తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ రంగాల కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారు. ఈ తొలగింపులన్నీ రాజకీయ అక్రమ తొలగింపులే. దీనికి చట్టబద్దత లేదు. స్థానిక గ్రామ పెద్దలు కక్షలతో తొలగిస్తున్నారు. కొత్తవారిని ఈ ఖాళీలలో ఉద్యోగాల్లో నియమించి లక్షలో డబ్బులు దండుకోవాలన్నది కొందరు నాయకుల ప్రయత్నం. కొన్ని జిల్లాల్లో కార్మికులను బలవంతంగా ఉద్యోగాల నుండి బయటకు గెంటివేస్తున్నారు. రాష్ట్రంలోని విఓఎ, ఆర్.పిలు (వెలుగు), మధ్యాహ్న భోజన కార్మికుల (వంటమ్మలు), ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా, అంగన్‌వాడీ, మున్సిపల్ తదితర ప్రభుత్వ రంగాల్లో పని చేసే వేలాది మంది కార్మికులను తొలగించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? ఏ చట్ట ప్రకారం తొలగిస్తున్నారు? సమాధానం చెప్పాలని సిఐటియు ప్రశ్నిస్తున్నది. అనంతపురం జిల్లా వజ్రకరువు మండలంలోని ఛాయాపురం గ్రామంలో 2003 నుంచి మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న వికలాంగురాలిని ఆ గ్రామ పెద్దలు బలవంతంగా బయటకి ఈడ్చుకొచ్చారు. ఈమెకు భర్త లేడు. కష్టపడి తన బిడ్డలను పోషించుకుంటున్నది. అలాంటి వారిపై దౌర్జన్యం చేయడం అత్యంత హేయమైన చర్య. అనంతరపురం జిల్లాలో 670 మంది వంటలమ్మలను తొలగించారు. మధ్యాహ్న భోజనం, విఓఎ, ఫీల్డ్ అసిసెంట్లు, ఆశా, అంగన్‌వాడీలతో సహా అక్రమంగా వేలాది మందిని తొలగిస్తున్నారు. మహిళలపై దౌర్జన్యం చేసిన రాజకీయ నాయకుల ఒత్తిడికి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా కార్మికులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 1 నుండి పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ సెక్షన్‌లో పని చేస్తున్న 52 మంది కార్మికులను ఎమ్మెల్యే ఆపివేయమన్నారని అధికారులు అక్రమంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని గద్దెలపాడు గ్రామంలో లక్కివలస-2 సెంటర్ అంగన్‌వాడీ టీచర్, ఆయా, ఆశా ఉద్యోగులను తొలగిస్తామని, ఒక్కో ఉద్యోగం లక్షా 90 వేల రూపాయలకు వేలం పాట పెట్టారు. ప్రజలు, కార్మికుల నిరసనలతో గ్రామ పెద్దలు వెనక్కి తగ్గారు. ప్రకాశం జిల్లా, కంభం గ్రామంలో వంటలమ్మ తిరగబడి మీ ఇంట్లో పనికత్తెను కాదు, పొండని పెత్తందారులపై తిరగబడితే పెత్తందారుల మనుషులు తోకముడిచారు. రాజకీయ వేధింపులు పడలేక శ్రీ సత్యసాయి జిల్లా వీరప్పగారి పల్లి, ఓడిసి మండలంలో అంగన్‌వాడీ టీచర్ దీరంగల నాగమణి జులై 27వ తేదీన ఆత్మహత్యకు పాల్పడి హాస్పిట ల్‌లో వున్నారు. గ్రామ పెత్తందార్లు ఉద్యోగం నుండి రాజీనామా చేయమంటూ ఇంటి మీదకు వెళ్ళి నాగమణిని నోటికి వచ్చినట్టు తిట్టారు. ఆ తిట్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారామె.
