సంక్షేమ పథకాలు – పాలకుల నైజం

Apr 4,2024 05:15 #editpage

దేశంలో పార్లమెంట్‌తో పాటు మరో 5 రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలను తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్ళలో అమలు చేసిన పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర బడ్జెట్‌ నుండి రూ. 2.50 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా పంపిణీ చేశామని చెబుతున్నది. ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందనే లెక్కలు ప్రచురించి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. మమ్మల్ని గెలిపిస్తే ఈ పథకాలు కొనసాగించడంతోపాటు ఇంకా అనేక పథకాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం-జనసేన కూటమి కూడా 6 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించాయి. సామాజిక పెన్షన్‌ రూ.4 వేలు, నిరుద్యోగ భృతి రూ.5 వేలు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ.2500, ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారని వైసిపిని విమర్శిస్తున్నాయి.
ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలలో పాలక బూర్జువా పార్టీలన్నీ ఎన్నికలను పథకాల చుట్టూనే తిప్పుతున్నాయి. ఇక బిజెపి దేశంలో అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో తెగ ఊదరగొడుతున్నది. దేశంలో ఎన్నడూ లేని విధంగా మతంతో ముడిపెట్టి మధుర, కాశీ వంటి తీర్థయాత్రల పథకాలు కూడా ప్రచారం చేస్తున్నది. రెండో వైపున సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక వైఖరిని బిజెపి పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్నది. పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఉచితాల పేర ప్రజలకు పంచి పెట్టడం వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతున్నదని విమర్శిస్తున్నది. తన కుహనా మేధావులతోను, మధ్యతరగతిలో ఒక వర్గం చేత వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నది. ఎన్నికలలో సంక్షేమ పథకాల ప్రచారాన్ని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సైతం కేసు వేయించింది. అయినా ఎన్నికల్లో అన్ని బూర్జువా పాలక పార్టీలు సంక్షేమ పథకాలనే నమ్ముకొని ప్రచారం సాగిస్తున్నాయి.
దేశంలో నూతన సరళీకరణ విధానాల అమలు అనంతరం గడిచిన మూడు దశాబ్దాల నుండి శ్రామిక ప్రజల సంక్షేమం, సదుపాయాలుపై తీవ్ర దాడి కొనసాగుతున్నది. విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరించి పెద్ద ఎత్తున భారాలు మోపారు. సామాజిక భద్రతా హక్కులను నిర్వీర్యం చేశారు. వేతనాలు పెంచకుండా అణిచివేయడం, న్యాయబద్దమైన వేతనాలు అమలు చేయకపోవడం, ఉపాధి భద్రత, ఉపాధి హక్కు లేకపోవడం, కార్మిక హక్కులను బలహీనపరచడం, రైతుల పంటలకు తగిన మద్దతు ధర కల్పించకపోవడంతో ప్రజల జీవితాలు ఆర్థిక సుడిగుండాల్లో చిక్కుకుపోయాయి. అంతేగాక కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ప్రజా సంక్షేమంపై సామాజిక న్యాయంపై చేసే ఖర్చులో కోత విధించడం, ప్రజలపై రకరకాల పన్నులు విధించడం, సబ్సిడీలు తొలగించడం, పౌరసేవలను వ్యాపారీకరించడం వంటి సంస్కరణలను అమలు చేయడంతో ప్రజల కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఈ భారాలను భరించలేని స్థితికి నెట్టబడుతున్నాయి. ప్రజలు అప్పుల ఊబిలో చిక్కుకుని దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి సృష్టించారు.
ఈ దుస్థితిలో ప్రజలు పాలకులను ప్రశ్నించకుండా ఎన్నికల సందర్భంగా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఇవి అమలు చేయబడుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలను ప్రజల హక్కులుగా పార్టీలతో సంబంధం లేకుండా, వాటంతటవే అమలు జరిగేలా, ప్రభుత్వాలు మారినా అవి కొనసాగేలా లేదా అంతకన్నా మెరుగైన పథకాలు అమలు జరిగేలా కాకుండా అవి ఎల్లప్పుడూ వారి కనుసన్నలలోనే కొనసాగేలా, వీటిని రాజకీయ స్వార్ధం కోసం వినియోగించుకుంటున్నారు. అందువల్లే గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్ని పథకాలు అమలు జరిగినా ప్రజల స్థితిగతుల్లో మార్పులు రాలేదు. ఆర్థిక అసమానతలు పెరిగాయి. ప్రజల మధ్యే కాదు, ప్రాంతాల మధ్య కూడా అంతరాలు పెరిగాయి. అవసరమైన సమృద్ధికర పోషకాహారం తీసుకోలేని వారి సంఖ్య పెరగడంతోపాటు నిరుద్యోగం పెరుగుతున్నది. కొనుగోలు శక్తి పుంజుకోవడం లేదు. విద్య, వైద్యం కొనక్కోవాల్సి వస్తున్నది.
