వికసిత్‌ సింధియా!

May 12,2024 05:15 #editpage

పట్టువదలని విక్రమార్కుడు చెట్టుకు వేలాడుతున్న శవాన్ని దించి, తన భుజాన వేసుకున్నాడు. స్మశానం వైపు వేగంగా నడవ సాగాడు. కొంత దూరం వచ్చేవరకూ మౌనంగా వున్న బేతాళుడు…కూనిరాగాలు తీయడం మొదలెట్టాడు. ‘ఇదేమిటి? రోజూ ప్రశ్నలతో వేధించే బేతాళుడు కొత్తగా కూనిరాగాలు తీస్తున్నాడు’ అనుకున్నాడు విక్రమార్కుడు. అయినా, ఈ బేతాళుడ్ని కదిలించిన దగ్గర నుంచి ఏదోక కథ చెప్తానంటాడు. ఎందుకొచ్చిన గోల… అనుకున్నాడు మనసులో.
విక్రమార్కుడి ఆలోచనలు పసిగట్టిన బేతాళుడు… ‘రాజా! నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు…’ అంటూనే ఈసారి పైకే పాడటం మొదలు పెట్టాడు. ‘వేషము మార్చెను/ భాషను మార్చెను/ మోసము నేర్చెను/ అసలు తానే మారెను/ అయినా..మనిషి మారలేదు/ ఆతని మమత తీరలేదు’…లలలల…ఆఆఆ అంటూ రాగం తీస్తున్నాడు కర్ణకఠోరంగా. ఒకసారి విక్రమార్కుడి వైపు చూసి…’దేశమంటే మట్టికాదోరు…దేశమంటే మనుషులోరు’ అంటూ మరో రాగం అందుకున్నాడు.
బేతాళుడి పాట వినడం చాలా దుర్భరంగా అనిపించింది విక్రమార్కుడికి. అతనికి ఆటంకం కలిగిస్తే…మళ్లీ చెట్టెక్కి కూర్చుంటాడేమోనన్న భయంతో…తన అసహనాన్ని మనసులోనే దాచుకొని..చిరాగ్గా శవంవైపు చూస్తూ మౌనంగా నడవసాగాడు. ‘రాజా, నీ అసహనం నాకర్థమైంది. నిజానికి నీ శ్రమ, దీక్ష చూస్తూంటే నాకెంతో ముచ్చటగా వుంది. అందుకే… నీకు అలసట తెలియకుండా వుండేందుకు ‘వికసిత్‌ సింధియా’ అనే కథ చెప్తా…జాగ్రత్తగా విను’ అంటూ మొదలు పెట్టాడు.
‘సింథియా అనే దేశానికి కాషాయం పార్టీకి చెందిన జేడీ అధినేతగా వున్నాడు. పదేళ్ల పాలనలో జేడీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అంటూ దేశ్‌ కా సత్యనాశ్‌ చేశాడు. వికసిత సింధియా అంటూ…దేశాన్ని విఫల సింధియాగా మార్చాడు. ఆయనిచ్చిన 150 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అచ్చే దిన్‌ అన్నాడు…కానీ సచ్చేదిన్‌ వచ్చిందని ప్రజలు వాపోతున్నారు ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడితే… పాకిస్తాన్‌, పుల్వామా అంటూ ఎమోషనల్‌ డ్రామాతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ‘సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడుపడవోయి/ దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుషులోరు’ పెద్దపెద్ద కవులు రాసిన కవితల్లోని వాక్యాలను బట్టీ పట్టి… అవసరాన్ని బట్టి వల్లెవేస్తుంటాడు. రాజా…వికసిత్‌ సింధియా అంటే ఏమిటి? నిజంగానే సింధియా వికసించిం దంటారా? జెడీ గొప్పలకు అర్థముందా?’ ఇంతకీ నిజమేంటి? నువ్వేమనుకుంటున్నావు?’ నిజం చెప్పు. నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది’ అన్నాడు బేతాళుడు.

చెప్పకపోతే వీడెలాగూ వదిలి పెట్టడు అనుకున్న విక్రమారుడు…’ఇందులో చెప్పడానికే ముంది. తెలుగునాడుకు వచ్చినప్పుడల్లా గురజాడ వారి ‘దేశమంటే మట్టికాదోరు… దేశమంటే మనుషులోరు’ అని చెబుతుంటాడు. వాస్తవానికి జేడీ చెప్పే వికసిత్‌లోని వికాసం సింధియా మనుషుల్లో వుండాలి. నిజానికి దానికి విరుద్ధంగా జరుగుతోంది. నిరుద్యోగం పెరిగింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరి వికసిత్‌ ఎవరికి అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నాకు తెలిసి…అబానీకి, అందానికి, జేడీకి మాత్రమే వికసిత్‌ గానీ, ప్రజలకు కాదు. అందుకే ఆ దేశంలోని సోషల్‌ మీడియాలో వికసిత్‌ అందానీ, వికసిత్‌ అబానీ అంటూ పోస్టులు పెడుతున్నారు’ అని బదులిచ్చాడు విక్రమార్కుడు.
‘రాజా…నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు జేడీ వికసిస్తాడో లేదో చూద్దాం…అంతవరకు సెలవు’ అంటూ విక్రమార్కుడి భుజమ్మీద నుంచి మాయమై మళ్ళీ చెట్టెక్కాడు బేతాళుడు.

– రాజాబాబు కంచర్ల
9490099231

➡️