శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకె అనూహ్య విజయం హర్షణీయం. దిసనాయకె ఘన విజయం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష, అభ్యుదయ కాముకులకు ఆనందం కలిగిస్తుంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాక జరిగిన ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనతా విముక్తి పెరమున (జెవిపి) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) కూటమి అభ్యర్థిగా దిసనాయకె ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమిలో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలిసి ఉన్నాయి. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో 70 శాతానికిపైన ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్‌లో ఎన్‌పిపి అభ్యర్థి దిసనాయకె 42.3 శాతం ఓట్లు తెచ్చుకొని మొదటి స్థానంలో నిలవగా, ప్రతిపక్ష నేత, ఎస్‌ఎల్‌పి అభ్యర్థి సాజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్థానంలో, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె 17.27 శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. తొలిరౌండ్‌లో 50 శాతానికి పైన ఓట్లు వచ్చిన వారు విజేత అవుతారు. ఎవ్వరికీ ఆ ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు చేపట్టాక దిసనాయకె అత్యధికంగా 55.89 శాతం ఓట్లు తెచ్చుకొని తిరుగులేని ఆధిక్యతలో నిలిచారు. 1982లో శ్రీలంక కొత్త రాజ్యాంగం వచ్చాక తొలిసారి రెండవ ప్రాధాన్యతా ఓట్లతో అధ్యక్షునిగా గెలుపొందింది దిసనాయకెనే.
తొలిసారి 2019 ఎన్నికల్లో ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసిన దిసనాయకె 3.16 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుదు అధికారంలోకి రావడం చిన్న విషయమేమీ కాదు. గడచిన ఎనిమిది దశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన ప్రజలు వాటి మీద విశ్వాసం కోల్పోయి ఈ తడవ వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గత ప్రభుత్వాల నిర్వాకం వలన దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. నిరసనగా ప్రజలు, యువత రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయం కేసి ఆలోచించి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారని అర్థమవుతుంది. గతంలో తుపాకీ చేపట్టి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు రెండుసార్లు జెవిపి విఫలయత్నం చేసింది. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా అధికారం పొందింది. ఈ విజయం దాని చరిత్రలో ఒక ముఖ్య మూలమలుపు.
మార్పుకోసం ప్రజలిచ్చిన విజయంగా దిసనాయకె వాస్తవాన్ని చెప్పారు. చెల్లింపుల సంక్షోభం, అధిక ధరలు, నిరుద్యోగం, ఐఎంఎఫ్ అప్పుల నుండి శ్రీలంకను బయట పడేయడం దిసనాయకె ముందున్న తక్షణ సవాల్. అదానీ ఎనర్జీ ప్రాజెక్టు రద్దు, గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న 290 కోట్ల డాలర్ల చెల్లింపు ఒప్పందం సమీక్ష వంటి ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చారు. వీటిని అమలు చేయాల్సి ఉంది. నరేంద్ర మోడీ, ఆయన కార్యాలయం ప్రత్యక్ష జోక్యంతో శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ అదానీకి పవర్ ప్రాజెక్టు ఇప్పించారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. దిసనాయకె గెలుపు మన దేశంలో బిజెపికి, మోడీకి ఇబ్బందికరం అన్నది విశ్లేషకుల అంచనా. కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల పని అయిపోయింది, వారు కోలుకొని అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటూ నిరాశలో ఉన్న వారికి శ్రీలంకలో వామపక్ష అభ్యర్థి ఎన్నిక ఉత్సాహాన్ని ఇస్తుంది. కమ్యూనిస్టుల అవసరం లేదని నిర్వచించే పెట్టుబడిదారీ మేధావులకు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ముచ్చెమటలు పోయిస్తాయి. లాటిన్ అమెరికాలో వామపక్షాల విజయాలు, దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు, నేపాల్‌లో తిరుగులేని శక్తిగా వామపక్షాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీలంక వంతు వచ్చింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్‌పిపి కూటమి అత్యదిక సీట్లలో గెలిస్తేనే పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగుతాయి. ఎన్నికల హామీలను, శ్రీలంక ఎదుర్కొంటున్న సమస్యలను దిసనాయకె సమర్ధవంతంగా ఎదుర్కొంటారని, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని ఆశిద్దాం.