ఈ దారుణమైన కష్టాల్లో ఈ పథకాలు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాలుగా ఉపయోగపడుతున్నాయనేది వాస్తవం. అందుకే ఈ పథకాలకు ఎన్ని పరిమితులున్నా వీటిని పాలకులు ఎన్నికల అస్త్రాలుగా వినియోగించుకుంటున్నా మనం సమర్ధించాల్సిన అవసరం ఉంది. రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇంకా ఆర్థికశక్తి తగ్గితే పాలకులపై పోరాడే శక్తి మరింత తగ్గిపోతుంది. సంక్షేమ చర్యలు శ్రామికుల బేరసార శక్తిని పెంచుతాయి. నిరుద్యోగ భృతి ద్వారా యువత సంఘటితం అవుతుంది. వివిధ రకాల శ్రమజీవుల మధ్య సంఘటిత శక్తి బలపడటమే గాక పాలక వర్గాలపై కూడా ప్రతిఘటన శక్తి పెరుగుతుంది.
సంక్షేమం జానెడుాసంపన్నులకు బారెడు
బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలపై తీవ్ర వివాదాలు రేపుతున్నది. ఈ పథకాలకు ఎన్నికల తాయిలాలు, ఉచితాలు…ఇలా అనేక పేర్లతో చర్చకు లేవదీస్తున్నది. బడ్జెట్‌ నిధులన్నీ పథకాలకే ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధికి నిధులు లేకుండా పోతున్నాయని విమర్శిస్తున్నది. పారిశ్రామిక అధిపతులకు రాయితీలు ఇవ్వకపోతే, వీరిపై పన్నులు పెంచితే పెట్టుబడులు పెట్టరని వాదిస్తున్నది. దీనివల్ల దేశం అభివృద్ధి కాదని ఎదురు దాడికి దిగుతున్నది.
వాస్తవంగా దేశంలో సంపద పెరుగుతున్నా దేశ బడ్జెట్‌ ఆదాయం పెరగడం లేదు. బిజెపి ప్రభుత్వం పదే పదే 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో భారత్‌ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నదనే ప్రచారం హోరెత్తిస్తున్నది. కానీ దేశ జిడిపిలో పన్ను నిష్పత్తి ప్రపంచ దేశాలతో చూస్తే చాలా అధమ స్థాయిలోనే ఉంది. ఇప్పటికీ జిడిపిలో 11.35 శాతంగానే ఉంది. గత పదిహేనేళ్ళలో ఎదుగూ బదుగూ లేకుండా ఉంది.
నూతన సరళీకరణ విధానాల కాలంలో దేశంలో సంపన్నులకు భారీగా పన్ను రాయితీలు కల్పించబడుతున్నాయి. కార్పొరేట్‌ పన్నులు, కస్టమ్స్‌ ఛార్జీలు, ఎగుమతి, దిగుమతి పన్నులు పెద్దఎత్తున తగ్గించబడ్డాయి. సంపద పన్నును ఏకంగా రద్దు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌ పన్ను ఆదాయాలకు లక్షల కోట్లలో గండికొట్టారు. రెండోవైపు బడ్జెట్‌ ఆదాయంలో కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా ఖర్చు పెడుతున్నారు. జిఎస్టీ తదితర పరోక్ష పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రజలకిచ్చే సబ్సిడీలకు కోత పెడుతున్నారు. విద్య, వైద్యంపై కేటాయింపులు తగ్గిస్తున్నారు. సంక్షేమ పథకాలన్నింటిపై నిధులు ఏడాదికేడాది కత్తిరిస్తున్నారు. ఆఖరికి చట్టం చేయబడ్డ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టాలను బలహీనం చేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ బాధ్యత వహించే రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం దెబ్బ తీస్తున్నది. ఆర్థిక సంఘం నిధుల్లో కూడా కోత విధిస్తున్నది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని వినియోగించి రాష్ట్రాల అప్పులపై తీవ్ర ఆంక్షలను విధిస్తున్నది. ఇవన్నీ చాలక కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వ బ్యాంకుల నుండి తీసుకున్న రూ. లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తున్నారు.
కార్పొరేట్‌, బడా పారిశ్రామిక సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వకుండా దేశ జిడిపిలో పన్ను నిష్పత్తి కనీసం 30 శాతం స్థాయికి పెంచగలిగినట్లైతే ప్రస్తుతం మరో 50 లక్షల కోట్లు అదనంగా పన్నుల ద్వారా కేంద్ర బడ్జెట్‌కు ఆదాయం వచ్చేది. ఇది జరిగినట్లయితే మన రాష్ట్రానికి కేంద్రం నుండి అదనంగా మరో రూ. లక్ష కోట్లకు పైగా నిధులు బదిలీ అయ్యేవి. రాష్ట్రాల బడ్జెట్‌ ఆదాయాలన్నీ కనీసం మూడు రెట్లు పెరిగేవి. పాలకుల రాజకీయ స్వార్ధం కోసం అమలు చేసేవే అయినప్పటికీ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తున్న సంక్షేమ పథకాలపై గగ్గోలు పెట్టటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనేది అర్ధం చేసుకోవాలి.
ఆర్థిక వ్యవస్థలో రాజ్య తిరోగమన జోక్యం