ఉద్యోగులు ఎవరైనా తప్పు చేస్తే మెమోలు ఇవ్వాలి. కార్మికుల నుండి సంజాయిషీ తీసుకోవాలి. దీనిపై అధికారులు సంతృప్తి చెందకపోతే విచారణ చేయాలి. విచారణ చేయకుండా తొలగించడమనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నోటీసు ఇచ్చామని తొలగించినా అది చెల్లదు. విచారణ చేసి నేరం రుజువు అయితే మాత్రమే కార్మికునిపై చర్యలు తీసుకోవచ్చు. మొదటి తప్పుకు హెచ్చరిక మాత్రమే చేయాలి. తీవ్రమైన తప్పులు జరిగాయని రుజువు అయినప్పుడు మాత్రమే ఇంక్రిమెంటు కోత విధిస్తారు. కానీ ఉద్యోగాల నుండి తొలగించరు. కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడమంటే కార్మికునికి ఉరిశిక్ష వేయడం లాంటిదే. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రమే చీటికి మాటికి అక్రమంగా తొలగింపులకు పాల్పడుతుంటాయి. అప్పుడు కూడా కార్మికులు పోరాటం ద్వారా తిరిగి పనిలోకి చేరుతుంటారు. తప్పనిసరి అయితే కోర్టులను కూడా ఆశ్రయిస్తారు. ఇటీవల జరిగిన తొలగింపులన్నీ అక్రమ తొలగింపులే. రాజకీయ కక్షలతో చేపట్టిన అక్రమ చర్యలే.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి చేతయితే రాష్ట్రంలో వున్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను నింపాలి. 60 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు నింపాలి. వీటిపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. నెలకు రూ.3 వేలు జీతం వచ్చే వంటలమ్మ మీద ఒంటి కాలితో యుద్ధానికి రావడానికి వీరికి సిగ్గు వేయడంలేదా? కొన్ని చోట్ల ఈ ఉద్యోగుల నుంచి బలవంతంగా రాజీనామా పత్రాలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు రాజీనామా పత్రం తయారు చేసి బలవంతంగా సంతకాలు పెట్టించినంత మాత్రన ఆ రాజీనామా చెల్లదు. ఈ రాజీనామా పత్రాలు ఎందుకూ పనికి రావు. టిడిపి నాయకులు కొందరు అధికారం వున్నదని అహంభావంతో తప్పుడు విధానాలు అవలభించడం సరికాదు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఉద్యోగుల తొలగింపులకు తెలుగుదేశం నాయకులు ఉసికొల్పుతున్నారు. చిన్న ఉద్యోగులయితే ఏమీ చేయలేరని భావించడం సరికాదు. చిన్న ఉద్యోగులు ఒంటరిగా లేరు. రాజకీయ దౌర్జన్యాలు కొద్ది కాలం ఏ పార్టీ అధికారంలో వున్నా చేయగలరు. కానీ శాశ్వతంగా చేయలేరు. అధికారులు కూడా అక్రమ తొలగింపులను అడ్డుకోకుండా మౌనం వహించడం పద్ధతి కాదు. కార్మికుల నుండి ఫిర్యాదులొచ్చినా చట్టాలను అమలు చేసి తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడానికి అధికారులు కూడా బాధ్యత వహించాలి. గత ప్రభుత్వ కాలంలో ఆ పార్టీ నాయకులు చెప్పారని తప్పుడు పనులు చేసిన అధికారులు నేడు నాలుక కరుచుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వుండవని పదేపదే ప్రకటించారు. గత ప్రభుత్వంలా కక్ష సాధింపులు, దౌర్జన్యాలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సహా అధికారులు కార్మికులను తొలగించవద్దని కింది అధికారులకు ఆదేశాలు పంపుతున్నారు. అయినా అక్రమంగా తొలగించిన వారిని తిరిగి ఎక్కడా తీసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల అండ లేకుండా స్థానిక నాయకులు దౌర్జన్యంగా కార్మికులను తొలగించగలరా? పెత్తందారుల వాదనలు అడ్డగోలుగా వున్నాయి. ”మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటిదాకా మీరు తిన్నారు. ఇప్పటిదాక మీరు ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు”…వంటి వాదనలు చేసే నాయకులకు…రాజకీయ పదవులకు, ఉద్యోగాలకు తేడా కూడా తెలియదా? పైన పేర్కొన్న రంగాల్లో పని చేసే కార్మికులందరికీ సర్వీసు కండిషన్లు వున్నాయి. పని గంటలు, పని విధి విధానాలున్నాయి. వీరందరికి ప్రభుత్వం జీతం చెల్లిస్తున్నది. వీరికి నియామకపు పత్రాలున్నాయి. గత వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ తొలగింపులకు పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న విద్యుత్ ఆపరేటర్ పోస్టులను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు అమ్ముకున్నారు. సిఐటియు దీనిని అడ్డుకున్నది. అనేక మందిని తిరిగి ఉద్యోగాల్లో పెట్టించింది. కొన్ని చోట్ల పెత్తందారులు మొండిగా వుంటే సిఐటియు నాయకత్వంలో హైకోర్టుకు కూడా వెళ్ళి కార్మికులందరినీ తిరిగి పనుల్లో పెట్టించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు చేస్తే ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు అదే శిక్ష వేస్తారు.
(రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనల సందర్భంగా… )

వ్యాసకర్త : సిహెచ్. నరసింగరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి