కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పేర్లతో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ”సమాన పనికి సమాన వేతనం” అమలు కావడం లేదు. దీనివలన దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగు తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేర్లతో అనేక సౌకర్యాలను తగ్గించి, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించు కొంటున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటుగా ఆర్థిక, సామాజిక భద్రత లేకుండా చేస్తూ బహిరంగంగా శ్రమ దోపిడికి దారితీసింది.
రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం. పౌరుడికి చట్టం ముందు సమాన హక్కును రాజ్యం నిరాకరించకూడదని, ప్రతి ఒక్కరికీ చట్టాల నుంచి సమానమైన రక్షణ కల్పించాలని ఆర్టికల్‌ 14(ఎ) హామీ ఇస్తున్నది. కానీ ఒకే పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు-రెగ్యులర్‌ ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసాలు ఈ హక్కును కాలరాస్తున్నాయి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానమైన రక్షణను ప్రభుత్వాలు కల్పించటం లేదు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల శ్రమను భక్షిస్తూ వారిని పేదరికంలోకి, నిరంతర అభద్రతలోకి నెడుతున్నాయి. ఆర్టికల్‌ 16 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగ నియామకాలలో ఎటువంటి వివక్ష ఉండకూడదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల పేరుతో రిజర్వేషన్లను అమలు చేయకుండా రాజ్యాంగ విరుద్ధ నియామకాలు చేస్తూ సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశాయి. ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో రాజకీయ సిఫార్సులు, లంచాలు రాజ్యమేలుతూ నిరుపేద నిరుద్యోగులను నిస్సహాయ స్థితికి నెడుతున్నాయి. తెల్లవారి లేచింది మొదలు పేదరికం నిర్మూలన, సామాజిక న్యాయం గురించి మాట్లాడే పాలకులు అమానవీయమైన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవన హక్కు అంటే గౌరవప్రదమైన జీవితం. కాని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఈ హక్కుకు నిరాకరిస్తున్నారు. ఆర్టికల్‌ 39(డి) సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేస్తుంది. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వేతనాలు రెగ్యులర్‌ ఉద్యోగులు వేతనాల కంటే తక్కువగా ఇవ్వడంతో రాజ్యాంగం నిర్దేశించిన సమాన పనికి సమాన వేతనం గాలి మాటగా మారిపోతుంది. నిరుద్యోగులకు పని అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆర్టికల్‌ 41 నిర్దేశిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో సంవత్సరాల తరబడి ఏర్పడిన ఖాళీలు నింపకుండా శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగాల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమైనది. భద్రత లేని ఉద్యోగాలు నింపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయడంలేదు.
కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుంది. రెగ్యులర్‌ ఉద్యోగులతో పోల్చితే కాంట్రాక్ట్‌ ఉద్యోగులది తక్కువ వేతనం. సామాజిక భద్రత లేమి, పింఛన్‌, ఎస్‌.ఇ.సి, గ్రాట్యూటీ, వీడ్కోలు ప్యాకేజీ వంటి ప్రయోజనాలు లేకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలు, మధ్యవర్తుల ద్వారా నియామకాలు జరగడం వల్ల మధ్యవర్తులకు లాభం, ఉద్యోగులకు నష్టం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ప్రోత్సాహకాలు, ప్రమోషన్లకు దూరంగా ఉంచడం వల్ల అభివృద్ధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. మన రాజ్యాంగం ప్రకారం ఆదర్శ యజమానిగా ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో అసమానతను ప్రోత్సహించే విధానం అవలంబిస్తున్నాయి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రిటైర్‌ అయినా, ఏ కారణం చేతనైనా ఉద్యోగాలు కోల్పోయినా ఆ తర్వాత పింఛన్‌, గ్రాట్యూటీ, ఆరోగ్య బీమా లేదా చికిత్స సదుపాయాలు అందడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం, భరోసా కూడా వుండడం లేదు.
”సమాన పనికి సమాన వేతనం” పౌరుల హక్కు మాత్రమే కాకుండా రాజ్యాంగంలో ప్రాథమిక విధానమని రంధిర్‌ సింగ్‌ కేసు (1978) తీర్పు పేర్కొంది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని ఉమాదేవి కేసు (2006)లో సుప్రీంకోర్టు సూచించింది. సమాన పనికి సమాన వేతనం అనే హక్కును జగ్జీత్‌ సింగ్‌ కేసు (2016)లో సుప్రీంకోర్టు మరింత బలపరిచింది. తాత్కాలిక ఉద్యోగులకు కూడా రెగ్యులర్‌ ఉద్యోగులు వేతనాలు ఇవ్వాల్సి ఉందని తీర్పు ఇచ్చింది. కార్మికులకు వారి ప్రయోజనాలు అందకుండా చేసేందుకు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించడం తప్పు. ఒకే విధమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకే రకమైన పనిచేస్తున్న వ్యక్తికి (కాంట్రాక్టు పేరిట)…మరొకరి (పర్మినెంట్‌ ఉద్యోగి) కంటే తక్కువ జీతం ఇవ్వడం కుదరదు. మరీ ముఖ్యంగా సంక్షేమ రాజ్యంలో అస్సలు కుదరదు” అని ధర్మాసనం పేర్కొంది. ”తక్కువ వేతనం తీసుకుని పని చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని, స్వీయ విలువను తగ్గించుకుని మరీ తక్కువ జీతానికి పనిచేస్తారు. అలా చేయకపోతే తమపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసు” అని తీర్పు రాసిన జస్టిస్‌ ఖేహర్‌ పేర్కొన్నారు. ”ఒకే రకమైన పరిస్థితుల్లో, ఒకే రకమైన పని చేసే వారి మధ్య వేతనాల్లో తేడా ఉండటమంటే శ్రమను దోచుకోవడమే. ఇది కచ్చితంగా అణచివేత చర్యే” అని స్పష్టం చేశారు. తాత్కాలిక ఉద్యోగులను పునరుద్ధరించడంలో ప్రభుత్వాల నిబంధనలలో స్పష్టత అవసరమని మోహనలాల్‌ కేసు(2021)లో సుప్రీం కోర్టు చెప్పింది.
నిర్దిష్ట కాలం పనిచేసిన తర్వాత, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేలా విధానాలు రూపొందించాలి. సంస్థల పాత్రను పర్యవేక్షించడానికి ప్రత్యేక నియంత్రణా మండళ్లు ఏర్పాటు చేయాలి. కరువు భత్యం, ఇంటి అద్దె, పింఛన్‌, గ్రాట్యూటీ, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు అమలు చేయాలి. కనీస వేతనం, వర్క్‌ అవర్స్‌ నియంత్రణ పర్యవేక్షణలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. కోర్టుల ద్వారా వచ్చిన తీర్పులు ముఖ్యంగా సమాన వేతనం తీర్పులు, త్వరగా అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలు ఇవ్వడంలో, వారి అప్పులు మాఫీ చేయడంలో ఆసక్తి చూపుతున్నాయి కానీ …పేద కుటుంబాల నుండి వచ్చిన ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమమ్‌ ఆఫ్‌ టైం స్కేల్‌ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం.2 చెప్తోంది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమైనది. కృత్రిమ నిబంధనలు సృష్టించి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే దీని ఉద్దేశం. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, సమానత్వం కోసం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలి.


– వ్యాసకర్త : బి. కాంతారావు,

రాష్ట్ర కో-చైర్మన్‌, ఎ.పి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జెఎసి.

సెల్‌ : 9490623349

➡️