స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వ పెట్టుబడితో పాలకులు పెట్టుబడిదారీ విధానాన్ని అభివృద్ధి చేయసాగారు. అందులో భాగంగానే ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. అంతేగాక విదేశీ, స్వదేశీ ప్రైవేట్‌ సంస్థలను జాతీయం చేస్తూ విద్య, వైద్యం, సామాజిక, సేవా, మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారు. వ్యవసాయ రంగంలో నీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థలన్నీ ఆ విధంగా వచ్చినవే. అలాగే వెనుకబాటుతనం, పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు…వంటి వాటి కోసం చట్టాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆర్థిక వ్యవస్థలో రాజ్య (పాలకుల) జోక్యం, ప్రభుత్వ పెట్టుబడి బలంగా ఉండేది.
సోవియట్‌ పతనానంతరం సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ ఆధిపత్యం సాధించాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విజృంభించింది. ప్రపంచవ్యాపితంగా నూతన సరళీకరణ విధానాల అమలుకు పూనుకున్నాయి. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అనుసరిస్తూ వచ్చిన ఆర్థిక విధానాలకు స్వస్తి పలికారు. విద్య, వైద్యం బాధ్యత నుండి వైదొలిగారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, వ్యవస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం బడా పెట్టుబడిదారుల ఆస్తుల రక్షణ, పెట్టుబడులకు ద్వారాలు తెరవడం, లాభాలు పెంచడమే ప్రధాన కర్తవ్యంగా మారింది. ఈ నేపథ్యంలో బూర్జువా పాలకుల అసలు నైజం బట్టబయలు కాకుండా వుండేందుకే సంక్షేమ జపం చేస్తున్నారు.
సోషలిజంతోనే సంక్షేమం పుట్టుక
సోవియట్‌ యూనియన్‌లో 1917లో లెనిన్‌ నాయకత్వంలో విప్లవం జయప్రదం అయ్యాక ప్రపంచంలో తొలిసారిగా సంక్షేమ పథకాలను కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజా సంక్షేమ విధానాలు లేవు. ఎక్కడన్నా ఒకటీ అరా వున్నా ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్నవే. విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ భృతి, ఆహారం, గృహ వసతి వంటివి సార్వత్రిక హక్కులుగా సోవియట్‌లో ప్రవేశపెట్టారు. భూమి, పరిశ్రమలపై ప్రజల సమిష్టి హక్కు, లాభాల్లో శ్రామికులకు వాటా, 8 గంటల పని విధానం, కార్మికులకు సెలవులు, రెండేళ్లు వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు, వృద్ధాప్యంలో ప్రభుత్వ బాధ్యత, పెన్షన్‌ హక్కు…ఇలా మనిషి పుట్టిన దగ్గర నుండి అంతిమ శ్వాస విడిచే వరకు విస్తృతమైన సంక్షేమ హక్కులు కల్పించబడ్డాయి.
ఆ తరువాత అనివార్యంగా సామ్రాజ్యవాద దేశాల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి సోవియట్‌ యూనియన్‌ సృష్టించింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానంతరం పెట్టుబడిదారీ దేశాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినడం, భారాల కారణంగా శ్రామికవర్గం ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారీ దేశాలన్నీ సోషలిజం వ్యాప్తిని అడ్డుకోవడానికి అనివార్య పరిస్థితుల్లో సోవియట్‌లో అమలు జరుపుతున్న అనేక సంక్షేమ పథకాలను తమ దేశాల్లో ప్రవేశపెట్టాల్సి వచ్చింది. రెండోవైపు యుద్ధంతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థల పున: నిర్మాణం కోసం ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అనేక రంగాల్లో ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. కీన్షియన్‌ డిమాండ్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని చేపట్టాయి.
కనుక నేడు పెట్టుబడిదారీ దేశాల్లో సైతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పాలకుల దయాదాక్షిణ్యాల వల్ల వచ్చినవి కాదనేది అర్ధంచేసుకోవాలి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరప్‌ దేశాల్లో సోషలిజం పతనానంతరం కూడా ఈ సంక్షేమ పథకాలను పెట్టుబడిదారీ దేశాలన్నీ హక్కులుగా కొనసాగించడం ఆశ్చర్యం కలిగించకమానదు. అయితే సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం సంక్షేమ చర్యల పట్ల పెట్టుబడిదారీ దేశాలు బహిరంగంగా వ్యతిరేకతను వెళ్లగక్కాయి. సంక్షేమ పథకాలపై తీవ్ర దాడి ప్రారంభించాయి. కార్మికవర్గం తీవ్ర ప్రతిఘటనతో పాలకులు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నారు. పెట్టుబడిదారీ దేశాలు సంక్షేమ పథకాలను కొనసాగించడానికిగాను అనివార్యంగా తమ జిడిపిలో పన్నుల నిష్పత్తిని పెంచుకొని బడ్జెట్‌ ఆదాయాలను పెంచుకోవాల్సి వస్తున్నది. నేడు మన దేశంలో ఇది పూర్తి తిరోగమనం వైపు కొనసాగుతున్నది.

– డా బి.గంగారావు

/ వ్యాసకర్త సెల్‌ : 9490098792 /

➡️