పాలకుల మాటలకు, ప్రజల వాస్తవ జీవితాలకు పొంతనే లేదు. ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, వికసిత భారత్‌గా ఎదిగిపోతున్నామని పాలకులు చెబుతుంటే, 140 కోట్ల మందిలో వంద కోట్ల మంది భారతీయుల దగ్గర కొనడానికి డబ్బులు లేవని, మరో 30 కోట్ల మంది ఉన్నత మధ్యతరగతి వర్గం తమ దగ్గర వున్న కొద్దిపాటి డబ్బును ఖర్చు చేయడానికి భయపడుతున్నారని బ్లూమ్ వెంచర్స్ అనే పెట్టుబడుల సంస్థ తాజా సర్వే తేల్చింది. దేశ పాలకులు అనుసరించిన నూతన ఆర్థిక విధానాల వల్ల దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగకపోగా, అందుకు విరుద్ధంగా కొద్దిమంది సంపన్నుల వద్దే సంపద మరింతగా పోగుబడిందని ఈ అధ్యయనం చెప్పింది. 1990లో జాతీయ ఆదాయంలో 10 శాతం మంది దగ్గర దేశ సంపదలో 34 శాతం సంపద ఉండగా, ప్రస్తుతం 57.7 శాతానికి చేరుకుంది. నరేంద్ర మోడీ పాలనలో ఈ ధోరణి మరింతగా పెరిగింది. సంపద కేంద్రీకరణతో పాటు, ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు కొద్దిమంది ఆస్తిగా మారి, అత్యధికమంది ఆస్తి లేని వారుగా దిగజారారు. అందువల్ల దేశంలో మూడు విభిన్న ఆర్థిక తరగతులు ఏర్పడ్డాయని ఈ సర్వే చెప్పింది. ఈ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చేందుకు కోట్ల మందిని కుంభమేళాలో పుణ్యం కోసం ముంచుతున్నారు.
మూడు భిన్న ఆర్థిక వ్యవస్థలు
దేశ జనాభాలో 46 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే జాతీయ ఆదాయంలో ఈ రంగం వాటా మాత్రం కేవలం 15 శాతం. స్వాతంత్య్రానంతరం పాలకులు గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా వున్న సన్న, చిన్నకారు రైతులను, వ్యవసాయ కూలీలను, వృత్తిదారులను గాలికి వొదిలేసి భూస్వాముల సేవలో తరించారు. దీని ఫలితంగా 1964లో జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా 48 శాతం వుండగా, 2024 నాటికి 15 శాతానికి పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడంలో భూ పంపిణీ కీలకమైంది. ఆ దిశగా పాలకుల చర్యలు నామమాత్రమే.
పాలకులు అనుసరించిన విధానాల వల్ల మూడు విభిన్న ఆర్థిక తరగతులు ఏర్పడ్డాయని బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది. అవి ఒకటి, సంపన్నులు; ఏ సరుకునైనా ఎంతటి ఖరీదైనా కొనగలిగిన అత్యున్నత తరగతి. రెండు, ఊగిసలాటలో వున్న ఉన్నత మధ్యతరగతి. మూడు, మనుగడ కోసం పోరాడుతున్న కోట్లాది శ్రామికవర్గం. మొదటి తరగతిలో 13 లేదా 14 కోట్ల మంది సంపన్నులు. వీరిని ఒక దేశంగా పరిగణిస్తే ప్రపంచ జనాభాలో పదవ దేశంగా, తలసరి ఆదాయంలో 63వ దేశంగా వుంటారు. వీరి వద్ద మాత్రమే అత్యంత కొనుగోలు శక్తి వుంది. ఈ కొద్దిమంది కొనుగోలు పైనే కీలకమైన వ్యాపార సంస్థలు ఆధారపడి ఉన్నాయి. వీరిని ఆకర్షించగలిగే వాటినే ఉత్పత్తి చేయడం, ప్రచారం చేయడం పెరిగింది. వీరి వల్ల ఖరీదైన బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. వీటి అమ్మకాల్లో భారీగా ఆఫర్లు ఇవ్వడం కంటే, నాణ్యమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను మెరుగుపరిచి, సంపన్నులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న అల్ట్రా లగ్జరీ గేటెడ్ హౌసింగ్, ఖరీదైన ఫోన్లు అమ్మకాలు పెరగడం, పెళ్ళిళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇందుకు నిదర్శనం. 2015లో బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలు, 70 శాతంగా వుంటే 2022 నాటికి 90 శాతానికి పెరగడం ఇందులో భాగమే. జనాభాలో ఈ 10 శాతంగా ఉన్న వీరు ఎలాంటి ఆలోచన లేకుండా, ఇష్టానుసారంగా ఖర్చు చేయగలిగిన వినియోగదారులు.
