక్షణ కల్పించాలి. చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
వ్యాసకర్త కె.వి.పి.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
సెల్ : 9490300366