పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నవారిపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడం ఆందోళనకరం. జైలులో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలంటూ ఖైబర్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అలీ అమిన్ గండాపుర్, ఇమ్రాన్‌ఖాన్ భార్య బుష్రా బీబీ ఇచ్చిన పిలుపునందుకుని రాజధాని ఇస్లామాబాద్‌కు ‘లాంగ్‌మార్చ్’ నిర్వహించిన లక్షలాది మంది పిటిఐ మద్దతుదారులపై ప్రభుత్వం అడుగడుగునా నిర్బంధాన్ని ప్రయోగించింది.. వేలాది మంది నిరసనకారులను ముందస్తు ఆరెస్టులు గావించింది. షిప్పింగ్ కంటైనర్లు, కాంక్రీట్ బారికేడ్లతో ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించింది. ప్రధాన రహదారులను మూసివేసింది.. మొబైల్, ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజధాని నగరాన్ని షట్‌డౌన్ చేసింది. ఎంతగా నిర్బంధాన్ని ప్రయోగించినా, ఎన్ని అవరోధాలు కల్పించినా లెక్కచేయకుండా లక్షలాది మంది ఇస్లామాబాద్‌లోని డి చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా ప్రదర్శన నిర్వహించకుండా అడ్డుకోవడంతో భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భద్రతా సిబ్బందితో సహా ఆరుగురు చనిపోయారు. అదే రోజు రాత్రి పెద్దయెత్తున పిటిఐ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో తాత్కాలికంగా ఆందోళన విరమించుకుంటున్నట్లు జైలు నుంచి ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. నిరసనకారుల డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. ప్రజాతంత్ర హక్కుల పట్ల పాక్ ప్రజల్లో ఆకాంక్ష ఎంత బలంగా ఉందో తెలియజేయడంలో పిటిఐ నిరసన సఫలమైంది.
క్రికెటర్‌గా, పాకిస్తాన్‌కు ప్రపంచకప్‌ను అందించిన ఇమ్రాన్‌ఖాన్ సైనిక కుట్రలకు భయపడి ఇతర పాలకుల్లా దేశం వీడి పారిపోలేదు. వాటిని ఎదిరించి నిలిచినందుకు ఆయన మీద 150కిపైగా క్రిమినల్ కేసులు పెట్టి కటకటాల వెనక్కి నెట్టారు. ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం కూడా తలెత్తకుండా నివారించాల్సిన బాధ్యత పిఎంఎల్(ఎన్), పిపిపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపైన, సైన్యంపైన ఉంది. ప్రతిపక్ష నేతను విడుదలజేసేందుకు ప్రభుత్వం, సర్వాధికారిగా వ్యవహరిస్తున్న సైన్యం ససేమిరా అంటున్నాయి. ఇదే ప్రస్తుత పరిస్థితికి కారణం. సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్ గద్దెనెక్కినప్పటికీ కొంతకాలం తరువాత తన అస్తిత్వాన్ని చాటుకునేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు యత్నించారు. ఈ ధిక్కారాన్ని సైన్యం సహించలేకపోయింది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్ చెలిమి చేయడం అమెరికాకు కోపం తెప్పించింది. అమెరికా సామ్రాజ్యవాదం, పాక్ సైన్యం కూడబలుక్కుని 2022లో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలదోశాయి. ఇమ్రాన్‌ను జైలులో పెట్టాయి. ఆ పార్టీని నాశనం చేయాలని చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘క్రికెట్ బ్యాట్’ పై నిషేధం విధించాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ వంటి పలు అక్రమాలకు సైన్యం పాల్పడింది. అయినప్పటికీ స్వతంత్రులుగా పోటీ చేసిన ఇమ్రాన్ మద్దతుదారులు గణనీయమైన సంఖ్యలో పార్లమెంటులోకి ప్రవేశించారు. ప్రజల్లో ఇమ్రాన్ పట్ల అంతకంతకూ ఆదరణ పెరుగుతున్నదనడానికి తాజా నిరసనలే నిదర్శనం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడడానికి ఏ ఐఎంఎఫ్ విధానాలు కారణమో వాటినే మరింతగా అమలు చేయడానికి షెహబాజ్ ప్రభుత్వం పూనుకుంది. 700 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌తో తిరిగి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధానాలు పాక్ ఎదుర్కొంటున్న అధిక ధరలు, తీవ్ర రూపం దాల్చిన నిరుద్యోగం వంటి సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేకపోయాయి. దీంతో ప్రజలు అసంతృప్తితో వీధుల్లోకి వస్తుండడంతో ప్రభుత్వం వీటిని నిరంకుశంగా అణచివేసేందుకు యత్నిస్తున్నది. ఇమ్రాన్ జైలులో నుండి ఇచ్చిన పిలుపునకు ఇంత పెద్దయెత్తున జనం స్పందించడానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం. ‘నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం, బలగం, అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనా సరే! అదే ప్రజాస్వామ్యం’ అని అబ్రహంలింకన్ అన్న మాటలు పాక్ పాలకుల చెవికెక్కుతాయా? నిరసనకారుల వాణి విని పరస్పర చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోడానికి ప్రభుత్వం, సైన్యం సిద్ధం కావాలి. లేకుంటే తరువాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్, శ్రీలంకలో పరిణామాలు పాక్ పాలకులకు ఒక హెచ్చరిక కావాలి.