ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు బోధనేతర పనులతో సమయం వృథా అవుతున్నది. రకరకాల యాప్‌లు, డిజిటల్ పనుల వలన బోధన కుంటుపడుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సిగల్ సరిగా లేని చోట ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్ ద్వారా డేటా యాప్‌లలో అప్‌లోడ్ చేయడానికి అధిక సమయం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన అన్ని రకాల యాప్‌లు ఇప్పుడు కూడా వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఉన్న యాప్‌ల భారం తగ్గించి వారిని కేవలం బోధనకే పరిమితం చేస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ, యాప్‌ల భారం తగ్గించడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఉపాధ్యాయుడు పాఠశాలలోకి వచ్చిన వెంటనే ఫేషియల్ అటెండెన్స్, విద్యార్థుల హాజరుకు సంబంధించి వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల హాజరును ఉదయం 9 గంటల 30 నిమిషాలు లోపు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఇది ముగిసిన తర్వాత పది గంటల ముప్పై నిమిషాల తర్వాత మరుగుదొడ్ల ఇన్‌స్పెక్షన్ ఫామ్ పూర్తి చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. మరుగుదొడ్లకు సంబంధించి ఫొటోలను సమీప సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, స్కూలు అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉన్నా, అధిక శాతం పాఠశాలల్లో ఆ పని కూడా ఉపాధ్యాయులే చేయాల్సిన పరిస్థితి. విద్యార్థుల అసెస్‌మెంట్ టెస్ట్ మార్కులను ప్రతి తరగతి ఉపాధ్యాయుడు ‘ఫేషియల్ అటెండెన్స్’ యాప్‌లో ఎంటర్ చేయాలి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఐ.ఎం.ఎం.ఎస్ యాప్‌లో గుడ్లు, చిక్కీలు, రాగి జావ, భోజనం వడ్డింపు తదితర వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఇలాంటి బోధనేతర పనులతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. డిజిటల్ అసిస్టెంట్ చేయాల్సిన పనులన్నీ ఉపాధ్యాయులతో చేయించడం జరుగుతోంది. మరోవైపు విద్యాశాఖ అధికారులు వంద శాతం ‘అపార్’ ఐడీలు సృష్టించమని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘అపార్’ కార్డు జారీ ప్రక్రియలో ఆధార్ వివరాలు, స్కూలు రికార్డులలో ఉన్న వివరాలు సరిపోలక పోవడంతో ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం తల్లిదండ్రులు, పిల్లలు ఆధార్ సవరణ కేంద్రాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులకు వివిధ రకాల రెసిడెన్షియల్ శిక్షణ తరగతులను నిర్వహిస్తూ బోధనకు దూరం చేయడం సబబు కాదు. వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఆన్‌లైన్ పనుల నిర్వహణకు ప్రతి పాఠశాలకు డిజిటల్ అసిస్టెంట్‌ని నియమించాలి.
– వాసిలి సురేష్, నెల్లూరు జిల్లా.