ఇక రెండో తరగతికి చెందిన వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేయడానికి ఊగిసలాడుతున్నవారు. నూతన ఉపాధి అవకాశాల ద్వారా కొంత సొమ్ము పోగేసుకున్నప్పటికి భవిష్యత్ వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, పిల్లల చదువులు, ఆరోగ్యం, రోజువారి ఖర్చులు, నివాసం, వృద్ధాప్యం ఇలా అనేక అంశాలు వీరి కొనుగోలును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కోవిడ్ తర్వాతి పరిణామాలు వీరి జీవితాలను మరింత ఆందోళనకరంగా మార్చాయి. కోవిడ్ తర్వాత భారత దేశంలో ఆర్థిక పునరుత్తేజం ఆంగ్ల అక్షరం ‘కె’ ఆకారంలో ఉందన్న దీర్ఘకాలపు అభిప్రాయాలను ఈ నివేదిక బలపరుస్తుంది. ఈ కాలంలో ధనికులు మరింత ధనికులు అయ్యారు, పేదలు కొనుగోలు శక్తిని కోల్పోయారు. వాస్తవానికి, ఈ పరిణామం కోవిడ్ కంటే ముందే ప్రారంభం అయింది. దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 11 సంవత్సరాల మోడీ పాలనలో కార్పొరేట్లకు ప్రభుత్వ రాయితీలు, సహాయం భారీగా పెరిగి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజా సంక్షేమ పథకాలకు కోతలు వేయడంతో దేశంలో వినియోగం మరింతగా పడిపోయింది. కొనుగోలే లేనప్పుడు పొదుపు అనేది వుండదు. మన దేశ ప్రజల ఆర్థిక పొదుపు 2000 సంవత్సరంలో 10.1 శాతం వుండగా, 2023 నాటికి 5.1 శాతానికి పడిపోయింది. మన పొరుగు ఆసియా దేశాల ప్రజలు 30 శాతం, చైనా ప్రజలు 44 శాతం పొదుపు చేస్తున్నారు. ఈ మధ్యతరగతి తమ జీవిత అవసరాల కోసం అప్పులపై ఆధారపడుతున్నారు. విద్యార్థుల నుండి ఫించన్‌దారుల వరకు రకరకాల యాప్‌లతో రుణాలు ఇచ్చే సంస్థలు పెరిగాయి. ఆన్‌లైన్ లోనింగ్ యాప్‌లు యువతలో బలమైన పట్టును సాధించుకున్నాయి. అనేక దుష్పరిణామాలు జరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఖర్చు చేయడం తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగా ప్రజలకు తేలిగ్గా అందుబాటులోకి వచ్చిన జామీను అక్కరలేని రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించింది. 2023 ఆగస్టులో ఇలాంటి రుణాల వాటా 24 శాతం వుండగా 2024 జూన్ నాటికి 15 శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఆశావహులైన వినియోగదారుల వర్గం ఇలాంటి రుణాల వల్లనే పుట్టుకొచ్చింది. ఆ రుణాలను కట్టడి చెయ్యడం వినియోగాన్ని ప్రభావితం చేసింది. భారతదేశంలో అందుబాటులో ఉన్న నివాస గృహాల మార్కెట్ ఐదేళ్ల కిందట 40 శాతం ఉండేది. అది ప్రస్తుతం 18 శాతానికి పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా క్షీణించాయి. భారతదేశపు వినియోగ దారుల మార్కెట్‌కు మూల స్తంభంగా ఉన్న మధ్య తరగతి వర్గాన్ని పీల్చి పిప్పి చేశారని, వారి ఆదాయం చాలా కాలం నుంచి ఎదుగు బొదుగు లేకుండా ఉందని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజర్లు రూపొందించిన మరో నివేదిక చెబుతోంది. మోడీ పాలనలో దేశంలో పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం ప్రజల ఆదాయం స్తబ్ధతగా ఉంది. ”ఆర్థికంగా పెరుగుతున్న భారం మధ్య తరగతి ప్రజల పొదుపును దాదాపు ఖాళీ చేసింది. భారత దేశంలో కుటుంబాల నికర పొదుపు 50 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. దీని వల్ల మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునే వస్తువులు, సేవలకు డిమాండ్ రానున్న రోజుల్లో భారీగా పడిపోతుందని” ఆ నివేదిక చెప్పింది. సేవా రంగం మన జాతీయ ఆదాయంలో కీలకంగా ఉంది. జిడిపిలో 54 శాతం వాటా కలిగి, 31 శాతం శ్రామిక శక్తికి ఉపాధి కలిపిస్తుంది. ఎ.ఐ ముప్పుతో, చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో కోల్పోయే అవకాశం ఉంది. భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి ఇదొక సవాలుగా మారుతంది.
