పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్యాకేజి

కేంద్ర ప్రభుత్వ ”క్యానెబిట్‌ కమిటీ ఆన్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌” (సి.సి.ఇ.ఎ) ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జనవరి 17న జరిగిన సమావేశంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రివైవల్‌ ప్యాకేజీ కోసం రూ.11,440 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. ఎన్‌డిఎ ప్రభుత్వం 6 నెలలు కష్టపడి ఉక్కు సంకల్పంతో సాధించిన ఘన విజయంగా రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వ అధినేతలు ప్రకటించారు. విశాఖ స్టీల్‌ను 100 శాతం ప్రైవేటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సుమారు గత నాలుగు సంవత్సరాల కాలంలో…రాష్ట్ర ప్రజల మద్దతుతో కార్మిక వర్గం నిరంతర పోరాట ఫలితంగానే ఈ ప్యాకేజీ సాధ్యమైంది. స్టీల్‌ కార్మికులు, ప్రజలు పోరాడి సాధించుకున్న ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతుందో ముందు ముందు చూడాలి. అయితే ఈ ప్యాకేజీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ ప్యాకేజీని అందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే ప్లాంటుకు ముఖ్యం స్వంత గనులు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.11,440 కోట్లలో రూ.1140 కోట్లు షేర్‌ ధనానికి అసలు, వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఈక్విటిగా కేటాయించిన రూ.10,300 కోట్లలో ఇప్పటికే రూ.1200 కోట్లు విశాఖ స్టీల్‌కు వినియోగించారు. కార్మికుల పి.ఎఫ్‌, జీతాలకు ఇందులో రూ. 1000 కోట్ల బకాయిలు చెల్లించాలి. 2025 ఆగస్టు నాటికి మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నడిపి పూర్తి సామర్ధ్యం సాలీనా 73 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఉత్పత్తి సాధించడానికి సాలీనా రూ.18 వేల కోట్లు ముడి ఖనిజాలకు ఇప్పటి రేట్ల ప్రకారం ఖర్చు అవుతుంది. రెండు సంవత్సరాలలోనైనా 100 శాతం సామర్ధ్యం సాధించడానికి ఇప్పుడు కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవు. కేవలం 7 లక్షల టన్నుల సామర్ధ్యం వున్న కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ ప్లాంట్‌కు రూ.18 వేల కోట్లు కేంద్రం కేటాయించింది. ఇద్దరు ఎంపీలతో కర్ణాటక రూ.18 వేల కోట్లు సాధించినా అక్కడ ఇంత ఆర్భాటం చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో గొప్పగా ప్రచారం చేయడం సంకీర్ణ ప్రభుత్వ ఘనత. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను 100 శాతం అమ్మాలని నిర్ణయించిన 2021-22 సంవత్సరంలో కూడా విశాఖ స్టీల్‌ రూ.913 కోట్లు నికర లాభాలార్జించింది. రూ.28,215 కోట్లు అత్యధికంగా టర్నోవర్‌ పొందింది. గత మూడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం, అదాని పోర్టులు ఉత్పత్తిని అడ్డుకుని విశాఖ స్టీల్‌ను నష్టాల్లోకి నెట్టాయి. విశాఖ స్టీల్‌ ఉత్పత్తి సామర్ధ్యం పెంచడానికి నిజాయితీతో కేంద్ర ప్రభుత్వం నిలబడితే ఈ నష్టాలు విశాఖ స్టీల్‌కు లెక్కలోకి రావు. 1991 నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క కోటి రూపాయలు కూడా విశాఖ స్టీల్‌కు కేటాయించక పోయినా స్వంత లాభాలతో రూ. 22 వేల కోట్లు వెచ్చించి 73 లక్షల టన్నుల సామర్ధ్యానికి చేరింది.
భారీ స్టీల్‌ ప్లాంట్లకు ముడి ఖనిజమే ప్రధాన పెట్టుబడి. ముడి ఖనిజాల్లో ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌ ప్రధానమైనవి. 2000 సంవత్సరం నుంచి ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 2000 సంవత్సరంలో మార్కెట్‌లో టన్ను ఇనుప ఖనిజం రూ. 500 ఉంటే నేడు టన్ను 6000 నుండి 8000 రూపాయల వరకు ఎగబాకింది. కోకింగ్‌ కోల్‌ మన దేశంలో లభ్యం కాదు. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. 2018లో 48 డాలర్లు ఉన్న కోకింగ్‌ కోల్‌ ధర నేడు టన్ను 240 డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో పుష్కలంగా ఇనుప ఖనిజం లభించే దేశాలలో భారతదేశం ఒకటి.

కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ స్టీల్‌ ప్లాంట్లకు ఇనుప ఖనిజం 100 సంవత్సరాలకు సరిపడా కేటాయించింది. టాటా, భిలాయ్, బొకారో, దుర్గాపూర్‌, రూర్కెలా వంటి స్టీల్‌ ప్లాంట్లు అన్నింటికీ ముడి ఖనిజం సమృద్ధిగా వుంది. వారితో విశాఖ స్టీల్‌ పోటీ పడాలి. మార్కెట్‌లో అన్ని స్టీల్‌ప్లాంట్ల అమ్మకాల రేట్లు ఒక్కటే. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1957 సెక్షన్‌ 17(1)(బి) ప్రకారం ప్రభుత్వ రంగ పరిశమ్రలన్నింటికి ముడి ఖనిజం గనులు కేటాయించాలని ముడి ఖనిజం గనుల చట్టంలో స్పష్టంగా వుంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు స్వంత గనుల కేటాయింపు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల హక్కు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణ సమయంలో 1985లో విడుదల చేసిన డి.పి.ఆర్‌ ప్రకారం ఎన్‌.ఎమ్‌.డి.సి (నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌), బైలదిలా లోని నాలుగు, ఐదు బ్లాకుల్లో స్వంత గనులు విశాఖ స్టీల్‌కు కేటాయించాలి. ప్రభుత్వ రంగంలో 1990లో ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కావాలనే, ప్రైవేటు చేయడానికే కేంద్ర ప్రభుత్వాలు స్వంత గనులు కేటాయించలేదు. స్వంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బలపడుతుంది. స్టీల్‌ రంగంలో విశాఖ స్టీల్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. పాలకులు వారి ఇష్టం వచ్చిన ప్రైవేటు కంపెనీలకు విశాఖ స్టీల్‌ను కారుచౌకగా కట్టబెట్టాలనే దురుద్దేశంతోనే విశాఖ స్టీల్‌కు నేటికీ స్వంత గనులు కేటాయించడానికి నిరాకరిస్తున్నారు. కనీసం స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో విలీనం చేయాలన్న కార్మికుల డిమాండ్‌ను బి.జె.పి పాలకులు ఖాతరు చేయడంలేదు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశంలోకెల్లా సముద్ర తీరంలో 20 వేల ఎకరాల స్వంత భూములలో ఏర్పడిన ఏకైక భారీ స్టీల్‌ ప్లాంట్‌. నవరత్న గుర్తింపు పొందిన ఏకైక స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఇదే. బంగారు బాతు లాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాజేయడానికి కార్పొరేట్లు పోటీ పడుతున్నారు. వాటిని ప్రతిఘటించి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. కార్మికుల పోరాటం, ప్రజల సంఘీభావం పరిఢవిల్లాలి.

వ్యాసకర్త సి.ఐ.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నరసింగరావు

 

➡️