మూడో తరగతికి చెందిన 90 శాతం మంది శ్రమజీవులను ప్రభుత్వాలు ఆచరణలో విస్మరిస్తున్నాయి. వీరు రోజువారీ పనిచేసుకుని కడుపు నింపుకునే పేదలు, ఆర్థికంగానే కాక, సామాజికంగా తరతరాలుగా అణచబడినవారు. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల దృష్టిలో వీరు వినియోగదారులు కాదు. వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదా ఆరోగ్య ప్రయోజనాలు అందుబాటులో లేవు. దేశంలో విస్తరిస్తున్న గిగ్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తున్నది వీరిలోని చదువుకున్న యువతే. న్యాయమైన వేతనాలు, కార్మిక హక్కులు లేవు. అత్యధికులు ఉపాధి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. దేశంలో 15 సంవత్సరాలు పైబడిన యువత 96 కోట్ల మంది వున్నారు. ఇందులో 57.8 కోట్ల మంది పనిచేయగలిగే శ్రామికులుగా వున్నారు. వీరిలో 18 కోట్ల మంది నిరుద్యోగులు, ముఫ్పై రెండున్నర కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నవారు. 11 కోట్ల మంది కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులు, కేవలం 9 శాతం మంది మాత్రమే రెగ్యులర్ వేతనాలు పొందుతున్నవారు. మన పక్కన వున్న బంగ్లాదేశ్‌లో 42 శాతం మంది రెగ్యులర్ వేతనాలు పొందుతున్నారని బ్లూ వెంచర్ నివేదిక తెలిపింది. చదువుకున్న వారిలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఈ నివేదిక కూడా మరోసారి స్పష్టం చేసింది. డిగ్రీ ఆపైన చదివినవారిలో 28.7 శాతం, సెకండరీ/ హయ్యర్ సెకండరీ చదివిన వారిలో 11.5 శాతం నిరుద్యోగులు వున్నారు.
మేకిన్ ఇండియా గురించి ప్రధాని మాటలు కోటలు దాటుతున్నప్పటికీ తయారీ రంగంలో దేశం చాలా పేలవమైన తీరులో వుంది. దేశ స్థూల జాతీయ ఆదాయంలో తయారీ రంగం వాటా 1960లో 15 శాతంగా వుంటే 2023లో 12.9 శాతానికి దిగజారింది. మన పొరుగున వున్న బంగ్లాదేశ్, శ్రీలంకల జాతీయ ఆదాయంలో తయారీ రంగం వాటా వరుసగా 22, 18 శాతంగా వుంది. దేశంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ప్రధాని చెప్పే మాటాలకు చేతలకు పొంతన లేదు. ఉదాహరణకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు దేశంలో బ్యాంకు రుణాలపై వడ్డీ 12-15 శాతం వుండగా, చైనాలో కేవలం 3-5 శాతం మాత్రమే ఉంది. అంతేకాకుండా జిఎస్‌టి విధానంతో చిన్న తరహా తయారీ రంగం పూర్తిగా పతనమైంది.
ఈ అసమానతలను పరిష్కరించకుండా దేశాభివృద్ధి గురించి మాట్లాడటమంటే పది శాతంగా వున్న సంపన్నుల గురించి మాట్లాడటమే. ఉన్నత మధ్య తరగతికి చెందిన 30 కోట్ల మంది ఆందోళనతో జీవిస్తుండడం, మిగిలిన వంద కోట్ల మందికి కొనుగోలు లేకపోవడం నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు. ఈ సవాళ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే అవకాశం లేదు. ఈ ఆర్థిక, సామాజిక అసమానతల అంతం కోసం విశాల ప్రజా ఉద్యమాలే అంతిమ పరిష్కారం.
వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్